జౌళి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

హైదరాబాద్‌లో జరిగిన 'సంస్కరణ ఉత్సవం-2026'లో... పత్తి రైతులు, జౌళి పరిశ్రమ కోసం చేపట్టిన కీలక సంస్కరణలను ప్రదర్శించిన జౌళి మంత్రిత్వశాఖ

పత్తి రైతుల సాధికారత, డిజిటల్ పరివర్తన, ఉత్పాదకత, నాణ్యత మెరుగుదల, పత్తి వాల్యూ చెయిన్ వ్యాప్తంగా వ్యాపార నిర్వహణ సౌలభ్యం పెంపొందించడంపై దృష్టి సారించిన ఈ సంస్కరణలు

· పత్తి ఉత్పాదకత, నాణ్యత మెరుగుదల, కనీస మద్దతు ధరకు కొనుగోలు కార్యకలాపాలపై తమ అనుభవాలను పంచుకున్న రైతులు, పరిశ్రమ భాగస్వాములు

· పట్టు పరిశ్రమ అభివృద్ధి లక్ష్యంగా చేపట్టిన సిల్క్‌మార్క్ డిజిటలైజేషన్, సెరీ-టూరిజం, ‘మేరా రేషమ్ మేరా అభిమాన్’ కార్యక్రమాలను ప్రదర్శించిన సెంట్రల్ సిల్క్ బోర్డు

నాడు పోస్టు చేయడమైనది: 06 OCT 2026 5:25PM by PIB Hyderabad

కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ, తన ప్రభుత్వ రంగ సంస్థ అయిన కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సీసీఐ) ద్వారా తెలంగాణలోని హైదరాబాద్‌లో 'సంస్కరణల ఉత్సవం-2026' కింద ఒక ప్రత్యేక ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించింది. పత్తి రైతుల సాధికారత, జౌళి పరిశ్రమ బలోపేతం, పత్తి వాల్యూ చెయిన్ అంతటా సామర్థ్యం, పారదర్శకత, వ్యాపార నిర్వహణ సౌలభ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో చేపట్టిన కీలక సంస్కరణలను ఈ కార్యక్రమంలో ప్రముఖంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ ఉత్పత్తి విభాగం కమిషనర్ (ఏపీసీ), వ్యవసాయ, సహకార శాఖ కార్యదర్శి శ్రీ కె. సురేంద్ర మోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.సీసీఐ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ లలిత్ కుమార్ గుప్తా... తెలంగాణ ప్రభుత్వ సహకార శాఖ ప్రత్యేక కమిషనర్, సహకార సంఘాల రిజిస్ట్రార్, మార్కెటింగ్ డైరెక్టర్ (ఎఫ్ఏసీ) శ్రీ రాహుల్ రాజ్ పి.ఎస్... సిల్క్‌మార్క్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా సీఈవో, సంయుక్త కార్యదర్శి (టెక్నికల్) డాక్టర్ నరేష్ బాబు ఎన్... ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధన విభాగం సంచాలకులు డాక్టర్ ఎం. బలరాం తదితర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ, సీసీఐ, తెలంగాణ ప్రభుత్వ ఉన్నతాధికారులతో పాటు పత్తి రైతులు, పరిశ్రమ ప్రతినిధులు, ఇతర లబ్ధిదారులూ ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఉత్పాదకత పెంపు, కనీస మద్దతు ధరకు కొనుగోళ్లు, నాణ్యత మెరుగుదల, వ్యాపార నిర్వహణ సౌలభ్యాన్ని మరింత పెంచడం వంటి కీలక అంశాలపై అనుభవాలను పంచుకోవడానికి ఈ ఉమ్మడి వేదిక ఎంతగానో ఉపయోగపడుతుందని శ్రీ సురేంద్ర మోహన్ కొనియాడారు.

సీసీఐ సంస్థ సీఎండీ శ్రీ లలిత్ కుమార్ గుప్తా మాట్లాడుతూ... పత్తి రైతుల ప్రయోజనాలను కాపాడటంలో సంస్థ సాగించిన ప్రయాణాన్ని... పారదర్శకత, సాంకేతికత, రైతు సంక్షేమమే ధ్యేయంగా మారుతున్న సంస్థ విధానాన్ని ప్రముఖంగా వివరించారు. రైతులతో అనుసంధానాన్ని పెంచడం, పారదర్శకతను తీసుకురావడం, పనితీరును మెరుగుపరచడం, వ్యాపార నిర్వహణ సౌలభ్యాన్ని, పత్తి వాల్యూ చెయిన్ అంతటా పోటీతత్వాన్నీ పెంపొందించడం కోసం సీసీఐ చేపట్టిన కీలక సంస్కరణలను శ్రీ లలిత్ కుమార్ వివరించారు.

 

ప్రభుత్వ ప్రధాన సంస్కరణలను వివరించే కొన్ని లఘు చిత్రాలను ఈ కార్యక్రమంలో ప్రదర్శించారు. వీటిలో పత్తి రైతులతో డిజిటల్ అనుసంధానాన్ని సులభతరం చేస్తూ పత్తి కొనుగోళ్లకు సంబంధించిన సమాచారాన్ని అందించే 'కపాస్ కిసాన్ యాప్'... దేశంలో పత్తి దిగుబడిని, నాణ్యతను పెంచడమే లక్ష్యంగా పనిచేస్తున్న 'పత్తి ఉత్పాదకత మిషన్ – కపాస్ క్రాంతి'... జౌళి పరిశ్రమకు ముడిసరుకు సులభంగా లభించేలా పత్తిపై ఉన్న నాణ్యత నియంత్రణ ఉత్తర్వులను (క్యూసీవోలను) తొలగించడం... పత్తి బేళ్లు-గింజల బిల్లింగ్ ప్రక్రియను పూర్తిగా డిజిటలైజ్ చేసి పనితీరును వేగవంతం చేసే 'కాట్‌బిజ్' వంటి వినూత్న డిజిటల్ వ్యవస్థల ప్రదర్శనలు వీటిలో భాగంగా ఉన్నాయి.

 

పత్తి రైతులు తమ అనుభవాలను పంచుకునే ప్రత్యేక సమావేశం ద్వారా... క్షేత్రస్థాయిలో పత్తి సాగు, దిగుబడి, పత్తి రంగానికి సంబంధించి ప్రభుత్వం తీసుకున్న రైతు అనుకూల నిర్ణయాల వల్ల చేకూరిన ప్రయోజనాలను గురించి ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం రైతులకు లభించింది.

 

అకోలాకు చెందిన ఒక ప్రగతిశీల రైతు హై-డెన్సిటీ ప్లాంటింగ్ సిస్టమ్ (హెచ్‌డీపీఎస్)తో తన అనుభవాన్ని పంచుకున్నారు. ఆ జిల్లాలో మొదట్లో కేవలం 5,000 హెక్టార్లలో మాత్రమే ఈ సాగు విధానాన్ని అనుసరించగా... ఇప్పుడు అది సుమారు 30,000 హెక్టార్లకు విస్తరించింది. దీనివల్ల ఎకరాకు పత్తి దిగుబడి 12 క్వింటాళ్ల నుంచి ఏకంగా 18 క్వింటాళ్లకు పెరిగే అవకాశం ఉంది అని ఆ రైతు తెలిపారు. సాంప్రదాయిక పద్ధతులతో పోలిస్తే ఈ హెచ్‌డీపీఎస్ విధానం వల్ల కూలీల కొరత సమస్య తీరుతుందని, యంత్రాల వాడకం సులభమవుతుందని, కలుపు నివారణ మెరుగ్గా సాగుతుందని, పెట్టుబడి ఖర్చులూ చాలా వరకు తగ్గుతాయని ఆయన వివరించారు.

 

తెలంగాణ ప్రభుత్వ సహకార శాఖ ప్రత్యేక కమిషనర్, సహకార సంఘాల రిజిస్ట్రార్, మార్కెటింగ్ డైరెక్టర్ (ఎఫ్ఏసీ) శ్రీ రాహుల్ రాజ్ పి.ఎస్ మాట్లాడుతూ... కనీస మద్దతు ధర విధానం కింద జరుగుతున్న పత్తి కొనుగోలు ప్రక్రియలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. పత్తి రైతులకు అండగా నిలవడంలో సమర్థమైన కొనుగోలు ఏర్పాట్లు, ప్రభుత్వ సంస్థల మధ్య సమన్వయం, ఎలాంటి అడ్డంకులు లేని పారదర్శక విధానం ఎంతో కీలకమని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధన విభాగం సంచాలకులు డాక్టర్ ఎం. బలరాం మాట్లాడుతూ... పత్తి ఉత్పాదకత, సంస్కరణల ఆధారిత చర్యలను ప్రస్తావించారు. భారతీయ పత్తి దిగుబడిని, నాణ్యతను పెంచడం కోసం శాస్త్రీయ సాగు పద్ధతులు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ సంస్థలు, రైతులు, పరిశ్రమల మధ్య ఉమ్మడి సహకారం చాలా అవసరమని ఆయన స్పష్టం చేశారు.

 

సెంట్రల్ సిల్క్ బోర్డ్ (సీఎస్‌బీ) చేపట్టిన కీలకమైన పలు నూతన విధానాలనూ ఈ కార్యక్రమంలో ప్రదర్శించారు. బెంగళూరుకు చెందిన సిల్క్‌మార్క్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా సీఈవో, సంయుక్త కార్యదర్శి (టెక్నికల్) డాక్టర్ నరేష్ బాబు మాట్లాడుతూ... సిల్క్‌మార్క్ డిజిటలైజేషన్, సెరీ-టూరిజం సంబంధిత ప్రణాళికలను వివరించారు. బెంగళూరు సీఎస్‌బీ సైంటిస్ట్-సి డాక్టర్ విశాఖ 'మేరా రేషమ్ మేరా అభిమాన్' (ఎంఆర్ఎంఏ) కార్యక్రమం గురించి సభకు వివరించారు.

