సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
సాధన శృంఖల 2026: ప్రాంతీయ వ్యాప్తంగా శిక్షణా సంస్థలను సామర్థ్య నిర్మాణ సంస్థలుగా తీర్చిదిద్దే ఒక ప్రతిష్టాత్మక చొరవ
రాష్ట్రాల మధ్య సామర్థ్య నిర్మాణ ప్రదర్శనలో ఆంధ్రప్రదేశ్ కు ప్రథమ స్థానం; కర్ణాటక, ఒడిశా లకు ద్వితీయ, తృతీయ స్థానాలు
వికసిత్ భారత్ లక్ష్య సాధనకు ప్రభుత్వ ఉద్యోగులు నిరంతరం నైపుణ్యాలను పెంపొందించుకోవాలి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
నాడు పోస్టు చేయడమైనది:
29 SEP 2026 5:34PM by PIB Vijayawada
శిక్షణ సంస్థలను వ్యూహాత్మక, సామర్థ్య-ఆధారిత సంస్థలుగా మార్చేందుకు కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ (సిబిసి) విజయవాడలో ఏర్పాటు చేసిన 'సాధన శృంఖల 2026' ప్రాంతీయ కార్యశాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. కృత్రిమ మేథ (ఏఐ)తో సహా వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు తమ నైపుణ్యాలను నిరంతరం పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. పౌర కేంద్రిక పాలన మరియు ప్రజా సేవల పంపిణీని మరింత బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
'ఐగాట్ కర్మయోగి' ఆన్లైన్ శిక్షణ వేదిక ద్వారా అధికారులు, సిబ్బంది తమ సామర్థ్యాలను క్రమం తప్పకుండా మెరుగుపరుచుకోవడానికి వీలవుతోందని శ్రీ చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు ప్రభుత్వ ఉద్యోగులందరూ నాణ్యమైన ప్రజాసేవలను అందించేందుకు నిరంతర శిక్షణ పొందాలని అన్నారు. 'iGOT కర్మయోగి' పోర్టల్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగం దాదాపు 2 కోట్ల కోర్సులను పూర్తి చేసి, సామర్థ్య నిర్మాణంలో రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచేలా కృషి చేసినందుకు యంత్రాంగాన్ని ఆయన అభినందించారు.
కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ ఛైర్పర్సన్ శ్రీమతి రాధా చౌహాన్ ఈ కార్యశాలలో మాట్లాడుతూ, వేగంగా మారుతున్న సాంకేతికతలు, ముఖ్యంగా కృత్రిమ మేధ దృష్ట్యా ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల సామర్థ్యాలను నిరంతరం పెంచాల్సిన అవసరం ఉందన్నారు. పాలనలో "నాగరిక్ దేవో భవ" అనేది ఒక ప్రాథమిక సూత్రంగా రూపాంతరం చెందిందని, ఉద్యోగులు తమ ప్రవర్తన, నైపుణ్యాలు, పరిపాలనా సామర్థ్యాలు, పనితీరును పౌరుల అవసరాలకు అనుగుణంగా మార్చుకోవాలని ఆమె పేర్కొన్నారు.

ప్రభుత్వ ఉద్యోగులకు నిర్మాణాత్మక అభ్యాస అవకాశాలను అందించడంలో iGOT కర్మయోగి పాత్రను శ్రీమతి చౌహాన్ ప్రశంసించారు. శిక్షణ సంస్థలను సామర్థ్య నిర్మాణ సంస్థలుగా మార్చడం వల్ల వివిధ ప్రభుత్వ సంస్థలు తమ నిర్దిష్టమైన బాధ్యతలను నెరవేర్చడానికి అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకోగలవని పేర్కొన్నారు.
'మిషన్ కర్మయోగి' కింద శిక్షణ సంస్థల రూపాంతరాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ (సిబిసి) దేశవ్యాప్తంగా 'సాధన శృంఖల 2026' (జాతీయ పురోగతికి అనుకూలమైన అభివృద్ధి, మానవ సామర్థ్యాన్ని బలోపేతం చేయడం) పేరుతో ప్రాంతీయ సంప్రదింపుల సదస్సులను నిర్వహిస్తోంది. నాలుగు ప్రాంతీయ టాస్క్ ఫోర్స్‌లు, 2026 ఏప్రిల్ 2 నుండి 8 వరకు జరిగిన 'సాధన సప్తాహ్ 2026', మరియు మే 15, 2026న జరిగిన జాతీయ స్థాయి "ఇన్స్టిట్యూషనలైజింగ్ కెపాసిటీ బిల్డింగ్: ఫ్రమ్ ట్రైనింగ్ టు పెర్ఫార్మెన్స్-లింక్డ్ గవర్నెన్స్" సమ్మిట్ ఆధారంగా ఈ శృంఖల రూపుదిద్దుకుంది. విజయవాడలో జరుగుతున్న ఈ రెండు రోజుల ప్రాంతీయ కార్యశాలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల సీనియర్ అధికారులు, శిక్షణ సంస్థల అధిపతులు, ఫ్యాకల్టీ, పిఎస్‌యులు, పరిశ్రమ భాగస్వాములు, విషయ నిపుణులు మరియు స్టార్టప్‌ల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగుల సామర్థ్య నిర్మాణంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రథమ బహుమతి లభించగా, కర్ణాటక ద్వితీయ, ఒడిశా తృతీయ స్థానాల్లో నిలిచాయి. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ పురస్కారాలను ప్రధానం చేశారు. ఆంధ్రప్రదేశ్ తరఫున ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ పీయూష్ కుమార్, ఏపీఎస్డీపీఎస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ అలపర్తి వెంకటేశ్వరరావు ఈ అవార్డును అందుకున్నారు.

'సాధన శృంఖల' ద్వారా జాతీయ స్థాయి సంప్రదింపులు, ప్రజా భాగస్వామ్య స్ఫూర్తిని ప్రాంతీయ స్థాయికి తీసుకెళ్లి, పౌర కేంద్రిక పాలన, మెరుగైన ప్రజా సేవల పంపిణీ లక్ష్యంగా భవిష్యత్తుకు అనుగుణమైన సామర్థ్య నిర్మాణ పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడమే దీని ముఖ్య ఉద్దేశం.
***
(రిలీజ్ ఐడి: 2316644)
సందర్శకుల సూచీ సంఖ్య : : 49