బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బొగ్గు గనుల పరిణామక్రమం: కేటాయింపు నుంచి వేలం దాకా.. భారత్‌ వృద్ధికి దోహదం

నాడు పోస్టు చేయడమైనది: 24 SEP 2026 5:14PM by PIB Hyderabad

   ప్రతి యూనిట్ విద్యుత్తు సరఫరా వెనుక ఒక ప్రస్థానం తప్పనిసరి. ఓ ఇంట్లో దీపం వెలగాలన్నా, ఒక ఫ్యాక్టరీలో యంత్రాలు నడవాలన్నా, ఉక్కు లేదా సిమెంట్ కర్మాగారంలో ఉత్పత్తికి శ్రీకారం చుట్టాలన్నా… అంతకుముందే పరస్పరం ముడిపడుతూ వచ్చిన సుదీర్ఘ కార్యకలాపాల గొలుసు ఆ స్థాయికి చేరుస్తుంది.

దేశంలో నానాటికీ పెరిగే విద్యుత్తు డిమాండ్ వెనుక అంతే కీలకమైన మరో కథనం ఉంది. అదే- గని నుంచి వినియోగదారు వరకూ బొగ్గు ప్రస్థానం.. దాన్ని కొనసాగించే పంపిణీ వ్యవస్థ. గడచిన దశాబ్దంలో కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్‌) ఈ ప్రయాణానికి సరికొత్త రూపమిచ్చింది. అంటే- ఒకనాడు ప్రధానంగా సంప్రదాయ ప్రతిపాదన (నామినేషన్ పద్ధతిలో కేటాయింపు) ఆధారిత ఈ వ్యవస్థ, నేడు దీర్ఘకాలిక సరఫరాకు హామీతో పోటీతత్వ వేలంపాట, డిజిటల్ వేదిక, అధిక సౌలభ్య సహిత విస్తృత వ్యవస్థగా పరిణామం చెందింది.

ప్రతి వినియోగదారు కోసం ఓ మార్గం

సీఐఎల్‌ నేడు విభిన్న అవసరాల మేరకు అనేక రకాల సరఫరా మార్గాల్లో తన  వినియోగదారులకు సేవలందిస్తోంది. ఈ మేరకు ఇంధన సరఫరా ఒప్పందాలు (ఎఫ్‌ఎస్‌ఏ) విద్యుదుత్పాదన రంగానికి దీర్ఘకాలిక బొగ్గు లభ్యతలో పునాదిగా నిలుస్తున్నాయి. దాదాపు దశాబ్దం కిందట 2017లో ప్రభుత్వం ‘శక్తి’ (ఎస్‌హెచ్‌ఏకెటిఐ) విధానాన్ని ప్రవేశపెట్టింది. ఆ తర్వాత 2025లో దాన్ని సవరించడంతో విద్యుదుత్పత్తిదారులకు బొగ్గు కేటాయింపులో మరింత పారదర్శకత, పోటీతత్వం చేకూరాయి.

విద్యుత్తు రంగం కాకుండా ఇతర వినియోగదారుల కోసం 2016లో ప్రవేశపెట్టిన లింకేజ్ వేలంపాటలతో సిమెంటు, ఉక్కు, స్పాంజ్ ఐరన్, క్యాప్టివ్ పవర్ వంటి పరిశ్రమలకు దీర్ఘకాలిక సరఫరా దిశగా పోటీ బాటను సృష్టించాయి. ఇనుమడించిన పారదర్శకత, సమర్థ కేటాయింపుల యంత్రాంగం వల్ల మొత్తం విద్యుత్ రంగ లింకేజీ సుమారు 643 టన్నులు కాగా, ఇతర రంగాల లింకేజీ సుమారు 119 టన్నులుగా ఉంది.

లింకేజీలు, ‘ఎఫ్‌ఎస్‌ఏ’ల ద్వారా దీర్ఘకాలిక డిమాండ్‌ తీరుతుండగా, ఇ-వేలం ద్వారా స్వల్పకాలిక అవసరాలు తీరుతున్నాయి. వినియోగదారులు, వ్యాపారులు, ఎగుమతిదారులు తదితరులంతా ఒకే వేదికపై పోటీలో పాల్గొనేందుకు ఇ-వేలం యంత్రాగాలు తోడ్పడతాయి. ఇవి స్వల్పకాలిక బొగ్గు అవసరాలను తీర్చడమేగాక దేశంలో శక్తిమంతమైన, గతిశీల తక్షణ మార్కెట్ల వృద్ధికీ దోహదం చేస్తున్నాయి. ఏటా 10,000 టన్నులకన్నా తక్కువ అవసరమున్న చిన్న ‘ఎంఎస్‌ఎంఈ’లకు ప్రభుత్వ ప్రతిపాదిత సంస్థల (ఎస్‌ఎన్‌ఏ) ద్వారా సేవల పొందే అవకాశం ఉంటుంది.

