ఆర్థిక మంత్రిత్వ శాఖ
‘ఆర్ఐఎన్ఎల్’ భూమి ఇ-వేలం ప్రక్రియకు ముందు నమూనా ఇ-వేలం ద్వారా ‘ఎన్ఎల్ఎంసీ’ అవగాహన
• మొత్తం 93,572.21 చదరపు గజాల విస్తీర్ణంగల 459 ‘ఆర్ఐఎన్ఎల్’ ప్లాట్లకు అక్టోబరు 12… 16 తేదీలలో వేలం
• తొలి వేలంలో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ సహా ‘ఈఎండీ’ చెల్లింపు గడువు 2026 అక్టోబరు 8వ తేదీ.. సాయంత్రం 5:00 గంటలు
నాడు పోస్టు చేయడమైనది:
07 OCT 2026 7:25PM by PIB Hyderabad
విశాఖపట్నం ఉక్కు కర్మాగారం కార్పొరేట్ సంస్థ ‘రాష్ట్రీయ ఇస్పత్ నిగమ్ లిమిటెడ్’ (ఆర్‌ఐఎన్‌ఎల్) పరిధిలోని భూమిలో 93,572.21 చదరపు గజాల విస్తీర్ణం గల 459 ప్లాట్లను ఆన్‌లైన్ ద్వారా (ఇ-వేలం) విక్రయించనున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా ఆన్‌లైన్ బిడ్డింగ్‌పై అవగాహన కల్పించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖలోని ప్రభుత్వరంగ సంస్థల విభాగం (డీపీఈ) ఆధ్వర్యంగల జాతీయ భూ ద్రవ్యీకరణ సంస్థ (ఎన్‌ఎల్‌ఎంసీ) 2026 అక్టోబరు 6న విశాఖపట్నంలో ఒక నమూనా ఇ-వేలం వేదిక ద్వారా శిక్షణ కార్యక్రమం నిర్వహించింది.
అక్టోబరు 12, 16 తేదీలలో నిర్వహించే ఇ-వేలంలో పాల్గొనబోయే వారు (బిడ్డర్లు) సహా ఆసక్తిగల భాగస్వామ్య సంస్థలకు దీనిపై అనుభవపూర్వక అవగాహన దిశగా విశాఖపట్నంలోని ఫెయిర్‌ఫీల్డ్‌లో మారియట్ సంస్థ అక్టోబరు 6న ఈ ప్రత్యక్ష శిక్షణ కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా “బిడ్డింగ్ స్వరూపం, పాల్గొనే విధానం, ఆన్‌లైన్ వేలం ప్రక్రియలోని ఇతర కీలకాంశాలను నిపుణులు వివరించారు. తద్వారా ప్రత్యక్ష వేలానికి ముందు బిడ్డర్లకు దీనిపై ఆచరణాత్మక అవగాహన కలిగింది.
ఈ శిక్షణకు హాజరు కాలేకపోయిన వారి సౌలభ్యం కోసం అక్టోబరు 7న ‘ఎన్‌ఎల్‌ఎంసీ’ ఆన్‌లైన్ నమూనా ఇ-వేలం కార్యక్రమం కూడా నిర్వహించింది. రెండు దశలలో (12, 16) ప్రత్యక్ష వేలం నిర్వహించడానికి ముందు ఏర్పాటు చేసిన ఈ నమూనా వేలం డిజిటల్ బిడ్డింగ్ ప్రక్రియ గురించి తెలుసుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ నేపథ్యంలో తొలి దశ ఇ-వేలం ప్రక్రియను అక్టోబరు 12న ఉదయం 11:00 నుంచి రాత్రి 7:00 గంటల దాకా నిర్వహిస్తుంది. అటుపైన రెండో దశలో అక్టోబరు 16న కూడా ఉదయం 11:00 నుంచి రాత్రి 7:00 గంటల వరకూ ఈ ప్రక్రియ కొనసాగుతుంది.
ఈ సందర్భంగా ‘ఎన్ఎల్ఎంసీ’ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) శ్రీ రోహన్ చంద్ ఠాకూర్ మాట్లాడుతూ- “ప్రత్యక్ష వేలంపాటకు ముందు బిడ్డర్లకు డిజిటల్ బిడ్డింగ్ ప్రక్రియను పరిచయం చేయడం ఈ నమూనా వేలం ఉద్దేశం. తదనుగుణంగా వారు ఈ వేదిక గురించి అవగాహన పొంది, నిబంధనల మేరకు నిర్దేశిత గడువులోగా లాంఛనాలను పూర్తి చేసేందుకు ఈ కార్యక్రమం వీలు కల్పిస్తుంది. వేలం ప్రక్రియను పారదర్శకంగా, సౌలభ్యంతో, బిడ్డర్లకు సానుకూలమైన రీతిలో నిర్వహించడమే దీని ధ్యేయం. ‘ఆర్‌ఎన్‌ఐఎల్’ ఆస్తుల ద్రవ్యీకరణ దిశగా ఈ భూమి వేలం ఓ కీలక అవకాశం కల్పిస్తుంది. ఈ ప్రక్రియను వృత్తిగత నిపుణతతో, పారదర్శకంగా, క్రమబద్ధంగా నిర్వహించేందుకు ‘ఎన్ఎల్ఎంసీ’ కట్టుబడి ఉంది” అని తెలిపారు.
మొత్తం 93,572.21 చదరపు గజాల విస్తీర్ణంలో 459 ప్లాట్లు
‘ఆర్ఐఎన్ఎల్’ భూ ఆస్తులలో విశాఖపట్నంలోని హెచ్‌బి కాలనీ, మద్దిలపాలెం, ఆటో నగర్, గాజువాక వంటి ప్రాంతాలలో 93,572.21 చదరపు గజాల విస్తీర్ణంలో 459 విలువైన, ఎలాంటి అడ్డంకులకూ తావులని ప్లాట్లు ఉన్నాయి. గుర్తించిన ప్రదేశాలలో సుమారు 128.94 చదరపు గజాల నుంచి 2,728 చదరపు గజాల వరకూ వివిధ పరిమాణాల్లో ఈ ప్లాట్లను వేలం వేస్తారు. తద్వారా కొనుగోలుదారులు తమకు అనువైన ప్లాటును ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. ఈ మేరకు “రైల్‌టెల్ పరిధిలోని ఇ-నివిడా ఇ-ప్రొక్యూర్‌మెంట్ వేదిక ద్వారా పారదర్శక, పోటీతత్వ ఇ-టెండర్-కమ్-ఇ-వేలం ప్రక్రియ ద్వారా ఈ ఆస్తుల విక్రయం సాగుతుంది. దీనికి క్వికర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (క్యూఐపీఎల్) లావాదేవీల సంప్రదింపుల సంస్థగా వ్యవహరిస్తోంది.
ముఖ్యమైన వేలం తేదీలు
వివరాలు మొదటి రోజు రెండో రోజు
ప్లాట్ల సంఖ్య 243 216
వేలం తేదీ అక్టోబరు 12, 2026 అక్టోబరు 16, 2026
వేలం సమయం ఉదయం 11:00 నుంచి రాత్రి 7:00 గంటల వరకు ఉదయం 11:00 నుంచి రాత్రి 7:00 గంటల వరకు
రిజిస్ట్రేషన్ - ఈఎండీ గడువు అక్టోబరు 8, సా॥ 5:00 గం. అక్టోబరు 14, సా॥ 5:00 గం.
ఈఎండీ ఒక్కో ప్లాట్‌కు ₹2 లక్షలు ఒక్కో ప్లాట్‌కు ₹2 లక్షలు
అక్టోబరు 12నాటి వేలం తొలిదశలో పాల్గొనేందుకు ఆసక్తిగల బిడ్డర్లు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిచేసి, నిర్దేశిత నిబంధనల మేరకు అక్టోబరు 8న సాయంత్రం 5:00 గంటల్లోగా ఈఎండీ జమ చేయాల్సి ఉంటుంది.
అలాగే, అక్టోబరు 16నాటి రెండో దశ వేలం కోసం రిజిస్ట్రేషన్, ఈఎండీ చెల్లింపు గడువు అక్టోబరు 14, సాయంత్రం 5:00 గంటల వరకు ఉంటుంది.
పెట్టుబడిదారుల కోసం మూడు నగరాల్లో అవగాహన సదస్సులు
ఈ వేలం ప్రక్రియకు ముందు ఆసక్తిగల బిడ్డర్లకు అవగాహన కల్పించే దిశగా విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్ నగరాల్లో పెట్టుబడిదారుల సదస్సును కూడా ఎన్ఎల్ఎంసీ నిర్వహించింది. విక్రయించబోయే ప్లాట్లు, వేలం ప్రక్రియ, అర్హత ప్రమాణాలు, ఇతర విధానాలపై ఈ సందర్భంగా బిడ్డర్లు, ఇతర భాగస్వామ్య సంస్థలకు సమగ్ర సమాచారమిచ్చింది.
సంబంధిత భూ విక్రయ ప్రాంతం సహా విదేశాల్లోని పెట్టుబడిదారులు (బిడ్డర్లు) కూడా ఈ సదస్సులలో పత్ర్యక్షంగానే కాకుండా ఆన్‌లైన్ ద్వారా కూడా పాల్గొన్నారు. వారందరికీ అవగాహన కల్పించడం కోసం ఆన్‌లైన్, ప్రత్యక్ష మార్గాల్లో నమూనా ఇ-వేలం నిర్వహించారు. ఈ ఆచరణాత్మక అనుభవ కల్పన నేపథ్యంలో ఈ కార్యక్రమం మరింత సజావుగా సాగనుంది.
ప్రత్యక్ష వేలానికి ముందు విస్తృత సౌలభ్యం కల్పించడంతోపాటు బిడ్డర్లను సన్నద్ధం చేయడం లక్ష్యంగా అక్టోబరు 6న విశాఖపట్నంలో ప్రత్యక్ష శిక్షణ, 7న ఆన్‌లైన్ శిక్షణ కింద ఈ రెండు దశల నమూనా కార్యక్రమం నిర్వహించారు.
పారదర్శక, వ్యవస్థీకృత ప్రక్రియల ద్వారా స్వల్ప వినియోగం గల ఆస్తుల విలువను గరిష్ఠంగా రాబట్టే ప్రభుత్వ విస్తృత లక్ష్యం మేరకు ఈ ప్రక్రియను చేపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు, ఇతర ప్రభుత్వ సంస్థల పరిధిలోని అదనపు, అప్రధాన, అనుబంధేతర ఆస్తుల ద్రవ్యీకరణకు ఈ విధంగా ఎన్‌ఎల్‌ఎంసీ కృషి చేస్తోంది.
ఆసక్తిగల బిడ్డర్లు భూమి ఇ-వేలం సంబంధిత ప్లాట్ల వివరాలు, వేలం షెడ్యూల్, అర్హత ప్రమాణాలు, నిబంధనలు-షరతులు, రిజిస్ట్రేషన్ నియమాలు, బిడ్డింగ్ ప్రక్రియ సహా సమగ్ర సమాచారాన్ని అధికారిక ఇ-వేలం పోర్టల్ https://eauction.enivida.com/ లో పొందవచ్చు:
ఎన్‌ఎల్‌ఎంసీ నేపథ్యం
నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ (ఎన్‌ఎల్‌ఎంసీ) కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థ. ఆర్థిక మంత్రిత్వశాఖలోని ప్రభుత్వరంగ సంస్థల విభాగం పాలన నియంత్రణలో ఇది పనిచేస్తుంది. ఈ మేరకు వ్యవస్థీకృత, వృత్తిగత విధానంలో కేంద్ర ప్రభుత్వరంగ, ఇతర ప్రభుత్వ సంస్థల పరిధిలోని మిగులు భూమి సహా అప్రధాన ఆస్తుల ద్రవ్యీకరణ సౌలభ్యం కల్పిస్తుంది.
ఆర్‌ఐఎన్‌ఎల్ నేపథ్యం
రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌ఐఎన్‌ఎల్) విశాఖపట్నం ఉక్కు కర్మాగారం కార్పొరేట్ సంస్థ కాగా, ఇది కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ పరిధిలోగల ఒక ‘నవరత్న కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ.
******
(రిలీజ్ ఐడి: 2320346)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10