ఆయుష్
azadi ka amrit mahotsav

హైదరాబాద్‌లోని సీసీఆర్ఏఎస్- ఎన్ఐఐఎంహెచ్ లో తెలుగు ఆయుర్వేద గ్రంథాల ప్రతిలేఖనం (ట్రాన్స్‌క్రిప్షన్),


సంపాదకత్వం (ఎడిటింగ్) పై ముగిసిన మూడు రోజుల వర్క్‌షాప్‌

వర్క్‌షాప్‌ లో 30 ప్రాచీన తెలుగు ఆయుర్వేద గ్రంథాల్లోని 2,040 తాళపత్ర పుటలకు లిఖితరూపం - తప్పులను సరిదిద్ది ఎడిటింగ్ చేసిన నిపుణులు

నాడు పోస్టు చేయడమైనది: 28 OCT 2026 8:51PM by PIB Hyderabad

హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్ (ఎన్ఐఐఎమ్‌హెచ్) ప్రాంగణంలో 'తెలుగు ఆయుర్వేద ప్రతుల ప్రతీలేఖనం, సంపాదకత్వంపై నిర్వహించిన మూడ్రోజుల వర్క్‌షాప్ ఈరోజు విజయవంతంగా ముగిసింది. అక్టోబర్ 26 నుంచి 28 వరకు జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో చారిత్రక తెలుగు తాళపత్రాలు, ప్రాచీన కాగితపు ప్రతులలో నిక్షిప్తమై ఉన్న ఆయుర్వేద వైద్య విజ్ఞానాన్ని చదవడం, ప్రతీలేఖనం (ట్రాన్స్‌క్రిప్షన్) చేయడం, విశ్లేషించడం, సమగ్రంగా సవరించడంపై పరిశోధకులకు ప్రత్యేక నైపుణ్య శిక్షణ అందించారు.

ఆయుష్‌ మంత్రిత్వ శాఖ కార్యదర్శి పద్మశ్రీ వైద్య రాజేశ్‌ కొటేచా, మంత్రిత్వ శాఖ సలహాదారు (ఆయుర్వేదం) డాక్టర్‌ కౌస్తుభ ఉపాధ్యాయ మార్గదర్శకత్వంలో ఈ వర్క్‌షాప్ నిర్వహించారు. ఆయుష్‌ మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్‌ కౌన్సిల్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఇన్‌ ఆయుర్వేదిక్‌ సైన్సెస్‌ (సీసీఆర్ఏఎస్), హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియన్‌ మెడికల్‌ హెరిటేజ్‌ (ఎన్ఐఐఎంహెచ్) ఆధ్వర్యంలో పనిచేస్తున్న వైద్య చరిత్ర అధ్యయనాలు, భారతీయ వైద్య వారసత్వ కేంద్రం పర్యవేక్షణలో ఈ వర్క్‌షాప్  జరిగింది.

నైపుణ్యాభివృద్ధి, మానవ వనరుల వికాసమే లక్ష్యంగా నిర్వహించిన ఈ వర్క్‌షాప్ ద్వారా భారతదేశ వైద్య వారసత్వాన్ని క్రమపద్ధతిలో అధ్యయనం చేసి, పరిరక్షించేందుకు అవసరమైన ప్రత్యేక నైపుణ్యాలను పరిశోధకులు, పండితులకు అందించాలనే ప్రణాళికను నిర్దేశించారు.

ప్రారంభ సమావేశంలో సీసీఆర్ఏఎస్ డైరెక్టర్‌ జనరల్‌ ప్రొఫెసర్‌ (వైద్య) రవినారాయణ ఆచార్య వర్క్‌షాప్ ఉద్దేశాన్ని వివరించారు. భారతీయ వైద్య వారసత్వ పరిరక్షణకు మండలి చేపడుతున్న పరిశోధనా కార్యక్రమాలు, ప్రాజెక్టుల గురించి వెల్లడించారు. సీసీఆర్ఏఎస్ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ ఎన్‌. శ్రీకాంత్‌ మాట్లాడుతూ, ప్రాచీన వైద్య తాళపత్ర గ్రంథాల్లో నిక్షిప్తమైన అపారమైన చికిత్సా విజ్ఞానాన్ని వెలికితీసి, వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

