నాడు పోస్టు చేయడమైనది:
02 NOV 2026 8:19PM by PIB Hyderabad
బొగ్గు మంత్రిత్వ శాఖ ఈ రోజు ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో 2024-25 ఆర్థిక సంవత్సరానికి స్టార్ రేటింగ్ పురస్కారాల ప్రదానోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో భారత్‌లో బొగ్గు, లిగ్నైట్ గని తవ్వకాల రంగంలో శ్రేష్ఠత్వాన్ని, అసాధారణమైన పనితీరును కనబరిచిన సంస్థలను గౌరవించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి శ్రీ సతీశ్ చంద్ర దుబే, మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారులు, కోల్ ఇండియా ప్రతినిధులు, ఎన్ఎల్సీ ఇండియా, సింగరేణి కాలరీస్ కంపెనీ (ఎస్సీసీఎల్)తో పాటు బొగ్గు పరిశ్రమకు చెందిన ఇతర ఆసక్తిదారు వర్గాలు పాల్గొన్నారు.
2024-25 ఆర్థిక సంవత్సరానికి మొత్తం 50 బొగ్గు గనులకు ‘ఫైవ్ స్టార్ రేటింగు’లు ప్రదానం చేశారు. వాటిలో 10 గనులు తమ తమ శ్రేణులలో 93 శాతానికి మించిన ఫలితాలతో ఒకటి, రెండు, మూడవ స్థానాలను దక్కించుకున్నాయి. ఓపెన్‌కాస్ట్ (భూమి ఉపరితలంపైన ఉన్న గనిలో నేరుగా తవ్వకం జరిపి ఖనిజాలను వెలికితీసే) శ్రేణిలో నార్దర్న్ కోల్‌ఫీల్డ్స్ (ఎన్సీఎల్)తో పాటు ఎన్టీపీసీ ప్రథమ స్థానాన్ని చేజిక్కించుకున్నాయి. అండర్‌గ్రౌండ్ (భూగర్భంలో ఖనిజాలను తవ్వకాలు జరిపి వెలికితీసే) కేటగిరీలో సింగరేణి కాలరీస్ కంపెనీ (ఎస్సీసీఎల్) ప్రథమ బహుమతిని గెలిచింది. కోల్ ఇండియా అనుబంధ సంస్థలలో అత్యధిక సంఖ్యలో ఫైవ్-స్టార్ రేటింగును పొందిన గనులలో వెస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ (డబ్ల్యూసీఎల్) ప్రత్యేక ప్రశంసను అందుకుంది. స్టార్ రేటింగ్ మూల్యాంకనంతో పాటు ఉత్పాదనలో కూడా వరుసగా ఉన్నత స్థాయి పనితీరును కొనసాగించినందుకు గాను నార్దర్న్ కోల్‌ఫీల్డ్స్‌తో పాటు మహానది కోల్‌ఫీల్డ్స్ (ఎమ్‌సీఎల్)ను కూడా ప్రశంసించారు.
2024-25 ఆర్థిక సంవత్సరానికి స్టార్ రేటింగ్ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ఉద్దేశించి కేంద్ర బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి శ్రీ సతీశ్ చంద్ర దుబే ప్రసంగిస్తూ, బొగ్గు గనుల మధ్య ఆరోగ్యకర పోటీని పెంపొందించేందుకే కాకుండా వాటి పనితీరును నిలకడగా మెరుగుపరుచుకొంటూ ఉండేటట్లు స్ఫూర్తిని కూడా అందించేందుకు స్టార్ రేటింగ్ ప్రోగ్రాము ఒక ప్రధాన వేదికగా ఉందని స్పష్టం చేశారు. ఈ ప్రోగ్రామును కేవలం ఒక అంచనా ప్రక్రియగా చూడటానికి బదులు స్వీయ మూల్యాంకనానికి, నేర్చుకొంటూ ఉండటానికి, మెరుగుపరుచుకోవడానికి ఓ అవకాశంగా తీసుకోవాలంటూ బొగ్గు ఉత్పాదక కంపెనీలను మంత్రి ప్రోత్సహించారు. అత్యుత్తమ పద్ధతులను అనుసరించడం, గని కార్యకలాపాలను పటిష్టపరచడంతో పాటు సముచిత రికార్డులను పరిరక్షించుకొంటూ మొత్తంమీద గని తవ్వకం పనితీరును పెంపొందించుకొనేందుకు ఆధునిక, సురక్షిత సాంకేతికతలను అవలంబించడానికి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.
అవార్డులను గెలుచుకున్న గనులను, వాటి బృందాలను కేంద్ర సహాయ మంత్రి అభినందించారు. ఉన్నత ప్రమాణాలను సాధించడంలో కనబరుస్తున్న అంకితభావాన్ని, నిబద్ధతను ఆయన ప్రశంసించారు. వేరు వేరు శ్రేణులలో నిలకడైన పనితీరును చాటుతున్నారని ఆయన అంగీకరిచారు. ఈ విజయాలను ఇతర గని తవ్వకం సంస్థలు చూసి తాము కూడా ఎదిగేందుకు ప్రయత్నించాలంటూ ప్రోత్సహించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మరిన్ని సంస్థలు పాలుపంచుకోవాలని ఆయన సూచిచారు. ఆరోగ్యకర పోటీ, నిరంతర ప్రాతిపదికన స్వీయ మెరుగుదల, చక్కని పద్ధతులను పరస్పరం ఇచ్చి పుచ్చుకొంటూ ఉండటం బొగ్గు రంగంలో పనితీరు ప్రమాణాలను పెంపొందింప చేసుకోవడానికే కాకుండా సురక్షితమైన, సమర్థమైన, మన్నిక కలిగిన గని తవ్వకం సంబంధిత కార్యకలాపాలకు తోడ్పడుతాయని ఆయన అన్నారు.
బొగ్గు మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ సనోజ్ కుమార్ ఝా కీలకోపన్యాసాన్నిస్తూ, బొగ్గు గని తవ్వకాల రంగంలో పనితీరును గుర్తించడానికి, అత్యుత్తమ పద్ధతులను సంస్థాగతీకరించడానికి స్టార్ రేటింగ్ ప్రోగ్రాము ఒక ప్రధాన వేదికగా రూపొందిందన్నారు. వరుసగా పురస్కారాల ప్రదాన కార్యక్రమాలను నిర్వహిస్తూ, మార్గదర్శక పనితీరును నిలకడగా ప్రదర్శిస్తున్న గనులను గౌరవిస్తూ ఈ వేదికను మంత్రిత్వ శాఖ బలోపేతం చేసిందని ఆయన తెలిపారు. ప్రమాణాలను నెలకొల్పడంలో, పారదర్శకత్వాన్ని ప్రోత్సహించడంలో, ప్రావీణ్యపూర్వక పనితీరును ఆదర్శంగా తీసుకుని నేర్చుకొనే అవకాశాలను గనులు అందించడంలో ఈ తరహా వ్యవస్థాగత మూల్యాంకనం, గుర్తింపులు ముఖ్య పాత్రను పోషిస్తాయని ఆయన అన్నారు.
2024-25 ఆర్థిక సంవత్సరంలో నమోదైన విజయాలను శ్రీ ఝా ప్రస్తావిస్తూ, 50 బొగ్గు గనులు ఫైవ్-స్టార్ రేటింగులను సాధించాయని, వాటిలో 10 గనులు 93 శాతానికి మించిన పనితీరు గణాంకాలతో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలలో నిలిచాయన్నారు. ఈ విజయాలు ఆయా గని తవ్వకం బృందాల నిబద్ధతకు, నాయకత్వానికి, క్రమశిక్షణతో కూడిన కృషికి అద్దం పడుతుండటంతో పాటు విశాల మైన ఈ రంగానికి మూల్యాంకనంతో ముడిపడిన కొలబద్దలను అందిస్తున్నాయన్నారు. గుర్తింపును పొందిన గనులకు ఆయన అభినందనలు తెలిపారు. బొగ్గు గనుల తవ్వకం పనులలో పనితీరు ప్రమాణాలను పెంచడంలో వాటి పాత్ర ఎంతైనా ఉందని ఆయన అన్నారు.
