నాడు పోస్టు చేయడమైనది:
17 NOV 2026 4:10PM by PIB Hyderabad
గౌరవనీయులైన అధ్యక్షులు మార్కోస్‌కు,
మహాశయులకు,
గౌరవ ప్రతినిధులకు,
నమస్కారం!
తూర్పు ఆసియా సదస్సును అద్భుతంగా నిర్వహించినందుకు అధ్యక్షుడు మార్కోస్‌కు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.
మిత్రులారా,
కోవిడ్ మహమ్మారి తర్వాత ప్రపంచం ఒక సంక్షోభం తర్వాత మరో సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. సంఘర్షణల కారణంగా ఆహారం, ఇంధనం, ఎరువుల సరఫరాపై ఒత్తిడి అంతకంతకూ పెరుగుతోంది.
అంతర్జాతీయ జలమార్గాల్లో నౌకలు, నావికులపై కూడా దాడులు జరుగుతున్నాయి. ఉగ్రవాదం తీవ్ర ముప్పుగా కొనసాగుతుండగా, సైబర్ మోసాలు, ఆన్‌లైన్ మోసాలు వంటి సరిహద్దులు దాటి జరిగే నేరాల కొత్త రూపాలు కూడా పెరుగుతున్నాయి.
మిత్రులారా,
నేడు ప్రపంచానికి అన్నింటికంటే ఎక్కువగా కావాల్సింది శాంతి, స్థిరత్వం, పరిస్థితులపై స్పష్టత, విశ్వసనీయత.
ఉమ్మడి సవాళ్లకు పరిష్కారాలను కనుగొనడం, పరస్పర సహకారాన్ని బలోపేతం చేయడంలో తూర్పు ఆసియా సదస్సు అనేక సంవత్సరాలుగా కీలక వేదికగా నిలుస్తోంది. చర్చలు, పరస్పర గౌరవం, సహకారం అనే ఈ స్ఫూర్తే భారత విదేశాంగ విధానానికి మూలస్తంభం.
ఆసియాన్ ఐక్యత, కేంద్ర స్థానం మా ‘యాక్ట్ ఈస్ట్’ విధానంలో కీలకమైనవి. స్వేచ్ఛాయుత, బహిరంగ, సమ్మిళిత, నియమాల ఆధారిత ఇండో-పసిఫిక్ ప్రాంతానికి మేం కట్టుబడి ఉన్నాం. ఉక్రెయిన్ అయినా, పశ్చిమాసియా అయినా.. శాంతి దిశగా జరిగే ప్రతి ప్రయత్నానికీ మా మద్దతు కొనసాగుతుంది.
మిత్రులారా,
మన ఉమ్మడి సమృద్ధికి సముద్రాలే జీవనాడులు. వాటి భద్రతను, నౌకాయాన స్వేచ్ఛను నిర్ధారించడం మనందరి బాధ్యత.
ఈ దిశగా నావికుల భద్రతా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. దీని కింద ఉమ్మడి శిక్షణ, అత్యవసర పరిస్థితుల్లో స్పందన వంటి అంశాల్లో సహకారాన్ని మరింత పెంపొందిస్తాం.
మిత్రులారా,
డిజిటల్ ప్రపంచంలో విశ్వాసం, భద్రతను నిర్ధారించడం కూడా అంతే అవసరం. ఈ ఏడాది భారత్‌లో నిర్వహించిన ఏఐ ఇంపాక్ట్ సదస్సులో మానవ కేంద్రీకృత, సమ్మిళిత, సురక్షితమైన కృత్రిమ మేధ అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చాం. డీప్‌ఫేక్‌లు, తప్పుడు సమాచారాన్ని ఎదుర్కోవడానికి డిజిటల్ వాటర్‌మార్కింగ్ వంటి సాంకేతిక పరిజ్ఞానాల అవసరాన్ని కూడా తెలియజేశాం.
ఆన్‌లైన్ మోసాలను ఎదుర్కోవడంపై నేడు విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనను స్వాగతిస్తున్నాం.
పెరుగుతున్న ఈ ముప్పును సమర్థంగా ఎదుర్కొనేందుకు, భారత్‌లోని నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీలో తూర్పు ఆసియా సదస్సు సైబర్ నేరాల సదస్సును నిర్వహించాలని ప్రతిపాదిస్తున్నాం.
మిత్రులారా,
వేల సంవత్సరాల నాటి ఉమ్మడి వారసత్వమే మన సంబంధాలకు పునాది. భారత్‌లోని లోథల్‌లో అభివృద్ధి చేస్తున్న జాతీయ నౌకావాణిజ్య వారసత్వ సముదాయం త్వరలో ఈ ఉమ్మడి వారసత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పనుంది. మన చారిత్రక, సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు లోథల్‌లో తూర్పు ఆసియా సదస్సు సముద్ర వారసత్వ ఉత్సవాన్ని కూడా నిర్వహిస్తాం.
వచ్చే ఏడాది నలందలో తూర్పు ఆసియా సదస్సు విశ్వవిద్యాలయాల అధిపతుల సదస్సును నిర్వహిస్తాం. ఇది విద్య, పరిశోధన రంగాల్లో మన సహకారానికి కొత్త ఊపునిస్తుంది.
మిత్రులారా,
ఈ ఏడాది ఆగ్నేయాసియాలో చారిత్రక స్నేహ, సహకార ఒప్పందం (ట్రీటీ ఆఫ్ అమిటీ అండ్ కోఆపరేషన్) 50వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాం.
యాభై ఏళ్ల క్రితం ఈ ప్రాంతం ప్రపంచానికి ఒక కీలక సందేశాన్ని అందించింది. అది శాంతి, సార్వభౌమత్వానికి గౌరవం, చర్చల సందేశం. నేడు ఆ సందేశం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. మన ఉమ్మడి భవిష్యత్తు సంఘర్షణల ద్వారా కాకుండా, పరస్పర గౌరవం, సహకారం ద్వారా రూపుదిద్దుకుంటుంది.
ఈ దార్శనికతతో ప్రాంతీయ శాంతి, స్థిరత్వం, ఉమ్మడి సమృద్ధికి కట్టుబడి ఉంటూ భారత్ ఆసియాన్‌కు పూర్తి మద్దతుగా నిలుస్తుంది.
ధన్యవాదాలు.
***