నాడు పోస్టు చేయడమైనది:
26 OCT 2026 10:00PM by PIB Hyderabad
మానవ పర్యవేక్షణకు ప్రాధాన్యమిస్తూ నైతికమైన, బాధ్యతాయుతమైన, పారదర్శకమైన సాంకేతికతను ప్రోత్సహించాలని బ్రిక్స్ పార్లమెంటులను లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా కోరారు.
కొనసాగుతున్న 12వ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరంలో భాగంగా నిర్వహిస్తున్న ప్లీనరీ సమావేశాలను ఉద్దేశించి శ్రీ బిర్లా ప్రసంగించారు. ప్రపంచంలో సగం జనాభాకు బ్రిక్స్ దేశాలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయన్నారు. పార్లమెంటరీ సార్వభౌమత్వాన్ని పరిరక్షిస్తూ, పరస్పర సహకారాన్ని పెంపొందించుకంటూనే సాంకేతిక పరిజ్ఞానాన్ని నైతికంగా ఉపయోగించుకొనే ఉమ్మడి బాధ్యతను కలిగి ఉన్నాయని తెలిపారు.
అంతకు ముందు ఈ ఫోరంను శ్రీ బిర్లా ప్రారంభించారు.
చట్టసభల సామర్థ్యాన్ని, పారదర్శకతను, సమర్థతను ప్రజలకు అందుబాటులో ఉండటాన్ని పెంపొందించేందుకు భారత పార్లమెంటులో ఉపయోగిస్తున్న అనేక డిజిటల్ ఆవిష్కరణల గురించి శ్రీ బిర్లా వివరించారు. ఎంపీల ప్రశ్నలు, సమాధానాలను, ప్రభుత్వ శాఖల సత్వర స్పందనలను ఆన్లైన్లో అందించే సురక్షిత డిజిటల్ వేదికలు ఇందులో ఉన్నాయి. అలాగే రోజువారీ కార్యకలాపాల జాబితాను 10 భాషల్లో అందిస్తున్నామని, వీటిని అధికారికంగా గుర్తించిన 22 భాషలకూ విస్తరించే పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఏకకాలంలో 22 భాషల్లో అనువదించడం లాంటి బహుభాషా కార్యక్రమాలు కూడా వీటిలో భాగమని తెలియజేశారు.
స్వాతంత్య్రానికి ముందు, ఆ తర్వాత జరిగిన పార్లమెంటరీ చర్చల రికార్డులను మెటాడేటా, వీడియో-సెర్చ్ సదుపాయాలతో డిజిటలైజ్ చేసిన అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. పరిశోధన పత్రాలను 24 గంటలూ ఆన్లైన్లో అందుబాటులో ఉంచడం, పార్లమెంట్ లైబ్రరీ నుంచి పుస్తకాలను ఇళ్లకు చేరవేయడం లాంటి సౌకర్యాల గురించి కూడా వివరించారు. శాసనసభలను అనుసంధానించడానికి, సభా కార్యకలాపాలు, చర్చలు, బడ్జెట్, చట్టాల రూపకల్పన వివరాలను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి నేషనల్ ఈ-విధాన్ అప్లికేషన్ (నేవా), 'వన్ నేషన్, వన్ లెజిస్లేటివ్ ప్లాట్‌ఫామ్' విధానాల ద్వారా చేపట్టిన కాగితరహిత పాలన కార్యక్రమాలను సైతం ఆయన వివరించారు.
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన భారతదేశ డిజిటల్ ప్రజా మౌలిక వసతులు (డీపీఐ) గురించి శ్రీ బిర్లా మాట్లాడారు. ఇది పౌరులను శక్తిమంతం చేయడంతో పాటు ఆర్థిక సమ్మిళిత్వాన్ని ప్రోత్సహిస్తుందని తెలియజేశారు. అవినీతిని అరికట్టేందుకు సంక్షేమ ఫలాలను నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకే పారదర్శకంగా బదిలీ చేస్తుందని తెలిపారు. సాంకేతికత బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో, మానవ కేంద్రకంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. మానవ భావోద్వేగాలకు, నైతిక విలువలకు, గౌరవానికి అనుగుణంగా ఆధునిక టెక్నాలజీ ఉండాలన్నారు. దీనిలో మానవ పర్యవేక్షణే అత్యంత ప్రధానమని ఆయన పేర్కొన్నారు.