మొత్తం మీద ఈ మార్గాలన్నీ మరింత ప్రతిస్పందనాత్మక పంపిణీ వ్యవస్థను సృష్టించాయి. వివిధ రంగాలు, వ్యవధులలో వినియోగదారుల అవసరాలను మెరుగ్గా ప్రతిబింబించేలా బొగ్గు సరఫరాకు ఇది వీలు కల్పిస్తుంది.

బొగ్గు కొనుగోళ్లు సులభతరం

బొగ్గు కొనుగోళ్లను సరళం, మరింత సమర్థం, వినియోగదారు హితంగా మార్చే దిశగా కృషి వల్ల కూడా బొగ్గు పంపిణీలో పరిణామశీల మార్పులు చోటుచేసుకున్నాయి.

ఇందులో భాగంగా విద్యుత్తు ‘ఎఫ్‌ఎస్‌ఏ’ల కోసం వీటి స్వరూపాన్ని సీఐఎల్ సవరించింది. ఇంతకుముందు సరఫరా చేసే ఇంధనం పరిమాణం (టన్నేజీ) ఆధారంగా ఒప్పందాలు కుదుర్చుకునే వారు. దీనికి భిన్నంగా ఇప్పుడు దేశంలో తొలిసారి వినియోగదారులకు స్థిరమైన పరిమాణంలో స్థూల దహన విలువ గల బొగ్గు సరఫరాపై ‘ఎఫ్‌ఎస్‌ఏ’లు రూపొందుతున్నాయి. చెల్లింపుల్లో జాప్యంపై వడ్డీని సీఐఎల్ సుమారు 14.65 నుంచి 8.25 శాతానికి తగ్గించింది. దీంతో ద్రవ్య లభ్యత మెరుగుపడి, విద్యుత్తు రంగంపై ఆర్థిక భారం తగ్గింది.

సీఐఎల్‌ 2014 నుంచి సుమారు 105 టన్నుల బొగ్గు లింకేజీని హేతుబద్ధీకరించింది. దీనివల్ల రవాణా వ్యయం తగ్గడమే కాకుండా దేశీయ బొగ్గు సమర్థ వినియోగం ద్వారా విద్యుత్తు రంగానికి ఏటా ₹7,500 కోట్లకు పైగా ఆదా కాగల అవకాశం ఉంది.

విద్యుదేతర రంగ వినియోగదారుల కోసం, ‘ఇ-బీజీ’ సదుపాయం, వేలానికి ముందే బొగ్గు నాణ్యత పరీక్ష, ఒకే పోటీదారు గుర్తింపుతో కింద బహుళ తుది వినియోగ ప్లాంట్ల నమోదు, రవాణా విధానాల్లో మరింత సౌలభ్యం తదితర చర్యలు కొనుగోలు ప్రక్రియను సులభం చేశాయి.

ఈ పరిణామంలో అధికశాతం ఇప్పుడు డిజిటల్ రూపేణా సాగుతోంది. ఈ మేరకు ఆన్‌లైన్ సమాచార వ్యవస్థలు, సమన్వయ సౌకర్యాలు, స్వతంత్ర నమూనా తనిఖీ ఏజెన్సీల పోర్టళ్లను కొనుగోలు-అమ్మకందారులతో అనుసంధానిస్తున్నారు. మరోవైపు ఫిర్యాదుల పరిష్కార పోర్టళ్లు, ఎస్‌ఏపీ అనుసంధానం, వినియోగదారు హిత వ్యవస్థలు సహా రైల్వే పోర్టళ్లతో అనుసంధానం కూడా చేపడుతున్నారు. ఉత్పత్తిదారులు, వినియోగదారులు, రవాణా సేవా ప్రదాతలు తమ కార్యాలయాల నుంచే సౌకర్యవంతంగా పరస్పరం సంభాషించుకునే విధానాన్ని ఈ చర్యలన్నీ రూపాంతరీకరించాయి. దీంతో బొగ్గు పంపిణీ ఇకపై తరలింపు ప్రక్రియకు పరిమితం కాదు. సరళ లభ్యత, పారదర్శకత, నిర్వహణ సౌలభ్యం అంతకంతకూ ఇనుమడిస్తోంది.