ముందున్న మార్గాన్ని శ్రీ ఝా ప్రస్తావిస్తూ.. జ్ఞానాన్ని ఇచ్చి పుచ్చుకోవడం, విజయవంతమైన పద్దతులను అమలు చేయడం, ఉమ్మడి సవాళ్లకు ఆచరణీయ పరిష్కారాలను అవలంబించడం వంటి మార్గాల్లో బొగ్గు కంపెనీలు, గని తవ్వకంలో నిమగ్నమైన సంస్థల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడం ముఖ్యమని సూచించారు. ఈ రంగాన్ని ఆమూలాగ్రం మెరుగుపరచడం కోసం మరింత సమగ్రమైన దృష్టికోణాన్ని అన్వయించాలంటూ ఆయన పిలుపునిచ్చారు. దీనిలో వ్యక్తిగత గనుల విజయాలు ఇతర గనులకు నేర్చుకొనే అవకాశాల్ని అందించవలసి ఉంటుందన్నారు. సామూహికంగా నేర్చుకొనేందుకు, నిరంతరాయంగా ప్రగతిని సాధిస్తుండేందుకు ఒక వేదికగా స్టార్ రేటింగ్ ప్రోగ్రాము కొనసాగాలని ఆయన అన్నారు. ఇలా చేస్తే, పూర్తి బొగ్గు గని తవ్వకాల రంగం పనితీరు, దక్షత, బాధ్యతాయుత నిర్వహణలలో ఉన్నత స్థాయిని అందుకోగలుగుతుందని తెలిపారు.
సీసీఓ శ్రీ సతీశ్ కుమార్ స్వాగతోపన్యాసాన్నిస్తూ భద్రత, పర్యావరణ నిర్వహణ, శాస్త్రీయ గని తవ్వకం పద్ధతులు, ఉత్పాదకత, సామాజిక సంక్షేమంలో గనుల ఆదర్శప్రాయ పనితీరును గుర్తించడానికి స్టార్ రేటింగ్ పురస్కారాల కార్యక్రమం ఓ ప్రధాన వేదికగా నిలుస్తోందన్నారు. ఈ పురస్కారాలు గని తవ్వకం రంగంలో బాధ్యతాయుతమైన, మన్నిక కలిగిన అభివృద్ది పట్ల గని తవ్వకం వర్గాల అంకిత భావానికి, ఉమ్మడి కృషికి అద్దం పడుతున్నాయని ఆయన అన్నారు.
శ్రేష్ఠత్వానికి ఒక ముఖ్య కొలమానంగా స్టార్ రేటింగ్ ఫ్రేంవర్కు పనిచేస్తుందని శ్రీ సతీశ్ అన్నారు. ఇది గనులలో కార్మికుల భద్రత, పర్యావరణ సంరక్షణ, గనులలో ఉపయోగించని ప్రదేశాలను ఇతరత్రా పునర్వినియోగానికి అనువుగా తీర్చిదిద్దడం, ప్రాజెక్టుతో ప్రభావితం అయిన సమాజాల సంక్షేమానికి పూచీ పడుతూ నిర్వహణ సంబంధిత ప్రమాణాలను నిరంతరాయంగా మెరుగుపరుస్తూ ఉండటానికి స్పూర్తిని అందిస్తుందని కూడా ఆయన చెప్పారు. పురస్కారాలను అందుకున్న వారిని ఆయన అభినందించారు. వారి విజయాలు అత్యుత్తమ పద్ధతుల్ని అనుసరించడానికి, స్వయంసమృద్ధ భారత్ (‘ఆత్మనిర్భర్ భారత్’), అభివృద్ధి చెందిన భారత్ (‘వికసిత్ భారత్’) దిశగా పయనించాలన్న దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చుకోవడానికి తోడ్పడతాయన్న నమ్మకం తనకు ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం బొగ్గు పరిశ్రమలో ఇదివరకటితో పోలిస్తే మరింత ఎక్కువ పారదర్శకత్వాన్ని, నూతన ఆవిష్కరణలను, జవాబుదారుతనాన్ని ప్రోత్సహిస్తుందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో, ‘‘నెక్స్ట్‌జెన్ ఏఐ ఫర్ స్మార్ట్ మైనింగ్’’ ఇతివృత్తంలో భాగంగా వినూత్న సేవలను అందించినందుకు ఆర్ అండ్ డీ 2026 అంశంపై నిర్వహించిన హ్యాకథాన్‌లో విజేతలుగా వచ్చిన వారిని, రన్నర్స్-అప్ (ఉప విజేత)లను సన్మానించారు. విజేతలలో..
సీఎస్ఐఆర్-ఎన్ఈఈఆర్ఐ, నాగ్‌పూర్;
ధన్‌బాద్‌కు చెందిన ఐఐటీ (ఐఎస్ఎమ్)తో కలసి రాంచీకి చెందిన టెక్నోవేవ్ సొల్యూషన్స్ ప్రయివేట్ లిమిటెడ్;
కోల్‌కతాకు చెందిన డాక్టర్ కల్యాణ్ సేన్ అండ్ అసోసియేట్స్ ప్రయివేట్ లిమిటెడ్ తో కలసి సీఎస్ఐఆర్-సీఎల్ఆర్ఐ, చెన్నయి;
దుర్గాపూర్‌కు చెందిన సీఎస్ఐఆర్-సీఎమ్ఈఆర్ఐ, తిరువనంతపురానికి చెందిన సి-డిఎసి, రాంచీకి చెందిన మెస్సర్స్ ఉనీరాష్ప కార్పొరేషన్ లార్డ్ టెక్ల కన్సార్టియమ్..
ఉన్నాయి. వీటితో పాటు ప్రథమ, ద్వితీయ రన్నర్-అప్ సంస్థలను కూడా సత్కరించారు. బొగ్గు రంగంలో కీలక సవాళ్లను పరిష్కరించడానికి గాను కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత సేవలను ఆవిష్కరించడంలో తోడ్పడిన సంస్థల ప్రయత్నాలను గుర్తించడం ఈ సత్కారం ముఖ్యోద్దేశం. ఈ క్రమంలో, కార్యకలాపాల నిర్వహణ దక్షతను పెంపొందించడంపై, గనుల సురక్ష, పర్యావరణ సంబంధ సుస్థిరత సాధనపై ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నారు.
ఏటా ఇస్తున్న స్టార్ రేటింగ్ పురస్కారాలు.. బొగ్గు గనుల తవ్వకం రంగంలో శ్రేష్ఠత్వం, పారదర్శకత్వం, జవాబుదారుతనం పట్ల నిబద్దతను ప్రోత్సహించడంలో బొగ్గు మంత్రిత్వ శాఖ చాటుకుంటున్న నిరంతర నిబద్ధతకు ప్రతీకలు. మార్గదర్శకంగా నిలిచే పనితీరును గుర్తించి సన్మానించి అత్యుత్తమ పద్ధతుల మార్పిడిని ప్రోత్సహిస్తున్న ఈ కార్యక్రమం మెరుగుదలకు పెద్దపీటను వేసే సంస్కృతిని బలపరుస్తూవస్తోంది. అంతేకాదు, దేశవ్యాప్తంగా బాధ్యతాయుతమైన, సమర్థమైన, సుస్థిరమైన గని తవ్వకం కార్యకలాపాలను ముందుకు తీసుకుపోయేటట్లు కూడా చూస్తోంది.
***