బొగ్గు మంత్రిత్వ శాఖ
ఎన్ఎల్‌సీ ఇండియా: ఇంధన భద్రత, సుస్థిరతతో జాతీయ వృద్ధికి ఊతం
నాడు పోస్టు చేయడమైనది:
19 SEP 2026 6:40PM by PIB Hyderabad
2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారే దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో... దేశ ప్రగతికి నమ్మకమైన, సుస్థిరమైన విద్యుత్ శక్తి అత్యంత కీలకం. దేశానికి అవసరమైన నిరంతర విద్యుత్‌ను అందించడంతో పాటు, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించే రెండు ముఖ్యమైన సవాళ్లను సమర్థవంతంగా సమతుల్యం చేస్తూ ఎన్ఎల్‌సీ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎల్‌సీఐఎల్) దూసుకుపోతోంది. బొగ్గు మంత్రిత్వ శాఖ పరిధిలోని ఈ 'నవరత్న' ప్రభుత్వ సంస్థ ప్రస్తుతం 8,405 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని, 59.10 ఎంటీపీఏ మైనింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. భారత 'పంచామృత్' వాతావరణ లక్ష్యాలకు అండగా నిలుస్తూ... ఈ సంస్థ కేవలం ఒక సాధారణ మైనింగ్ కంపెనీగానే కాకుండా, అన్ని రకాల ఇంధన వనరులు కలిగిన భవిష్యత్తుకు సిద్ధమైన ఒక సమగ్ర శక్తి కేంద్రంగా తన రూపాన్ని వేగంగా మార్చుకుంటోంది.
ఇంధన భద్రత: ఆర్థిక విస్తరణకు విశ్వసనీయమైన ఇంధనం అత్యంత కీలకం. బొగ్గు, లిగ్నైట్ దేశానికి బేస్‌లోడ్ విద్యుత్ కోసం ప్రధాన ఆధారంగా కొనసాగుతున్నాయి. పర్యావరణ అనుకూల విధానంలో భారత విద్యుత్ అవసరాలను తీర్చడం కోసం... ఎన్ఎల్‌సీఐఎల్ ఉత్పత్తి విధానాన్ని ఆధునికీకరిస్తూనే, బాధ్యతాయుత విధానంలో తన మైనింగ్ కార్యకలాపాలనూ విస్తరిస్తోంది.
సామర్థ్యం పెంపు: దిగుమతులపై ఆధారపడటాన్ని నివారించేందుకు... మొత్తం మైనింగ్ సామర్థ్యాన్ని 2030 నాటికి 59.1 ఎంటీపీఏ నుంచి 104.35 ఎంటీపీఏకు పెంచడం, 2047 నాటికి దానిని 115.85 ఎంటీపీఏ స్థాయికి విస్తరించడం లక్ష్యంగా సంస్థ పురోగమిస్తోంది.
అధిక-సమర్థత, తక్కువ-ఉద్గార (హెచ్ఈఎల్ఈ) ఆధారిత ఉత్పత్తి: కాలుష్యాన్ని, బొగ్గు వాడకాన్ని బాగా తగ్గించడం కోసం సరికొత్త సాంకేతికతతో కూడిన థర్మల్ విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఘటంపూర్ (1,980 మెగావాట్లు), తలబీరా (2,400 మెగావాట్లు), మచ్చకట్ట (4,000 మెగావాట్లు) ప్రాంతాల్లో అత్యాధునిక పవర్ ప్రాజెక్టులను నిర్మిస్తున్నారు.
ఎఫ్ఎంసీ ద్వారా రవాణా సామర్థ్యం పెంపు: పచ్వారా సౌత్, నార్త్ ధాడు (వెస్ట్), తలబీరా, మచ్చకట్ట, న్యూ పాత్రాపరా (సౌత్) రైల్వే కారిడార్లలో 'ఫస్ట్ మైల్ కనెక్టివిటీ' (ఎఫ్ఎంసీ) ప్రాజెక్టుల ద్వారా ఏటా 63.5 మిలియన్ టన్నుల (ఎంటీపీఏ) సామర్థ్యంతో బొగ్గు రవాణా సౌకర్యాలను అందుబాటులోకి తెస్తున్నారు. ఇది రోడ్డు రవాణా వల్ల వచ్చే కాలుష్యాన్ని, చమురుపై ఆధారపడటాన్ని పూర్తిగా నిరోధించడమే కాకుండా, రవాణా ప్రక్రియనూ మరింత వేగవంతం చేస్తుంది.
పునరుత్పాదక ఇంధనం: ఎన్ఎల్‌సీఐఎల్ సంస్థ తన ప్రత్యేక హరిత విభాగమైన ఎన్ఎల్‌సీఐఎల్ రిన్యూవెబుల్స్ లిమిటెడ్ (ఎన్ఐఆర్ఎల్) ద్వారా భారత పరిశుద్ధ ఇంధన రంగాన్ని చురుగ్గా అభివృద్ధి చేస్తోంది.
2030 నాటికి 10 గిగావాట్లు: ప్రస్తుతం అందుబాటులో ఉన్న సుమారు 1.8 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన పోర్ట్‌ఫోలియోను 2030 నాటికి 10 గిగావాట్లకు పైగా పెంచడం (దీనిని 2047 నాటికి 32.7 గిగావాట్లకు విస్తరించడం) ద్వారా, నిర్దేశిత గడువు కంటే ముందే తన మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో 50 శాతం పర్యావరణ అనుకూల ఇంధన భాగస్వామ్యాన్ని ఈ సంస్థ సాధించనుంది.
బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (బీఈఎస్ఎస్): ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల్లో... తమిళనాడులో 250 మెగావాట్లు / 500 మెగావాట్ అవర్స్, రాజస్థాన్‌లో ఎస్ఈసీఐతో కలిసి 300 మెగావాట్లు / 1800 మెగావాట్ అవర్స్, గుజరాత్‌లో జీయూవీఎన్ఎల్‌తో కలిసి 275 మెగావాట్లు / 550 మెగావాట్ అవర్స్, పశ్చిమ బెంగాల్ (డబ్ల్యూబీఎస్ఈడీఎల్)లో 50 మెగావాట్లు / 200 మెగావాట్ అవర్స్ సామర్థ్యం గల ప్రాజెక్టులు భాగంగా ఉన్నాయి.
పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు (పీఎస్‌పీ): పునరుత్పాదక ఇంధన గ్రిడ్ వైవిధ్యాలను (హెచ్చుతగ్గులను) సమతుల్యం చేయడం కోసం తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లో భారీ స్థాయి నిల్వ సామర్థ్యాలను (స్టోరేజ్ అసెట్స్) ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో సంస్థ పురోగమిస్తోంది.
ఇతర విభిన్న రకాల ప్రాజెక్టులు: ప్రపంచవ్యాప్తంగా ముడిసరుకు సరఫరాలో వచ్చే సమస్యల నుంచి దేశాన్ని కాపాడటానికి, కాలుష్యం లేని పరిశ్రమలను ప్రోత్సహించడానికి ఎన్ఎల్‌సీఐఎల్ మరిన్ని సరికొత్త ప్రాజెక్టులను చేపడుతోంది.
గ్రీన్ హైడ్రోజన్ - సీసీఎస్: నెయ్వేలిలో 4 మెగావాట్ల సోలార్ పవర్డ్ పీఈఎమ్ ఎలక్ట్రోలైజర్ ఆధారిత 'గ్రీన్ హైడ్రోజన్' పైలట్ ప్లాంట్‌ను నిర్మిస్తోంది. అత్యాధునిక కార్బన్ క్యాప్చర్ సిస్టమ్స్ విషయంగా ఐఐటీ మద్రాస్‌తో కలిసి పనిచేస్తోంది.
ఖనిజ రంగంలో వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి: అంతర్జాతీయ సరుకు రవాణా వ్యవస్థలపై ఆధారపడటాన్ని తగ్గించి, దేశీయంగా స్వయం-సమృద్ధి సాధించడం కోసం ఎన్ఎల్‌సీఐఎల్ సంస్థ చత్తీస్‌గఢ్‌లో ఫాస్ఫోరైట్, సున్నపురాయి... తెలంగాణలో వెనేడియం, టైటానియం ఖనిజాల అన్వేషణకు దేశీయ కాంపోజిట్ లైసెన్సులను పొందింది. కీలక ఖనిజాల కోసం కేఏబీఐఎల్ సంస్థ ద్వారా విదేశాల్లోనూ ఖనిజ అన్వేషణకు అవకాశాలను పరిశీలిస్తోంది.
స్వయం-సమృద్ధ భారత్‌ను సాధించాలనే జాతీయ దార్శనికతకు అనుగుణంగా ముందుకు సాగుతున్న ఎన్ఎల్‌సీ ఇండియా లిమిటెడ్... దేశ ఇంధన భద్రతకు హామీ ఇవ్వడమే కాకుండా, భవిష్యత్తు కోసం తక్కువ కార్బన్ ఉద్గారాలతో కూడిన లాభదాయకమైన వ్యాపారాలు, సరికొత్త పర్యావరణ అనుకూల ప్రాజెక్టులకు బలమైన పునాది వేస్తోంది.
***
(రిలీజ్ ఐడి: 2312827)
సందర్శకుల సూచీ సంఖ్య : : 4