సీసీఆర్ఏఎస్‌ - ఎన్ఐఐఎంహెచ్‌.ఇన్‌చార్జి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ జి.పి. ప్రసాద్‌ వర్క్‌షాప్ ప్రధాన లక్ష్యాలను వివరించి, ప్రాచీన గ్రంథాలను లిఖిత రూపంలోకి మార్చేందుకు అనుసరించాల్సిన కార్యాచరణ ప్రణాళికను వెల్లడించారు. ప్రారంభ కార్యక్రమానికి ప్రముఖ పండితులు హాజరయ్యారు. నేషనల్‌ ఆయుర్వేద రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ పంచకర్మ (ఎన్ఏఆర్ఐపీ) మాజీ డైరెక్టర్‌ డాక్టర్‌ బి. రామారావు, ఉత్తమ వైద్య బిరుదాంకితులు పమ్మి సత్యనారాయణ శాస్త్రి గౌరవ అతిథులుగా పాల్గొన్నారు.

మూడు రోజుల పాటు సాగిన ఈ కార్యక్రమంలో నిపుణుల ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి ప్రాయోగిక శిక్షణ, సాంకేతిక అంశాలపై ప్రత్యేక తరగతులు నిర్వహించారు. తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) గ్రంథాలయ సంరక్షకులు శ్రీ నరసింహ, భారతీయ ప్రాచీన లిఖిత ప్రతుల అధ్యయన నిపుణులు శ్రీ పి.వి.ఎస్. కుమార్‌, లిఖిత ప్రతుల అధ్యయనం, సాహిత్య రంగ నిపుణులు ఉత్తమ వైద్య పమ్మి సత్యనారాయణ శాస్త్రి ఈ శిక్షణా కార్యక్రమాలను నిర్వహించారు.

ప్రాయోగిక శిక్షణా తరగతుల్లో 37 మందికి పైగా ప్రతినిధులు, అధ్యాపకులు, పీజీ విద్యార్థులు పాల్గొన్నారు. వీరిలో ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి ఎస్‌.వి. ఆయుర్వేద కళాశాల, కర్ణాటకలోని బీదర్‌ జిల్లా హుమ్నాబాద్‌లో ఉన్న రాజరాజేశ్వరి ఆయుర్వేద వైద్య కళాశాల, బీదర్‌లోని బసవరాజ్‌ పాటిల్‌ ఆయుర్వేద కళాశాల ప్రతినిధులతో పాటు సీసీఆర్ఏఎస్‌కు చెందిన పరిశోధకులు, అధికారులు ఉన్నారు.

2026 అక్టోబర్‌ 28న మధ్యాహ్నం ముగింపు సమావేశంతో మూడు రోజుల వర్క్‌షాప్ ముగిసింది. ఈ మూడు రోజుల పాటు పాల్గొన్నవారు ప్రాచీన లిపుల అధ్యయనంలో విస్తృత పరిజ్ఞానం సంపాదించారు. ఇందులో పాత లిఖిత ప్రతుల్లోని అక్షరాలను గుర్తించి అర్థం చేసుకోవడం, వాటిని లిఖిత రూపంలోకి మార్చడం, సంపాదకత్వం, దిద్దుబాట్లు, పాఠాంతరాల విశ్లేషణ, లిపిలోని భిన్న రూపాలను గుర్తించడం వంటి అంశాలపై శిక్షణ పొందారు.

ప్రముఖ పండితుల సమర్థవంతమైన మార్గదర్శకత్వంలో నిర్వహించిన ఈ వర్క్‌షాప్‌లో ఒక ప్రధాన మైలురాయి నమోదైంది. 30 తెలుగు ఆయుర్వేద ప్రాచీన గ్రంథాలకు చెందిన దాదాపు 2,040 తాళపత్ర పుటల (ఫోలియోల) ప్రతీలేఖనం, ప్రాథమిక ప్రూఫ్‌రీడింగ్, సంపాదక ప్రక్రియను నిపుణులు విజయవంతంగా పూర్తి చేశారు. భారతీయ సంప్రదాయ వైద్య విజ్ఞానాన్ని పరిరక్షించి, క్రమపద్ధతిలో పత్రబద్ధం (డాక్యుమెంట్)  చేసే ప్రయత్నాలకు ఈ కార్యక్రమం విశేషంగా దోహదపడింది.

***


(రిలీజ్ ఐడి: 2329883) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी