నాడు పోస్టు చేయడమైనది:
31 OCT 2026 1:15PM by PIB Hyderabad
స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల (FTAs) ద్వారా లభించే అవకాశాలను సమర్థవంతంగా వినియోగించుకునే అంశంపై విదేశీ వాణిజ్య సంచాలక జనరల్ (DGFT) హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం, తెలంగాణ ప్రభుత్వ సహకారంతో నవంబర్ 2, 2026న హైదరాబాద్లోని మాధాపూర్, టీ-హబ్ నాలెడ్జ్ సిటీలో రాష్ట్రస్థాయి కార్యశాలను నిర్వహించనుంది.
భారతదేశం కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై అవగాహన పెంపొందించడం, వాటిని సమర్థవంతంగా వినియోగించుకునేలా వాణిజ్య వర్గాలను ప్రోత్సహించడం ఈ కార్యశాల ప్రధాన ఉద్దేశం. అంతర్జాతీయ మార్కెట్లలోకి ప్రవేశాన్ని విస్తరించడం, ఎగుమతులకు సంబంధించి కొత్త అవకాశాలను గుర్తించడం, తెలంగాణ రాష్ట్ర ఎగుమతి పోటీతత్వాన్ని మరింత బలోపేతం చేయడంపై ఈ కార్యక్రమం ప్రత్యేకంగా దృష్టి సారించనుంది.
మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానున్న ఈ మెగా ఎఫ్టీఏ అవుట్రీచ్ కార్యక్రమంలో తెలంగాణకు చెందిన ప్రముఖ ఎగుమతిదారులు, జిల్లా పరిశ్రమల కేంద్రాల (DICs) అధికారులు, ఎగుమతి ప్రోత్సాహక మండళ్ల (EPCs) ప్రతినిధులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు, వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు చెందిన ఇతర భాగస్వాములు సహా సుమారు 200 మంది పాల్గొననున్నారు.
ఈ కార్యక్రమంలో ఔషధాలు, ఇంజినీరింగ్, వస్త్ర పరిశ్రమలు, రత్నాలు, ఆభరణాలు వంటి కీలక ఎగుమతి ఆధారిత రంగాలపై ప్రత్యేక విభాగాల వారీ చర్చా సమావేశాలు నిర్వహించనున్నారు. వ్యవసాయం, పాడి పరిశ్రమ, సముద్ర ఉత్పత్తులు, ఆహార శుద్ధి; వస్త్రాలు, దుస్తులు, వస్త్ర ఉత్పత్తులు; ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు; సేవల రంగాల్లో అందుబాటులో ఉన్న అవకాశాలు, వాటిని సద్వినియోగం చేసుకునేందుకు చేపట్టాల్సిన ఆచరణాత్మక చర్యలపై కూడా చర్చించనున్నారు.
విధాన నిర్ణేతలు, పారిశ్రామిక ప్రతినిధులు, ఎగుమతిదారుల మధ్య ప్రత్యక్ష పరస్పర చర్చలకు ఈ సమావేశాలు వేదికగా నిలవనున్నాయి. ఆయా రంగాల్లోని నిర్దిష్ట అవకాశాలను గుర్తించడం, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల వినియోగంలో ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించడం, ఎగుమతుల పనితీరును మెరుగుపరిచేందుకు ఆచరణాత్మక సూచనలు రూపొందించడం ఈ చర్చల ప్రధాన లక్ష్యం.
ఈ అవుట్రీచ్ కార్యక్రమం ద్వారా భాగస్వామ్య వర్గాల్లో అవగాహనను పెంపొందించడంతో పాటు, భారతదేశం కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను సమర్థవంతంగా వినియోగించుకునేలా ప్రోత్సహించడం, తెలంగాణ పరిశ్రమలను అంతర్జాతీయ మార్కెట్లతో మరింతగా అనుసంధానించడం డీజీఎఫ్టీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల ద్వారా లభించే ప్రాధాన్యతాయుత మార్కెట్ ప్రవేశ సౌకర్యాలను, అభివృద్ధి చెందుతున్న వాణిజ్య అవకాశాలను వ్యాపార సంస్థలు సద్వినియోగం చేసుకునేలా చేయడం ద్వారా రాష్ట్ర ఎగుమతుల వృద్ధికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని భావిస్తున్నారు.
***