కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
తెలంగాణలో డిజిటల్ సేవలు, చివరి వ్యక్తి వరకు పంపిణీని బలోపేతం చేస్తున్న భారత తపాలా శాఖ.. ఆర్థిక సేవల విస్తరణ
• ‘‘ఒకే తపాలా వ్యవస్థ, అపరిమిత అవకాశాలు’’-ప్రజలకు అందుబాటులో ఉండే, సాంకేతికత ఆధారిత సేవలు అందించడమే లక్ష్యం: సీపీఎంజీ శ్రీ డీఎస్‌వీఆర్ మూర్తి
• ప్రతి నెలా 20 లక్షల మంది చేయూత పింఛన్ లబ్ధిదారులకు సేవలు.. 263 ఆధార్ కేంద్రాల ద్వారా పౌర సేవలు
• 17 విడతల రోజ్‌గార్ మేళాల ద్వారా 1,86,202 నియామక పత్రాల అందజేత.. తెలంగాణ ప్రాంతంలో 1,272 మంది అభ్యర్థుల ఎంపిక
నాడు పోస్టు చేయడమైనది:
09 OCT 2026 3:27PM by PIB Hyderabad
అక్టోబర్ 9 ప్రపంచ తపాలా దినోత్సవం సందర్భంగా నేటి నుంచి ఈ నెల 15 వరకు జాతీయ తపాలా వారోత్సవాలను తపాలాశాఖ నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని డాక్ సదన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ (సీపీఎంజీ) శ్రీ డీఎస్‌వీఆర్ మూర్తి మాట్లాడారు. భారత తపాలాశాఖ సాధించిన విజయాలు, సాంకేతిక పురోగతి, పౌరులకు మెరుగైన సేవలు అందించేందుకు చేపడుతున్న వివిధ కార్యక్రమాలను ఆయన వివరించారు.
ఈ సందర్భంగా శ్రీ మూర్తి మాట్లాడుతూ.. 1874లో యూనివర్సల్ పోస్టల్ యూనియన్ (యూపీయూ) ఏర్పాటైన సందర్భంగా ప్రపంచ తపాలా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది ‘‘ఒకే తపాలా వ్యవస్థ- అపరిమిత అవకాశాలు” అనే ఇతివృత్తాన్ని ఎంపిక చేసినట్లు చెప్పారు. తపాలా కార్యాలయాల ద్వారా విస్తృత సేవలను కొనసాగిస్తూనే, ఆధునిక సాంకేతికతతో ప్రజలకు మెరుగైన సేవలు అందించే సంస్థగా భారత తపాలాశాఖ అభివృద్ధి చెందుతున్న తీరును ఈ నినాదం ప్రతిబింబిస్తుందని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో 1,49,385 కార్యాలయాలతో సహా మొత్తం 1,64,999 తపాలా కార్యాలయాలతో ప్రపంచంలోనే అతిపెద్ద తపాలా వ్యవస్థను ఇండియా పోస్టు నిర్వహిస్తోందని చెప్పారు. తెలంగాణ సర్కిల్ పరిధిలో 36 ప్రధాన పోస్టాఫీసులు, 759 సబ్ పోస్టాఫీసులు, 5,424 బ్రాంచ్ పోస్టాఫీసులు పనిచేస్తున్నాయని.. ఈ వ్యవస్థలో 6,514 మంది శాఖా ఉద్యోగులు, 10,623 మంది గ్రామీణ డాక్ సేవకులు (జీడీఎస్) భాగస్వామ్యులుగా ఉంటూ.. గ్రామీణ, పట్టణ, మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు నిత్యావసర సేవలను అందిస్తున్నారని ఆయన వివరించారు. ఉపాధి కల్పన గురించి ప్రస్తావిస్తూ.. 17 విడతల రోజ్‌గార్ మేళా ద్వారా తపాలా శాఖ మొత్తం 1,86,202 నియామక ఉత్తర్వులను జారీ చేసిందని, ఇందులో 1,51,348 మంది గ్రామీణ డాక్ సేవకులు ఉన్నారని తెలిపారు. తెలంగాణ సర్కిల్‌లో 1,123 మంది గ్రామీణ డాక్ సేవకులతో సహా మొత్తం 1,272 మంది అభ్యర్థులు ఉద్యోగ నియామకాలను పొందారని ఆయన పేర్కొన్నారు.

