గనుల మంత్రిత్వ శాఖ
సర్క్యులర్ ఎకానమీ, కీలక ఖనిజాల వెలికితీతను ప్రోత్సహించడం లక్ష్యంగా
‘ప్రత్యేక ప్రచారం-6’ ద్వారా ఇ-వ్యర్థాల సేకరణ కార్యక్రమాన్ని బలోపేతం చేస్తున్న గనుల మంత్రిత్వశాఖ
నాడు పోస్టు చేయడమైనది:
28 SEP 2026 5:37PM by PIB Hyderabad
భారత ప్రభుత్వ గనుల మంత్రిత్వశాఖ 'ప్రత్యేక ప్రచారం 6.0' ద్వారా ఇ-వ్యర్థాల సేకరణను మరింత వేగవంతం చేస్తోంది. బాధ్యతాయుతమైన ఇ-వ్యర్థాల నిర్వహణ, పనికిరాని వస్తువుల నుంచి తిరిగి వనరులను సేకరించడం, పర్యావరణహిత సర్క్యులర్ ఎకానమీని ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.
ఈ ప్రచార కార్యక్రమానికి నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న నాగపూర్‌కు చెందిన 'జవహార్‌లాల్ నెహ్రూ అల్యూమినియం రీసెర్చ్ డెవలప్‌మెంట్ అండ్ డిజైన్ సెంటర్', 'మెటీరియల్ రీసైక్లింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'ల భాగస్వామ్యంతో సమన్వయం చేస్తూ దీనిని అమలు చేస్తోంది. గనుల మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉన్న వివిధ కార్యాలయాలు, సంస్థల ద్వారా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇ-వ్యర్థాల సేకరణ, అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు
ఈ ప్రచార కార్యక్రమం కోసం దేశవ్యాప్తంగా 44కి పైగా కార్యాలయ ప్రాంతాలను ఖరారు చేశారు. కేవలం మహారాష్ట్రలోనే ఇ-వ్యర్థాల సేకరణ కోసం 28కి పైగా ప్రాంతాలను గుర్తించారు. వివిధ కార్యాలయాలు, సంస్థలు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భాగస్వాములు కావడం... ఇ-వ్యర్థాల బాధ్యతాయుత సేకరణ, సురక్షిత డిస్పోజల్ కోసం జరుగుతున్న ఉమ్మడి కృషికి నిదర్శనంగా నిలుస్తోంది. న్యూఢిల్లీలోని గనుల మంత్రిత్వశాఖ కార్యాలయం ఇందులో ఒక సేకరణ కేంద్రంగానూ ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన ఇ-వ్యర్థాలను, సరైన పద్ధతుల ద్వారా సురక్షితమైన రీసైక్లింగ్, వనరుల పునరుద్ధరణ ప్రక్రియలకు తరలిస్తారు.
ఇ-వ్యర్థాలు కేవలం పారవేసే చెత్త మాత్రమే కాదు... వాటిలో విలువైన ద్వితీయ శ్రేణి వనరులు ఉన్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అవసరమయ్యే ఎన్నో కీలక ఖనిజాలు, లోహాలు వివిధ ఎలక్ట్రానిక్ వస్తువుల్లో ఉంటాయి. ఇ-వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడం ద్వారా ఆ వనరులను సమర్థంగా వాడుకోవచ్చు. కీలక ఖనిజాల సర్క్యులర్ ఎకానమీని బలోపేతం చేయవచ్చు. బాధ్యతాయుతమైన రీసైక్లింగ్ పద్ధతులను ఉపయోగించి ఈ విలువైన పదార్థాలను తిరిగి పొందడం ద్వారా భూమి నుంచి నేరుగా తీసే ప్రాథమిక ఖనిజ వనరులపై ఒత్తిడి తగ్గుతుంది. ఇది వనరుల దీర్ఘకాలిక, సుస్థిర వినియోగానికి ఎంతగానో దోహదపడుతుంది.
ఈ ప్రచార కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేయడానికి వీలుగా... గనుల మంత్రిత్వ శాఖ పరిధిలోని వివిధ కార్యాలయాలు, సంస్థల నోడల్ అధికారులతో జేఎన్‌ఏఆర్‌డీడీసీ ముందస్తు సమన్వయ సమావేశాలను వీడియో అనుసంధానం ద్వారా నిర్వహించింది. ఈ సమావేశాల్లో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్, నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్, హిందుస్థాన్ జింక్ లిమిటెడ్, మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్, హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ వంటి ప్రముఖ ప్రభుత్వ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
గనుల మంత్రిత్వశాఖతో పాటు దాని ప్రాంతీయ కార్యాలయాలు, సంస్థలు... ఈ ప్రచారంలో ఉద్యోగులు, భాగస్వామ్య పక్షాలు పెద్ద ఎత్తున పాల్గొనేలా ప్రోత్సహించడానికి వివిధ అవగాహన కార్యక్రమాలు, ప్రచారాలు, పోటీలను నిర్వహిస్తున్నాయి. ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వస్తువుల బాధ్యతాయుత డిస్పోజల్ గురించి అవగాహన పెంపొందించడం, వీలైనంత వరకు పాత వస్తువులను తిరిగి ఉపయోగించడం, వేరే అవసరాలకు అనుగుణంగా వాటిని మార్చుకోవడం, రీసైక్లింగ్ చేయడాన్ని ప్రోత్సహించడం ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశం.
ఈ ప్రచారం ద్వారా వనరుల సంరక్షణలో ప్రజల భాగస్వామ్యాన్ని గనుల మంత్రిత్వశాఖ విస్తృతంగా ప్రోత్సహిస్తోంది. ఇ-వ్యర్థాల సేకరణ, వర్గీకరణ, రీసైక్లింగ్, వాటి నుంచి విలువైన పదార్థాలను తిరిగి పొందడం కోసం బాధ్యతాయుతమైన పద్ధతులను అవలంబించేలా ప్రజలను చైతన్యపరుస్తోంది. సుస్థిర వనరుల నిర్వహణ, పర్యావరణ బాధ్యత, సర్క్యులర్ ఎకానమీని ప్రోత్సహించడం లక్ష్యంగా చేపట్టిన ఈ 'ప్రత్యేక ప్రచారం 6.0' విస్తృత ఆశయాలకు ఈ కార్యక్రమం మరింత బలాన్ని చేకూరుస్తుంది.
***
(రిలీజ్ ఐడి: 2316269)
సందర్శకుల సూచీ సంఖ్య : : 9