నాడు పోస్టు చేయడమైనది:
10 SEP 2026 11:23PM by PIB Hyderabad
హైదరాబాద్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) నిర్వహిస్తున్న మీడియా టూర్లో భాగంగా తెలంగాణ ప్రతినిధి బృందం ఈ రోజు వడోదరలోని గతి శక్తి విశ్వవిద్యాలయ (జీఎస్వీ), ఆనంద్‌లోని అమూల్ డెయిరీని సందర్శించింది.
జీఎస్వీ అందిస్తున్న విద్యా కార్యక్రమాలు, పారిశ్రామిక భాగస్వామ్యాలు, భవిష్యత్తు ప్రణాళికల గురించి ప్రతినిధి బృందానికి విశ్వవిద్యాలయ డీన్ (అకడమిక్స్) ప్రొఫెసర్ (డాక్టర్) జితేష్ జే థక్కర్ వివరించారు. తెలంగాణతో సహా దేశవ్యాప్తంగా క్యాంపస్‌లను ఏర్పాటు చేయాలని జీఎస్వీ యోచిస్తోందని ఆయన తెలిపారు. రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచే కేంద్రీయ విశ్వవిద్యాలయమే జీఎస్వీ అని తెలియజేశారు. రవాణా, లాజిస్టిక్స్ కోసం భారతదేశంలో ఏర్పాటయిన తొలి ప్రత్యేక విశ్వవిద్యాలయమని వెల్లడించారు. దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాలు, అనుసంధానానికి సంబంధించిన సమగ్ర, సమన్వయ ప్రణాళికను ప్రోత్సహించడమే లక్ష్యంగా నిర్దేశించుకున్న పీఎం గతిశక్తి విస్తృత దార్శనికతకు అనుగుణంగా రవాణా, లాజిస్టిక్స్ విద్యపై ఈ విశ్వవిద్యాలయం దృష్టి సారించిందని తెలియజేశారు.

జీఎస్వీ అందిస్తున్న విద్యా కార్యక్రమాల గురించి ప్రొఫెసర్ థక్కర్ వివరించారు. రైల్వేలు, రోడ్లు, పోర్టులు, విమానయానం, పట్టణ రవాణా, లాజిస్టిక్స్ లాంటి ముఖ్యమైన రంగాల్లో జీఎస్వీ కోర్సులను అందిస్తోందన్నారు. పరిశ్రమ నిపుణులతో సంప్రదించి ఈ కార్యక్రమాలను రూపొందించినట్లు తెలియజేశారు. రైల్వేలు, మెట్రో సంస్థలు, విమానయానం, రవాణా రంగాలలోని నిపుణులు కూడా తమ నైపుణ్యాన్ని విద్యార్థులతో పంచుకుంటున్నారని ఆయన చెప్పారు. ప్రయోగాత్మక విద్యకు విశ్వవిద్యాలయం అధిక ప్రాధాన్యమిస్తోందని ప్రొఫెసర్ థక్కర్ స్పష్టం చేశారు. విద్యార్థులు ప్రతి ఏటా 13 నుంచి 14 వారాల తప్పనిసరి ఇంటర్న్‌షిప్‌లు చేస్తారు. అలాగే కోర్సు చివరి సంవత్సరంలో భాగస్వామ్య పారిశ్రామిక సంస్థలో 21 వారాల వ్యవధి ఉన్న చివరి సంవత్సరం ప్రాజెక్ట్‌ను చేపడతారు. దీనివల్ల వారికి సుమారుగా తొమ్మిది నెలల ప్రయోగాత్మక అనుభవం లభిస్తుంది.
ఇటీవలి ఏళ్లలో 92 శాతానికి పైగా ప్రాంగణ నియామకాలను జీఎస్వీ నమోదు చేసింది. తాజా బీటెక్, ఎంబీయే బ్యాచులు 100 శాతం ప్లేస్మెంట్లను సాధించాయి. నియామకాలు చేపట్టే సంస్థలలో ఎల్ అండ్ టీ, జాకబ్స్, సిమెన్స్, ఎయిర్‌బస్, ఆల్స్టోమ్, ప్లాస్సర్ ఇండియా ఉన్నాయి.
ప్రస్తుతం 22 రాష్ట్రాలకు చెందిన 1,300 మంది విద్యార్థులు ఈ విశ్వవిద్యాలయంలో చదువుతున్నారు. వచ్చే అయిదేళ్లలో విద్యార్థుల సంఖ్యను 5,000కు పెంచేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.
పట్టణ రవాణా రంగంలో జీఎస్వీ చేస్తున్న కృషి గురించి కూడా ప్రతినిధి బృందానికి వివరించారు. వడోదరలో ఉన్న ఆరు కూడళ్లలో ఏర్పాటు చేసిన అడాప్టివ్ ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను ఈ విశ్వవిద్యాలయం పరీక్షిస్తోంది. ఈ నమూనాను హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలకు విస్తరించాలని యోచిస్తోంది.
మీడియా బృందం ఆనంద్‌లోని అమూల్ డెయిరీలో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అమిత్ వ్యాస్‌తో సమావేశమయింది. ఆయన సంస్థ వృద్ధి గురించి, ప్రపంచవ్యాప్తంగా భారతీయ పాల ఉత్పత్తుల విస్తరణకు చేస్తున్న ప్రయత్నాల గురించి మాట్లాడారు. అమూల్‌ను ‘‘ప్రపంచానికే డెయిరీ’’గా అభివర్ణించారు.
పశు వైద్య సేవలు, టీకాలు, పశువుల మేత, పాలు పిండే యంత్రాలతో పాటు వివిధ రూపాల్లో పాడి రైతులకు అమూల్ అందిస్తున్న తోడ్పాటు గురించి డాక్టర్ వ్యాస్ వివరించారు. రైతుల జీవనోపాధిని, రాబడిని పెంచడమే ఈ కార్యక్రమాల లక్ష్యం.

రవాణా, లాజిస్టిక్స్ విద్య, పరిశ్రమ-విద్యాసంస్థల సహకారం, పట్టణ రవాణా, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పాడి రంగాన్ని బలోపేతం చేయడం లాంటి రంగాల్లో కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇస్తున్న కీలక కార్యక్రమాలపై ఈ పర్యటన ద్వారా తెలంగాణ మీడియా బృందానికి అవగాహన ఏర్పడింది. రైతులకు అవకాశాలు, జీవనోపాధిని మెరుగుపరిచే ప్రయత్నాల గురించి కూడా వారు తెలుసుకున్నారు.

***