వ్యవసాయ మంత్రిత్వ శాఖ
సురక్షిత, సుస్థిర ప్రాతిపదికలతో కూడిన నిల్వ కోసం అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న ఐసీఏఆర్, ఎఫ్‌సీఐ
నాడు పోస్టు చేయడమైనది:
01 OCT 2026 5:47PM by PIB Hyderabad
గోధుమలను, బియ్యాన్ని నిల్వ చేసే ప్రక్రియలో ఎదురవుతున్న కీటకాల బెడదను అరికట్టే సురక్షిత, సుస్థిర నిర్వహణ పద్ధతుల కోసం ప్రత్యామ్నాయంగా పొగబెట్టే (ఫ్యూమిగేషన్) సాంకేతికతలపై పరిశోధన చేయడానికి భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్), భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)లు ఒక అవగాహన ఒప్పందాన్ని (ఎమ్ఓయూ) కుదుర్చుకున్నాయి. ఈ పరిశోధన పూర్వక అధ్యయనానికి వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖకు చెందిన ఆహార, ప్రజా పంపిణీ విభాగం (డీఎఫ్‌పీడీ) సహకారాన్ని అందిస్తోంది.
రెండు సంవత్సరాలు పాటు కొనసాగే మొదటి దశ ప్రాజెక్టును లూధియానాలోని ఐఏసీఆర్-సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ హార్వెస్ట్ ఇంజినీరింగ్, టెక్నాలజీ (సీఐపీహెచ్ఈటీ) నిర్వహిస్తుంది.
దశాబ్దాలుగా, దేశంలో ధాన్యాల కీలక నిల్వల్లో పంటకోత అనంతరం ఆశించే కీటకాల బారి నుంచి రక్షణ కోసం ప్రధానంగా అల్యూమినియం ఫాస్ఫైడ్ (ఏఎల్‌పీ)తో పాటు మాలాథియాన్‌ను కూడా ఉపయోగిస్తూ వచ్చారు. ఏమైనా, వీటిని పెద్ద ఎత్తున పదే పదే ఉపయోగించడం వల్ల తీవ్ర పరిణామాలు ఎదురయ్యాయి. ఉదాహరణకు, ప్రముఖ రాష్ట్రాల్లో కీటకాలు నిరోధక సామర్ధ్యాన్ని 72 నుంచి 100 శాతం వరకు సంపాదించుకున్నాయి. పొగబారించే (ఫ్యూమిగేషన్) పద్ధతిని చాలా కాలం అనుసరిస్తుండడంతో అందుకు పెట్టాల్సిన ఖర్చు పెరిగిపోయింది. దీనికి అదనంగా, ప్రస్తుతం పాటిస్తున్న రసాయనిక ఆధారిత పద్దతులతో పనివారికి శ్వాస సంబంధిత తీవ్ర సమస్యలే కాకుండా, పర్యావరణానికి కూడా దీర్ఘకాలిక ముప్పులు ఎదురుకావచ్చు. తాజా కార్యక్రమంతో నైట్రోజన్ గ్యాస్, కార్బన్ డయాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్‌తో పాటు ఫాస్ఫీన్‌ల మిశ్రిత ప్రభావాన్ని వాణిజ్య సరళిలో ఉపయోగించడాన్ని ప్రమాణీకరించడం ద్వారా ఈ సవాళ్లను నేరుగా ఎదుర్కొని, పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తారు.
• భూమి మీద ఒక టవర్ ఆకారపు లేదా భూమిలో బావి ఆకారపు లోహ సైలోలలో నిల్వ ఉంచిన గోధుమలను ఆశించే పురుగులను దీటుగా ఎదుర్కోవడానికి నైట్రోజన్ గ్యాస్ (99 శాతం కన్న తక్కువ స్థాయి కలిగి ఉంటుంది)తో పొగ పెడతారు.
