కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

తెలంగాణ ప్రభుత్వం, టెలికమ్యూనికేషన్ల శాఖ విభాగం డిజిటల్ భారత్ నిధి మధ్య ఒప్పందం

తెలంగాణలో సవరించిన భారత్‌నెట్‌ కార్యక్రమం అమలుకు టీఆర్‌ఐఐసీఎల్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌, టీ-ఫైబర్‌ మధ్య అవగాహన...

తెలంగాణలో సవరించిన భారత్‌నెట్‌ కార్యక్రమం అమలుకు రూ.3,189 కోట్ల ఆర్థిక సహాయం ఆమోదం

సవరించిన భారత్‌నెట్‌ కార్యక్రమం తెలంగాణలోని 12,769 గ్రామ పంచాయతీలకు విస్తరణ...

తెలంగాణవ్యాప్తంగా గ్రామీణ టెలికాం మౌలిక సదుపాయాల బలోపేతం, ఆధునికీకరణకు భాగస్వామ్యం

నాడు పోస్టు చేయడమైనది: 06 NOV 2026 5:28PM by PIB Hyderabad

తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్‌ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్టివిటీని వేగవంతం చేయడం దిశగా కీలక ముందడుగు పడింది.  సవరించిన భారత్‌నెట్‌ కార్యక్రమాన్ని (ఏబీపీ) రాష్ట్రంలో అమలు చేయడం   కోసం టెలికమ్యూనికేషన్ల శాఖ పరిధిలోని  డిజిటల్‌ భారత్‌ నిధి (డీబీఎన్‌), రాష్ట్ర ప్రభుత్వాల మధ్య  న్యూఢిల్లీలోని సంచార్‌ భవన్‌లో నేడు ఒప్పందం కుదిరింది.

 

 

తెలంగాణలో సవరించిన భారత్‌నెట్‌ కార్యక్రమం అమలు కోసం డిజిటల్‌ భారత్‌ నిధి (డీబీఎన్‌), టెలికమ్యూనికేషన్ల శాఖ, తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ గ్రామీణ ఇంటర్నెట్‌ మౌలిక సదుపాయాల కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (టీఆర్‌ఐఐసీఎల్‌), భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎస్‌ఎన్‌ఎల్‌), తెలంగాణ ఫైబర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (టీ-ఫైబర్‌) మధ్య ఈ ఒప్పందం కుదిరింది.

 

డిజిటల్‌ భారత్‌ నిధి (డీబీఎన్‌) అడ్మినిస్ట్రేటర్‌ శ్రీ శ్యామల్‌ మిశ్రా సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకాల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వ ఐటీ, ఎలక్ట్రానిక్స్‌, కమ్యూనికేషన్స్‌ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ అనుదీప్‌ దురిశెట్టి, బీఎస్‌ఎన్‌ఎల్‌ డైరెక్టర్‌ (ఎంటర్‌ప్రైజ్‌ బిజినెస్‌) శ్రీ పాపా సుధాకర రావు, టెలికమ్యూనికేషన్ల శాఖ డీడీజీ (ఏబీపీ అమలు–1) శ్రీ దినేశ్‌ కుమార్‌ గార్గ్‌, తెలంగాణ ఫైబర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (టీ-ఫైబర్‌), తెలంగాణ గ్రామీణ ఇంటర్నెట్‌ మౌలిక సదుపాయాల కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (టీఆర్‌ఐఐసీఎల్‌) సీఈఓ శ్రీ వేణు ప్రసాద్‌ పన్నీరు హాజరయ్యారు. టెలికమ్యూనికేషన్ల శాఖ, డిజిటల్‌ భారత్‌ నిధి, బీఎస్‌ఎన్‌ఎల్‌కు చెందిన పలువురు ఉన్నతాధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

 

ఈ ఒప్పందంపై సంతకాలు చేయడం ద్వారా కార్యక్రమాన్ని వేగంగా అమలు చేసేందుకు కీలక ముందడుగు పడింది. గ్రామీణ డిజిటల్‌ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, చివరి మైలు వరకు అనుసంధానాన్ని విస్తరించడం, అందరికీ డిజిటల్‌ వృద్ధి ఫలాలు అందేలా చూడటంలో కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఉమ్మడి నిబద్ధతను ఈ ఒప్పందం ప్రతిబింబిస్తోంది.

 

దేశంలోని అన్ని గ్రామ పంచాయతీలు, గ్రామాలకు అవసరాన్ని బట్టి పటిష్ఠమైన, భవిష్యత్తు అవసరాలకు అనుగుణమైన బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్టివిటీని అందించేందుకు ప్రస్తుతం ఉన్న భారత్‌నెట్‌ నెట్‌వర్క్‌ను ఆధునికీకరించడం, సమీకృతం చేయడం, విస్తరించడం లక్ష్యంగా కేంద్ర మంత్రివర్గం 2023 ఆగస్టు 4న సవరించిన భారత్‌నెట్‌ కార్యక్రమానికి ఆమోదం తెలిపింది.

 

తెలంగాణలో సవరించిన భారత్‌నెట్‌ కార్యక్రమాన్ని తెలంగాణ గ్రామీణ ఇంటర్నెట్‌ మౌలిక సదుపాయాల కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (టీఆర్‌ఐఐసీఎల్‌) ద్వారా అమలు చేయనున్నారు. ఈ కార్యక్రమం పరిధిలో మొత్తం 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో నెట్‌వర్క్‌ సామర్థ్యం, విశ్వసనీయతను పెంచేందుకు మొదటి దశలోని 1,946 గ్రామ పంచాయతీల్లో లీనియర్‌ టోపాలజీని రింగ్‌ టోపాలజీగా ఉన్నతీకరించడం, రెండో దశలోని 10,787 గ్రామ పంచాయతీలకు నెట్‌వర్క్‌ విస్తరించడం, కొత్తగా ఏర్పాటైన 36 గ్రామ పంచాయతీలను చేర్చడం ఉన్నాయి.

 

తెలంగాణలో ఈ కార్యక్రమం అమలుకు భారత ప్రభుత్వం రూ.3,189 కోట్ల ఆర్థిక సహాయాన్ని ఆమోదించింది. ఈ కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ సహకారంతో గ్రామీణ ప్రాంతాల్లో సుమారు మూడు లక్షల ఇళ్లకు ఫైబర్‌ కనెక్షన్లు కల్పించే అవకాశం ఉంది. రాష్ట్రంలోని గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో ఈ-గవర్నెన్స్‌, ఆన్‌లైన్‌ విద్య, టెలిమెడిసిన్‌, డిజిటల్‌ చెల్లింపులు, పౌరులకు అవసరమైన ఇతర సేవల అందజేత గణనీయంగా మెరుగుపడుతుందని భావిస్తున్నారు.

 

నేడు కుదిరిన ఈ ఒప్పందం తెలంగాణలో కార్యక్రమం అమలును వేగవంతం చేయడంతో పాటు, డిజిటల్‌ సాధికారత కలిగిన సమాజం, జ్ఞానాధారిత ఆర్థిక వ్యవస్థ నిర్మాణం దిశగా లక్ష్య సాధనకు మరింత దోహదపడుతుందని భావిస్తున్నారు.

 

డిజిటల్‌ భారత్‌ నిధి గురించి

డిజిటల్‌ భారత్‌ నిధి (గతంలో యూనివర్సల్‌ సర్వీస్‌ ఆబ్లిగేషన్‌ ఫండ్‌–యూఎస్‌ఓఎఫ్‌) భారత టెలిగ్రాఫ్‌ (సవరణ) చట్టం 2003 కింద 01.04.2002 నుంచి అమల్లోకి వచ్చింది టెలికమ్యూనికేషన్ల చట్టం 2023 ప్రకారం యూనివర్సల్‌ సర్వీస్‌ ఆబ్లిగేషన్‌ ఫండ్‌ పేరు డిజిటల్‌ భారత్‌ నిధి (డీబీఎన్‌)గా మారింది. వెనుకబడిన గ్రామీణ, మారుమూల, పట్టణ ప్రాంతాల్లో టెలికమ్యూనికేషన్‌ సేవలకు అందుబాటు కల్పించడం, వాటి పంపిణీని ప్రోత్సహించడం ద్వారా సార్వత్రిక సేవా లక్ష్యాన్ని సాధించేందుకు మద్దతు ఇవ్వడం డిజిటల్‌ భారత్‌ నిధి ప్రధాన బాధ్యత. ఇది కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని టెలి కమ్యూనికేషన్ల శాఖ (డీఓటీ) అనుబంధ కార్యాలయంగా పనిచేస్తుంది.

 

డిజిటల్‌ భారత్‌ నిధి లక్ష్యాల సాధన కోసం భారత్‌నెట్‌, 4జీ సంతృప్తి ప్రాజెక్టు, ఆకాంక్షిత జిల్లాల్లోని సేవలు అందని ప్రాంతాలకు మొబైల్‌ సేవల కల్పన, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో మొబైల్‌ సేవలు, హిమాలయ, సరిహద్దు ప్రాంతాల్లో మొబైల్‌ సేవలు, దీవుల్లో మొబైల్‌ సేవలు, ఈశాన్య ప్రాంతాల్లో మొబైల్‌ సేవలు వంటి పలు పథకాలు, ప్రాజెక్టులను అమలు చేస్తోంది. 

 

మరిన్ని వివరాల కోసం కమ్యూనికేషన్ల శాఖ సామాజిక మాధ్యమ ఖాతాలను అనుసరించండి.

 

ఎక్స్‌-https://x.com/DoT_India

 

ఇన్‌స్టాగ్రామ్‌- https://www.instagram.com/department_of_telecom?igsh=MXUxbHFjd3llZTU0YQ==

 

ఫేస్‌బుక్ - https://www.facebook.com/DoTIndia

 

యూట్యూబ్: https://youtube.com/@departmentoftelecom?si=DALnhYkt89U5jAaa

 

***


(రిలీజ్ ఐడి: 2333952) సందర్శకుల సూచీ సంఖ్య : : 22
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी