కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
నాడు పోస్టు చేయడమైనది:
30 OCT 2026 10:17PM by PIB Hyderabad
ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీర ప్రాంతాలను ‘అర్నబ్’ తుపాను తాకిన నేపథ్యంలో, ప్రభావిత ప్రాంతాల్లో అత్యవసర సమాచార సేవలకు అంతరాయం కలగకుండా టెలికమ్యూనికేషన్స్ శాఖ (డీఓటీ), టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల (టీఎస్‌పీలు) సమన్వయంతో సేవల పునరుద్ధరణ చర్యలు చేపడుతోంది. టెలికాం నెట్‌వర్క్ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోంది. భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు, చెట్లు కూలిపోవడం, విద్యుత్ మౌలిక సదుపాయాలకు అంతరాయం కలగడం వల్ల ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పరిసర ప్రాంతాల్లోని పలు చోట్ల టెలికాం సేవలకు ఆటంకం ఏర్పడింది.
ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో నెట్‌వర్క్ అనుసంధానాన్ని పునరుద్ధరించడంలో గణనీయమైన పురోగతి సాధించారు. ముఖ్యంగా విద్యుత్ సరఫరాలో అంతరాయాలను పరిష్కరించడం, ఆప్టికల్ ఫైబర్ అనుసంధానాన్ని పునరుద్ధరించడంపై దృష్టి సారించారు. పౌరులకు నిరంతర సమాచార సేవలు అందించడంతో పాటు, ప్రభావిత ప్రాంతాల్లో సహాయక, పునరుద్ధరణ కార్యకలాపాలకు మద్దతు ఇచ్చేందుకు ఇంట్రా-సర్కిల్ రోమింగ్ (ఐసీఆర్), సెల్ ఆన్ వీల్స్ (సీఓడబ్ల్యూ) వంటి అత్యవసర సమాచార ఏర్పాట్లను కొనసాగిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం టెలికాం నెట్‌వర్క్ అందుబాటు 99.18 శాతానికి చేరుకుంది. ప్రభావిత జిల్లాల్లో పశ్చిమ గోదావరిలో 98.5 శాతం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 91.96 శాతం నెట్‌వర్క్ అందుబాటులో ఉంది. వాణిజ్య విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, స్థానికంగా ఆప్టికల్ ఫైబర్ కేబుల్ (ఓఎఫ్‌సీ) తెగిపోవడం నెట్‌వర్క్ కార్యకలాపాలకు ప్రధాన ఆటంకాలుగా ఉన్నాయి. వినియోగదారులు తమ టెలికాం సర్వీస్ ప్రొవైడర్‌తో సంబంధం లేకుండా కనెక్టివిటీ పొందేందుకు ప్రభావిత జిల్లాలన్నింటిలో ఇంట్రా-సర్కిల్ రోమింగ్ (ఐసీఆర్) సేవలు కొనసాగుతున్నాయి. అదనంగా అత్యవసర సమాచార సేవలను మరింత బలోపేతం చేసేందుకు 11 ‘సెల్ ఆన్ వీల్స్’ (సీఓడబ్ల్యూ) యూనిట్లను మోహరించారు.
ఒడిశాలో ‘అర్నబ్’ తుపాను ప్రభావం తర్వాత గంజాం, గజపతి, కంధమాల్ జిల్లాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడం, వరద నీరు క్రమంగా తగ్గుతుండటంతో టెలికాం నెట్‌వర్క్ పరిస్థితి మెరుగుపడుతోంది. టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు (టీఎస్‌పీలు) ప్రభావిత ప్రాంతాల్లో సేవల పునరుద్ధరణ పనులు ప్రారంభించారు. దీంతో నెట్‌వర్క్ అనుసంధానం క్రమంగా మెరుగుపడటంతో పాటు, సేవల్లో అంతరాయాలు తగ్గుతున్నాయి. మిగిలిన ప్రభావిత ప్రాంతాల్లోనూ సేవలను పునరుద్ధరించి, టెలికాం సేవలను త్వరగా సాధారణ స్థితికి తీసుకురావడంతో పాటు ప్రజలకు నిరంతర కనెక్టివిటీ అందించేందుకు అన్ని టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు ప్రాధాన్య ప్రాతిపదికన నిరంతర ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఐసీఐర్ అంటే ఏంటి? దానిని ఎలా ఉపయోగించాలి?
ఇంట్రా సర్కిల్ రోమింగ్ (ఐసీఆర్) అనేది ఒకే టెలికాం సర్కిల్ (ప్రాంతం) పరిధిలో మొబైల్ వినియోగదారుడు మరో టెలికాం ఆపరేటర్ (టీఎస్‌పీ) నెట్‌వర్క్‌కు అనుసంధానమయ్యే సదుపాయం. ఒక నిర్దిష్ట ప్రాంతంలో వినియోగదారుడి సొంత టెలికాం ఆపరేటర్ నెట్‌వర్క్ అందుబాటులో లేకపోయినా, మరో ఆపరేటర్ నెట్‌వర్క్ ద్వారా మొబైల్ సేవలను పొందేందుకు ఇది వీలు కల్పిస్తుంది. ముఖ్యంగా ప్రకృతి విపత్తుల సమయంలో మొబైల్ మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నప్పుడు ఈ సదుపాయం కీలక పాత్ర పోషిస్తుంది.
ప్రకృతి విపత్తు సమయంలో ఒక ప్రాంతంలో మొబైల్ మౌలిక సదుపాయాలు దెబ్బతింటే, ఐసీఆర్ అమలు చేయాలని టెలికమ్యూనికేషన్స్ శాఖ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు ఆదేశాలు జారీ చేస్తుంది.
ఐసీఆర్ సేవలు అందుబాటులో ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలు
మీ ఫోన్ సెట్టింగ్స్‌లో ‘ఆటోమేటిక్ నెట్‌వర్క్ సెలెక్షన్’ ఎంపికను ఆన్‌లో ఉంచండి.
ఆటోమేటిక్‌గా మరో నెట్‌వర్క్‌కు అనుసంధానం కాకపోతే...
సెట్టింగ్స్>మొబైల్ నెట్‌వర్క్స్>నెట్‌వర్క్ ఆపరేటర్స్ విభాగానికి వెళ్ళండి
అందుబాటులో ఉన్న మరో నెట్‌వర్క్‌ను మాన్యువల్‌గా ఎంపిక చేసుకోండి.
కమ్యూనికేషన్ల మంత్రిత్వశాఖ సామాజిక మాధ్యమ ఖాతాలను అనుసరించండి..
ఎక్స్‌ఖాతా- https://x.com/DoT_India
ఇన్‌స్టాగ్రామ్-https://www.instagram.com/department_of_telecom?igsh=MXUxbHFjd3llZTU0YQ==
ఫేస్‌బుక్ - https://www.facebook.com/DoTIndia
యూట్యూబ్: https://youtube.com/@departmentoftelecom?si=DALnhYkt89U5jAaa