నాడు పోస్టు చేయడమైనది:
23 OCT 2026 8:10PM by PIB Hyderabad
మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ కొనసాగిస్తున్న కఠిన చర్యల్లో భాగంగా... నిఘా వర్గాల సమాచారంతో పంజాబ్‌లోని జలంధర్ సమీపంలో ఉన్న ఫగ్వారాలో 2026 అక్టోబర్ 21న అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా 5.6 కిలోల హెరాయిన్ అక్రమ రవాణాను గుర్తించిన అధికారులు దానిని స్వాధీనం చేసుకుని, నలుగురిని అరెస్టు చేశారు.
ప్రజా రవాణా బస్సులో ప్రయాణిస్తున్న కొందరు వ్యక్తులు మాదక ద్రవ్యాలను తరలిస్తున్నారనే నిర్దిష్ట సమాచారం మేరకు, డీఆర్ఐ అధికారులు ఫగ్వారా ప్రాంతంలో నిఘా ఉంచారు. తనిఖీల్లో భాగంగా ఆ మార్గంలో వెళ్తున్న ఒక బస్సులో సోదాలు నిర్వహించారు. అందులో ప్రయాణిస్తున్న నలుగురు అనుమానితులను డీఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డీపీఎస్) చట్టం-1985 నిబంధనల ప్రకారం నిర్వహించిన సోదాల్లో... నలుగురు అనుమానితుల్లో ఒకరి వద్ద గల సంచీలో దాచి ఉంచిన, పసుపు రంగు టేపుతో చుట్టి ఉన్న అయిదు ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ అయిదు ప్యాకెట్లలో ప్రతి దానిలో గల రెండు చిన్న ప్యాకెట్లతో మొత్తం పది ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ పది ప్యాకెట్లలోని పదార్థాన్ని క్షేత్రస్థాయిలో పరీక్షించగా, అది పంజాబ్‌లో చిట్టాగా పిలిచే హెరాయిన్‌గా నిర్ధారణ అయింది. మొత్తం 5.6 కిలోల నిషేధిత పదార్థాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు... ఎన్‌డీపీఎస్ చట్టం-1985 నిబంధనల ప్రకారం దానిని జప్తు చేశారు. ఈ నిషేధిత పదార్థం రవాణా, స్వాధీనంలో పాల్గొన్నారనే ఆరోపణలతో నలుగురినీ అదే చట్టం కింద అరెస్టు చేశారు.
హెరాయిన్ అత్యంత వ్యసనకరమైన ఓపియాయిడ్. ఇది కేంద్ర నాడీ వ్యవస్థపై అధిక ఒత్తిడిని కలిగిస్తుంది. దీనిపై ఆధారపడటం, శ్వాసకోశ సమస్యలు, అధిక మోతాదుతో మరణం వంటి తీవ్రమైన ముప్పును ఇది కలిగిస్తుంది. ఇది దేశంలో ఎన్‌డీపీఎస్ చట్టం నియంత్రణలో గల ఒక నిషేధిత మాదక ద్రవ్యం. అనధికారికంగా దీనిని కలిగి ఉండటం, అక్రమంగా రవాణా చేయడం, రవాణా లేదా అమ్మకం వంటి చర్యలకు కఠినమైన శిక్షలు ఉంటాయి. వాణిజ్య పరిమాణానికి, సెక్షన్ 21(సి) ప్రకారం 10 నుంచి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ. 1 నుంచి 2 లక్షల జరిమానా విధిస్తారు. మరింత అధిక జరిమానా విధించే అవకాశమూ ఉంది.
పంజాబ్‌లో భారీగా మాదకద్రవ్యాలను పట్టుకోవడం... వాటి సరఫరా వ్యవస్థను దెబ్బతీయడానికి, అక్రమ మాదకద్రవ్యాల రవాణాలో పాలుపంచుకున్న వారిని న్యాయస్థానం ఎదుట నిలబెట్టడానికి డీఆర్ఐ చేస్తున్న నిరంతర ప్రయత్నాలను స్పష్టం చేస్తోంది.
****