మంత్రిమండలి
azadi ka amrit mahotsav

2026-27 నుంచి 2030-31 వరకు ప్రధానమంత్రి వికసిత్ గ్రామ స్వరాజ్ యోజనకు కేంద్ర ప్రాయోజిత పథకంగా ఆమోదం తెలిపిన కేబినెట్

నాడు పోస్టు చేయడమైనది: 28 OCT 2026 3:48PM by PIB Hyderabad

వికసిత్ భారత్ జాతీయ దృక్పథానికి అనుగుణంగా తదుపరి తరం పాలనా సంస్కరణల కార్యక్రమం ద్వారా నూతన కేంద్ర ప్రాయోజిత పథకం (సీఎస్ఎస్)గా ప్రధానమంత్రి వికసిత గ్రామ స్వరాజ్ యోజన (పీఎం వీజీఎస్‌వై)కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 2026-27 నుంచి 2030-31 వరకు (పదహారవ ఆర్థిక సంఘం కాలపరిమితితో సమానంగా) ఈ పథకాన్ని అమలు చేసేందుకు ఆమోదం లభించింది.

ఆర్థిక పరమైన అంశాలు:

ఈ పథకం మొత్తం అంచనా వ్యయం రూ. 7,395.55 కోట్లు కాగా... కేంద్ర వాటా రూ. 4,869.48 కోట్లు, రాష్ట్ర వాటా రూ. 2,526.07 కోట్లు.

లబ్ధిదారుల సంఖ్య: దేశవ్యాప్తంగా 2.55 లక్షలకు పైగా పంచాయతీలు, సంప్రదాయ స్థానిక సంస్థల్లోని దాదాపు 32 లక్షల మంది ఎన్నికైన ప్రజా ప్రతినిధులు, పంచాయతీ సిబ్బంది, ఇతర భాగస్వాములు ఈ పథకం ద్వారా ప్రత్యక్ష ప్రయోజనం పొందుతారు. ప్రతి అవగాహన కార్యక్రమం కనీసం కోటి మందికి చేరుతుంది.

ఉపాధి కల్పన సహా గణనీయమైన ప్రభావం:

  1. గ్రామ స్వరాజ్ పోర్టల్ ద్వారా ఏటా 2.55 లక్షల సమగ్ర గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనకు మద్దతివ్వటం, ఇందులో గ్రామ ప్రాధాన్యతలు, సంబంధిత కేంద్ర, రాష్ట్ర శాఖల జోక్యాలు, అందుబాటులో ఉన్న వనరులను భాగస్వామ్య సాక్ష్యాధారిత ప్రణాళిక ద్వారా అనుసంధానిస్తారు.
  2. ప్రభుత్వ పథకాలు, జాతీయ కార్యక్రమాలపై అవగాహన మెరుగుపరిచేందుకు, స్థానిక ప్రభావాలపై చర్చలను ప్రోత్సహించేందుకు, డిజిటల్, ప్రచార వేదికలు, గ్రామ సభలు, ఇతర పంచాయతీ వేదికలను ఉపయోగించి ప్రతి సమన్వయ అవగాహన ప్రచారంలో కనీసం కోటి మంది పౌరులను చేరుకోవటం.
  3. సమగ్ర ప్రణాళిక, పౌరులతో సంభాషణ, వనరుల నిర్వహణ, స్థానిక సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన దిశగా పురోగతిని మెరుగుపరిచేందుకు... సామర్థ్య పెంపుదల, డిజిటల్ హ్యాండ్‌హోల్డింగ్ ద్వారా ఏటా సుమారు 32 లక్షల మంది ఎన్నికైన ప్రజా ప్రతినిధులు, పంచాయతీ సిబ్బంది, ఇతర భాగస్వాముల పాలనా సామర్థ్యాలను బలోపేతం చేయటం.
  4. ఆన్‌లైన్ ఆడిట్ ద్వారా ఏటా కనీసం 2.55 లక్షల ఆడిట్ ప్రణాళికలకు మద్దతివ్వటం, తదనుగుణంగా ఆడిట్లను సకాలంలో పూర్తి చేయటం. మెరుగైన అకౌంటింగ్, పబ్లిక్ ప్రకటనలు, సొంత ఆదాయ వనరుల సమీకరణతో పాటు అందుబాటులో ఉన్న నిధుల జవాబుదారీతనాన్ని బలోపేతం చేయటం. ఆర్థికంగా మరింత స్వావలంబన గల పంచాయతీలకు మద్దతు.

ఈ పథకం ద్వారా ఎటువంటి శాశ్వత పోస్టులను రూపొందించరు. సాంకేతికంగా మద్దతిచ్చేందుకు, దాని లక్ష్యాలను సాధించేందుకు సంస్థాగత వ్యవస్థలో భాగంగా రాష్ట్ర, జిల్లా, బ్లాక్ స్థాయిలో అవసరం మేరకు కాంట్రాక్టు పద్దతిలో మానవ వనరులను నియమించవచ్చు.

వర్తించే రాష్ట్రాలు, జిల్లాలు: 

ఈ పథకం పంచాయతీలు లేని పార్ట్-IX పరిధిలోకి రాని గ్రామీణ స్థానిక ప్రభుత్వ సంస్థల (సంప్రదాయ స్థానిక సంస్థలు)తో సహా అన్ని రాష్ట్రాలు, యూటీలకు వర్తిస్తుంది.

వివరాలు:

  • గ్రామస్థాయిలో జాతీయ పరివర్తనాత్మక సంస్కరణల సద్వినియోగం: ప్రభుత్వ వినూత్న కార్యక్రమాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేసేందుకు, మెరుగైన ప్రజా సేవలను అందించేందుకు, గ్రామీణాభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేందుకు గత పన్నెండేళ్లలో చేపట్టిన జాతీయ సంస్కరణలు చక్కటి అవకాశాలను సృష్టించాయి. ఈ అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకునేందుకు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలను రూపొందించుకోవటం, క్షేత్రస్థాయిలో అందరి భాగస్వామ్యం చాలా ముఖ్యం. 2026-27 నుంచి 2030-31 ఆర్థిక సంవత్సరాల మధ్య గ్రామీణ స్థానిక సంస్థలకు సుమారు రూ. 4.35 లక్ష కోట్ల నిధులను 16వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిన నేపథ్యంలో... జాతీయ ప్రాధాన్యతలు, ప్రభుత్వ పథకాలు, అందుబాటులో ఉన్న వనరులు, స్థానిక ఆకాంక్షలను సమన్వయం చేసుకునే సామర్థ్యం పంచాయతీలకు ఎంతో అవసరం. సమగ్ర ప్రణాళికలు, వివిధ శాఖల మధ్య సమన్వయం, సామర్థ్య పెంపుదల, గ్రామసభల ద్వారా సమాలోచనలు జరపటం వంటి అంశాల ద్వారా ఈ విధానానికి పీఎం వీజీఎస్‌వై పూర్తి మద్దతునిస్తుంది. ఇది జాతీయ స్థాయి కార్యక్రమాలను, మెరుగైన ఆర్థిక వనరులను స్థానికంగా సార్థకమైన అభివృద్ధి ఫలితాలుగా మార్చటంలోనూ, వికసిత్ భారత్ సాధనలోనూ కీలక పాత్ర పోషిస్తుంది.
  • స్థానిక పాలన కేంద్రాలుగా గ్రామ పంచాయతీలు: సమగ్ర స్థానిక ప్రణాళికలు, అభివృద్ధి కార్యక్రమాల సమన్వయానికి గ్రామ పంచాయతీలను ప్రధానమంత్రి వికసిత్ గ్రామ స్వరాజ్ యోజన (పీఎం వీజీఎస్‌వై) కేంద్రంగా నిలపనుంది. గ్రామ ప్రాధాన్యతలు, ప్రభుత్వ చర్యలు, అందుబాటులో ఉన్న వనరులను ఒకే తాటిపైకి తెచ్చేలా పంచాయతీలకు అండగా నిలవనుంది. తద్వారా అట్టడుగు స్థాయి అభివృద్ధికి ఇవి కేంద్రంగా మారతాయి. ఈ పథకం వికసిత్ భారత్ దృక్పథాన్ని గ్రామీణ ప్రజల అవసరాలు, ఆకాంక్షలతో అనుసంధానిస్తుంది.
  • గ్రామ పంచాయతీ స్థాయిలో సమగ్ర ప్రణాళికలు: కేంద్రంలోని అన్ని సంబంధిత మంత్రిత్వశాఖలు, విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వాల ప్రణాళికా ప్రక్రియలను ఈ పథకం... ఒకే డిజిటల్ వేదిక మీదకు తీసుకువస్తుంది. దీనివల్ల అందరూ కలిసి సమగ్ర గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (జీపీడీపీ)ను రూపొందించుకునే వీలుంటుంది. లోపాలను గుర్తించటం, ప్రణాళికలను సమన్వయం చేసుకోవటం, కేంద్ర ఆర్థిక సంఘం నిధులతో సహా అందుబాటులో ఉన్న వనరులను మెరుగ్గా వినియోగించుకునేందుకు పంచాయతీలకు, సంబంధిత విభాగాలకు ఇది దోహదపడుతుంది. వ్యక్తిగత పథకాలను అమలు చేసే ప్రస్తుత విభాగాల ఏర్పాట్లు యథాతథంగా కొనసాగుతాయి.
  • ప్రతి గ్రామ పంచాయతీ అభివృద్ధిని సులభంగా అర్థమయ్యేలా చూపే విధానం: ఈ-గ్రామ్ స్వరాజ్, ఇప్పటికే అమల్లో ఉన్న ఈ-పంచాయత్ వ్యవస్థల ఆధారంగా... ప్రభుత్వ పథకాలు, లబ్ధిదారులు, ప్రయోజనాలు, సామాజిక ఆస్తులు, అందుబాటులో ఉన్న వనరులకు సంబంధించిన సమస్త సమాచారాన్ని ఒకే డిజిటల్ వేదికపైకి ఈ పథకం తీసుకువస్తుంది. తద్వారా స్థానిక అవసరాలను గుర్తించి, లోపాలను సరిదిద్దుకునేందుకు ప్రణాళికలు, సమన్వయం, పర్యవేక్షణను మెరుగుపరచుకునేందుకు పంచాయతీలకు ఇది  ఉపయోగపడుతుంది.
  • స్థానిక అవసరాలతో జాతీయ ప్రాధాన్యతల అనుసంధానం: ప్రభుత్వ పథకాలు, జాతీయ కార్యక్రమాలను సులభంగా, అందరికీ అర్థమయ్యే భాషలో వివరించేందుకు పంచమ్ (17 భారతీయ భాషల్లో అందుబాటులో ఉన్న ఏఐ-ఆధారిత ద్విముఖ సమాచార వేదిక) సహా ఇప్పటికే ఉన్న శిక్షణ, డిజిటల్, ప్రచార వేదికలను పీఎం వీజీఎస్‌వై వినియోగించుకుంటుంది. గ్రామ సభలు, పంచాయతీ వేదికల ద్వారా ఉమ్మడి చర్చలను ప్రోత్సహించి... జాతీయ ప్రాధాన్యతలను స్థానిక అవసరాలు, గ్రామాభివృద్ధి లక్ష్యాలతో అనుసంధానించేందుకు ఇది తోడ్పడుతుంది.
  • ఈ విధానాన్ని ఆచరణలో పెట్టేందుకు సామర్థ్య పెంపుదల: డిజిటల్ వేదికలను సమర్థవంతంగా ఉపయోగించటం, పథకాలు, వనరుల సమాచారాన్నివిశ్లేషించుకోవటం, సమగ్ర ప్రణాళికలు రూపొందించటం, పౌరులతో మమేకమై మాట్లాడటం వంటి అంశాలపై గ్రామ పంచాయతీలకు తగిన శిక్షణనిస్తారు. లభించిన సమాచారం ఆధారంగా, గ్రామస్థుల చర్చల ద్వారా స్థానిక అభివృద్ధి ప్రణాళికలను, తదుపరి చర్యలను రూపొందించుకోవటంలో ఈ సామర్థ్య పెంపుదల పంచాయతీలకు సహాయపడుతుంది.
  • అందుబాటులో ఉన్న వనరుల పారదర్శక, సమర్థవంతమైన వినియోగం: ఆర్థిక సంఘం నిధులు, ఇతర నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవటం, సొంత ఆదాయ వనరులను (ఓఎస్ఆర్) సమకూర్చుకోవటం, ఆన్‌లైన్ అకౌంటింగ్, ఆడిటింగ్, పంచాయతీల్లో ప్రజలకు ఎప్పటికప్పుడు వివరాలు వెల్లడించే సామర్థ్యాన్ని ఈ పథకం బలోపేతం చేస్తుంది. ఇది వనరుల పారదర్శక వినియోగాన్ని ప్రోత్సహించటంతో పాటు, స్థానిక అభివృద్ధిలోని లోపాలను సరిదిద్ది... పంచాయతీలను స్వావలంబన దిశగా, బాధ్యతాయుతంగా నడిపిస్తుంది.

