జల శక్తి మంత్రిత్వ శాఖ
9వ ఇండియా ఇంటర్నేషనల్ వాటర్ వీక్ (ఐఐడబ్ల్యూడబ్ల్యూ) 2026 లో నీరు, పారిశుధ్యం, పరిశుభ్రత (డబ్ల్యూఏఎస్‌హెచ్-వాష్) పై రెండవ భారత అంతర్జాతీయ సదస్సు సందర్భంగా ఇండో - ఆఫ్రికా వాష్ రౌండ్ టేబుల్ సమావేశం
డబ్ల్యూఏఎస్‌హెచ్ రంగంలో భాగస్వామ్య అవకాశాలపై చర్చించేందుకు ఒకే వేదికపై చేరిన 22 ఆఫ్రికా దేశాల రాయబారులు, అంతర్జాతీయ ప్రతినిధులు, శాస్త్రవేత్తలు
విజ్ఞాన మార్పిడి, సామర్థ్య పెంపు, డిజిటల్ ఆవిష్కరణలు, సమాజ ఆధారిత సేవల లభ్యత, వాతావరణ మార్పులను తట్టుకునే డబ్ల్యూఏఎస్‌హెచ్ పరిష్కారాలపై చర్చ
నాడు పోస్టు చేయడమైనది:
24 SEP 2026 7:07PM by PIB Hyderabad
తొమ్మిదో భారత అంతర్జాతీయ జల వారోత్సవాలు (ఇండియా ఇంటర్నేషనల్ వాటర్ వీక్ -(ఐఐడబ్ల్యూడబ్ల్యూ) - 2026లో భాగంగా నిర్వహిస్తున్న రెండో ఇండియా ఇంటర్నేషనల్ డబ్ల్యూఏఎస్‌హెచ్ సదస్సులో భాగంగా, భారత ప్రభుత్వ జల శక్తి మంత్రిత్వ శాఖ పరిధిలోని తాగునీరు, పారిశుధ్య విభాగం (డీడబ్ల్యూఎస్ఎస్) ఈ రోజు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఉన్నతస్థాయి ఇండో - ఆఫ్రికా వాటర్, శానిటేషన్, హైజీన్ (డబ్ల్యూఏఎస్‌హెచ్) రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహించింది. నీరు, పారిశుధ్య రంగాల్లో ఇరు ప్రాంతాలు ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చించడంతో పాటు, భవిష్యత్తులో సహకారానికి గల అవకాశాలను అన్వేషించడం ఈ సమావేశం ప్రధాన ఉద్దేశం.
ఈ రౌండ్‌టేబుల్ సమావేశంలో 22 ఆఫ్రికా దేశాల రాయబారులు, ప్రతినిధులు, భారత ప్రభుత్వ ఉన్నతాధికారులు, అభివృద్ధి భాగస్వాములు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. జాతీయ రాజధాని ప్రాంతంలోని ఏఐసీటీఈ అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులను కూడా ఈ చర్చలను వీక్షించేందుకు ఆహ్వానించారు.
డీడబ్ల్యూఎస్ఎస్ కార్యదర్శి శ్రీ అశోక్ కె.కె. మీనా మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో నీటి సరఫరా, పారిశుధ్య రంగాల్లో భారత్ అనుభవం కేవలం మౌలిక సదుపాయాల కల్పనకే పరిమితం కాదని, ప్రజారోగ్యం, గౌరవప్రదమైన జీవనం, మహిళా సాధికారత, సమాజ భాగస్వామ్యం ప్రధానంగా ఉన్నాయని వివరించారు. జల్ జీవన్ మిషన్ (జేజేఎం), స్వచ్ఛ భారత్ మిషన్ - గ్రామీణ్ (ఎస్‌బీఎం - జీ) కార్యక్రమాల కింద భారత్ సాధించిన పురోగతికి బలమైన రాజకీయ నిబద్ధతతో పాటు స్థానిక సంస్థల భాగస్వామ్యం కీలకంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. భారత్‌లో అమలు చేస్తున్న వికేంద్రీకృత పాలనా విధానాన్ని ప్రస్తావిస్తూ, గ్రామీణ సేవల ప్రణాళిక, నిర్వహణ, పర్యవేక్షణ, సుస్థిరతలో గ్రామ పంచాయతీలు, గ్రామ నీరు - పారిశుధ్య కమిటీలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆయన వివరించారు.
నీటి నాణ్యత పర్యవేక్షణ కోసం ఫీల్డ్ టెస్టింగ్ కిట్లను ఉపయోగించడంలో 24.8 లక్షల మందికి పైగా మహిళలకు శిక్షణ ఇచ్చినట్లు శ్రీ మీనా తెలిపారు. దీంతో స్థానిక నీటి నిర్వహణలో మహిళలు చురుకైన భాగస్వాములుగా మారారని పేర్కొన్నారు. ప్రవర్తన మార్పు, స్థానిక నాయకత్వం, సమాజ భాగస్వామ్యంతో పారిశుధ్యాన్ని దేశవ్యాప్త ప్రజా ఉద్యమంగా మార్చిన స్వచ్ఛ భారత్ మిషన్ - గ్రామీణ్ (ఎస్‌బీఎం - జీ) కార్యక్రమం చూపిన మార్పుదాయక ప్రభావాన్ని కూడా ఆయన గుర్తుచేశారు.
సుస్థిరత ప్రాధాన్యాన్ని ప్రముఖంగా పేర్కొంటూ, భారత్ అనుభవం నుంచి ఐదు కీలక పాఠాలను - బలమైన రాజకీయ నాయకత్వం, సాధికారత పొందిన స్థానిక ప్రభుత్వాలు, మౌలిక సదుపాయాలతో పాటు ప్రజలపై పెట్టుబడి పెట్టడం, ప్రారంభం నుంచే నిర్వహణ, సంరక్షణకు ప్రణాళిక రూపొందించడం, జవాబుదారీతనం, సేవల చేరవేత కోసం సరళమైన, పరస్పరం అనుసంధానమయ్యే డిజిటల్ వ్యవస్థలను వినియోగించడం అనే అంశాలను- ఆయన వివరించారు.
ఆచరణాత్మక అనుభవం, డిజిటల్ విధానాలు, సమాజ పాలనలో తన అనుభవాలను పంచుకోవడం భారత్‌కు గౌరవంగా ఉందని, అదే సమయంలో ఆఫ్రికా దేశాల్లో అభివృద్ధి చెందుతున్న ఆవిష్కరణలు, అనుభవాల నుంచి కూడా నేర్చుకుంటున్నామని డీడబ్ల్యూఎస్ఎస్ కార్యదర్శి తెలిపారు. పరస్పరం అనుభవాలను పంచుకుని నేర్చుకోవడం, ప్రజలకు సురక్షితమైన తాగునీరు, గౌరవప్రదమైన పారిశుధ్య సదుపాయాలు, ప్రతికూల పరిస్థితులను తట్టుకునే సేవలను అందించే విధానాలను మరింత బలోపేతం చేయడం ఈ చర్చల ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ఇలాంటి సహకారం సుస్థిర అభివృద్ధి లక్ష్యం–6 సాధనకు గణనీయంగా దోహదపడుతుందని అన్నారు.
జాతీయ జల్ జీవన్ మిషన్ అదనపు కార్యదర్శి, మిషన్ డైరెక్టర్ శ్రీ కమల్ కిషోర్ సోన్ గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సేవల అందజేతలో భారత్ అనుభవాన్ని వివరిస్తూ, రాజకీయ సంకల్పాన్ని ప్రతిబింబించేలా అపూర్వ స్థాయిలో పెట్టుబడులు పెట్టినట్లు తెలిపారు. 2019 ఆగస్టు 15న జల్ జీవన్ మిషన్‌ను ప్రారంభించడం ద్వారా ప్రతి గ్రామీణ కుటుంబానికి కుళాయి నీటి కనెక్షన్ అందించడంపై నిర్ణయాత్మకంగా దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. ఈ అనుభవం రాజకీయ నిబద్ధత, ప్రభుత్వ పెట్టుబడులు, సమన్వయంతో కూడిన అమలు, సమాజ భాగస్వామ్యం ప్రాధాన్యాన్ని మరింత స్పష్టం చేసిందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో విశ్వసనీయమైన, సుస్థిరమైన తాగునీటి సేవలను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్న దేశాల మధ్య విస్తృత విజ్ఞాన మార్పిడికి ఈ అనుభవాలు దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. 2019లో 3.24 కోట్ల గ్రామీణ కుటుంబాలకు కుళాయి నీటి సౌకర్యం ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 15.94 కోట్లకు పైగా చేరిందని తెలిపారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, నీటి వనరుల సుస్థిరత చర్యలు, నీటి నాణ్యత పర్యవేక్షణ, సమాజ భాగస్వామ్యాన్ని సమన్వయం చేయడం ద్వారా పైపుల ద్వారా పరిమిత నీటి సరఫరా, పనిచేయని నీటి పథకాలు, భూగర్భ జలాలపై ఎక్కువగా ఆధారపడటం, నీటి నాణ్యతకు సంబంధించిన సమస్యలు వంటి దీర్ఘకాలిక సవాళ్లను జల్ జీవన్ మిషన్ ఎలా పరిష్కరిస్తోందో ఆయన వివరించారు.
భారత గ్రామీణ నీటి నిర్వహణ వ్యూహం క్రమంగా సుస్థిరతపై మరింతగా దృష్టి సారిస్తోందని, ఇందులో భాగంగా భూగర్భ జలాలపై ఆధారపడటాన్ని క్రమంగా తగ్గించి, ఉపరితల నీటి వనరుల వినియోగాన్ని పెంచుతున్నామని ఆయన తెలిపారు. గ్రామీణ నీటి పాలన కోసం భారత్ అభివృద్ధి చేస్తున్న డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ‘సుజలం భారత్’ను కూడా ఆయన ప్రదర్శించారు. ఉమ్మడి, పరస్పరం అనుసంధానమయ్యే డిజిటల్ వ్యవస్థ ద్వారా నీటి వనరు నుంచి కుళాయి వరకు నీటి సరఫరాను పర్యవేక్షించడం, డిజిటల్ ఆస్తుల మ్యాపింగ్, డేటా ఆధారిత పాలన, సేవల నిర్వహణను మెరుగుపరచడం దీని లక్ష్యమని వివరించారు.
స్వచ్ఛ భారత్ మిషన్ - గ్రామీణ్ సంయుక్త కార్యదర్శి, మిషన్ డైరెక్టర్ శ్రీమతి ఐశ్వర్య సింగ్ భారత్ పారిశుధ్య ప్రస్థానాన్ని వివరిస్తూ, అపూర్వ స్థాయిలో ప్రజల భాగస్వామ్యం, ప్రవర్తనా మార్పు ద్వారా ఈ మిషన్ పారిశుధ్యాన్ని ప్రజా ఉద్యమంగా మార్చిందని తెలిపారు. 2014 నుంచి 12 కోట్లకు పైగా కుటుంబ మరుగుదొడ్లు నిర్మించినట్లు ఆమె పేర్కొన్నారు. దీంతో భారత్ సార్వత్రిక పారిశుధ్య సౌకర్యాన్ని సాధించడంతో పాటు, సుస్థిర అభివృద్ధి లక్ష్యం 6.2ను నిర్ణీత గడువుకు ముందుగానే చేరుకోగలిగిందని తెలిపారు. ఎస్‌బీఎం - జీ ఇప్పుడు మరుగుదొడ్ల నిర్మాణాన్ని దాటి, గ్రామీణ ప్రాంతాల్లో సుస్థిర పారిశుధ్య సేవల అందజేతపై దృష్టి సారిస్తోందని ఆమె తెలిపారు. ప్రస్తుతం ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ, పరిశుభ్రమైన పరిసరాలు, ఓడీఎఫ్ ప్లస్ ఆదర్శ గ్రామాలు, డిజిటల్ పర్యవేక్షణ వ్యవస్థలు, పారిశుధ్య సేవలను క్రమం తప్పకుండా అంచనా వేసేందుకు సంస్థాగత విధానాలపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు. స్వచ్ఛ సేవా ఆందోళన్ వంటి ఇటీవలి కార్యక్రమాలతో పాటు, స్థానిక ప్రభుత్వాలు, డిజిటల్ వ్యవస్థలు, సమాజ ఆధారిత ధ్రువీకరణ ద్వారా పారిశుధ్య సేవల అందజేతను సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు చేపడుతున్న చర్యలను కూడా ఆమె వివరించారు. ప్రవర్తనా మార్పు ప్రాధాన్యాన్ని ప్రముఖంగా పేర్కొంటూ, పరిశుభ్రత, ప్రజారోగ్య పరిరక్షణలో సాధించిన ఫలితాలు సుస్థిరంగా కొనసాగాలంటే సమాజమే వాటికి బాధ్యత వహించాలని ఆమె పేర్కొన్నారు.
ప్రపంచ బ్యాంక్ గ్లోబల్ డైరెక్టర్ (వాటర్) శ్రీ సరోజ్ కుమార్ ఝా మాట్లాడుతూ, భారత్‌లో నీరు, పారిశుధ్య రంగాల్లో చోటుచేసుకున్న మార్పు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పెద్ద స్థాయిలో వచ్చిన అభివృద్ధి మార్పులకు అత్యంత ముఖ్యమైన ఉదాహరణల్లో ఒకటని పేర్కొన్నారు. బలమైన రాజకీయ నాయకత్వం, సంస్థల మధ్య సమన్వయం, వినూత్న ఆర్థిక విధానాలు, ప్రభుత్వ పెట్టుబడులు, సమాజ భాగస్వామ్యం ఈ విజయానికి కీలక కారణాలని ఆయన తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా నీటి భద్రత ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రస్తావిస్తూ, ప్రపంచంలోని కోట్లాది మంది ప్రజలకు ఇప్పటికీ సురక్షితమైన తాగునీరు, పారిశుధ్య సేవలు అందుబాటులో లేవని ఆయన పేర్కొన్నారు. ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పన, సౌభాగ్యం, సామాజిక స్థిరత్వానికి నీటి భద్రత ప్రాథమికమని ఆయన స్పష్టం చేశారు. నీరు, పారిశుధ్య రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులను పెంచడంతో పాటు, బలమైన రాజకీయ నిబద్ధత, భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అదే సమయంలో, ఆఫ్రికాను కేవలం సవాళ్ల దృష్టితోనే కాకుండా, ఆవిష్కరణలు, ఔత్సాహికత, స్థానికంగా అభివృద్ధి చేసిన పరిష్కారాలకు నిలయంగా కూడా చూడాలని ఆయన పేర్కొన్నారు. భారత్ - ఆఫ్రికా చర్చలను ఆయన స్వాగతిస్తూ, ఇరు ప్రాంతాల మధ్య నిరంతర సంప్రదింపులు, సంస్థాగత సహకారం కొనసాగించాలని సూచించారు.
ప్రపంచ బ్యాంక్, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ), యూనిసెఫ్, శానిటేషన్ అండ్ వాటర్ ఫర్ ఆల్ (ఎస్‌డబ్ల్యూఏ), బిసాగ్ - ఎన్ ప్రతినిధులు డబ్ల్యూఏఎస్‌హెచ్ సేవల అందజేతలో తమ అంతర్జాతీయ అనుభవాలు, ఆవిష్కరణలు, ఉత్తమ విధానాలను పంచుకున్నారు. నీరు, పారిశుధ్య వ్యవస్థలను మరింత బలోపేతం చేయడంలో డిజిటల్ సాంకేతికతలు, భౌగోళిక సమాచార సాధనాలు, సమాజ సంస్థలు, నీటి నాణ్యత పర్యవేక్షణ, వాతావరణ మార్పులను తట్టుకునే సామర్థ్యం, ఆధారాల ఆధారిత విధాన రూపకల్పనకు పెరుగుతున్న ప్రాధాన్యాన్ని చర్చల్లో ప్రస్తావించారు. సుస్థిర డబ్ల్యూఏఎస్‌హెచ్ ఫలితాల సాధనకు ప్రభుత్వాలు, సమాజాలు, అభివృద్ధి సంస్థలు, సాంకేతిక సంస్థల మధ్య భాగస్వామ్యాలు కీలకమని స్పష్టం చేశారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తరఫున పాల్గొన్న శ్రీ ఇవాన్ జె.-ఎఫ్. హుటిన్ మాట్లాడుతూ, సురక్షితమైన తాగునీరు, పారిశుధ్యం, ప్రజారోగ్య ఫలితాల మధ్య సన్నిహిత సంబంధం ఉందని అన్నారు. నీటి నాణ్యత పర్యవేక్షణ, ముందస్తు ఆరోగ్య పరిరక్షణ చర్యలు, ప్రతికూల పరిస్థితులను తట్టుకునే డబ్ల్యూఏఎస్‌హెచ్ వ్యవస్థల ప్రాధాన్యాన్ని ఆయన వివరించారు. యూనిసెఫ్ ఇండియా చీఫ్ డబ్ల్యూఏఎస్‌హెచ్ శ్రీ పౌలోస్ వర్క్‌నెహ్ సమాజ కేంద్రిత సేవల అందజేత, ప్రవర్తనా మార్పు, అందరికీ సమాన అవకాశాలు, మహిళలు, పిల్లలు, బలహీన వర్గాలకు డబ్ల్యూఏఎస్‌హెచ్ సేవలను బలోపేతం చేయడంలో అనుభవాలను పంచుకున్నారు.
శానిటేషన్ అండ్ వాటర్ ఫర్ ఆల్ (ఎస్‌డబ్ల్యూఏ) గ్లోబల్ అండ్ ఆసియా రీజినల్ ప్రోగ్రామ్ డైరెక్టర్ శ్రీమతి రుచికా శివ మాట్లాడుతూ, అందరికీ నీరు, పారిశుధ్య సదుపాయాలు అందించేందుకు వివిధ వర్గాల భాగస్వామ్యం, దేశాల ఆధ్వర్యంలో చర్యలు, జవాబుదారీతనం, సమష్టి విధానాలు ఎంతో కీలకమని స్పష్టం చేశారు.. బిసాగ్ - ఎన్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ వినయ్ ఠాకూర్ మాట్లాడుతూ, నీటి మౌలిక సదుపాయాల పర్యవేక్షణ, ఆస్తుల నిర్వహణను మెరుగుపరచడం, డబ్ల్యూఏఎస్‌హెచ్ రంగంలో డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకునేందుకు భౌగోళిక సమాచార సాంకేతికతలు, జీఐఎస్ ఆధారిత ప్రణాళిక, డిజిటల్ మ్యాపింగ్ పరిష్కారాలను ఎలా వినియోగిస్తున్నారో వివరించారు. డిజిటల్ ఆవిష్కరణలు, వాతావరణ మార్పులను తట్టుకునే సామర్థ్యం, సమాజ భాగస్వామ్యం, ఆధారాల ఆధారిత పాలన సుస్థిర డబ్ల్యూఏఎస్‌హెచ్ వ్యవస్థలను బలోపేతం చేయడంలో కీలకంగా మారుతున్నాయని వక్తలు పేర్కొన్నారు.
విదేశాంగ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ శివాలా నాయక్ ముడే సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, ఆఫ్రికా దేశాలతో భారత్‌కు దీర్ఘకాలంగా కొనసాగుతున్న అభివృద్ధి భాగస్వామ్యాన్ని ప్రస్తావించారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, సంస్థాగత సామర్థ్య నిర్మాణం, విజ్ఞాన మార్పిడి ద్వారా ఆఫ్రికాకు మద్దతు అందించేందుకు భారత్ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, నీటి వనరుల నిర్వహణ, సాంకేతిక సహకారం భవిష్యత్తులో భారత్ - ఆఫ్రికా సహకారానికి గణనీయమైన అవకాశాలను అందిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. భారత్, ఆఫ్రికా మధ్య చారిత్రక, నాగరికతా సంబంధాలను గుర్తుచేస్తూ ఉమ్మడి అభివృద్ధి సవాళ్లను ఎదుర్కొనేందుకు గ్లోబల్ సౌత్ భాగస్వాములుగా కలిసి పనిచేయడం ఎంతో ముఖ్యమని ఆయన చెప్పారు.
ముఖాముఖీ సమావేశంలో ఆఫ్రికా దేశాల రాయబారులు, ప్రతినిధులు తమ దేశాల్లో నీటి భద్రత, పారిశుధ్యం, సాగునీరు, వాతావరణ మార్పులను తట్టుకునే సామర్థ్యం, సుస్థిర మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించిన అనుభవాలు, అభిప్రాయాలను పంచుకున్నారు. తాగునీరు, పారిశుధ్య సదుపాయాల విస్తరణలో భారత్ సాధించిన పురోగతిని వారు ప్రశంసిస్తూ, నీటి సంరక్షణ, భూగర్భ జలాల నిర్వహణ, మురుగునీటి శుద్ధి, పునర్వినియోగం, నీటి వనరుల సుస్థిరత, అందుబాటు ధరలో నీటి శుద్ధి సాంకేతికతలు, వ్యర్థాల నిర్వహణ, డిజిటల్ గా నీటి నిర్వహణ, వాతావరణ మార్పులను తట్టుకునే మౌలిక సదుపాయాలు వంటి పలు ఉమ్మడి ప్రాధాన్య అంశాలను ప్రస్తావించారు.
గ్రామీణ, కరువు ప్రభావిత, తగిన సేవలు అందని వర్గాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆచరణాత్మకంగా, అందుబాటు ఖర్చుతో, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అమలు చేయగల పరిష్కారాల అవసరాన్ని చర్చలు స్పష్టం చేశాయి. సుస్థిర ఆర్థిక వనరులు, సమర్థవంతమైన నిర్వహణ, సంరక్షణ వ్యవస్థలు, సంస్థాగత సామర్థ్య నిర్మాణం, ప్రైవేట్ రంగ భాగస్వామ్యం, స్థానిక సాంకేతిక నైపుణ్యాల అభివృద్ధి ప్రాధాన్యాన్ని ఆఫ్రికా ప్రతినిధులు కూడా వివరించారు. విజ్ఞాన మార్పిడి, సాంకేతిక పరిజ్ఞాన బదిలీని సులభతరం చేసేందుకు ప్రభుత్వాల మధ్య సహకారం, సాంకేతికత మార్పిడి, ప్రయోగాత్మక ప్రాజెక్టులు, పరిశోధనా భాగస్వామ్యాలు, విద్యా సంస్థల సహకారం, అధ్యయన పర్యటనలు చేపట్టేందుకు పలువురు ప్రతినిధులు ఆసక్తి వ్యక్తం చేశారు.
డీడబ్ల్యూఎస్ఎస్ సంయుక్త కార్యదర్శి శ్రీ డి. సెంథిల్ పాండియన్ ప్రతినిధులకు స్వాగతం పలకడంతో కార్యక్రమం ప్రారంభమైంది. ఒకే తరహా అభివృద్ధి సవాళ్లను ఎదుర్కొంటున్న దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేసేందుకు ఈ రౌండ్‌టేబుల్ సమావేశం ఒక ముఖ్యమైన వేదికగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా నీటి రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రస్తావిస్తూ, సురక్షితమైన తాగునీటి లభ్యతకు కేవలం మౌలిక సదుపాయాలు మాత్రమే సమస్య కాదని, అది గౌరవప్రదమైన జీవనం, ఆరోగ్యం, అవకాశాలతో ముడిపడి ఉన్న అంశమని ఆయన అన్నారు.
డీడబ్ల్యూఎస్ఎస్ సంయుక్త కార్యదర్శి శ్రీమతి స్వాతి మీనా నాయక్ జల్ జీవన్ మిషన్ కింద భారత్ సాధించిన అనుభవాన్ని ముగింపు ప్రసంగంలో ప్రస్తావిస్తూ, సురక్షితమైన తాగునీరు, పారిశుధ్యం, పరిశుభ్రత ప్రజారోగ్యం, గౌరవప్రదమైన జీవనం, లింగ సమానత్వం, సుస్థిర అభివృద్ధికి ప్రాథమిక అవసరాలని ఈ చర్చలు మరోసారి స్పష్టం చేశాయని తెలిపారు. భవిష్యత్తు కార్యాచరణపై దృష్టి సారిస్తూ, నీటి భద్రత, పారిశుధ్య రంగాల్లో భారత్ - ఆఫ్రికా సహకారానికి ఈ చర్చలు కొత్త అవకాశాలను తెరిచాయని ఆమె తెలిపారు. విజ్ఞాన మార్పిడి, సామర్థ్య నిర్మాణం, నీటి నాణ్యత నిర్వహణ, డబ్ల్యూఏఎస్‌హెచ్ కోసం డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సమాజ ఆధారిత పాలన, వాతావరణ మార్పులను తట్టుకునే నీటి వ్యవస్థలు, సుస్థిర పారిశుధ్యాలను భవిష్యత్తు సహకారంలో ప్రాధాన్య రంగాలుగా ఆమె పేర్కొన్నారు. శిక్షణ కార్యక్రమాలు, అధ్యయన పర్యటనలు, సాంకేతిక మార్పిడి ద్వారా ఎస్‌పీఎం - నివాస్ ఈ సహకారానికి మద్దతు అందించగలదని ఆమె తెలిపారు.
జల్ జీవన్ మిషన్, స్వచ్ఛ భారత్ మిషన్ అనుభవాలను ప్రస్తావిస్తూ, నీరు, పారిశుధ్య సేవలు దీర్ఘకాలం సుస్థిరంగా కొనసాగాలంటే సమాజమే చురుకైన భాగస్వామిగా మారడంతో పాటు, సృష్టించిన మౌలిక సదుపాయాలకు బాధ్యత వహించే స్థాయికి రావాలని చెప్పారు. 2030 నాటికి అందరికీ స్వచ్ఛమైన నీరు, పారిశుధ్యం అందించాలన్న సుస్థిర అభివృద్ధి లక్ష్యం - 6 సాధనకు ప్రపంచ సమాజం కృషి చేస్తున్న తరుణంలో సమష్టి చర్యలు, విజ్ఞాన మార్పిడి ప్రాధాన్యాన్ని వివరించారు.
నిరంతర పరస్పర చర్చలు, పరస్పర అనుభవాల నుంచి నేర్చుకోవడం, ఆచరణాత్మక భాగస్వామ్యాల ద్వారా భారత్ - ఆఫ్రికా సహకారాన్ని మరింత బలోపేతం చేయాలన్న సంకల్పంతో రౌండ్‌టేబుల్ సమావేశం ముగిసింది. సురక్షితమైన తాగునీరు, గౌరవప్రదమైన పారిశుధ్యం, వాతావరణ మార్పులను తట్టుకునే డబ్ల్యూఏఎస్‌హెచ్ సేవలను అందరికీ అందించడంలో పురోగతిని వేగవంతం చేసేందుకు అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య సహకారం ఎంతో కీలకమని చర్చలు స్పష్టం చేశాయి.
***
(రిలీజ్ ఐడి: 2314731)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7