ఎరువుల విభాగం
azadi ka amrit mahotsav

యూరియా ఉత్పత్తిలో స్వయం-సమృద్ధి దిశగా భారత్ కీలక ముందడుగు - 6 కొత్త ప్లాంట్లకు ఆమోదం

యూరియా ఉత్పత్తిలో స్వయం-సమృద్ధి సాధన లక్ష్యంగా... జాతీయ యూరియా పెట్టుబడి విధానం (ఎన్ఐపీయూ)-2026 కింద దేశంలో 6 కొత్త యూరియా ప్లాంట్ల ఏర్పాటు

రూ. 54,000 కోట్ల పెట్టుబడితో దేశీయ యూరియా ఉత్పత్తి విస్తరణ

నాడు పోస్టు చేయడమైనది: 25 NOV 2026 6:19PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వయం-సమృద్ధ భారత్ దార్శనికతకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం, ఎరువుల భద్రతను నిర్ధారించడం, యూరియా ఉత్పత్తిలో స్వయం-సమృద్ధి సాధించడం దిశగా ఇది కీలక ముందడుగు. ఇందులో భాగంగా జాతీయ యూరియా పెట్టుబడి విధానం (ఎన్ఐపీయూ)-2026 కింద 'బ్రౌన్‌ఫీల్డ్' విభాగంలో 6 కొత్త యూరియా ప్లాంట్ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. సుమారు రూ. 54,000 కోట్ల భారీ పెట్టుబడితో చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా దేశీయ యూరియా తయారీలో పూర్తిస్థాయి స్వయం-సమృద్ధిని సాధించడం ప్రభుత్వ లక్ష్యం. భవిష్యత్తులో మరిన్ని ప్రాజెక్టులూ రానున్నాయి.

6 కొత్త బ్రౌన్‌ఫీల్డ్ ప్లాంట్లు, పెట్టుబడులు, స్వయం-సమృద్ధిపై ప్రత్యేక దృష్టి:

జాతీయ యూరియా పెట్టుబడి విధానం (ఎన్ఐపీయూ)-2026 కింద ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగం, సహకార సంస్థల భాగస్వామ్యంతో 6 కీలక బ్రౌన్‌ఫీల్డ్ యూరియా ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తున్నారు:

 

1.     ఎం.ఎఫ్.ఎల్ - మద్రాస్ (చెన్నై, తమిళనాడు): ప్రస్తుతం అందుబాటులో ఉన్న 60 ఏళ్లకు పైబడిన పాత ప్లాంటు స్థానంలో 12.7 లక్షల మెట్రిక్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో ఈ ప్రభుత్వ రంగ బ్రౌన్‌ఫీల్డ్ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నారు. పాత ప్లాంటు వల్ల ఉత్పత్తి వ్యయం ఎక్కువగా ఉండటంతో పాటు అధిక విద్యుత్ వినియోగం, భద్రతాపరమైన ముప్పులూ ఎదురవుతున్నాయి. సామర్థ్యం తగ్గిన ఆ పాత ప్లాంటు స్థానంలో ఈ కొత్త యూనిట్‌ను నిర్మించాల్సిన అవసరం ఏర్పడింది.

2.    ఎన్‌.ఎఫ్.ఎల్ - నంగల్ (నంగల్, పంజాబ్): సుమారు 50 నుంచి 55 ఏళ్ల నాటి ప్రభుత్వ రంగ ప్లాంటు స్థానంలో ఈ ఆధునిక బ్రౌన్‌ఫీల్డ్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పాత ప్లాంటు వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 4.73 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, దీని స్థానంలో 12.7 లక్షల మెట్రిక్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో కొత్త ప్లాంటును నిర్మించనున్నారు.

3.    కే.ఎఫ్.ఎల్ - షాజహాన్‌పూర్ (షాజహాన్‌పూర్, ఉత్తరప్రదేశ్): 1995లో ప్రారంభమైన ఈ యూనిట్‌ను విస్తరిస్తూ, సహకార రంగ సంస్థ 'క్రిబ్కో' ఆధ్వర్యంలో 12.7 లక్షల మెట్రిక్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో ఈ బ్రౌన్‌ఫీల్డ్ ప్రాజెక్టును చేపడుతున్నారు.

4.    మ్యాటిక్స్ - పనాగఢ్ (పనాగఢ్, పశ్చిమ బెంగాల్): 2017లో ప్రారంభమైన ప్రస్తుత ఆధునిక ప్లాంటు ఆవరణలోనే, 12.7 లక్షల మెట్రిక్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో ఈ ప్రైవేటు బ్రౌన్‌ఫీల్డ్ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు పశ్చిమ బెంగాల్‌లో ఒకే ఒక్క యూరియా ప్లాంటు మాత్రమే ఉంది. ఈ కొత్త ప్లాంటు ఏర్పాటు వల్ల రాష్ట్ర ఎరువుల అవసరాలు తీరనున్నాయి.

5.    సీ.ఎఫ్.సీ.ఎల్ - గడేపాన్ (గడేపాన్, కోటా, రాజస్థాన్): 1994 నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ ప్లాంటు సముదాయాన్ని విస్తరిస్తూ, 12.7 లక్షల మెట్రిక్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో ఈ ప్రైవేటు బ్రౌన్‌ఫీల్డ్ ప్రాజెక్టును చేపడుతున్నారు.

6.    ఐ.ఐ.పీ.ఎల్ - జగదీష్‌పూర్ (జగదీష్‌పూర్, ఉత్తరప్రదేశ్): 1988లో ఏర్పాటైన ప్లాంటుకు అదనంగా సంవత్సరానికి 12.7 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల ఈ ప్రైవేట్ బ్రౌన్‌ఫీల్డ్ ప్రాజెక్టును ప్రతిపాదించారు.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న భూమి, ఇతర సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు, రవాణా వ్యవస్థ, సాంకేతిక మానవ వనరుల వంటి బ్రౌన్‌ఫీల్డ్ ప్రాజెక్టుల ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవడం వల్ల పనులు వేగంగా పూర్తవడంతో పాటు నిర్మాణ వ్యయం తగ్గుతుంది. వీటికి తోడు భవిష్యత్తులో మరిన్ని కొత్త ప్రాజెక్టులు రానుండటంతో దేశం యూరియా ఉత్పత్తిలో పూర్తిస్థాయి స్వయం-సమృద్ధి సాధించే దిశగా మరింత ముందుకు సాగనుంది.

పాతబడిన ప్లాంట్ల ఆధునికీకరణ, కొత్త ప్లాంట్ల ఏర్పాటు:

ఎం.ఎఫ్.ఎల్ - మద్రాస్ (60 ఏళ్లకు పైబడినది)... ఎన్‌.ఎఫ్.ఎల్ - నంగల్ (సుమారు 50–55 ఏళ్ల నాటిది)... వంటి పురాతన యూరియా యూనిట్లు అధిక ఉత్పత్తి వ్యయం, భారీ ఇంధన వినియోగం సహా నిర్వహణలో భద్రతాపరమైన ముప్పులనూ ఎదుర్కొంటున్నాయి. ఉదాహరణకు, పరిశ్రమ సగటు ఇంధన వినియోగం 5.95 Gcal/MT కాగా, నూతన పరిశ్రమ ఇంధన వినియోగం టన్నుకు కేవలం 5 Gcal/MT ఉంది. నంగల్ ప్లాంట్‌లో ఇది ఏకంగా 6.498 Gcal/MT నమోదవుతోంది. అధిక ఇంధనాన్ని వినియోగించే ఇలాంటి పాత యూనిట్ల స్థానంలో బ్రౌన్‌ఫీల్డ్ విస్తరణ ద్వారా ఆధునిక ప్లాంట్లను ఏర్పాటు చేయడం వల్ల భద్రత, సామర్థ్యానికి సంబంధించిన సవాళ్లు పరిష్కారమవుతాయి. తద్వారా దేశీయ యూరియా సరఫరా నిరంతరాయంగా కొనసాగుతుంది.

వినియోగంపై ప్రభావం, దిగుమతుల తగ్గింపు:

దేశంలో వార్షిక యూరియా డిమాండ్, వినియోగం సుమారు 400 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉంది. 2014–15లో ఏడాదికి 225 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉన్న దేశీయ యూరియా ఉత్పత్తి... 2023–24 నాటికి రికార్డు స్థాయిలో 314.07 లక్షల మెట్రిక్ టన్నులకి చేరుకుంది. 2025–26లో ఇది 293.30 లక్షల మెట్రిక్ టన్నులుగా నమోదైంది. దేశీయ మొత్తం ఉత్పత్తి సామర్థ్యం (ఆర్ఏసీ) 2014–15లో  సంవత్సరానికి 207.54 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 2026–27 నాటికి సంవత్సరానికి 269.42 లక్షల మెట్రిక్ టన్నులకి పెరిగింది. ఏడాదికి సుమారు 400 లక్షల మెట్రిక్ టన్నుల వినియోగం ఉన్న నేపథ్యంలో... ఈ కొత్త ప్లాంట్ల ఏర్పాటు, సామర్థ్య విస్తరణ ప్రణాళికల వల్ల విదేశాల నుంచి యూరియా దిగుమతులపై ఆధారపడటం గణనీయంగా తగ్గనుంది. తద్వారా విదేశీ మారకద్రవ్యం ఆదా అవ్వడమే కాకుండా, దేశంలో ఎరువుల లభ్యత మరింత బలోపేతం కానుంది.

రూ. 54,000 కోట్ల పెట్టుబడులకు మార్గం సుగమం

ప్రతి బ్రౌన్‌ఫీల్డ్ ప్రాజెక్టుకు సుమారు రూ. 9,000 కోట్ల మూలధన వ్యయం అవుతుందని అంచనా వేయగా, ఈ 6 యూరియా ప్లాంట్ల ద్వారా దాదాపు రూ. 54,000 కోట్ల కొత్త పెట్టుబడులు రానున్నాయి. ఇది యూరియా ఉత్పత్తిలో భారత్‌ను స్వయం-సమృద్ధి దిశగా నడిపించడమే కాకుండా, భారీగా ఉపాధి అవకాశాలనూ అందిస్తుంది. పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని పెంచడానికి, ప్రాజెక్టులకు సులభంగా రుణాలు లభించేలా చూడటానికి ఈ విధానంలో కీలక నిబంధనలు చేర్చారు. ఇందులో భాగంగా కనిష్ఠంగా 12 శాతం నుంచి గరిష్ఠంగా 16 శాతం వరకు సమతుల్య 'రిటర్న్ ఆన్ ఈక్విటీ' (ఆర్‌వోఈ) పరిమితిని నిర్ణయించారు. దీనికి తోడు, విదేశీ మారకద్రవ్య రేట్లలో ఒడిదుడుకుల నుంచి రక్షణ కల్పించే వ్యవస్థనూ ఏర్పాటు చేశారు. దీని ప్రకారం నాలుగేళ్ల తర్వాత అప్పటి మార్కెట్ రేట్ల ఆధారంగా మారకపు విలువను రూపాయల్లోకి మారుస్తారు. ఇప్పటికే ఉన్న బ్రౌన్‌ఫీల్డ్ వసతుల వల్ల ఏటా సుమారు రూ. 225 కోట్లు... అంటే ఎనిమిదేళ్లలో దాదాపు రూ. 1,800 కోట్లు ఆదా కానున్నాయి. ఈ నిబంధనలన్నీ ప్రాజెక్టుల ఆర్థిక స్థిరత్వాన్ని పెంచి, దేశీయ ఎరువుల తయారీ రంగంలోకి నిరంతరాయంగా పెట్టుబడులు వచ్చేందుకు దోహదపడతాయి.

నూతన పెట్టుబడి విధానం (ఎన్ఐపీ)-2012 విజయం... భారత్ యూరియా విధానాల సమగ్ర స్వరూపం:

2013 జనవరి 2న ప్రకటించి, 2014 అక్టోబర్ 7న సవరించిన నూతన పెట్టుబడి విధానం (ఎన్ఐపీ)-2012 ద్వారా దేశంలో 6 కొత్త యూరియా తయారీ యూనిట్లు ఏర్పాటయ్యాయి. వీటిలో 4 యూనిట్లు ప్రభుత్వ రంగ సంస్థల ఉమ్మడి భాగస్వామ్యంతో (తెలంగాణలోని రామగుండం – ఆర్ఎఫ్‌సీఎల్, ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్, జార్ఖండ్‌లోని సింద్రీ, బీహార్‌లోని బరౌని – హెచ్‌యూఆర్ఎల్ యూనిట్లు) ప్రారంభమయ్యాయి. మరో 2 యూనిట్లను ప్రైవేట్ సంస్థలు (పశ్చిమ బెంగాల్‌లోని పనాగఢ్ - మ్యాటిక్స్ ఫెర్టిలైజర్స్, రాజస్థాన్‌లోని గడేపాన్-III - చంబల్ ఫెర్టిలైజర్స్) ఏర్పాటు చేశాయి. వీటిలో ప్రతి యూనిట్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 12.7 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, వీటన్నింటి ద్వారా దేశానికి మొత్తం 76.2 లక్షల మెట్రిక్ టన్నుల వార్షిక అదనపు ఉత్పత్తి సామర్థ్యం సమకూరింది. ఫలితంగా, 2014–15లో 207.54 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉన్న దేశీయ మొత్తం వార్షిక ఉత్పత్తి సామర్థ్యం (ఆర్ఏసీ)... 2026–27 నాటికి 269.42 లక్షల మెట్రిక్ టన్నులకి పెరిగింది. అదనంగా, ఒక్కొక్కటి 12.7 లక్షల మెట్రిక్ టన్నుల వార్షిక సామర్థ్యం గల మరో రెండు ప్రాజెక్టులు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నాయి. ఒడిశాలో బొగ్గు గ్యాసిఫికేషన్ విధానంలో నిర్మిస్తున్న తాల్చేర్ ఫెర్టిలైజర్ ప్రాజెక్ట్ (టీఎఫ్ఎల్ - ఇది 2027 డిసెంబర్ నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది), 2025 మార్చి 19న ప్రకటించి అస్సాంలోని నామ్రూప్ వద్ద ఏర్పాటు చేస్తున్న అస్సాం వ్యాలీ ఫెర్టిలైజర్స్ - కెమికల్స్ కంపెనీ లిమిటెడ్ (ఏవీఎఫ్‌సీసీఎల్) ఈ జాబితాలో ఉన్నాయి.

 

***


(రిలీజ్ ఐడి: 2341607) సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी