రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆంధ్రప్రదేశ్లో రూ.3 లక్షల కోట్ల రహదారి మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రణాళికను ప్రకటించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

2014 నుంచి రాష్ట్రంలో రెట్టింపైన జాతీయ రహదారుల నెట్వర్క్.. గ్రీన్ఫీల్డ్ కారిడార్లు, ఎక్స్ప్రెస్వేలు, పోర్టుల అనుసంధానంతో ప్రయాణ సమయం, రవాణా వ్యయాలు తగ్గింపు: నితిన్ గడ్కరీ

నాడు పోస్టు చేయడమైనది: 13 NOV 2026 5:14PM by PIB Vijayawada

విశాఖపట్నం
2026 నవంబర్ 13

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌లో రహదారి మౌలిక సదుపాయాలను సమూలంగా అభివృద్ధి చేసే భారీ ప్రణాళికలను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ వెల్లడించారు. విశాఖపట్నంలో నేడు నిర్వహించిన 31వ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) భాగస్వామ్య సదస్సులో ఆయన ప్రసంగించారు.

“ఆర్థిక వృద్ధికి పునాది రహదారులే” అనే అంశాన్ని ప్రస్తావిస్తూ, రవాణా వ్యయాలను తగ్గించడం, పెట్టుబడులను ఆకర్షించడం, ఉపాధి అవకాశాలను కల్పించడం, ఆర్థిక శ్రేయస్సును పెంపొందించడం కోసం నాణ్యమైన రహదారి మౌలిక సదుపాయాలు అత్యంత అవసరమని ఆయన స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో భారీ స్థాయిలో రహదారుల అభివృద్ధి

రాష్ట్రంలో సుమారు రూ.3 లక్షల కోట్ల విలువైన రహదారి ప్రాజెక్టులు ఇప్పటికే అమలులో ఉన్నాయని, మరికొన్ని ప్రణాళిక దశలో ఉన్నాయని కేంద్ర మంత్రి గడ్కరీ తెలిపారు. ఇందులో రూ.60 వేల కోట్ల వ్యయంతో చేపట్టిన 4,750 కిలోమీటర్ల రహదారి పనులు పూర్తయ్యాయని, రూ.1 లక్ష కోట్ల వ్యయంతో 2,500 కిలోమీటర్ల మేర పనులు కొనసాగుతున్నాయని వివరించారు. అలాగే రూ.1.20 లక్షల కోట్ల వ్యయంతో 4,600 కిలోమీటర్ల మేర రహదారుల అభివృద్ధి, ఆధునికీకరణ పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారుల నెట్‌వర్క్ 2014లో 4,100 కిలోమీటర్లు ఉండగా, 2026 నాటికి దాదాపు రెట్టింపై 8,700 కిలోమీటర్లకు చేరుకుందని వెల్లడించారు.

రాష్ట్ర అభివృద్ధికి ప్రధానంగా మూడు అంశాలపై దృష్టి సారించినట్లు మంత్రి వివరించారు.

  • గ్రీన్‌ఫీల్డ్ కారిడార్లు, ప్రవేశ నియంత్రిత జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌ రహదారుల నిర్మాణం.
  • నౌకాశ్రయాలకు రహదారి అనుసంధానం.
  • రింగ్ రోడ్లు, బైపాస్ రహదారుల నిర్మాణం.

ఈ ప్రాజెక్టులన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సన్నిహిత సంప్రదింపుల ద్వారా, ముఖ్యమంత్రి శ్రీ ఎన్.చంద్రబాబు నాయుడు నిర్దేశించిన అభివృద్ధి దార్శనికతకు అనుగుణంగా అమలవుతున్నాయని తెలిపారు.

కీలక గ్రీన్‌ఫీల్డ్ కారిడార్లు, ఎక్స్‌ప్రెస్‌వేలు

బెంగళూరు–కడప–విజయవాడ కారిడార్ (340 కి.మీ., రూ.14,000 కోట్లు): ఈ ప్రాజెక్టులో ఇప్పటికే 70 శాతం పనులు జరిగాయని, 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఈ కారిడార్ ద్వారా ప్రయాణ దూరం సుమారు 210 కిలోమీటర్లు తగ్గడంతో పాటు, ప్రయాణ సమయం 12 గంటల నుంచి 4 గంటలకు తగ్గనుంది. ముఖ్యంగా సిమెంట్, ఖనిజ పరిశ్రమలకు ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

రాయ్‌పూర్–విశాఖపట్నం కారిడార్ (460 కి.మీ., రూ.16,000 కోట్లు): ఈ ప్రాజెక్టులో 96 శాతం పనులు పూర్తయ్యాయని, 2027 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ కారిడార్ అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం 13 గంటల నుంచి 5 గంటలకు తగ్గుతుంది. పెద్ద నౌకల రాకపోకలకు అనువుగా 18 మీటర్ల డ్రాఫ్ట్ సదుపాయం కలిగిన విశాఖపట్నం పోర్టుకు ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా రాష్ట్రాల నుంచి రవాణా అనుసంధానం గణనీయంగా మెరుగుపడుతుంది. ఈ కారిడార్ విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల మీదుగా సాగుతుంది.

హైదరాబాద్‌–విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారి ఆరు వరుసలుగా విస్తరణ (286 కి.మీ., రూ.12,000 కోట్లు): ఈ ప్రాజెక్టుకు పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్ట్‌నర్‌షిప్‌ అప్రైజల్‌ కమిటీ ఆమోదం లభించిందని, ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గ ఆమోదం కోసం ఎదురుచూస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ విస్తరణ పూర్తయితే హైదరాబాద్‌ నుంచి విజయవాడకు ప్రయాణ సమయం 4.5 గంటల నుంచి 2.5 గంటలకు తగ్గనుంది.

ఢిల్లీ–ముంబై ఎక్స్‌ప్రెస్‌వే విస్తరణలు, ఉత్తర–దక్షిణ భారత అనుసంధాన మార్గాల్లోని కొన్ని భాగాలు సహా ఇతర కీలక జాతీయ కారిడార్లు కూడా ఆంధ్రప్రదేశ్‌కు ప్రయోజనం చేకూరుస్తాయని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమైన మార్గాల్లో ఉత్తర, దక్షిణ భారతదేశాల మధ్య ప్రయాణ దూరం సుమారు 300 కిలోమీటర్ల మేర తగ్గనుందని వివరించారు.

పోర్టుల అనుసంధానం, రింగ్ రోడ్ల అభివృద్ధి

సుదీర్ఘ తీరప్రాంతం, ప్రధాన నౌకాశ్రయాలు కలిగిన ఆంధ్రప్రదేశ్‌లో పోర్టుల ఆధారిత అభివృద్ధికి వ్యూహాత్మక ప్రాధాన్యం ఉందని కేంద్ర మంత్రి గడ్కరీ పేర్కొన్నారు. గతంలో చేపట్టిన సాగరమాల కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేలా పలు కీలక ప్రాజెక్టులు అమలు చేస్తున్నట్లు తెలిపారు.

ఇందులో భాగంగా ఖరగ్‌పూర్‌–విశాఖపట్నం–అమరావతి కారిడార్ ను మొత్తం 1,100 కిలోమీటర్ల పొడవున రూ.71,000 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయనున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ పరిధిలో 460 కిలోమీటర్ల మేర నిర్మాణానికి రూ.30,000 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారీ ప్రక్రియ కొనసాగుతోంది. దీని ద్వారా విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం పోర్టులకు నేరుగా రహదారి అనుసంధానం కల్పించనున్నారు. అదేవిధంగా విశాఖపట్నం, కాకినాడ, కృష్ణపట్నం పోర్టులకు ప్రత్యేక రహదారి అనుసంధాన ప్రాజెక్టులు కూడా నిర్మాణంలో ఉన్నాయని, మరికొన్ని తుది దశకు చేరుకున్నాయని మంత్రి తెలిపారు.

ప్రతిపాదిత అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి వివరాల్ని తెలియజేసిన గడ్కరీ.. 190 కిలోమీటర్ల పొడవైన ఈ రింగ్ రోడ్డు నిర్మాణానికి సుమారు రూ.32,000 కోట్లు వ్యయం కానుందని వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకు పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్ట్‌నర్‌షిప్‌ అప్రైజల్‌ కమిటీ పరిశీలన పూర్తయిందని, కేంద్ర మంత్రివర్గ ఆమోదం రావాల్సి ఉందని తెలిపారు. ఈ రహదారి ఎన్టీఆర్‌, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల మీదుగా సాగుతుంది. దీని నిర్మాణంతో పట్టణ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో పాటు, పారిశ్రామిక పార్కులు, లాజిస్టిక్స్‌ హబ్‌ల అభివృద్ధికి అవసరమైన రవాణా సదుపాయాలు మెరుగుపడతాయి. విశాఖపట్నం, విజయవాడ తదితర ప్రాంతాల్లో బైపాస్ రహదారుల నిర్మాణ పనులు కూడా కొనసాగుతున్నాయని మంత్రి వెల్లడించారు.

రవాణా వ్యయాల తగ్గింపు, నాణ్యత, నిధుల సమీకరణ

మెరుగైన రహదారి నాణ్యత కారణంగా దేశంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో రవాణా వ్యయాల వాటా గతంలో సుమారు 16 శాతం ఉండగా, ప్రస్తుతం సింగిల్‌ డిజిట్‌ స్థాయికి చేరువైందని, తాజా అంచనాల ప్రకారం ఇది 9 నుంచి 10 శాతంగా ఉందని శ్రీ గడ్కరీ పేర్కొన్నారు.

రహదారుల నిర్మాణంలో నాణ్యత, భద్రత, వేగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. నాసిరకం పనుల విషయంలో ఏమాత్రం ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. నిర్మాణ పనుల్లో లోపాలు తలెత్తితే వాటికి కాంట్రాక్టర్లు బాధ్యత వహించేలా డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నట్లు వివరించారు. రహదారుల నెట్‌వర్క్‌ను పర్యవేక్షించేందుకు సాంకేతిక పరిజ్ఞానంతో పాటు సామాజిక మాధ్యమాలను కూడా వినియోగిస్తున్నట్లు తెలిపారు.

నిధుల సమీకరణ విషయానికి వస్తే, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ మార్కెట్‌లో బలమైన విశ్వసనీయతను సంపాదించుకుందని మంత్రి పేర్కొన్నారు. గతంలో జారీ చేసిన బాండ్లకు కొన్ని గంటల్లోనే ఏడు రెట్లకు పైగా స్పందన లభించిందని గుర్తుచేశారు. ఇన్‌విట్స్‌, టోల్‌ ఆపరేట్‌ ట్రాన్స్‌ఫర్‌, సెక్యూరిటైజేషన్‌ వంటి వినూత్న ఆర్థిక నమూనాల ద్వారా దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడులను సమీకరిస్తున్నట్లు తెలిపారు. ఈ విధానాల్లో సామాన్య పౌరులు కూడా పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు వివరించారు.

ప్రత్యామ్నాయ ఇంధనాలు, సమగ్ర అభివృద్ధి దార్శనికత

శిలాజ ఇంధనాల దిగుమతులను తగ్గించడం, కాలుష్యాన్ని నియంత్రించడం, రైతులకు కొత్త ఆదాయ మార్గాలను కల్పించడం లక్ష్యంగా ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నట్లు కేంద్ర మంత్రి గడ్కరీ తెలిపారు. ఇందులో భాగంగా ఇథనాల్‌, మిథనాల్‌, బయోడీజిల్‌, విద్యుత్ వాహనాలు, కంప్రెస్డ్ బయోగ్యాస్‌, గ్రీన్‌ హైడ్రోజన్‌ వంటి ఇంధనాల వినియోగాన్ని విస్తరించేందుకు మంత్రిత్వ శాఖ కృషి చేస్తోందని చెప్పారు.

వ్యవసాయ వ్యర్థాల నుంచి కంప్రెస్డ్ బయోగ్యాస్‌ ఉత్పత్తి చేసే విషయంలో ఆంధ్రప్రదేశ్ చూపుతున్న ఆసక్తిని అభినందించారు. రైతులు కేవలం అన్నదాతలుగానే కాకుండా, ఇంధన ఉత్పత్తి ద్వారా దేశానికి శక్తినిచ్చే 'ఊర్జాదాతలు'గా కూడా మారాలని పేర్కొన్నారు.

ప్రతిపాదిత మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోని బలమైన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలబెడతాయని కేంద్ర మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రపంచ స్థాయి రహదారి మౌలిక సదుపాయాల అభివృద్ధికి భారత ప్రభుత్వం సంపూర్ణంగా కట్టుబడి ఉందని వెల్లడించారు.

***


(రిలీజ్ ఐడి: 2335979) సందర్శకుల సూచీ సంఖ్య : : 30
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English