• ఎఫ్‌సీఐ/ కేంద్ర గిడ్డంగుల సంస్థ (సీడబ్ల్యూసీ)లకు చెందిన గిడ్డంగుల్లో సంచులలో ఉంచిన గోధుమలు, బియ్యం నిల్వలకు పట్టే పురుగుల నిర్వహణ/నియంత్రణ కోసం కార్బన్ డయాక్సైడ్, ఫాస్ఫీన్ గ్యాస్.. ఈ రెండిటి మిశ్రిత ఫ్యూమిగేషన్‌ను చేపడతారు.ఈ కింద ప్రస్తావించిన మూడు ప్రధాన ప్రయోగాలను మొదటి దశలో నిర్వహిస్తారు :
• గాలి చొరబాటును అడ్డుకొనే హెర్మెటిక్ కవర్లను కప్పి ఉంచిన సంచుల్లో నిల్వ చేసే గోధుమకు, బియ్యానికి పట్టే పురుగుల నిర్వహణ/ నియంత్రణలో భాగంగా కార్బన్ డయాక్సైడ్‌తో పొగబెడతారు.
మొదటి దశ ప్రయోగాత్మక ప్రాజెక్టు అమలు తీరుతెన్నులను రెండు సంవత్సరాల పాటు పరిశీలించిన తరువాత రెండో దశలో ఒక ఏడాది పాటు అనేక వ్యవసాయ, వాతావరణ జోన్లలో పరిశీలనను కొనసాగిస్తారు. ఇలా చేయడం వల్ల నిర్దిష్ట ప్రాంతం వారీ ప్రామాణిక మార్గదర్శకాలను (ఎస్ఓపీస్) రూపొందించడానికి అవకాశం కలుగుతుంది.
సాంప్రదాయిక రసాయనిక ఫ్యూమిగేషన్ కన్న శాస్త్రీయతపరంగా చెల్లుబాటయ్యే, కార్యకలాపాలను విస్తరించడానికి అనువుగా ఉండే, దీర్ఘకాలం పాటు మన్నికను కలిగి ఉండే ప్రత్యామ్నాయాల్ని అభివృద్ధిపరచడం ఈ కార్యక్రమ లక్ష్యం. కీటకాల్లో పెరుగుతున్న నిరోధక స్వభావం, వృత్తిపరమైన అపాయాలు, పర్యావరణంపైన పడే ప్రభావాలతో పాటు పొగబెట్టడం వల్ల ఎదురయ్యే అవశేషాలకు సంబంధించిన సమస్యల్ని పరిష్కరించడం అనే అంశాలు కూడా దీనిలో కలిసి ఉన్నాయి.
అవగాహన ఒప్పందంపై డీఏఆర్ఈ కార్యదర్శి, ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎమ్.ఎల్. జాట్, ఐసీఏఆర్‌కు చెందిన డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (అగ్రికల్చరల్ ఇంజినీరింగ్) డాక్టర్ రాజ్‌బీర్ సింగ్, డిప్యూటీ డైరెక్టర్ (క్రాప్ సైన్స్) జనరల్ డాక్టర్ డి.కె. యాదవ్, అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ (ప్రాసెసింగ్ ఇంజినీరింగ్) డాక్టర్ కె. నర్సయ్యల సమక్షంలో సంతకాలయ్యాయి. ఒప్పంద పత్రంపై ఐసీఏఆర్-సీఐపీహెచ్ఈటీ డైరెక్టర్ డాక్టర్ నచికేత్ కొత్వాలీవాలే, ఎఫ్‌సీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (నాణ్యత నియంత్రణ.. క్యూసీ) డాక్టర్ ఎ.కె. సిన్హా సంతకాలు చేశారు. ఈ కార్యక్రమలో పాల్గొన్న వారిలో డీఎఫ్‌పీడీ డైరెక్టర్ ప్రియా జాకబ్, ఎఫ్‌సీఐ జనరల్ మేనేజర్ (క్యూసీ) శ్రీ రాజగోపాల్, ఐసీఏఆర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ దేవీందర్ ఢింగ్‌రా, ఐసీఏఆర్-సీఐపీహెచ్ఈటీకి చెందిన ప్రిన్సిపల్ సైంటిస్ట్, ప్రాజెక్టుకు చెందిన లీడ్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ సందీప్ మాన్, ఎఫ్‌సీఐకి చెందిన డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (క్యూసీ) శ్రీ గౌతమ్ కుమార్, ఎఫ్‌సీఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (క్యూసీ) శ్రీ సి.పి. సహారన్, సారికా ప్రీతమ్ ఉన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2318365)
సందర్శకుల సూచీ సంఖ్య : : 28