బెంగళూరు సోదరీసోదరులకు నమస్కారం! కర్ణాటక గవర్నర్ సుధా యాదవ్, ముఖ్యమంత్రి డీకే శివకుమార్, రాష్ట్ర మంత్రి కృష్ణ బైరె గౌడ, లోక్‌సభలో నా సహసభ్యులు, బెంగళూరు యువనేత తేజస్వీ సూర్య, ఈ కార్యక్రమానికి హాజరైన ఇతర ప్రముఖులు, సోదరీసోదరులారా,
మన గవర్నర్ సుధాయాదవ్ గారితో వేదిక పంచుకొనే అవకాశం నాకు మొదటిసారి లభించింది. కర్ణాటక ప్రజలకు బహుశా ఆమె గురించి ఇంకా పూర్తిగా తెలిసి ఉండకపోవచ్చు. కానీ, నేను ఆమె జీవితం గురించి చెప్పాలనుకుంటున్నాను. దేశసేవ అంటే ఏంటి? దేశానికి అంకితమై ఉండటం అంటే ఏంటి? వీటిని మనం సుధాజీని, ఆమె కుటుంబాన్ని చూసి నేర్చుకోవచ్చు. కార్గిల్ యుద్ధంలో ఆమె భర్త అమరులయ్యారు. ఆ తర్వాత కూడా ఆమె తన భర్త జ్ఞాపకార్థం భరతమాతకు సేవ చేయాలనే తన సంకల్పాన్ని కొనసాగించారు. ఈనాటికీ సేవాస్ఫూర్తితో పనిచేస్తున్నారు. ఎన్నో సంవత్సరాలు పార్లమెంటులో సేవలందించి అనేక ముఖ్యమైన అంశాలకు మార్గనిర్దేశం చేశారు. ఇప్పుడు కర్ణాటకలో ఈ రాష్ట్ర ప్రజల ఆనందం, శాంతి, సంక్షేమాల కోసం కృషి చేస్తున్నారు. సుధాజీకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
ముందుగా బెంగళూరు నగర దేవత అన్నమ్మతాయికి, నాదప్రభు కెంపెగౌడకు హృదయపూర్వక నమస్కారాలు. బెంగళూరు,కర్ణాటక అభివృద్ధి ప్రయాణానికి ఈ రోజు సరికొత్త వేగాన్ని జోడిస్తోంది. రవాణా అనుసంధానం, ఇంధన భద్రతకు సంబంధించి రూ. 15,000 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను ఈ రోజు ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్నాం. మెట్రో, రైల్వే ప్రాజెక్టుల నుంచి ఇంధన భద్రత కార్యక్రమాల వరకు... ఇవన్నీ కర్ణాటక మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తాయి.
మిత్రులారా,
ఏ దేశ అభివృద్ధి ప్రయాణంలోనైనా మౌలిక సదుపాయాలు కీలకపాత్ర పోషిస్తాయి. అభివృద్ధికి, ఉపాధికి, పరిశ్రమలకు కొత్త అవకాశాలను మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పిస్తాయి. సమాజంలోని ప్రతి వర్గానికీ ఈ అభివృద్ధి అవకాశాలు చేరినప్పుడే పేదరికంపై పోరాటం మరింత బలోపేతమవుతుంది. ఫలితంగా ఇటీవలి సంవత్సరాల్లో దేశంలో దాదాపు 50 కోట్ల మంది పౌరులు తీవ్ర పేదరికం నుంచి బయటపడ్డారు. ఈ రోజు ప్రారంభిస్తున్న ప్రాజెక్టులు కూడా ఈ అభివృద్ధి ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్తాయి. ఇవి వికసిత్ కర్ణాటక అభివృద్ధికి, వికసిత్ కర్ణాటక ద్వారా వికసిత్ భారత్ నిర్మాణానికి సరికొత్త వేగాన్ని అందిస్తాయి. టెక్ సిటీగా బెంగళూరుకు ఉన్న గుర్తింపును ఇవి మరింత బలోపేతం చేస్తాయి. ఈ ప్రాజెక్టులన్నింటికీ కర్ణాటక ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
మిత్రులారా,
కొద్దిసేపటి క్రితమే బెంగళూరు మెట్రో కొత్త పింక్ లైన్‌ను నగర ప్రజలకు అంకితం చేశాం. ఈ కొత్త మెట్రో లైనుతో ఐఐఎం బెంగళూరుతో సహా అనేక విద్యాసంస్థలకు రవాణా సౌకర్యం మరింత మెరుగవుతుంది. అంతేకాకుండా బెంగళూరులో ప్రధాన వ్యాపార సాంకేతిక, వాణిజ్య కేంద్రాలుగా గుర్తింపు పొందిన అనేక ప్రాంతాలకు కూడా మెట్రో సదుపాయం ఏర్పాటయింది. దీనివల్ల బెంగళూరులోని లక్షలాది మందికి ప్రయాణ సౌలభ్యం కలుగుతుంది. డబ్బుతో పాటు, సమయం ఆదా అవుతుంది.
