నాడు పోస్టు చేయడమైనది:
09 NOV 2026 12:37PM by PIB Hyderabad
హైదరాబాద్లోని బండ్లగూడ-నాగోల్లో ఉన్న జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (జీఎస్ఐటీఐ)లో మూడు ప్రధాన వసతులైన అంతర్జాతీయ వసతి గృహం, అధునాతన జియోఫిజికల్ డేటా ప్రాసెసింగ్ ల్యాబొరేటరీ, డిజిటల్ స్టూడియోను 2026 నవంబర్ 10న ఉదయం 09:30 గంటలకు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి ప్రారంభిస్తారు.
జీఎస్ఐటీఐ శిక్షణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంతో పాటు అంతర్జాతీయ శిక్షణ, అధునాతన జియో సైంటిఫిక్ పరిశోధన, డిజిటల్ లెర్నింగ్ సామర్థ్యాలను పెంపొందించడంలో సాధించిన విజయాన్ని ఈ ప్రారంభోత్సవం సూచిస్తుంది.
అంతర్జాతీయ హాస్టల్ ప్రారంభోత్సవంతో ఈ కార్యక్రమం మొదలవుతుంది. అనంతరం అధునాతన జియోఫిజికల్ డేటా ప్రాసెసింగ్ ల్యాబొరేటరీని, డిజిటల్ స్టూడియోను ప్రారంభిస్తారు. డైరెక్టర్ జనరల్ శ్రీ దినేష్ వి. గన్వీర్ స్వాగతోపన్యాసం చేస్తారు. అనంతరం మల్కాజిగిరి లోక్సభ సభ్యులు శ్రీ ఈటల రాజేందర్, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి ప్రసంగిస్తారు.
గనుల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీమతి ఫరీదా ఎం. నాయక్, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు.
మూడు సరికొత్త సౌకర్యాల గురించి:
1. అంతర్జాతీయ వసతి గృహం (నలంద, తక్షశిల): జీఎస్ఐ అందించిన రూ. 4.27 కోట్ల నిధులతో దీనిని ఏర్పాటు చేశారు. దీనిలో భోజనశాల, రిక్రియేషన్ వసతులు, వ్యాయామశాల, మినీ-లైబ్రరీ, లాండ్రీ లాంటి ఆధునిక సదుపాయాలతో పాటు పూర్తి స్థాయిలో ఫర్నీచర్ ఏర్పాటు చేసిన 32 సూట్లు ఉన్నాయి. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) సూచనల ప్రకారం దీనిని అభివృద్ధి చేశారు. ఇది అంతర్జాతీయ శిక్షణార్థులకు సౌకర్యవంతమైన బసను కల్పించడంతో పాటు వృత్తిపరమైన సంబంధాలను, సాంస్కృతిక వినిమయాన్ని, అంతర్జాతీయ సహకారాలను పెంపొందించడానికి తోడ్పడుతుంది.
2. అధునాతన జియోఫిజికల్ డేటా ప్రాసెసింగ్ ల్యాబరేటరీ: ఎన్ఎంఈడీటీ, జీఎస్ఐ సమకూర్చిన రూ.4.55 కోట్ల నిధులతో ఈ ప్రయోగశాలను ఏర్పాటు చేశారు. దీనిలో 25 అత్యాధునిక కంప్యూటర్లు, ఆధునిక సాఫ్ట్వేర్ ఉన్నాయి. వీటిని ఖనిజాన్వేషణలో సామర్థ్యాన్ని బలోపేతం చేసేలా అధునాతన జియోఫిజికల్ డేటా ప్రాసెసింగ్, మోడలింగ్, ఇన్వర్షన్, సమాచార విశ్లేషణకు ఉపయోగిస్తారు.
3. డిజిటల్ స్టూడియో: సీబీసీ, జీఎస్ఐ అందించిన రూ.30 లక్షల వ్యయంతో ఈ స్టూడియోను ఏర్పాటు చేశారు. మిషన్ కర్మయోగికి అనుగుణంగా ఐజీవోటీ కర్మయోగి పోర్టల్ కోసం వీడియో పాఠాలు, పాడ్క్యాస్టులు, వెబినార్లతో సహా నాణ్యమైన డిజిటల్ లెర్నింగ్ వనరులను రూపొందించడానికి ఈ స్టూడియో వీలు కల్పిస్తుంది.
ఈ సౌకర్యాలు జీఎస్ఐటీఐ శిక్షణ మౌలికవసతులను, అంతర్జాతీయ సహకారాన్ని, డిజిటల్ లెర్నింగ్ సామర్థ్యాలను బలోపేతం చేస్తాయి.
జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గురించి...
రైల్వేల కోసం బొగ్గు నిక్షేపాలను అన్వేషించడానికి 1851లో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ)ను స్థాపించారు. ఇది అంతర్జాతీయ గుర్తింపు పొందిన ప్రముఖ భూ విజ్ఞాన సంస్థగా ఎదిగింది. జియోలాజికల్ సర్వేలు, అన్వేషణ, వివిధ విభాగాల అధ్యయనాలు, ప్రకృతి విపత్తులపై పరిశోధనలు, ప్రాథమిక భౌగోళిక శాస్త్రాల ద్వారా జాతీయ భూవిజ్ఞాన సమాచారాన్ని సిద్ధం చేయడం, నవీకరించడం, ఖనిజ వనరులను అంచనా వేయడం ఈ సంస్థ ప్రధాన విధులు.
***"