ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఆధ్వర్యంలో హైదరాబాద్ నుంచి 10 మంది సభ్యులతో కూడిన మీడియా ప్రతినిధి బృందం గుజరాత్ పర్యటనకు వెళ్లింది. ఈ పర్యటనలో భాగంగా స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, ఏక్తానగర్ను సందర్శించింది.
ఏక్తానగర్ అభివృద్ధి తీరును నేరుగా వీక్షించటంతో పాటు అక్కడ చేపట్టిన పర్యాటక, జీవనోపాధి, సుస్థిర కార్యక్రమాల గురించి ఈ బృందం తెలుసుకుంది.
సర్దార్ వల్లభభాయ్ పటేల్‌కు అంకితమిచ్చిన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ… జాతీయ ఐక్యత, సమగ్రతల స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది. పర్యాటకం, ఉపాధి, స్థానికాభివృద్ధిని ప్రోత్సహించటంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారిస్తున్నట్లు ఏక్తానగర్ అభివృద్ధి ద్వారా తెలుస్తుంది. పర్యాటకం, పర్యావరణ పరిరక్షణ, స్థానికాభివృద్ధి పరస్పరం ముందుకు సాగటంతో అభివృద్ధి చెందుతున్న పర్యాటక ప్రాంతంగా ఏక్తానగర్ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభివర్ణించారు.
స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఏరియా డెవలప్మెంట్ అండ్ టూరిజం గవర్నెన్స్ అథారిటీ (ఎస్ఓయూఏడీటీజీఏ) అదనపు కలెక్టర్ శ్రీ నారాయణ్ మధు ప్రతినిధి బృందానికి వివరాలు వెల్లడించారు. 56 చదరపు కిలోమీటర్లు, 90 గ్రామాల పరిధిలో విస్తరించిన ఏక్తానగర్ అభివృద్ధి గురించి వివరించారు. పర్యాటక రంగ అభివృద్ధి ద్వారా సుమారు 1,800 మందికి ప్రత్యక్షంగా, 7,000 మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించాయని తెలిపారు. స్టాచ్యూ ఆఫ్ యూనిటీతో పాటు జంగిల్ సఫారీ, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, ఆరోగ్య వన్, కాక్టస్ గార్డెన్, సీతాకోకచిలుకల ఉద్యానవనం, ఏక్తా మాల్ వంటి ప్రధాన ఆకర్షణ ప్రాంతాల గురించి ప్రతినిధి బృందానికి వివరించారు.

పింక్ ఈ-రిక్షాలు, ఆహార కేంద్రాలు, రెస్టారెంట్ల వంటి పర్యాటక సంబంధిత కార్యకలాపాల్లో గిరిజన సంఘాలు, ముఖ్యంగా మహిళలు క్రియాశీలకంగా పాల్గొంటున్నట్లు తెలిపారు. గిరిజన మహిళలకు శిక్షణ, స్వయం ఉపాధి అవకాశాలను కల్పించటంలో ఏక్తా మహిళా మండల్ పోషిస్తున్న కీలక పాత్రను ప్రతినిధి బృందానికి తెలియజేశారు.