మిత్రులారా,
దివంగత అనంత్ కుమార్ జీ వర్ధంతి నిన్ననే జరిగింది. ఈ ప్రాంతంతో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉండేది. ఈ రోజు ఈ మెట్రో లైన్‌ను చూసి ఆయన ఆత్మ ఎంతో సంతోషించి ఉంటుంది. ఆయనకు హృదయపూర్వకంగా నివాళులు అర్పిస్తున్నాను.
మిత్రులారా,
భారతదేశానికి బెంగళూరే సిలికాన్ వ్యాలీ. దేశ ఐటీ ఎగుమతుల్లో మూడింట ఒక వంతుకు పైగా వాటా ఈ నగరానిదే. భారతదేశ ఆవిష్కరణలకు, ఆర్థిక వృద్ధికి ఈ నగరం ఒక ప్రధాన చోదక శక్తిగా ఉంది. అందుకే మొత్తం బెంగళూరు ప్రాంతం వేగవంతమైన అభివృద్ధి, ఆధునిక ప్రజా రవాణా విస్తరణ కేంద్ర ప్రభుత్వానికి ప్రధాన ప్రాధాన్యాలుగా ఉన్నాయి. ఈ దార్శనికతతోనే కేంద్ర ప్రభుత్వం నమ్మ మెట్రో విస్తరణకు అండగా నిలుస్తోంది. 2014లో నమ్మ మెట్రో కేవలం 17 కి.మీ.ల పొడవు మాత్రమే ఉండేది. ఇప్పుడు ఈ వ్యవస్థ 100 కిలోమీటర్లకు పైగా విస్తరించింది. మనం వరుసగా సెంచరీలు సాధిస్తున్నాం. శివకుమార్ జీ.. కొన్ని రోజుల క్రితమే చెస్ గ్రాండ్‌మాస్టర్ల విషయంలో భారత్ సెంచరీ కొట్టిందని మీరు వినే ఉంటారు. భారతదేశంలో ఇప్పుడు 100 మంది చెస్ గ్రాండ్‌మాస్టర్లు ఉన్నారు. వారంతా ఈ కాల వ్యవధిలో వెలుగులోకి వచ్చినవారే.
మిత్రులారా,
దేశంలో ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ తర్వాత 100 కి.మీ.ల మెట్ర్ నెట్వర్క్ కలిగిన మూడో నగరంగా బెంగళూరు నిలిచింది. నమ్మ మెట్రో సాధించిన ఈ విజయం కేవలం ఒక్క ప్రాజెక్టుకే పరిమితం కాదు. జీవన సౌలభ్యం, ప్రయాణ సౌలభ్యం పట్ల దేశం అనుసరిస్తున్న కొత్త దృక్పథానికి ఇది నిదర్శనం. మధ్యతరగతి కుటుంబాల జీవితాలను మెరుగుపరచాలన్న దేశ సంకల్పానికి ఇది ఫలితం.
మిత్రులారా,
వలస పాలన కాలం నాటి పాత ఆలోచనా ధోరణిని నేటి భారతీయ రైల్వే వదిలించుకుంటోంది. ఇప్పుడు కొత్త వారసత్వాన్ని, చరిత్రను దేశ రైల్వే వ్యవస్థ సృష్టిస్తోంది. మన రైల్వే స్టేషన్లు, మన రైల్వే ఇంజిన్లు, మన రైల్వే కోచ్‌లు – అన్నింటిపై ఇప్పుడు భారతదేశపు సొంత ముద్ర, గుర్తింపు కనిపిస్తున్నాయి. వికసిత్ భారత్ రైల్వే సేవలకు వందే భారత్ రైళ్లు, అమృత్ భారత్ స్టేషన్లు నిదర్శనంగా నిలుస్తున్నాయి. చామరాజనగర్, చిక్మగుళూరు, సకలేష్పూర్, సుబ్రమణ్య రోడ్ స్టేషన్లతో సహా కర్ణాటకలో అరవైకి పైగా రైల్వేస్టేషన్లు ఇప్పుడు అమృత్ భారత్ స్టేషన్లుగా మారాయి. ఈ స్టేషన్లు ఆధునికతతో పాటు ప్రయాణికుల అవసరాలకు తగినట్లుగా ఉన్నాయి. వృద్ధులు, దివ్యాంగులతో సహా ప్రతి ప్రయాణికుడికి ఇక్కడ ప్రత్యేక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. గతంలో విమానాశ్రయాల్లో అందుబాటులో ఉన్న సౌకర్యాలు ఇప్పుడు రైల్వేస్టేషన్లలో పేద, మధ్యతరగతి కుటుంబాలకు అందించేందుకు కృషి జరుగుతోంది.
మిత్రులారా,
గత 10, 12 ఏళ్లలో భారత రైల్వే బడ్జెట్ అనేక రెట్లు పెరిగింది. ఇప్పుడే తేజస్వి గారు పేర్కొన్నట్లు ఈ కాలంలో కర్ణాటక రైల్వే బడ్జెట్ కూడా తొమ్మిది రెట్లు పెరిగింది. ఈ ఏడాది కూడా కర్ణాటకకు నాలుగు అమృత్ స్టేషన్లు, రెండు లైన్లుగా విస్తరణ, విద్యుదీకరణకు సంబంధించిన రెండు ప్రాజెక్టులు మంజూరయ్యాయి. కొన్ని రోజుల క్రితమే కర్ణాటకకు తొలి వందేభారత్ స్లీపర్ రైలు అందుబాటులోకి వచ్చింది. నేడు గోవాతో కర్ణాటకను అనుసంధానించే వందేభారత్ రైలును కూడా ప్రారంభించుకున్నాం. ఈ రైలు ద్వారా మంగళూరుతో పాటు కర్ణాటకలోని తీరప్రాంత మార్గం వెంబడి ఉన్న ప్రజలకు సెమీ హైస్పీడ్ రైలులో ప్రయాణించే సరికొత్త అనుభూతి లభించనుంది.
