సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
నమస్తే పథకంలో విజయగాథ
పారిశుద్ధ్య కార్మికుల నుంచి యంత్రాలతో కూడిన సేవా రంగ పారిశ్రామికవేత్తలుగా మార్పు
నాడు పోస్టు చేయడమైనది:
19 OCT 2026 6:30PM by PIB Hyderabad
ఆర్థిక సాయం, ఆధునిక పరికరాలు అందుబాటులోకి రావడం అనేది పారిశుద్ధ్య కార్మికులకు జీవనోపాధిని మెరుగుపరుచుకోవడానికి, ఆర్థిక స్వతంత్రతను సాధించడానికి నూతన అవకాశాలను సృష్టిస్తుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరుకు చెందిన టీ. రవికుమార్, పీ. శేఖర్, టీ. నిఖిల్, ఈ. ఐలయ్యల ప్రయాణం... ఉమ్మడి వ్యవస్థాపన, యంత్రీకరణ ద్వారా పారిశుద్ధ్య కార్మికులు సురక్షితమైన, సమర్థవంతమైన పారిశుద్ధ్య సేవలను ప్రోత్సహిస్తూనే సుస్థిరమైన జీవనోపాధిని పెంపొందించుకున్న తీరును తెలియజేస్తోంది.
ఈ నలుగురు లబ్ధిదారులు గతంలో పారిశుద్ధ్య పనుల్లో నిమగ్నమై ఉండేవారు. యంత్రాలతో కూడిన పారిశుద్ధ్య సేవల ద్వారా తమ ఆదాయాన్ని, పని పరిస్థితులను మెరుగుపరుచుకోవాలని వారు కోరుకున్నారు. అయితే ఆధునిక పరికరాలు అధిక ధరలను కలిగి ఉండటం, ఆర్థిక వనరులు లభించకపోవడంతో వ్యక్తిగతంగా యంత్రాలను కొనుగోలు చేయడం వారికి సవాలుగా మారింది. పారిశుద్ధ్య రంగంలో మంచి అనుభవం ఉన్నప్పటికీ ఆర్థిక పరిమితులు వారి జీవనోపాధి అవకాశాలను విస్తరించుకోవడానికి, వారి కుటుంబాలకు మెరుగైన ఆర్థిక స్థిరత్వాన్ని అందించడానికి అడ్డంకిగా మారాయి.
నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఈ లబ్ధిదారులు పాల్గొనడంతో ఒక ముఖ్యమైన మార్పు ప్రారంభమైంది. అక్కడ వారు నమస్తే పథకం కింద అందుబాటులో ఉన్న 'స్వచ్ఛత ఉద్యమి యోజన' (ఎస్యూవై) గురించి తెలుసుకున్నారు. ఈ పథకం ద్వారా ఒక గ్రూప్ ప్రాజెక్ట్ చేపట్టి యంత్రాలతో కూడిన పారిశుద్ధ్య సేవలను ప్రారంభించాలనే వారి ఉమ్మడి లక్ష్యాన్ని సాధించడానికి అనుకూలమైన అవకాశం లభించింది. బ్యాంకు రుణం రూపంలో ఆర్థిక సాయం, మూలధన సబ్సిడీ ద్వారా వారు డ్రైనేజీ లేదా సీవర్, సెప్టిక్ ట్యాంకులను యంత్రాలతో శుభ్రపరిచే సేవల కోసం ఒక 'మిని జెట్టింగ్ మిషన్'ను కొనుగోలు చేశారు.
ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ. 35.85 లక్షలు కాగా అందులో రూ. 21.89 లక్షలు బ్యాంకు రుణం, రూ. 13.96 లక్షలు మూలధన రాయితీ రూపంలో సమకూరాయి. ఈ ఆర్థిక మద్దతు లబ్ధిదారులకు తమ ప్రాథమిక పెట్టుబడి అవరోధాలను అధిగమించి వ్యక్తిగతంగా కొనుగోలు చేయలేనటువంటి ఆధునిక పారిశుద్ధ్య యంత్రాలను పొందేందుకు సహాయపడింది.
ఆ యంత్రాన్ని కొనుగోలు చేసిన తర్వాత నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్.. ఆ గ్రూప్ పరికరాలను నెలకు సుమారు రూ. 78,500 అద్దెతో దీర్ఘకాలిక ప్రాతిపదికన ఒప్పందం చేసుకుంది. ఈ ఏర్పాటు ద్వారా క్రమబద్ధమైన ఆదాయం లభించడమే కాకుండా నలుగురు లబ్ధిదారులకు ఎంతో స్థిరమైన జీవనోపాధి అవకాశం ఏర్పడింది. నిర్వహణ ఖర్చులు మినహాయించిన తర్వాత గ్రూప్‌లోని ప్రతి సభ్యుడు ఇప్పుడు నెలకు సుమారు రూ. 37,000 సంపాదిస్తున్నారు. ఇది వారి ఆర్థిక స్థితిని, కుటుంబ అవసరాలను తీర్చుకునే సామర్థ్యాన్ని గణనీయంగా బలోపేతం చేసింది.
ఈ ప్రభుత్వ సహాయం.. లబ్ధిదారులు సంప్రదాయ పారిశుద్ధ్య పనుల పరిమితులను అధిగమించి యంత్రాలతో కూడిన పారిశుద్ధ్య పరికరాల యజమానులుగా-ఆపరేటర్లుగా ఎదిగేలా చేసింది. పెరిగిన సంపాదన వారి మెరుగైన ఆర్థిక స్థిరత్వానికి తోడ్పడగా.. యంత్రీకరణ సదుపాయం సురక్షితమైన, సమర్థవంతమైన పారిశుద్ధ్య నిర్వహణకు మద్దతునిస్తోంది. ఉమ్మడిగా పనిచేసే ఈ అవకాశం ఆర్థిక అడ్డంకులను అధిగమించడంలో, సుస్థిరమైన జీవనోపాధి అవకాశాలను సృష్టించడంలో గ్రూప్ వ్యవస్థాపకతకు ఉన్న ప్రాముఖ్యతను నిరూపించింది.
2021–22 కాలంలో సహాయం పొందిన ఈ గ్రూప్ ప్రయాణం... నమస్తే పథకం కింద అందుబాటులో ఉన్న స్వచ్ఛత ఉద్యమి యోజనకు ఉన్న మార్పు తెచ్చే సామర్థ్యాన్ని తెలియజేస్తోంది. మూలధనం, ఆధునిక పరికరాలు, భరోసాతో కూడిన పని అవకాశాలను అందించడం ద్వారా ఈ పథకం.. టీ. రవికుమార్, పీ. శేఖర్, టీ. నిఖిల్, ఈ. ఐలయ్యలు తమ జీవనోపాధిని బలోపేతం చేసుకోవడానికి, వృత్తిపరమైన ఆత్మగౌరవాన్ని పెంపొందించుకోవడానికి, తమ కుటుంబాల కోసం మరింత సురక్షితమైన భవిష్యత్తు వైపు సాగడానికి దోహదపడింది. వీరి విజయం... లక్ష్యిత ఆర్థిక సాయం, యంత్రీకరణ ద్వారా పారిశుద్ధ్య కార్మికులను వ్యవస్థాపకులుగా తీర్చిదిద్దుతూనే మెరుగైన పారిశుద్ధ్య సేవలకు ఎలా దోహదపడొచ్చో స్పష్టంగా తెలియజేస్తోంది.
***
(రిలీజ్ ఐడి: 2325300)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6