జాతీయ తపాలా వారోత్సవాల్లో భాగంగా యూపీయూ అంతర్జాతీయ లేఖా రచన పోటీ 2026లో తెలంగాణ సర్కిల్ తరఫున విజేతలుగా నిలిచిన వారికి శ్రీ మూర్తి బహుమతులు అందజేశారు. తపాలా శాఖ అందిస్తున్న విభిన్న సేవలు, చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించేలా జాతీయ తపాలా వారోత్సవాల్లో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం సింధియా, కమ్యూనికేషన్లశాఖ సహాయ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని నాయకత్వంలో తపాలా శాఖ సేవల పంపిణీని మెరుగుపరచడం, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం, కార్యకలాపాల సామర్థ్యాన్ని పెంపొందించడం వంటి చర్యలు చేపడుతోందని శ్రీ మూర్తి వివరించారు. అదే సమయంలో ప్రజలకు సేవలందించాలనే కీలక బాధ్యతను కూడా కొనసాగిస్తోందని పేర్కొన్నారు. గతంలో ఉత్తరాలు, పోస్టుకార్డుల ద్వారా ద్వారా సమాచారాన్ని చేరవేసే రోజులు ఉండేవని, ప్రస్తుతం ఎస్‌ఎంఎస్, వాట్సాప్, ఈ-మెయిల్ వంటి ఆధునిక మార్గాలు అందుబాటులోకి వచ్చాయని శ్రీ మూర్తి గుర్తుచేశారు. సమాచార అనుసంధానంలో సాంకేతిక పరిజ్ఞానం ఎన్నో మార్పులు తీసుకొచ్చినప్పటికీ, వ్యక్తుల మధ్య వ్యక్తిగత అనుబంధాలకు ఉన్న విలువ మాత్రం అలాగే కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు. మారుతున్న సమాచార అవసరాలకు అనుగుణంగా భారత తపాలాశాఖ తన సేవలను నిరంతరం అభివృద్ధి చేసుకుంటూనే.. ప్రజలను అనుసంధానించడం, వారికి అవసరమైన సేవలను అందించడం అనే తన దీర్ఘకాలిక లక్ష్యానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

డిజిటల్ గా వచ్చిన మార్పుల గురించి చెబుతూ... స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన సాంకేతిక వేదిక అయిన ఏపీటీ 2.0 ప్రారంభం కావడం ఓ ముఖ్యమైన విజయమని అన్నారు. ఐఐటీ హైదరాబాద్, ఇస్రోకు చెందిన జాతీయ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్‌సీ) సహకారంతో అభివృద్ధి చేసిన డిజిపిన్ (డిజిటల్ పోస్టల్ ఇండెక్స్ నంబర్)... ప్రామాణికమైన 10 అక్షరాలతో కూడిన జియో–కోడెడ్ ఆధారిత డిజిటల్ చిరునామా నిర్దేశాన్ని అందిస్తుంది. బట్వాడా సేవల గురించి శ్రీ మూర్తి వివరిస్తూ... డోర్ స్టెప్ సర్వీస్ (డీఎస్ఎస్) అప్లికేషన్ ద్వారా డెలివరీలను ఎప్పటికప్పుడు ట్రాక్ చేయవచ్చని తెలిపారు. 2026 మార్చి 17న హైదరాబాద్‌లో 24 స్పీడ్ పోస్ట్, 48 స్పీడ్ పోస్ట్ సేవలు ప్రారంభమయ్యాయి. వీటి ద్వారా 1.33 లక్షలకు పైగా వస్తువులు నమోదయ్యాయని వెల్లడించారు. 94 పిన్ కోడ్ ప్రాంతాలకు నిర్దిష్ట సమయంలో డెలివరీ అందిస్తున్నామని పేర్కొన్నారు. పోస్టాఫీసు కౌంటర్లలో యూపీఐ, కార్డు చెల్లింపుల సౌకర్యం కూడా అందుబాటులో ఉందని, డీఎస్ఎస్ అప్లికేషన్ ద్వారా ‘క్యాష్ ఆన్ డెలివరీ (సీవోడీ)’ విధానంలో సేవల్ని అందిస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణలో 14 పోస్టాఫీసు పాస్‌పోర్టు సేవా కేంద్రాలు ఉన్నాయని తెలియజేశారు. ఇవి ఆర్థిక సంవత్సరం 2025–26లో 1,66,478 పాస్‌పోర్ట్ లావాదేవీలను, 2026 సెప్టెంబర్ వరకు మరో 87,100 లావాదేవీలను నిర్వహించాయని ఆయన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 263 ఆధార్ కేంద్రాలు 2025–26 ఆర్థిక సంవత్సరంలో 4,75,592 లావాదేవీలను, 2026 సెప్టెంబర్ వరకు మరో 3,17,146 లావాదేవీలను నమోదు చేశాయి. తపాలా వ్యవస్థ ద్వారా నెలకు సుమారు 20 లక్షల మంది లబ్ధిదారులు చేయూత పింఛన్లను పొందుతుండగా, నెలకు దాదాపు ₹500 కోట్ల పంపిణీ జరుగుతోంది. ఉప తపాలా కార్యాలయాల ద్వారా స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) రుణ చెల్లింపుల సేకరణలో స్త్రీనిధికి కూడా తపాలా శాఖ సహకరిస్తోంది. ‘హోలీ బ్లెస్సింగ్’ చొరవ ద్వారా వేలాది ప్రసాదం పార్శిళ్లను నేరుగా భక్తుల ఇళ్ల వద్దకే చేరవేసింది.
ఆర్థిక సమ్మిళిత్వం గురించి శ్రీ మూర్తి ప్రత్యేకంగా వివరించారు. 2026 మార్చి 31 నాటికి తెలంగాణ పోస్టల్ సర్కిల్ పరిధిలో 1.07 కోట్ల లైవ్ పోస్టాఫీస్ సేవింగ్స్ బ్యాంక్ (పీవోఎస్బీ) ఖాతాలు ఉన్నాయని తెలిపారు. తపాలా ఆర్థిక సేవల ద్వారా 2026–27 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి తెలంగాణ గ్రామీణ జనాభాలో 25 శాతం మందిని ఆర్థిక సమ్మిళిత్వం పరిధిలోకి తీసుకురావాలని ఈ సర్కిల్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇదే ఆర్థిక సంవత్సరంలో కనీసం 10 శాతం పీవోఎస్బీ ఖాతాలను డిజిటల్ లావాదేవీల దిశగా మళ్లించాలని యోచిస్తోంది. వినియోగదారుల సౌలభ్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ లాంటి డిజిటల్ సదుపాయాలను విస్తృతంగా ప్రోత్సహిస్తున్నారు.
పోస్టల్ లైఫ్ ఇన్స్యూరెన్స్ (పీఎల్ఐ), రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్స్యూరెన్స్ (ఆర్‌పీఎల్ఐ) పథకాలు పౌరులకు బీమా రక్షణను అందిస్తున్నాయని ఆయన తెలియజేశారు. పీఎల్ఐ పరిధిని ప్రభుత్వ ఉద్యోగులకే కాకుండా నిపుణులు, పట్టభద్రులకు కూడా విస్తరించగా, ఆర్పీఎల్ఐని పట్టణ ప్రాంత ప్రజలకు సైతం అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ సర్కిల్ 71,233 కొత్త పీఎల్ఐ, ఆర్పీఎల్ఐ పాలసీలను విక్రయించింది. వాటి ద్వారా రూ. 590.13 కోట్ల ప్రీమియం వసూలు చేసిందని వివరించారు. సర్కిల్ ఆర్థిక పనితీరును వెల్లడిస్తూ... 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ.661.88 కోట్ల లక్ష్యానికి గాను తెలంగాణ సర్కిల్ రూ.596.71 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2026 సెప్టెంబర్ నాటికి రూ.322.28 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసిందని శ్రీ మూర్తి తెలిపారు.

***
(రిలీజ్ ఐడి: 2321459)
సందర్శకుల సూచీ సంఖ్య : : 9