మిత్రులారా,
వికసిత్ భారత్ నిర్మాణంలో అనుసంధానతతో పాటు ఇంధన భద్రత కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఇరాన్, గల్ఫ్ దేశాల చుట్టుపక్కల కొనసాగుతున్న యుద్ధం ఇంధన భద్రత ఎంత ముఖ్యమో తెలియజేసింది. ఈ పరిణామాలు భారత్‌కు కూడా సవాలుతో కూడిన పరిస్థితులను సృష్టించాయి. అయితే, గత దశాబ్ద కాలంగా ఇంధన భద్రత దిశగా తీసుకున్న చర్యలు ఈ సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కొనే శక్తిని మనకు అందించాయి. పెట్రోలు, డీజిలు, ఎల్పీజీ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాం. ముడి చమురు నిల్వ చేసుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు కల్పించాం. సౌర, జల, పవన విద్యుత్ ఉత్పత్తిని విస్తరించాం. రైల్వేల్లో దాదాపు 100 శాతం విద్యుదీకరణ సాధించాం. మెట్రో వంటి ప్రజా రవాణా వ్యవస్థలను బలోపేతం చేశాం. నేడు కర్ణాటకలో శంకుస్థాపనలు చేసిన లేదా ప్రారంభించిన మూడు ప్రాజెక్టులు కూడా దేశ ఇంధన భద్రతకు మరింత బలాన్ని చేకూర్చనున్నాయి. మంగళూరులోని ఎల్పీజీ ప్రాజెక్టు దేశ ఎల్పీజీ నిల్వ సామర్థ్యాన్ని 80 వేల మెట్రిక్ టన్నుల మేర పెంచుతుంది. దేవనగుండి మార్కెటింగ్ టెర్మినల్ ద్వారా పెట్రోలు, డీజిలు, విమాన ఇంధన సరఫరా మరింత క్రమబద్ధంగా, విశ్వసనీయంగా మారుతుంది. ఇక బెంగళూరులోని కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) కేంద్రం రోజుకు సుమారు 13 టన్నుల బయోగ్యాస్‌ను ఉత్పత్తి చేయనుంది. దీనివల్ల వ్యర్థాల నిర్వహణ మెరుగుపడటంతో పాటు సహజ వాయువు దిగుమతుల కోసం వెచ్చించే ఖర్చు కూడా ఆదా అవుతుంది.
మిత్రులారా,
ఇంధన భద్రతలో విద్యుత్ ఉత్పత్తి కూడా ఒక ముఖ్యమైన అంశం. చిప్స్ నుంచి నౌకల వరకు, కృత్రిమ మేధ (ఏఐ), డేటా కేంద్రాల నుంచి క్వాంటం కంప్యూటింగ్ వరకు.. నూతన సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో నాయకత్వ స్థానాన్ని సాధించే లక్ష్యంతో భారత్ ముందుకు సాగుతోంది. ఈ అవసరాలకు సరిపడా విద్యుత్‌ను దేశంలో అందుబాటులో ఉంచేందుకు నిరంతర కృషి జరుగుతోంది. ప్రస్తుతం భారత్ పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సామర్థ్యం 300 గిగావాట్లను దాటింది. స్వచ్ఛమైన ఇంధన లక్ష్యాన్ని సాధించేందుకు అణు విద్యుత్ కేంద్రాల సంఖ్యను కూడా భారత్ పెంచుతోంది.
మిత్రులారా,
కేంద్ర ప్రభుత్వ పథకాల కారణంగా నేడు దేశ ప్రజలు విద్యుత్ వినియోగదారులుగానే కాకుండా, విద్యుత్ ఉత్పత్తిదారులుగా కూడా మారుతున్నారు. పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద దేశవ్యాప్తంగా 60 లక్షలకు పైగా కుటుంబాలు తమ ఇళ్ల పైకప్పులపై సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకున్నాయి. వీటిలో కర్ణాటకకు చెందిన 40 వేలకు పైగా కుటుంబాలు కూడా ఉన్నాయి. ప్రతి కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.80 వేల ఆర్థిక సహాయం అందించింది. ప్రతి కుటుంబానికీ ఈ సహాయం అందించింది. అదేవిధంగా పీఎం–కుసుమ్ పథకం కింద కర్ణాటక రైతుల కోసం 8 లక్షలకు పైగా సౌర విద్యుత్ పంపుల ద్వారా సాగునీటి సదుపాయాలు కల్పిస్తున్నారు. అంటే కర్ణాటకలో అన్నదాతలు ఇప్పుడు ఇంధనదాతలుగా కూడా మారుతున్నారు. ఈ పథకాల వల్ల విద్యుత్ ఖర్చులు తగ్గడమే కాకుండా, ఆదాయం, ఉపాధికి కొత్త అవకాశాలు కూడా ఏర్పడుతున్నాయి.
మిత్రులారా,
ఒక దేశం లక్ష్యసాధన దిశగా ముందుకు సాగినప్పుడు, ప్రతి పౌరుడు అభివృద్ధిలో భాగస్వామి అయినప్పుడు, పన్ను చెల్లింపుదారులు అందించే వనరులను అభివృద్ధి కోసం సక్రమంగా వినియోగించినప్పుడు.. ఫలితాలు కూడా ఆశాజనకంగా, అర్థవంతంగా ఉంటాయి. 2014లో ‘సబ్కా సాథ్.. సబ్కా వికాస్’ అనే సంకల్పంతో మనం పని ప్రారంభించాం. నేడు ఆ ప్రయత్నాల ఫలితంగా దేశంలో మధ్యతరగతి విస్తరిస్తోంది. అదే సమయంలో కొత్తగా ఆకాంక్షలు పెరుగుతున్న వర్గం కూడా ఆవిర్భవిస్తోంది. ఈ వర్గంలో ప్రజల ఆశలు, ఆకాంక్షలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తమ ఇళ్లలో రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషీన్ ఉండాలని వారు కోరుకుంటున్నారు. తమ కుటుంబం కోసం స్కూటర్ లేదా మోటార్ సైకిల్ కొనాలని ఆశిస్తున్నారు. పిల్లలకు మెరుగైన విద్య, పోషకాహారం, వైద్య సదుపాయాలు అందించాలని ఆకాంక్షిస్తున్నారు. పర్యాటకానికి ఖర్చు చేయడంతో పాటు కొత్త అనుభవాలను పొందాలని కోరుకుంటున్నారు. ఈ పెరుగుతున్న ఆకాంక్షలు దేశంలో కొత్త డిమాండ్‌కు దారితీస్తున్నాయి. ఆటోమొబైల్ రంగం నుంచి ఎలక్ట్రానిక్స్ వరకు, పర్యాటకం నుంచి సేవల రంగం వరకు కొత్త పరిశ్రమలు, కర్మాగారాలు, ఉపాధి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. నూతన మధ్యతరగతి వర్గం భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ప్రధాన శక్తిగా మారుతోంది. కర్ణాటక, బెంగళూరులో కూడా పెద్ద సంఖ్యలో ఉన్న ఈ కొత్త మధ్యతరగతి ప్రయోజనాలకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది.
మిత్రులారా,
మధ్యతరగతి పొదుపును పెంచి, వారి చేతుల్లో మరింత డబ్బు మిగిలేలా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. వార్షిక ఆదాయం రూ. 12 లక్షల వరకు ఉన్నవారికి ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు కల్పించాం. టీడీఎస్ నిబంధనల్లో మార్పులు చేసి సీనియర్ సిటిజన్లకు, అద్దె ఆదాయం పొందేవారికి ఊరట కల్పించాం. తదుపరి తరం జీఎస్టీ సంస్కరణల ద్వారా నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాం. వ్యక్తిగత ఆరోగ్య, జీవిత బీమా పాలసీలపై జీఎస్టీని తొలగించడం ద్వారా బీమాను మరింత అందుబాటులోకి తీసుకొచ్చాం.
మిత్రులారా,
మధ్యతరగతి పొదుపును పెంచడం, వారి కొనుగోలు శక్తిని బలోపేతం చేయడం, కుటుంబ కలలను నెరవేర్చుకునేలా చేయడంతో పాటు దేశ ఆర్థిక పురోగతికి వారు కూడా తోడ్పడేలా చూడటమే మా ప్రయత్నం. నేడు కర్ణాటకలో జరుగుతున్న ఈ కార్యక్రమం కూడా అభివృద్ధి ప్రస్థానానికి కొత్త ఊతాన్ని ఇవ్వనుంది. కొత్త ప్రాజెక్టులన్నింటికీ మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ ధన్యవాదాలు.
***