గనుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

హైదరాబాద్‌లోని జీఎస్ఐ శిక్షణ సంస్థలో మూడు ప్రధాన మౌలిక వసతులను ప్రారంభించిన కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి

నాడు పోస్టు చేయడమైనది: 10 NOV 2026 1:33PM by PIB Hyderabad

హైదరాబాద్‌లో బండ్లగూడ–నాగోల్‌లో ఉన్న జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శిక్షణ సంస్థ (జీఎస్ఐటీఐ)లో మూడు ప్రధాన మౌలిక వసతులను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జీ కిషన్ రెడ్డి, మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు శ్రీ ఈటల రాజేందర్ ఈ రోజు ప్రారంభించారు. వీటిలో అంతర్జాతీయ వసతి గృహం (నలంద, తక్షశిల), అధునాతన జియోఫిజికల్ డేటా ప్రాసెసింగ్ ల్యాబొరేటరీ, డిజిటల్ స్టూడియో ఉన్నాయి.

ప్రారంభోత్సవం అనంతరం జీఎస్‌ఐటీఐ శిక్షణ, పరిశోధన, సామర్థ్య నిర్మాణ కార్యకలాపాలను బలోపేతం చేసేందుకు ఏర్పాటు చేసిన నూతన మౌలిక సదుపాయాలను కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి, శ్రీ ఈటల రాజేందర్ పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన  సౌకర్యాలను సమీక్షించారు.

సభను ఉద్దేశించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రసంగించారు. అభివృద్ధి చెందిన దేశంగా మారే దిశగా భారత్ సాగిస్తున్న ప్రయాణంలో ఖనిజ, మైనింగ్ రంగం పోషిస్తున్న కీలకపాత్రను వివరించారు. 176 ఏళ్ల జీఎస్ఐ వారసత్వం గురించి, దేశవ్యాప్తంగా భూగర్భ సర్వేలకు ఈ సంస్థ అందించిన గణనీయమైన సహకారం గురించి తెలియజేశారు. జాతీయ కీలక ఖనిజ మిషన్ కార్యక్రమానికి ఉన్న ప్రాముఖ్యాన్ని ఆయన వివరించారు. అలాగే భారత దేశ ఖనిజ భద్రతను బలోపేతం చేయడానికి, ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించడానికి కీలకమైన ఖనిజాలు, అరుదైన మూలకాల అన్వేషణను వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా కీలకమైన ఖనిజ నిక్షేపాలు ఉండే అవకాశం ఉన్న ప్రాంతాల్లో అన్వేషణను మరింత వేగవంతం చేయాలని జీఎస్ఐను కోరారు. అలాగే అన్వేషణ కార్యకలాపాలను వేగవంతం చేయడానికి, ఖనిజ బ్లాకులను సకాలంలో సిద్ధం చేయడానికి, వేలం జరిగేలా చూడటానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. రాజస్థాన్‌లోని సివానా రింగ్ కాంప్లెక్స్ (ఎస్ఆర్‌సీ)‌తో పాటు దేశంలో వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న అన్వేషణ ప్రయత్నాల గురించి ప్రస్తావించారు. అరుదైన భార మూలకాలు, ఇతర కీలకమైన ఖనిజాల అన్వేషణను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

జీఎస్ఐ అన్వేషణ, పరిశోధన సామర్థ్యాలను విస్తరించడంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలను స్వీకరించడం, సంస్థాగత సంస్కరణలు చేపట్టడం, అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయడానికి ఉన్న ప్రాధాన్యాన్ని కూడా శ్రీ కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. జాతీయ, అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలతో సహకారాన్ని బలోపేతం చేయాల్సిన, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా శిక్షణా వసతులను మెరుగుపరచాల్సిన అవసరం గురించి కూడా వివరించారు. దేశంలోని జియోసైంటిఫిక్ వనరులను విస్తృతంగా వినియోగంలోకి తీసుకువచ్చేలా జియోలాజికల్ సమాచారాన్ని, డేటాను బహిరంగ వేదికల ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని జీఎస్ఐకు సూచించారు. భారతదేశ ఇంధన అవసరాలను తెలియజేస్తూ.. ఇంధన భద్రతను అందించడంలో తగినంత బొగ్గు ఉత్పత్తిని కొనసాగించడానికి ఉన్న ప్రాధాన్యం గురించి కేంద్ర మంత్రి వివరించారు. దేశ విద్యుత్ అవసరాలను తీర్చడంలో బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు.

వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో శాస్త్రీయ పరిశోధన, సాంకేతిక పురోగతికి ఉన్న ప్రాధాన్యాన్ని పార్లమెంటు సభ్యులు శ్రీ ఈటల రాజేందర్ వివరించారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలు, సెమీకండక్టర్ పరిశ్రమలు, పరిశోధనలే ప్రపంచాభివృద్ధిని ముందుకు నడిపిస్తున్నాయన్నారు. ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా దేశాన్ని బలోపేతం చేయడానికి ఖనిజ వనరులను సమర్థంగా అన్వేషించి, వినియోగించుకోవడంతో పాటు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలను స్వీకరించడం అవసరమని చెప్పారు. హైదరాబాద్ జీఎస్ఐటీఐ అందిస్తున్న సేవలను ప్రశంసించారు. శాస్త్రవేత్తలు, పరిశోధకులు, అధ్యాపకులు తమ పరిశోధనా కార్యకలాపాలను ముమ్మరం చేసి జాతీయ అభివృద్ధికి దోహదపడాలని ఆయన ప్రోత్సహించారు.

ఈ కార్యక్రమంలో జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ శ్రీ దినేశ్ వీ గన్వీర్, గనుల మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి శ్రీమతి ఫరీదా ఎం నాయక్, గనుల మంత్రిత్వశాఖ, జీఎస్ఐ, జీఎస్ఐ‌టీఐకు చెందిన ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మూడు సరికొత్త సౌకర్యాల గురించి:

1. అంతర్జాతీయ వసతి గృహం (నలంద, తక్షశిల): జీఎస్ఐ అందించిన రూ. 4.27 కోట్ల నిధులతో దీనిని ఏర్పాటు చేశారు. దీనిలో భోజనశాల, రిక్రియేషన్ వసతులు, వ్యాయామశాల, మినీ-లైబ్రరీ, లాండ్రీ లాంటి ఆధునిక సదుపాయాలతో పాటు పూర్తి స్థాయిలో ఫర్నీచర్ ఏర్పాటు చేసిన 32 సూట్లు ఉన్నాయి. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) సూచనల ప్రకారం దీనిని అభివృద్ధి చేశారు. ఇది అంతర్జాతీయ శిక్షణార్థులకు సౌకర్యవంతమైన బసను కల్పించడంతో పాటు వృత్తిపరమైన సంబంధాలను, సాంస్కృతిక వినిమయాన్ని, అంతర్జాతీయ సహకారాలను పెంపొందించడానికి తోడ్పడుతుంది.

2. అధునాతన జియోఫిజికల్ డేటా ప్రాసెసింగ్ ల్యాబరేటరీ:  జాతీయ ఖనిజ అన్వేషణ, అభివృద్ధి ట్రస్టు (ఎన్ఎంఈడీటీ), జీఎస్ఐ సమకూర్చిన రూ.4.55 కోట్ల నిధులతో ఈ ప్రయోగశాలను ఏర్పాటు చేశారు. దీనిలో 25 అత్యాధునిక కంప్యూటర్లు, ఆధునిక సాఫ్ట్‌వేర్ ఉన్నాయి. వీటిని ఖనిజాన్వేషణలో సామర్థ్యాన్ని బలోపేతం చేసేలా అధునాతన జియోఫిజికల్ డేటా ప్రాసెసింగ్, మోడలింగ్, ఇన్వర్షన్, సమాచార విశ్లేషణకు ఉపయోగిస్తారు.

3. డిజిటల్ స్టూడియో: సామర్థ్య నిర్మాణ కమిషన్ (సీబీసీ), జీఎస్ఐ అందించిన రూ.30 లక్షల వ్యయంతో ఈ స్టూడియోను ఏర్పాటు చేశారు. మిషన్ కర్మయోగికి అనుగుణంగా ఐజీవోటీ కర్మయోగి పోర్టల్ కోసం వీడియో పాఠాలు, పాడ్‌క్యాస్టులు, వెబినార్లతో సహా నాణ్యమైన డిజిటల్ లెర్నింగ్ వనరులను రూపొందించడానికి ఈ స్టూడియో వీలు కల్పిస్తుంది.

కొత్తగా ప్రారంభించిన ఈ సౌకర్యాలు సంస్థాగత మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి, అంతర్జాతీయ సహకారాన్ని ప్రోత్సహించడానికి, అధునాతన భూ వైజ్ఞానిక శిక్షణ, అంతర్జాతీయ సహకారం, డిజిటల్ లెర్నింగ్ సామర్థ్యాలను సులభతరం చేయడానికి గణనీయంగా దోహదపడతాయని భావిస్తున్నారు.

***


(రిలీజ్ ఐడి: 2334638) సందర్శకుల సూచీ సంఖ్య : : 16
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English