ఉక్కు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

'పని ప్రదేశంలో మానసిక ప్రశాంతత' అంశంపై 'మినీ చింతన్ శిబిరం' నిర్వహించిన ఉక్కు మంత్రిత్వశాఖ

నాడు పోస్టు చేయడమైనది: 07 OCT 2026 6:26PM by PIB Hyderabad

న్యూఢిల్లీలోని చాణక్యపురిలో గల సివిల్ సర్వీసెస్ ఆఫీసర్స్ ఇనిస్టిట్యూట్ (సీఎస్‌వోఐ) వేదికగా ఉక్కు మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఈ రోజు ‘పని ప్రదేశంలో మానసిక ప్రశాంతత’ అంశంపై మినీ చింతన్ శిబిరం నిర్వహించారు. అధికారులు, ఉద్యోగులు ఒత్తిడి లేని పని వాతావరణాన్ని సృష్టించుకుని... భావోద్వేగపరమైన బలాన్ని పెంపొందించుకునేలా ప్రోత్సహించడమే ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశం. ప్రముఖ ఆధ్యాత్మిక వక్త బ్రహ్మ కుమారి సిస్టర్ శివాని ముఖ్య అతిథిగా, ప్రధాన వక్తగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

 

కార్యక్రమ ప్రారంభంలో ఉక్కు మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ సందీప్ పౌండ్రిక్ సభనుద్దేశించి మాట్లాడుతూ... పని ప్రదేశంలో మానసిక ప్రశాంతతను కాపాడుకోవడం చాలా ముఖ్యమన్నారు. అది ఉత్పాదకతను, సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుందని ఆయన స్పష్టం చేశారు.

 

ఈ అంశంపై సిస్టర్ శివాని మాట్లాడుతూ... ఒత్తిడిని తగ్గించుకోవడం, సానుకూల దృక్పథాన్ని పెంపొందించుకోవడంపై దృష్టి సారించాలని అధికారులు, ఉద్యోగులకు సూచించారు. ఏదైనా సాధించాలని మనం దృఢ నిశ్చయం చేసుకున్నప్పుడే దానిని పూర్తి చేసే దిశగా అడుగులు వేయగలమన్నారు. ఒత్తిడిని నిర్వహించే విషయంలోనూ ఇదే విధానాన్ని అనుసరించవచ్చని ఆమె పేర్కొన్నారు. ప్రతి పరిస్థితిలోనూ సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండాల్సిన ప్రాముఖ్యతను సిస్టర్ శివాని ప్రముఖంగా ప్రస్తావించారు.

సంకల్ప శక్తిని వివరిస్తూ... ఒక సంకల్పాన్ని పదే పదే తలచుకోవడం వల్ల అది మన జీవితాలపై ప్రభావం చూపడం ప్రారంభిస్తుందని సిస్టర్ శివాని పేర్కొన్నారు. మనం ఏదైనా విషయాన్ని ఎంత ఎక్కువగా ఆలోచిస్తూ, పునరావృతం చేస్తామో... అది మన ఆలోచనలను, ప్రవర్తనను అంతగా తీర్చిదిద్దుతుందన్నారు. మన ఆలోచనలు, సంకల్పాలు సానుకూలంగా ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యమని సిస్టర్ శివాని తెలిపారు. ఇదే 'సంకల్పం ద్వారా సిద్ధి' సూత్రమని, ఇది మన సమాజాన్ని, దేశాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపించగలదని ఆమె వ్యాఖ్యానించారు.

***


(రిలీజ్ ఐడి: 2320401) సందర్శకుల సూచీ సంఖ్య : : 4
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी