నాడు పోస్టు చేయడమైనది:
27 OCT 2026 10:44PM by PIB Hyderabad
రాబోయే శీతాకాలంలో తీసుకోవాల్సిన చర్యలపై సన్నద్ధతను, 26–27 పొగమంచు సీజన్లో భాగస్వాముల మధ్య సమన్వయాన్ని సమీక్షించడానికి పొగమంచు సన్నద్ధత తొలి సమావేశాన్ని పౌర విమానయాన మంత్రిత్వశాఖ నిర్వహించింది. ఈ సమావేశానికి పౌర విమానయాన కార్యదర్శి శ్రీ సమీర్ కుమార్ సిన్హా అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి డీజీసీఏ డైరెక్టర్ జనరల్ శ్రీ వీర్ విక్రమ్ యాదవ్, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ఛైర్మన్ శ్రీ పునీత్ కన్సల్, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్), కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్), భారత వాతావరణ విభాగం (ఐఎండీ)కి చెందిన ఉన్నతాధికారులు, ఢిల్లీ విమానాశ్రయంతో సహా పొగమంచు ప్రభావిత విమానాశ్రయాలు, విమానయాన సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
2026 డిసెంబర్ 15 నుంచి 2027 ఫిబ్రవరి 15 వరకు పొగమంచు ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నట్లు ఐఎండీ అధికారులు తెలియజేశారు. పొగమంచు సంబంధిత అవాంతరాలు ఎదురైన సమయంలో విమానాశ్రయ కార్యకలాపాలు సజావుగా సాగేలా చూడటం, ప్రయాణికులకు కలిగే అసౌకర్యాన్ని తగ్గించడంపై ఈ సమావేశం దృష్టి సారించింది. ముందస్తు సన్నద్ధత, సకాలంలో సమాచార వినిమయం, భాగస్వాముల మధ్య మెరుగైన సమన్వయం, విమానాల ఆలస్యం, రద్దు, రీషెడ్యూలింగ్ సందర్భాల్లో ప్రయాణికులకు తగిన సహాయం అందించడానికి సమావేశంలో ప్రాధాన్యమిచ్చారు.
నియంత్రణల పర్యవేక్షణ, వర్తించే సూచనల అమలు, విమానాలు–సిబ్బంది సన్నద్ధత ధృవీకరణ, ప్రయాణికులకు తగిన సౌకర్యాలను విమానయాన సంస్థలు ఏర్పాటు చేసేలా చూడాలని డీజీసీఏ స్పష్టం చేశారు. విజిబిలిటీ తక్కువగా ఉన్న సమయాల్లో ఎయిర్‌పోర్టు కార్యకలాపాల నిర్వహణ కోసం ఇనుస్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్స్ (ఐఎల్ఎస్), రన్‌వే విజువల్ రేంజ్ (ఆర్‌వీఆర్) వ్యవస్థలు, ఎయిర్ సైడ్ సేఫ్టీ, తగినంత టెర్మినల్ సామర్థ్యం, సమర్థమైన సమన్వయం ఉండేలా చూడాలని ఏఏఐ, ఎయిర్పోర్టు నిర్వాహకులను ఆదేశించారు.
తక్కువ విజిబిలిటీ ఉన్న సమయాల్లోనూ విమానాలు నడపడానికి తగిన అర్హత కలిగిన సిబ్బందిని, కార్యకలాపాలను నిర్వహించగలిగే సామర్థ్యం, అనుమతి ఉన్న విమానాలను అందుబాటులో ఉంచుకోవాలని విమానయాన సంస్థలను ఆదేశించారు. ఆచరణాత్మకమైన విమాన షెడ్యూళ్లను రూపొందించడంతో పాటు, విమాన రాకపోకలపై సకాలంలో నిర్ణయాలు తీసుకోవాలని స్పష్టం చేశారు. విమానాలు ఆలస్యమైనా, రద్దయినా, బయలుదేరే వేళలు మారినా ఆ వివరాలను ప్రయాణికులకు ఎస్ఎంఎస్, మొబైల్ యాప్‌లు, ఈ-మెయిల్ ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేయాలని స్పష్టం చేశారు. ఫలితంగా సమాచార లోపం కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఉంటారని తెలియజేశారు.
కార్యకలాపాల ప్రణాళికను సులభతరం చేయడానికి విశ్వసనీయమైన ముందస్తు వాతావరణ అంచనాలు, క్రమం తప్పని పరిశీలనలు, వాతావరణ సమాచారాన్ని సకాలంలో అందించేలా చూడాలని ఐఎండీని ఆదేశించారు. పొగమంచు పరిస్థితుల్లో విమానాల రాకపోకలను సురక్షితంగా నడపడం, తక్కువ విజిబిలిటీ నిబంధనలను ఖచ్చితంగా పాటించడం, సమన్వయంతో కూడిన ట్రాఫిక్ నిర్వహణ ఉండేలా చూడాలని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ), ఎయిర్ నావిగేషన్ సర్వీస్ ప్రొవైడర్లకు సూచించారు.
అవసరమైన సమయాల్లో ప్రయాణికులు టెర్మినల్‌లోకి తిరిగి ప్రవేశించడం, రీబోర్డింగ్‌తో సహా సురక్షితమైన, క్రమబద్ధమైన ప్రయాణికుల రాకపోకలను నిర్వహించడంలో బీసీఏఎస్, సీఐఎస్‌ఎఫ్ పాత్ర గురించి కూడా చర్చించారు. విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడినప్పుడు విమానయాన సంస్థలు తమ గ్రౌండ్ హ్యాండ్లింగ్ విభాగాల్లో తగినంత మంది సిబ్బందిని అందుబాటులో ఉంచాలని, లగేజీ నిర్వహణ, విమానాలను టర్న్ అరౌండ్ ప్రక్రియను సమర్థంగా నిర్వహించాలని, ప్రయాణికులకు అవసరమైన సాయం అందించాలని ఆదేశించారు.
విమానాలు ఆలస్యమైనప్పుడు, రద్దయినప్పుడు ప్రయాణికులకు సదుపాయాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించారు. చెక్-ఇన్ కౌంటర్లు, విమానయాన సంస్థల హెల్ప్‌డెస్క్‌లు, వినియోగదారు సేవా కేంద్రాల్లో తగినంత సిబ్బంది ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలి. ప్రయాణికుల సందేహాలను, సమస్యలను సరిగ్గా పరిష్కరించగల అవగాహన, నిర్ణయాధికారాలు కలిగిన సిబ్బందినే విమానాశ్రయాల్లోని హెల్ప్‌లైన్ డెస్కుల్లో నియమించేలా విమానయాన సంస్థలు చర్యలు తీసుకోవాలని కార్యదర్శి స్పష్టం చేశారు.
పొగమంచు సీజన్‌లో విమాన కార్యకలాపాలు సురక్షితంగా, సమర్థంగా సాగేలా చూడటానికి సంబంధిత వర్గాలన్నీ సమన్వయంతో పనిచేయడం ముఖ్యమని ఈ సమావేశం తెలియజేసింది. రాబోయే పొగమంచు సీజన్‌కు సంబంధించి ముందస్తు సన్నద్ధత, సరైన సమయంలో సమాచారం అందించడం, స్పష్టమైన కార్యాచరణ నిర్ణయాలు తీసుకోవడం, ప్రయాణికులకు ప్రభావవంతమైన సహాయాన్ని అందించడం ద్వారా వారికి కలిగే అసౌకర్యాన్ని వీలైనంత వరకు తగ్గించడమే అందరి ఉమ్మడి లక్ష్యం.
***