సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
ప్రధానమంత్రి కానుకగా పొందిన జ్ఞాపికల 8వ విడత వేలంలో కర్ణాటక కళారూపాలు
జ్ఞాపికల ఇ-వేలంలో కర్ణాటకకు చెందిన 30 కళారూపాలు
ఆ రాష్ట్రపు విభిన్న సంప్రదాయాలు, హస్తకళలు, సాంస్కృతిక వారసత్వం, సమకాలీన విజయాలను ప్రతిబింబిస్తున్న జ్ఞాపికలు
నాడు పోస్టు చేయడమైనది:
06 OCT 2026 7:35PM by PIB Hyderabad
పీఎం కానుకగా పొందిన జ్ఞాపికల 8వ విడత వేలంలో వేలానికి ఉంచిన కర్ణాటక కళారూపాలు... భారత వ్యాప్తంగానే కాకుండా రాష్ట్రంలోనూ భారత కళాత్మక, సాంస్కృతిక వారసత్వ వైవిధ్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.
ఈ సేకరణ కర్ణాటక సాంస్కృతిక ముఖచిత్రంలోని విభిన్న వ్యక్తీకరణలను ఒకచోట చేర్చుతుంది.
సరస్వతీ దేవి స్వరూపంగా భావించే శారదాంబకు సంబంధించిన జ్ఞాపిక... జ్ఞానం, భక్తిలతో శృంగేరికి ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని సూచిస్తోంది. సంత్ సేవలాల్‌కు సంబంధించిన కళాఖండాలు బంజారాల ఆధ్యాత్మిక, సాంస్కృతిక అస్తిత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయి.
కిన్నల్ కళ, బిద్రీవేర్ వస్తువులు కర్ణాటక హస్తకళా సంప్రదాయాన్ని చాటిచెబుతుండగా... కంబళ ఉత్సవ ఛాయాచిత్రం సజీవ గ్రామీణ సంప్రదాయాన్ని కళ్ళకు కడుతుంది. మైసూరు పేట, ఇతర ఉత్సవ తలపాగాలు గుర్తింపు, గౌరవం, వేడుకల సంప్రదాయాలను ప్రతిబింబిస్తున్నాయి.
ఈ సేకరణ... తన వారసత్వపు మూలాలతో మమేకమై, వర్తమానంతో దృఢంగా ముడిపడి ఉన్న కర్ణాటకను ప్రతిబింబిస్తుంది. పారాలింపిక్ పతక విజేత సుహాస్ యతిరాజ్ సంతకం చేసిన బ్యాడ్మింటన్ రాకెట్, సమకాలీన కళాకృతులు, శ్రీ మధుసూదన్ సాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ నమూనా ప్రతిరూపం వంటివి ప్రస్తుత కాలపు విజయాలను ఇవి చర్చలో భాగం చేస్తాయి.
మొత్తంగా చూస్తే, ఈ 30 జ్ఞాపికలు కేవలం కర్ణాటకకు చెందిన కళారూపాల సమాహారం మాత్రమే కాదు. అవి ఒకే రాష్ట్రంలో నెలకొన్న అనేక సాంస్కృతిక ప్రపంచాల సంగ్రహావలోకనాన్ని అందిస్తాయి. తద్వారా భారత భిన్నత్వంలోని గొప్పతనాన్ని ప్రతిబింబిస్తాయి. ప్రధానమంత్రికి బహూకరించిన జ్ఞాపికల వేలం... ఇటువంటి వివిధ రకాల కళాఖండాలను ఒకే చోటికి చేర్చి, భద్రపరిచి, ఏ సందర్భం కోసం వాటిని తయారు చేశారో లేదా బహూకరించారో ఆ క్షణాన్ని దాటి భవిష్యత్తు తరాలూ పంచుకోగల ఒక గొప్ప వేదికగా నిలుస్తుంది.
పీఎం కానుకగా పొందిన జ్ఞాపికల వేలం 8వ ఎడిషన్ ప్రస్తుతం కొనసాగుతోంది. దీనిని ఈ నెల 31 వరకు పొడిగించారు. ఈ వేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని నమామి గంగే ప్రాజెక్టు కోసం వినియోగిస్తారు.
ఆసక్తి గల బిడ్డర్లు పీఎం కానుగా పొందిన జ్ఞాపికల వేలం కోసం గల ఈ అధికారిక పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో తమ బిడ్‌లను సమర్పించవచ్చు: https://pmmementos.gov.in
***
(రిలీజ్ ఐడి: 2319882)
సందర్శకుల సూచీ సంఖ్య : : 17