అమలు వ్యూహం:

ఈ పథకాన్ని సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు, యూటీల పరిపాలనా వ్యవస్థల ద్వారా అమలు చేస్తారు. పథక లక్ష్యాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా కార్యకలాపాలు, ప్రాధాన్యతలు, అవసరాలను పేర్కొంటూ రాష్ట్రాలు, యూటీలు వార్షిక కార్యాచరణ ప్రణాళికలను సమర్పిస్తాయి. నిర్దేశిత కేంద్ర సాధికార కమిటీ సంబంధిత విధానాలు, ప్రమాణాలకు అనుగుణంగా ఈ ప్రణాళికలను పరిశీలించి ఆమోదిస్తుంది. సమన్వయం, సాంకేతిక సహాయం, పర్యవేక్షణ, సమీక్షల మద్దతుతో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు, యూటీలు కేటాయించిన బాధ్యతల పరిధిలో కార్యకలాపాలను నిర్వహిస్తాయి. గ్రామస్థాయిలో పథకం అమలుకు ఇప్పటికే ఉన్న సంస్థాగత, సామర్థ్య పెంపుదల, డిజిటల్, ప్రసార వ్యవస్థలను వినియోగిస్తారు.

 

***


(రిలీజ్ ఐడి: 2329662) సందర్శకుల సూచీ సంఖ్య : : 27
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Bengali , Kannada , Malayalam , Bengali-TR , Assamese , English , Urdu , हिन्दी , Marathi , Punjabi , Gujarati , Tamil