యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జాతీయ స్థాయి నషా ముక్త యువ ప్రచారంలో భాగంగా ‘‘నా ఆరోగ్యం-నా గర్వం’’


కార్యకలాపాలను చేపట్టిన మై భారత్-ఎన్ఎస్ఎస్

167 విద్యాసంస్థల్లో 1.75 లక్షల మందికి పైగా భాగస్వామ్యం నమోదు, 48,500 మందికి పైగా యువతకు ఆరోగ్య పరీక్షలు

నాడు పోస్టు చేయడమైనది: 25 SEP 2026 9:18PM by PIB Hyderabad

వికసిత్ భారత్ కోసం నషా ముక్త యువ – 100 వారాల నషా ముక్త యువ అభియాన్ పరిధిలో జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) ద్వారా 2026 సెప్టెంబర్ 25న దేశవ్యాప్తంగా ‘‘నా ఆరోగ్యం – నా గర్వం’’ కార్యక్రమాలను యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ నిర్వహించింది. ఈ కార్యక్రమాలు యువతలో ఆరోగ్యాన్ని, పోషణను ప్రోత్సహించడం, మత్తుపదార్థాల వినియోగం వల్ల ఎదురయ్యే దుష్ప్రభావాల గురించి అవగాహన కల్పించడంపై దృష్టి సారించాయి.

image.png

 

దేశవ్యాప్తంగా 167 విద్యాసంస్థలు, అవి దత్తత తీసుకున్న గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యకలాపాల్లో మొత్తం 1,75,368 మంది పాల్గొన్నారు. ఆరోగ్య పరీక్షలు, నిపుణులతో అవగాహన సదస్సులు, మత్తుపదార్థాల నివారణ కార్యక్రమాల ద్వారా యువతను ఒకే వేదికపైకి ఈ ప్రచారం తీసుకువచ్చింది.

ఈ ప్రచారంలో భాగంగా రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమ్ (ఆర్‌బీఎస్‌కే) ఆధ్వర్యంలో జిల్లా ఆరోగ్య అధికారులు, వైద్య అధికారుల సమన్వయంతో 15 నుంచి 18 ఏళ్ల వయసున్న 48,556 మందికి ఆరోగ్య పరీక్షలు, బీఎంఐ అంచనాలు నిర్వహించారు. క్రమం తప్పని ఆరోగ్య పర్యవేక్షణ, అవగాహనతో కూడిన జీవనశైలి ఎంపికలను అర్థం చేసుకొనే అవకాశాన్ని యువతకు ఈ ఆరోగ్య కార్యక్రమాలు అందించాయి.

నిపుణుల నేతృత్వంలో జరిగిన రెండు అవగాహనా సదస్సులు ఈ కార్యక్రమంలో ప్రధానపాత్ర పోషించాయి. ‘‘పోషణ, మంచి ఆరోగ్యం ప్రాముఖ్యం’’ అనే అంశంపై జరిగిన సదస్సులో 64,938 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పోషకాహారం, ఆరోగ్యం, ఆరోగ్యకరమైన జీవనానికి ఉన్న ప్రాధాన్యాన్ని వైద్య నిపుణులు, వైద్యులు వివరించారు. ‘‘మంచి ఆరోగ్యంపై వ్యసన ప్రభావం’’ అనే అంశంపై జరిగిన రెండో సదస్సులో 61,874 మంది పాల్గొన్నారు. దీనిలో మత్తుపదార్థాల దుర్వినియోగం వల్ల ఎదురయ్యే ప్రతికూల ఆరోగ్య ప్రభావాల గురించి వివరించారు.

image.png

 

వ్యసన విముక్తి అవగాహన కార్యక్రమంలో భాగంగా సుమారు 62,000 మంది యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. ఇది యువతలో మత్తు పదార్థాల దుర్వినియోగ నివారణ, అవగాహనతో కూడిన నిర్ణయాలు తీసుకొనేలా ప్రచార లక్ష్యాన్ని మరింత బలోపేతం చేసింది.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రముఖులు, వైద్య నిపుణులు పాల్గొన్నారు. 95 సంస్థలు తాము నిర్వహించిన శిబిరాలు ప్రారంభోత్సవానికి, యువతతో చర్చించడానికి నిపుణులు, ప్రజాప్రతినిధులను ఆహ్వానించాయి. పోషణ, ఆరోగ్య సదస్సుల్లో పాల్గొన్న వారిలో యువతులు వాటా 53.0 శాతం, వ్యసన విముక్తి సెషన్లలో 52.6 శాతంగా ఉంది. ఇది ప్రచార కార్యక్రమాల్లో యువ మహిళల భాగస్వామ్యాన్ని తెలియజేస్తోంది.

వికసిత్ భారత్ కోసం నషా ముక్త యువ ప్రచారంలో భాగంగా  చేపట్టిన నివారణ విభాగం పరిధిలో ‘‘నా ఆరోగ్యం-నా గర్వం’’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇది అవగాహన, నివారణ చర్యలను ఆరోగ్య సంరక్షణతో మిళితం చేస్తుంది. తద్వారా శారీరక ఆరోగ్యం, ఆరోగ్యకరమైన ఎంపికలు, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండే జీవనశైలి మధ్య సంబంధాన్ని అర్థం చేసుకొనే అవకాశాన్ని యువతకు అందిస్తోంది.

 

image.png

 

ఈ కార్యక్రమాలు మొత్తం 100 వారాల విస్తృత ప్రచార కార్యాచరణలో భాగం. ఇది నివారణ, రక్షణ, రికవరీ, నాయకత్వం అనే నాలుగు ప్రధాన అంశాలపై ఆధారపడి ఉంది. మై హెల్త్-మై ప్రైడ్, ఫిట్ యూత్ – అడిక్షన్ ఫ్రీ యూత్, లైఫ్ స్కిల్స్ మంత్  అనే మూడు అంశాలపై మొదటి దశ దృష్టి సారించింది. ఆరోగ్యం, శారీరక దారుఢ్యం, సామాజిక భాగస్వామ్యం, జీవన నైపుణ్యాల పెంపు ద్వారా యువత నిరంతరం క్రియాశీలంగా ఉండేలా చూడటమే ఈ ప్రచారం లక్ష్యం.

దేశవ్యాప్తంగా చేపట్టిన ఈ కార్యక్రమాలు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోగలిగిన విధానాన్ని ప్రదర్శించాయి. ప్రాంతీయ పండగలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా కొన్ని ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు వాయిదా వేశారు. బీహార్, జార్ఖండ్‌లో అనంత చతుర్దశి, మహారాష్ట్ర, గోవాలలో గణేష్ నిమజ్జనం, తీవ్ర తుపాను ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో ఆరు విద్యాసంస్థల్లో షెడ్యూల్ చేసిన కార్యక్రమాలను తాత్కాలికంగా వాయిదా వేశారు. ప్రభావిత ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలను తిరిగి రీషెడ్యూల్ చేయనున్నారు.

ఆరోగ్యకరమైన, నషా ముక్త యువ సమాజాన్ని నిర్మించడంలో అవగాహన, నివారణ ఆరోగ్య చర్యలు, అవగాహనతో కూడిన ఎంపికలు ముఖ్యమనే ప్రచార సందేశాన్ని ‘నా ఆరోగ్యం-నా గర్వం’ కార్యక్రమం బలోపేతం చేస్తుంది.

 

****


(రిలీజ్ ఐడి: 2315384) సందర్శకుల సూచీ సంఖ్య : : 73
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी