నాడు పోస్టు చేయడమైనది:
10 NOV 2026 6:18PM by PIB Hyderabad
వ్యవసాయ-జీవవైవిధ్య పరిరక్షణ, వాతావరణ మార్పులను తట్టుకోగల వ్యవసాయం, సుస్థిర ఆహార వ్యవస్థపై ఒడిషాలోని భువనేశ్వర్ నగరంలో రెండు రోజుల జాతీయ కార్యక్రమం ఈ రోజు ప్రారంభమైంది. రాష్ట్ర గవర్నర్ శ్రీ బ్రజ్ మోహన్ రామ్, వ్యవసాయ-రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ కనక్ వర్ధన్ సింగ్ దేవ్, ‘డేర్’ కార్యదర్శి-ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మంగీలాల్ జాట్, ఎం.ఎస్. స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. వారితోపాటు రాష్ట్ర వ్యవసాయ-రైతు సాధికారత శాఖ కమిషనర్-కార్యదర్శి శ్రీ సచిన్ రామచంద్ర జాదవ్, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్తలు, విధాన రూపకర్తలు, ఇతర భాగస్వాములు కూడా హాజరయ్యారు.
కార్యక్రమ ప్రారంభోత్సవం అనంతరం ప్రదర్శనశాలల సందర్శన, వ్యవసాయ ఆవిష్కరణలు, దేశీయ పంటల వైవిధ్యం, చిరుధాన్యాధారిత ఉత్పత్తుల ప్రదర్శన, రైతులతో మాటామంతీ తదితర కార్యకలాపాలు సాగాయి.
ఆ తర్వాత డాక్టర్ శ్రీ ఎం.ఎల్.జాట్ సభనుద్దేశించి మాట్లాడుతూ- వాతావరణ మార్పు, భూసారం, పోషకాలు తదితర పెను సవాళ్లను ఎదుర్కోవడం సహా చిరుధాన్యాలు, అవకాశానుగుణ పంటలపై మరింతగా దృష్టి సారించాలని పేర్కొన్నారు. తద్వారా రాష్ట్రంలోని సుసంపన్న వ్యవసాయ-జీవవైవిధ్యాన్ని సద్వినియోగం చేసుకోవడమే కాకుండా సమయంలో సార్వత్రిక ఆరోగ్యం దిశగా స్థానిక ఆహార వ్యవస్థను ప్రోత్సహించాలని స్పష్టం చేశారు.
రాష్ట్రం అమలు చేస్తున్న ‘శ్రీ అన్న అభియాన్’ విజయవంతం కావడాన్ని, చిరుధాన్యాధారిత వ్యవసాయ రూపాంతరీకరణలో జాతీయ నమూనాగా ఆవిర్భవించగల దాని సామర్థ్యాన్ని డాక్టర్ జాట్ ప్రముఖంగా ప్రస్తావించారు. దేశంలో 2047 నాటికి చిరుధాన్యాల సాగు విస్తీర్ణాన్ని 1.79 లక్షల హెక్టార్ల నుంచి 5 లక్షల హెక్టార్లకు పెంచడం సహా 8 లక్షల టన్నుల ఉత్పత్తిపై లక్ష్యనిర్దేశం చేసుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో 2024-25 ఫసలీలో 7.5 లక్షల క్వింటాళ్ల రాగి పంట కొనుగోళ్లతో పాటు 2025-26 సీజన్‌లో 8 లక్షల క్వింటాళ్ల లక్ష్యం నిర్దేశించుకోవడాన్ని ఆయన ప్రశంసించారు. అలాగే, దేశీయ చిరుధాన్యాల వైవిధ్యాన్ని.. ముఖ్యంగా నమోదిత 163 రాగుల స్థానిక రకాల పరిరక్షణ సహా కాలియా, బాటి, మామి, భారతి వంటి సంప్రదాయ రకాలను ప్రోత్సహించడం ముదావహమని చెప్పారు.
శాస్త్రీయ సాగు పద్ధతుల విస్తరణతో పాటు సువాన్, కంగు వంటి చిరుధాన్యాల సాగుకు ప్రోత్సాహం, చౌక ప్రాసెసింగ్ యంత్రాల రూపకల్పన, ‘ఎఫ్‌పీఓ’లు-మహిళా స్వయం సహాయ బృందాల బలోపేతం, ఐకార్, ఐఐఎంఆర్- హైదరాబాద్ ద్వారా చిరుధాన్యాధారిత సంస్థలు, మార్కెట్ అనుసంధాన విస్తరణపై ఈ కార్యక్రమంలో చర్చించారు. ఐకార్, ఐఐఎంఆర్-హైదరాబాద్ మధ్య పరిశోధన సహకార బలోపేతం, ఒడిషా వ్యవసాయ- సాంకేతిక విశ్వవిద్యాలయంలో చిరుధాన్యాలపై ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ ఏర్పాటును కూడా ఆయన ప్రతిపాదించారు.
సంస్థాగత భాగస్వామ్యాల బలోపేతం, విజ్ఞాన ఆదానప్రదానానికి ప్రోత్సాహం, సుస్థిర-వాతావరణ మార్పును తట్టుకోగల, ఆర్థికంగా లాభదాయక చిరుధాన్యాల ఆధారిత వ్యవసాయాభివృద్ధి దిశగా ఒడిషా ప్రస్థానాన్ని వేగిరపరచడం ఈ కార్యక్రమ లక్ష్యాలు.
***