నాడు పోస్టు చేయడమైనది:
28 OCT 2026 5:25PM by PIB Vijayawada
తుఫాను ఆర్నాబ్ ప్రభావంతో 2026 అక్టోబర్ 27 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీస్తున్న నేపథ్యంలో జాతీయ రహదారులపై ప్రయాణికుల భద్రత కొరకు, అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ప్రభావిత ప్రాంతాల్లో అత్యవసర సేవలను అందించేందుకు అవసరమైన వాహనాలు, యంత్రాలు, సిబ్బందిని సిద్ధంగా ఉంచింది.
విస్తృత స్థాయిలో అత్యవసర ఏర్పాట్లు
ఎన్హెచ్ఏఐ ఆధ్వర్యంలో 32 రూట్ పెట్రోలింగ్ వాహనాలు, 31 అంబులెన్స్‌లు, 35 క్రేన్లు/టోయింగ్ వాహనాలు, 47 జేసీబీలు, 25 పవర్‌సాలు, 45 డంపర్లు, 24 క్విక్ రెస్పాన్స్ బృందాలను (క్యూఆర్టీలు) అందుబాటులో ఉంచారు. ముఖ్యంగా ఏలూరు నుంచి శ్రీకాకుళం జిల్లాల పరిధిలోని తుఫాను ప్రభావిత జాతీయ రహదారి మార్గాలపై ఈ ఏర్పాట్లకు ప్రాధాన్యత ఇచ్చారు. ప్రయాణికుల భద్రత, అత్యవసర పరిస్థితులకు తక్షణ స్పందన, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చూడటమే లక్ష్యంగా సంబంధిత జిల్లా యంత్రాంగాలు, జాతీయ రహదారుల నిర్వహణ సంస్థలతో సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయి బృందాలు పనిచేస్తున్నాయి.
క్షేత్రస్థాయిలో సహాయక చర్యలు
తుఫాను ప్రభావిత జాతీయ రహదారి మార్గాల్లో ఇప్పటివరకు అందిన నివేదికల ప్రకారం కనీసం 149 కూలిన చెట్లను తొలగించారు. వీటిలో సిద్ధాంతం–అనకాపల్లి, పరిసర ప్రాంతాల రహదారి మార్గాల్లో 75 చెట్లు, ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలోని ఇతర రహదారి మార్గాల్లో 74 చెట్లు ఉన్నాయి. అలాగే, కూలిన ఒక విద్యుత్ స్తంభాన్ని కూడా తొలగించారు. వివిధ రహదారి మార్గాల్లో సుమారు 1,350 గుంతలను గుర్తించినట్లు సమాచారం. ప్రభావిత ప్రాంతాల్లో తాత్కాలిక మరమ్మతు పనులు చేపడుతున్నారు.
భారీ వర్షాల కారణంగా ఎన్‌హెచ్-16, ఎన్‌హెచ్-516సీ మార్గాల్లోని ప్రధాన రహదారులు, సర్వీస్ రోడ్లు, అండర్‌పాస్‌ల వద్ద పలు చోట్ల నీరు నిలిచినట్లు నివేదికలు అందాయి. డ్రైనేజీల నుంచి నీరు పొంగిపొర్లడం, వర్షపు నీరు నిలిచిపోవడం వంటి కారణాలతో ఈ పరిస్థితి ఏర్పడింది. నీటిని తొలగించేందుకు, డ్రైనేజీలను శుభ్రపరిచేందుకు జేసీబీలు, నీటిని తోడే పంపులు, కార్మికులను రంగంలోకి దించారు. అవసరమైన ప్రాంతాల్లో నీటిని సమీప జలవనరుల్లోకి మళ్లించేందుకు తాత్కాలిక మట్టి కాలువలను కూడా ఏర్పాటు చేశారు.
ఎన్‌హెచ్-16పై అనకాపల్లి డైట్ కళాశాల సమీపం, యలమంచిలి, కశింకోట, సత్యం జంక్షన్, అక్కయ్యపాలెం, గాజువాక తదితర ప్రాంతాల్లో చెట్లు కూలిపోవడంతో కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. కూలిన చెట్లను తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. మరోవైపు, ఎన్‌హెచ్-216 (కత్తిపూడి–కాకినాడ), ఎన్‌హెచ్-365బీజీ (ఖమ్మం–దేవరపల్లి) సహా పలు జాతీయ రహదారుల్లో ట్రాఫిక్‌కు అంతరాయం కలగలేదని నివేదికలు వెల్లడిస్తున్నాయి. సమస్యాత్మక ప్రాంతాలపై ఎన్హెచ్ఏఐ బృందాలు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తూ అవసరమైన చర్యలు చేపడుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని జాతీయ రహదారులపై ప్రయాణికుల భద్రతను కాపాడటం, ట్రాఫిక్ రాకపోకలను సాధ్యమైనంతవరకు సజావుగా కొనసాగించడం, వాతావరణ సంబంధిత అత్యవసర పరిస్థితులకు తక్షణమే స్పందించడం కోసం ఎన్హెచ్ఏఐ అన్ని అవసరమైన చర్యలను కొనసాగిస్తోంది. కూలిన చెట్ల తొలగింపు, నిలిచిన నీటిని బయటకు పంపించడం, రహదారులపై గుంతలకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టడం వంటి పనులను ఎన్హెచ్ఏఐ నిరంతరం పర్యవేక్షిస్తోంది. బలమైన ఈదురుగాలులు వీచే సమయంలో చెట్ల కింద లేదా ప్రమాదకరమైన రహదారి పక్క నిర్మాణాల సమీపంలో వాహనాలను నిలపకుండా ప్రయాణికులు జాగ్రత్తలు తీసుకోవాలి. స్థానిక అధికార యంత్రాంగం జారీ చేసే ట్రాఫిక్ సూచనలు, భద్రతా మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలి.
***