పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నూతన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రూపకల్పనలో భారత్ కీలక పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉంది: కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు

రెండేళ్లలో స్వదేశీ ప్రాంతీయ పౌర విమానాల రూపకల్పన, తయారీకి భారత్ సిద్ధం: కేంద్ర మంత్రి

పెట్టుబడులు, తయారీ రంగాలకు విశ్వసనీయ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

నాడు పోస్టు చేయడమైనది: 12 NOV 2026 3:12PM by PIB Vijayawada

వేగంగా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం, ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న ఆర్థిక, రాజకీయ పరిణామాల నేపథ్యంలో నేడు ప్రపంచ దేశాలు విశ్వసనీయ భాగస్వాములు, పటిష్టమైన సరఫరా వ్యవస్థలు, దీర్ఘకాలిక ఆర్థిక భాగస్వామ్యాల కోసం ఎదురుచూస్తున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు.

విశాఖపట్నంలో జరిగిన సీఐఐ సదస్సులో పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, విధాన నిర్ణేతలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. మారుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కేవలం వాణిజ్యం, సాంకేతికత మాత్రమే సరిపోవని, దేశాల మధ్య పరస్పర విశ్వాసం, ప్రభుత్వాలు – పరిశ్రమల మధ్య నమ్మకం, అనిశ్చిత పరిస్థితులను అవకాశాలుగా మలచగల నాయకత్వం ఎంతో అవసరమని అన్నారు. ఈ నూతన ప్రపంచ వ్యవస్థలో భాగస్వామిగా నిలిచేందుకు మాత్రమే కాకుండా, దాని రూపకల్పనలో కీలక పాత్ర పోషించేందుకు కూడా భారత్ సిద్ధమవుతోందని స్పష్టం చేశారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లుగా భారత్ సాధించిన ఆర్థిక ప్రగతిని ఈ సందర్భంగా మంత్రి వివరించారు. దేశంలో దాదాపు 50 కోట్ల మంది బహుముఖ పేదరికం నుంచి బయటపడ్డారని, భారత ఆర్థిక వ్యవస్థ సుమారు 7.8 శాతం వృద్ధి రేటుతో ముందుకు సాగుతోందని తెలిపారు. కోవిడ్ మహమ్మారి సమయంలో భారత్ 100కు పైగా దేశాలకు వ్యాక్సిన్లను సరఫరా చేసిందని గుర్తుచేశారు. అదేవిధంగా యూపీఐ ద్వారా ప్రతిరోజూ 80 కోట్లకు పైగా లావాదేవీలు జరుగుతున్నాయని, వీటి విలువ సుమారు రూ.94 వేల కోట్లుగా ఉందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతతో సాగుతున్న ఈ పరివర్తనను 'మోదీనామిక్స్'గా అభివర్ణించారు. 140 కోట్ల మంది భారతీయుల జీవితాల్లో సమూల మార్పు తీసుకువచ్చి, వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడమే ఈ దార్శనికత ప్రధాన ఉద్దేశమని వివరించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా ఎదగడానికి గల ప్రత్యేక అనుకూలతలను మంత్రి ప్రస్తావించారు. సుదీర్ఘ తీరప్రాంతం, వ్యూహాత్మకంగా ఉన్న ఓడరేవులు, సమృద్ధిగా లభించే సహజ వనరులు, యువశక్తి, వ్యవసాయం, తయారీ, రవాణా, పర్యాటకం, పునరుత్పాదక ఇంధన రంగాల్లో ఉన్న అవకాశాలు రాష్ట్రానికి బలమని పేర్కొన్నారు. వీటికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనికత, కార్యాచరణ తోడవడంతో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు మరింత అనుకూలమైన రాష్ట్రంగా రూపుదిద్దుకుంటోందని అన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును నిరంతరం కొత్త విషయాలను నేర్చుకునే 'నిరంతర విద్యార్థి’'గా అభివర్ణించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు.. 1990వ దశకంలోనే ఐటీ రంగం ప్రాధాన్యతను గుర్తించి ప్రోత్సహించిన ఆయన, ప్రస్తుతం కృత్రిమ మేధ (ఏఐ), క్వాంటమ్ టెక్నాలజీ, భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన నూతన సాంకేతిక వ్యవస్థల అభివృద్ధిపై దృష్టి సారిస్తున్నారని ప్రశంసించారు.

ఆంధ్రప్రదేశ్ కేవలం పెట్టుబడులను ఆహ్వానించే రాష్ట్రంగా మాత్రమే కాకుండా, ఆ పెట్టుబడులను ఉత్పత్తిగా, ఉత్పత్తిని ఉపాధిగా, ఉపాధిని ప్రజల ఆర్థికాభివృద్ధిగా మార్చాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోందని మంత్రి పేర్కొన్నారు. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తదితర నాయకుల సమన్వయంతో కూడిన 'డబుల్ ఇంజిన్ ప్రభుత్వం' రాష్ట్ర అభివృద్ధికి బలమైన మద్దతునిస్తోందని తెలిపారు. పెట్టుబడుల ఆకర్షణతో పాటు, వాటి అమలు, పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించడం, సంబంధిత సంస్థలతో నిరంతరం సంప్రదింపులు జరపడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని వివరించారు.

పౌర విమానయాన రంగంలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పలు కీలక కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రత్యక్షంగా దోహదపడతాయని మంత్రి వివరించారు. ఇందులో భాగంగా ఉడాన్ పథకాన్ని మరో పదేళ్ల పాటు పొడిగిస్తూ రూ.30 వేల కోట్లను కేటాయించినట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా మరో 100 కొత్త విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. 2014లో దేశంలో 74 విమానాశ్రయాలు ఉండగా, ప్రస్తుతం వాటి సంఖ్య 166కు చేరిందని పేర్కొన్నారు.

అదేవిధంగా 200 ఆధునిక హెలీపోర్టుల ఏర్పాటు, విమాన కార్గో రవాణా వ్యవస్థ విస్తరణకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, ఫార్మాస్యూటికల్స్, త్వరగా పాడయ్యే వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు వివరించారు.

ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంలో భాగంగా మరో రెండేళ్లలో స్వదేశీ ప్రాంతీయ పౌర విమానాన్ని రూపొందించి, తయారు చేసేందుకు భారత్ కృషి చేస్తోందని మంత్రి ప్రకటించారు. కర్నూలులో దేశంలోనే తొలి డ్రోన్ సిటీని ఏర్పాటు చేసినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఈ రంగంతో పాటు ఈవీటీఓఎల్ వంటి అభివృద్ధి చెందుతున్న ఆధునిక విమానయాన సాంకేతికతలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని ప్రశంసించారు.

రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఏడు విమానాశ్రయాల సంఖ్యను 14కు పెంచే లక్ష్య సాధనకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. అలాగే రాష్ట్రంలో దేశీయ, అంతర్జాతీయ విమాన కనెక్టివిటీని మరింత మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

***


(రిలీజ్ ఐడి: 2335463) సందర్శకుల సూచీ సంఖ్య : : 32
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Bengali , Gujarati