12వ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం–2026 సందర్భంగా యూఏఈ ఫెడరల్ నేషనల్ కౌన్సిల్ స్పీకర్ సఖ్ర్ ఘోబాష్‌తో శ్రీ బిర్లా భేటీ అయ్యారు. ఇరుదేశాల మధ్య ఉన్న చారిత్రక స్నేహ సంబంధాలను ఇరువురు నేతలు పునరుద్ఘాటించారు. నిరంతర చర్చలు, ప్రతినిధి బృందాల పరస్పర సందర్శనల ద్వారా పార్లమెంటరీ సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని వారు నిర్ణయించారు. డిజిటల్ సంసద్, కృత్రిమ మేధ, పార్లమెంటరీ కమిటీల పనితీరు, ఆన్లైన్ అష్యూరెన్స్ మానిటరింగ్ సిస్టమ్ లాంటి ఉత్తమమైన డిజిటల్ పాలన విధానాలను పంచుకోవడానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ‘వికసిత్ భారత్’, ‘వి ది యూఏఈ–2031’ ఉమ్మడి ఆకాంక్షలకు అనుగుణంగా వాణిజ్యం, పెట్టుబడులు, విద్య, యూత్ ఎక్స్ఛేంజి కార్యక్రమాలు, ప్రజా సంబంధాలను మరింత విస్తరించడంపై చర్చించారు. దౌత్య మార్గాల ద్వారా ప్రాంతీయ శాంతిని, స్థిరత్వాన్ని కాపాడాల్సిన ఆవశ్యకతను స్పష్టం చేశారు.
అనంతరం, చైనా నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ వైస్ చైర్మన్ జెంగ్ జియాన్బాంగ్తో శ్రీ బిర్లా భేటీ అయ్యారు. పార్లమెంటరీ ప్రతినిధుల పరస్పర సందర్శనలు, నిరంతర చర్చలతో పాటు విద్య, ఆరోగ్యం, సాంకేతిక రంగాల్లో సహకారం ద్వారా భారత్-చైనా సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై ఇరువురు నేతలు చర్చించారు. సరిహద్దుల్లో శాంతిని కాపాడటంతో పాటు పరస్పర గౌరవం, చర్చల ద్వారా విభేదాలను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాల్సిన ఉమ్మడి బాధ్యత ఇరు దేశాలపైనా ఉందని శ్రీ బిర్లా స్పష్టం చేశారు. పార్లమెంటరీ దౌత్యం, బలమైన వాణిజ్య సంబంధాలు, ప్రజల మధ్య సత్సంబంధాలకు ఉన్న ప్రాధాన్యాన్ని ఆయన వివరించారు. పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూపులు, బ్రిక్స్ తరహా బహుళపాక్షిక వేదికల ద్వారా కొనసాగే సంబంధాలు... పరస్పర అవగాహనను మరింత పెంపొందిస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
ఇరాన్ ఇస్లామిక్ కన్సల్టేటివ్ అసెంబ్లీ ప్రెసిడియం సభ్యులు డాక్టర్ అహ్మద్ నాదేరీతో కూడా లోక్‌సభ స్పీకర్ భేటీ అయ్యారు. భారత్-ఇరాన్ మధ్య గల చారిత్రక సంబంధాలను, 2026 సెప్టెంబర్‌లో వారి మధ్య జరిగిన భేటీతో సహా ఉన్నత స్థాయి సమావేశాలను గుర్తుచేసుకుంటూ పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వాల ప్రాధాన్యాన్ని శ్రీ బిర్లా స్పష్టం చేశారు. సంయుక్త ప్రయత్నాల ద్వారా చాబహార్ పోర్టు సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడంపై ఇరువురు నేతలు చర్చించారు. ఇరాన్‌కు భారత్ అందించిన ఔషధాలు, సాయం, ఇతర తోడ్పాటుకు డాక్టర్ నాదేరీ కృతజ్ఞతలు తెలిపారు. దీర్ఘకాలిక ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు నిరంతర చర్చలు, పరస్పర సహకారం కొనసాగించాల్సిన ఆవశ్యకతను ఇరుపక్షాలు పునరుద్ఘాటించాయి.
***