 

తెలంగాణ కాటన్ మిల్లర్స్, ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ బొమ్మినేని రవీందర్ రెడ్డి మాట్లాడుతూ... కస్తూరి కాటన్ నాణ్యత, కొనుగోలు, ప్రాసెసింగ్ విధానాలపై జిన్నింగ్, ప్రెస్సింగ్ పరిశ్రమ దృక్పథాన్ని పంచుకున్నారు. పత్తి నాణ్యతను పెంచడంలో, రైతులకు-జౌళి పరిశ్రమకు మధ్య బంధాన్ని బలోపేతం చేయడంలో వ్యాపార భాగస్వాముల పాత్రనూ ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. టెక్స్‌ప్రోసిల్ జాయింట్ డైరెక్టర్ శ్రీ ఉదయ్ కారత్... భారతీయ పత్తి నాణ్యత పెంపు, సర్టిఫికేషన్, బ్రాండింగ్, మూలాలను గుర్తించే విధానం కోసం 'కస్తూరి కాటన్ భారత్' కింద చేపట్టిన నిర్మాణాత్మక పద్ధతులపై వీడియోలను ప్రదర్శించారు. శ్రీ సాలసార్ బాలాజీ టెక్స్‌టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ధీరజ్ ఖేతాన్... స్పిన్నింగ్ పరిశ్రమ దృక్కోణంలో కస్తూరి కాటన్ నాణ్యతతో తన అనుభవాన్ని పంచుకున్నారు. అంతర్జాతీయ వస్త్ర మార్కెట్‌లో భారతీయ పత్తి పోటీతత్వాన్ని, స్థానాన్ని బలోపేతం చేయడానికి నాణ్యత, స్థిరత్వం, విలువ జోడింపు ఎంత కీలకమో ఆయన వివరించారు.

 

పత్తి, పట్టు రంగంలోని రైతులు, భాగస్వాములు, పారిశ్రామికవేత్తలూ సీసీఐ, సీఎస్‌బీ కార్యక్రమాలతో తమ అనుభవాలను పంచుకున్నారు. పత్తి, పట్టు వాల్యూ చెయిన్ బలోపేతంలో డిజిటల్ పద్ధతులను అవలంబించడం, ఆధునిక సాంకేతికతను ఉపయోగించడం, లబ్ధిదారుల మధ్య మెరుగైన అనుసంధానం ఎంతటి గొప్ప మార్పులను తీసుకురాగలవో వారు వివరించారు.

 

సీసీఐ, సీఎస్‌బీ చేపట్టిన సంస్కరణలను ప్రముఖంగా ప్రదర్శించేందుకు ఈ ప్రదర్శన కార్యక్రమం ఒక చక్కని వేదికను అందించింది. విధాన నిర్ణేతలు, రైతులు, పరిశ్రమ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, సాంకేతిక సంస్థల మధ్య ఒక అర్థవంతమైన పరస్పర చర్చకు ఇది ఎంతగానో దోహదపడింది. ఈ సదస్సులో నిర్వహించిన ప్రదర్శనలు, అనుభవాలను పంచుకునే సెషన్లు... పత్తి, పట్టు వాల్యూ చెయిన్ అంతటా పనితీరు సామర్థ్యం, పారదర్శకత, ఉత్పాదకత, పోటీతత్వాన్ని పెంపొందించడంలో ఆధునిక సాంకేతికతను అవలంబించడం, విజ్ఞానాన్ని పంచుకోవడం, భాగస్వాముల ఉమ్మడి సహకారం ఎంత ముఖ్యమో స్పష్టం చేశాయి. రైతు సంక్షేమ సంస్కరణలు, ఉత్పాదకత-నాణ్యత పెంపు, డిజిటల్ విప్లవం, వ్యాపార అనుకూల వస్త్ర రంగాన్ని అందించడంలో ప్రభుత్వ నిబద్ధతను ఈ కార్యక్రమం మరోసారి స్పష్టం చేసింది. భారత జౌళి రంగ వాల్యూ చెయిన్‌ను - ఫార్మ్ టు ఫైబర్, ఫైబర్ టు ఫ్యాక్టరీ, ఫ్యాక్టరీ టు ఫ్యాషన్, ఫ్యాషన్ టు ఫారిన్ వరకు - మరింత ఉత్పాదకతతో, పటిష్ఠంగా, ప్రపంచంతో పోటీ పడేలా మార్చాలనే విస్తృత దార్శనికత సాకారంలో ఈ వినూత్న కార్యక్రమాలు బలమైన మద్దతును అందిస్తాయి.

*"*


(రిలీజ్ ఐడి: 2319891) సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English