బొగ్గు మంత్రిత్వ శాఖ
సుందర్‌గఢ్ జిల్లాలో ఐదు సీఎస్ఆర్ ప్రాజెక్టుల కోసం రూ.22.64 కోట్లను కేటాయించిన ఎంసీఎల్
నాడు పోస్టు చేయడమైనది:
14 OCT 2026 7:42PM by PIB Hyderabad
సీఎస్ఆర్ కార్యక్రమాల్లో భాగంగా రూ. 22.64 కోట్ల విలువైన ఐదు అభివృద్ధి ప్రాజెక్టుల కోసం మంగళవారం సుందర్‌గఢ్ జిల్లా పరిపాలన వ్యవస్థతో మహానది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎంసీఎల్) ఎంఓయూలు కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టుల్లో కాటా బంధ (రూ. 4.32 కోట్లు), బ్రాహ్మణి బంధ (రూ. 3.98 కోట్లు), అబ్దుల్ హుస్సేన్ బంధ (రూ. 2.69 కోట్లు) వంటి వాటి పునరుజ్జీవనం, సుందరీకరణ, హేమ్గిర్ బ్లాక్‌లోని మైనింగ్ ప్రభావిత ప్రాంతాల్లో మంచినీటి జలశయాల్లో ఆక్వాకల్చర్ (రూ.3.81 కోట్లు), సుందర్‌గఢ్ జిల్లాలోని తల్సారా అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో చెరువుల పునరుద్ధరణ, అభివృద్ధి, నిర్మాణం (రూ. 7.84 కోట్లు) ఉన్నాయి.
జిల్లా పాలనా వ్యవస్థ ద్వారా ప్రాజెక్టు అమలుకు ఎంసీఎల్ జనరల్ మేనేజర్ (సీఎస్ఆర్), సుందర్‌గఢ్ జిల్లా కలెక్టర్ ఎంఓయూపై సంతకాలు చేశారు.
"అమృత్ సరోవర్ మిషన్"కు అనుగుణంగా నీటి వనరుల పునరుద్ధరణ ద్వారా నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుద్ధరణ, పర్యావరణ పరిరక్షణతో పాటు ఆహ్లాదకరమైన పర్యాటక ప్రాంతాల అభివృద్ధి, చిన్నతరహా పర్యాటకానికి ప్రోత్సాహం, స్థానిక ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయి. ఈ పనుల్లో జలాశయ కట్టల పరిరక్షణ, పాదచారులకు మార్గాల నిర్మాణం, స్నానపు మెట్లు, రాతి కట్టడాలు, రెయిలింగ్‌లు, కూర్చునే స్థలాలు, విద్యుత్ పనులు, హార్టికల్చర్ వంటివి మిషన్ అమృత్ సరోవర్కు అనుగుణంగా చేపడతారు.
ప్రధానమంత్రి ధన-ధాన్య కృషి యోజనకు అనుగుణంగా అక్వాకల్చర్ ప్రాజెక్టును అమలు చేయనున్నారు. దీని ద్వారా 50 కొత్త చెరువుల నిర్మాణం, 20 పాత చెరువుల పునరుద్ధరణతో 700 మందికిపైగా సన్నకారు రైతులకు, ఎఫ్‌పీఓ సభ్యులకు లబ్ధి చేకూరుతుంది. ఇందులో భాగంగా మహిళల నేతృత్వంలో చేప విత్తనోత్పత్తి యూనిట్లు, అద్దె ప్రాతిపదికన యంత్రాలు అందించే కేంద్రాలు, ఒక ఆక్వా బిజినెస్ స్కూల్, మత్స్యకార రైతు ఉత్పత్తిదారుల సంఘం ఏర్పాటు చేస్తారు.
ఈ కార్యక్రమాల ద్వారా సుందర్‌గఢ్ జిల్లా వ్యాప్తంగా కమ్యూనిటీల సామాజిక-ఆర్థిక అభివృద్ధికి తోడ్పడటంతో పాటు నీటి వనరుల నిర్వహణను బలోపేతం చేయటం, స్థిరమైన ఉపాధి అవకాశాలను ప్రోత్సహించటం, మహిళల నేతృత్వంలోని వ్యాపారాలకు మద్దతివ్వటం ఎంసీఎల్ లక్ష్యంగా పెట్టుకుంది.
***
(రిలీజ్ ఐడి: 2323724)
సందర్శకుల సూచీ సంఖ్య : : 17