ఆర్థిక మంత్రిత్వ శాఖ
జీఎస్టీ ప్రక్రియ సంస్కరణలపై జరిగిన 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశ ఫలితాల గురించి హైదరాబాద్లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్డైరెక్ట్ టాక్సెస్ & కస్టమ్స్ (సీబీఐసీ) ఛైర్మన్ అవగాహన కార్యక్రమం
నాడు పోస్టు చేయడమైనది:
15 OCT 2026 7:34PM by PIB Hyderabad
కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (సీబీఐసీ) ఛైర్మన్ శ్రీ వివేక్ చతుర్వేది, సీబీఐసీ సభ్యుడు (జీఎస్టీ) శ్రీ సంజయ్ మంగళ్తో కలిసి 2026 అక్టోబర్ 15న హైదరాబాద్లో జీఎస్టీ పన్ను చెల్లింపుదారులు, వాణిజ్య, పారిశ్రామిక రంగాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. 57వ జీఎస్టీ మండలి సమావేశంలో సిఫార్సు చేసిన జీఎస్టీ ప్రక్రియల సంస్కరణలు, కీలక చర్యల గురించి ఈ సమావేశంలో వివరించారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు, భారీ ఉత్పత్తి సంస్థలు, సేవలందించే సంస్థలు, వ్యాపారులు, ఎగుమతిదారులు, స్టార్టప్లు, ఈ-కామర్స్ సంస్థల ప్రతినిధులతో పాటు వివిధ వాణిజ్య మండళ్లు, సంఘాలకు చెందిన సుమారు 250 మంది పన్ను చెల్లింపుదారులు, ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

హైదరాబాద్ సీజీఎస్టీ జోన్ చీఫ్ కమిషనర్ శ్రీ అరుణ్ కుమార్తో పాటు కేంద్ర, రాష్ట్ర జీఎస్టీ విభాగాలకు చెందిన సీనియర్ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో జీఎస్టీ కీలక సాధనంగా రూపుదిద్దుకుందని సీబీఐసీ ఛైర్మన్ శ్రీ వివేక్ చతుర్వేది తెలిపారు. 56వ జీఎస్టీ మండలి సమావేశంలో పన్ను రేట్ల హేతుబద్ధీకరణ, కీలక రంగాలపై పన్ను భారాన్ని తగ్గించడంపై దృష్టి సారించినట్లు వివరించారు. జీఎస్టీ సంస్కరణలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రక్రియాపరమైన మార్పులు అవసరమని భావించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో 57వ సమావేశంలో నిజాయితీగా పన్నులు చెల్లించే వారికి ఇబ్బందులు తగ్గించేలా తదుపరి తరం ప్రక్రియాపరమైన సంస్కరణల సమగ్ర కార్యాచరణకు జీఎస్టీ మండలి సిఫార్సులు చేసిందన్నారు. నిజాయితీగా పనిచేసే పరిశ్రమలను ప్రోత్సహించాలని, పన్నుల పరిపాలన వ్యవస్థను ఆర్థిక భాగస్వామిగా పనిచేసేలా మార్చాలని ఆయన పేర్కొన్నారు. జీఎస్టీ చట్టంలో అరెస్టుకు సంబంధించిన నిబంధనలను తొలగించడం, ప్రాసిక్యూషన్కు వర్తించే కనీస పరిమితిని పెంచడం, ఆటోమేటెడ్ వ్యవస్థ ద్వారా రిఫండ్లు అందించడం, మానవ ప్రమేయం ఉండే దశలను తగ్గించడం వంటి ప్రధాన సిఫార్సులను వివరించారు. అలాగే నిర్దిష్ట నిఘా సమాచార ఆధారంగా మాత్రమే వాహనాలను తనిఖీ చేయాలని, అది కూడా సరుకు బయలుదేరే రాష్ట్రం, చేరుకునే రాష్ట్రంలో మాత్రమే తనిఖీకి అనుమతించాలని సూచించినట్లు తెలిపారు. ఈ తనిఖీలకు జాయింట్ కమిషనర్ స్థాయి లేదా అంతకంటే పైస్థాయి అధికారి అనుమతి తప్పనిసరి అని వివరించారు.

కేంద్ర ప్రభుత్వ పరిపాలనా పరిధిలోకి వచ్చే పన్ను చెల్లింపుదారుల కోసం జీఎస్టీ పరిపాలనను కేంద్రీకృతం చేసే ప్రతిపాదిత కార్యక్రమం గురించి కూడా సీబీఐసీ ఛైర్మన్ వివరించారు. ఈ ప్రతిపాదనపై వాణిజ్య రంగ ప్రతినిధుల అభిప్రాయాలను కోరారు.
సమావేశంలో పాల్గొన్నవారు లేవనెత్తిన ప్రశ్నలకు, కోరిన వివరణలకు సీబీఐసీ ఛైర్మన్, సభ్యుడు (జీఎస్టీ) సమాధానాలు ఇచ్చారు. మరిన్ని పన్ను సంస్కరణలపై ప్రతినిధులు చేసిన సూచనలను స్వాగతిస్తూ, వాటిని తగిన విధంగా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.

57వ జీఎస్టీ మండలి సమావేశంలో ప్రకటించిన నిర్ణయాలను వాణిజ్య, పారిశ్రామిక రంగాల ప్రతినిధులు స్వాగతించారు. ఈ నిర్ణయాలు పరస్పర విశ్వాసంపై ఆధారపడిన పన్నుల పరిపాలన వ్యవస్థను నిర్మించేందుకు, వ్యాపార సంస్థలకు వర్కింగ్ క్యాపిటల్ అందుబాటును మెరుగుపరిచేందుకు, వ్యాపార నిర్వహణను మరింత సులభతరం చేసేందుకు గణనీయంగా దోహదపడతాయని వారు పేర్కొన్నారు.
మధ్యాహ్నం జరిగిన సమావేశంలో సీబీఐసీ ఛైర్మన్, సభ్యుడు (జీఎస్టీ) సీబీఐసీ అధికారులతో సమావేశమయ్యారు. పారదర్శకంగా, ఎలాంటి అనవసర ఇబ్బందులు లేని, ముందుగా అంచనా వేయగల పన్నుల పరిపాలన వ్యవస్థను అందించాల్సిన అవసరాన్ని వారు నొక్కిచెప్పారు.
***
(రిలీజ్ ఐడి: 2324088)
సందర్శకుల సూచీ సంఖ్య : : 15