గని నుంచి మార్కెట్ దాకా… తరలింపు విస్తృతం

ఈ యావత్‌ ప్రస్థానంలో బొగ్గు ఉత్పాదన సగభాగం మాత్రమే. గని నుంచి వినియోగదారు దాకా బొగ్గు ఎలా తరలివెళ్తుందనేదే మిగిలిన సగం. ఈ కోణంలో పరికిస్తే- రైలు రవాణా మార్గంలో బొగ్గు తరలింపు 2015-16లో 272.9 టన్నులు కాగా, 2025-26లో 414.0 టన్నులకు పెరిగి, సుమారు 52 శాతం వృద్ధి నమోదైంది. సగటు రేక్ లోడింగ్ రోజుకు సుమారు 212.8 నుంచి 338 రేక్‌లకు పెరిగి, దాదాపు 59 శాతం వృద్ధిని సూచిస్తోంది. గనుల సమీపంలోని వినియోగదారులకు రోడ్డు మార్గంలో రవాణా 156.1 టన్నుల నుంచి 221.8 టన్నులకు పెరిగింది. ఇక మెర్రీ-గో-రౌండ్ (ఎంజీఆర్‌) వ్యవస్థల ద్వారా రవాణా 92.3 టన్నుల నుంచి 97.1 టన్నులకు పెరిగింది.

తదుపరి దశ తొలి అంచె అనుసంధానం (ఎఫ్‌ఎంసీ)... యాంత్రిక లోడింగ్, సైలోలు, బహుళ రవాణా సాధానాలలో కేంద్రీకృతమైంది. ఈ మేరకు సీఐఎల్ 843 మెట్రిక్ టన్నుల ప్రణాళికబద్ధ సామర్థ్యంతో 72 ‘ఎఫ్‌ఎంసీ’ ప్రాజెక్టులను చేపట్టింది. దీంతో ప్రస్తుత 151 టన్నుల సామర్థ్యం గల 20 సీహెచ్‌పీ-సైలోలతో కలిపి, 2028-29 నాటికి యాంత్రిక, వేగవంతమైన లోడింగ్ సామర్థ్యం 994 టన్నులకు చేరగలదని అంచనా. బొగ్గు తరలింపును మరింత వేగవంతం, విశ్వసనీయంగానే కాకుండా భవిష్యత్ ఉత్పత్తి స్థాయిలకు అనుగుణంగా మార్చడమే ఈ పెట్టుబడుల ఉద్దేశం.

భారత్‌తోపాటు వృద్ధి చెందుతున్న పంపిణీ వ్యవస్థ

విలువ వ్యవస్థలోని వివిధ భాగాలు మరింత ఏకీకృతం అవుతున్న తీరును బొగ్గు పంపిణీలో పురోగమనం ప్రతిబింబిస్తోంది.

బొగ్గు ఉత్పత్తి-కేటాయింపులు, వినియోగదారుల డిమాండ్‌-అవసరాలకు తగినట్లుగా ఉండాలి. అలాగే ఉత్పత్తికి తగిన రవాణా సదుపాయాలు, భవిష్యత్‌ స్థాయి అనుగుణ మౌలిక సదుపాయాలు ఉండాలి. ఈ యావత్‌ ప్రక్రియ సరళంగా, వేగంగా, మరింత పారదర్శకంగా పూర్తి కావడంలో డిజిటల్ వ్యవస్థలు తోడ్పడుతున్నాయి.

ఈ విధంగా బొగ్గు పంపిణీ ప్రక్రియ ప్రధానంగా కేటాయింపుపై దృష్టి సారించే వ్యవస్థ నుంచి ఉత్పత్తి, సరఫరా, లభ్యత, రవాణా, వినియోగదారు అవసరాలను అనుసంధానించే ఒక సమీకృత వ్యవస్థగా పరిణామం చెందింది.

దేశ ఇంధన అవసరాలు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి కాబట్టి, ఈ సమీకృత వ్యవస్థ బొగ్గు విలువ వ్యవస్థ అంతటా సీఐఎల్‌ మరింత చురుగ్గా, స్థిరంగా స్పందించే వెసులుబాటు కలుగుతుంది.

దేశంలో విస్తరిస్తున్న ఇంధన, బొగ్గు, ఆర్థిక అవసరాలకు తగినట్లుగా గని నుంచి విపణి వైపు పటిష్ట యంత్రాంగంతో సీఐఎల్‌ మద్దతునిస్తోంది. ఈ మేరకు బొగ్గు సరఫరాలో  విశ్వసనీయత, సామర్థ్యం, పారదర్శకతను నిరంతరం మెరుగుపరుస్తోంది.

 

***


(రిలీజ్ ఐడి: 2314706) సందర్శకుల సూచీ సంఖ్య : : 26
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी