భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

విశాఖపట్నంలో 'నిర్మల్ సాగర్' పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం

నాడు పోస్టు చేయడమైనది: 19 SEP 2026 3:55PM by PIB Vijayawada

భారత ప్రభుత్వ భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖకు చెందిన 'ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్' (INCOIS - ఇన్కాయిస్, హైదరాబాద్), ఆంధ్ర విశ్వవిద్యాలయం మరియు విజ్ఞాన భారతి (VIBHA) లతో కలిసి విశాఖపట్నంలో సముద్ర వ్యర్థాలను పరిశీలించే తొలి సమగ్ర వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు 'నిర్మల్ సాగర్' (నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ రెమిడియేషన్ ఆఫ్ మెరైన్ లిటర్) పైలట్ ప్రాజెక్ట్‌ను 2026 సెప్టెంబర్ 19 (శనివారం) నాడు ప్రారంభించింది. వారం రోజుల పాటు జరిగిన 'స్వచ్ఛ సాగర్ సురక్షిత్ సాగర్ 5.0' ప్రచార ముగింపు సందర్భంగా ఆర్‌కే బీచ్ సమీపంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సభలో విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు శ్రీ ఎం. శ్రీభరత్ మరియు ఇతర ప్రముఖుల సమక్షంలో భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ టి. శ్రీనివాస కుమార్ ఈ పైలట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఇన్కాయిస్ డైరెక్టర్ డాక్టర్ టి.ఎం. బాలకృష్ణన్ నాయర్ తన స్వాగతోపన్యాసంలో మాట్లాడుతూ... ఓషన్ మోడలింగ్, శాటిలైట్ రిమోట్ సెన్సింగ్, కృత్రిమ మేధ (AI/ML) ఆధారిత సాధనాలను ఉపయోగించడం ద్వారా ఈ కార్యక్రమం సముద్ర వ్యర్థాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తిస్తుందని, అలాగే అంచనా వేసి సమష్టిగా శుభ్రపరిచే చర్యలకు మద్దతు ఇస్తుందని తెలిపారు. స్వచ్ఛ సాగర్ సురక్షిత్ సాగర్ మిషన్ మరియు ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా, సముద్రాన్ని మరింత స్వచ్ఛంగా, ఆరోగ్యకరంగా ఉంచడానికి శాస్త్రీయ సహకారాన్ని అందించడంతో పాటు సమాజ భాగస్వామ్యాన్ని మరియు విధానపరమైన మద్దతును ప్రోత్సహించడం 'నిర్మల్ సాగర్' లక్ష్యమని చెప్పారు.

విశాఖపట్నం గౌరవ ఎంపీ శ్రీ ఎం. శ్రీభరత్ తన ప్రత్యేక ప్రసంగంలో... నగరంలోని బహిరంగ కాలువల ద్వారా ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రంలోకి చేరకుండా చూసేందుకు భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ సాంకేతిక మరియు మౌలిక సదుపాయాల మద్దతును అందించాలని విజ్ఞప్తి చేశారు.

భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ గౌరవ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) డాక్టర్ జితేంద్ర సింగ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరై ప్రసంగించారు. స్వచ్ఛ సాగర్, సురక్షిత్ సాగర్ సాధించాలనే గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కలను సాకారం చేయడంలో సహకరించిన స్వచ్ఛంద సేవకులకు, అధికారులందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.

భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ టి. శ్రీనివాస కుమార్ తన ప్రారంభోపన్యాసంలో... వివిధ పథకాలు, ప్రాజెక్టుల ద్వారా స్వచ్ఛమైన మరియు ఆరోగ్యకరమైన సముద్రాలను పెంపొందించడానికి మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. నిర్మల్ సాగర్ వంటి కార్యక్రమాల అమలు ద్వారా విశాఖపట్నానికి భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ మద్దతు ఇస్తుందని హామీ ఇచ్చారు. ఈ పైలట్ దశలో విశాఖపట్నం పరిసర ప్రాంతాలలో సముద్ర ప్లాస్టిక్ వ్యర్థాల మూలాలను గుర్తించడం, వాటి కదలికలను పరిశీలించడం, వ్యర్థాలు పేరుకుపోయే ప్రాంతాలను గుర్తించడం మరియు సర్క్యులర్ ఎకానమీకి మద్దతుగా ప్లాస్టిక్ వ్యర్థాలను పునర్వినియోగం చేసే వ్యూహాలను రూపొందించడానికి విస్తృత శాస్త్రీయ అధ్యయనాలు నిర్వహిస్తారని వెల్లడించారు.

అనంతరం గౌరవ ఎంపీ శ్రీ శ్రీభరత్ సభలోని వారితో 'స్వచ్ఛ సాగర్ సురక్షిత్ సాగర్' ప్రతిజ్ఞ చేయించారు.

ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జి.పి. రాజా శేఖర్, భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ శ్రీ జి. శ్రీనివాసరావు, సదరన్ నావల్ కమాండ్ చీఫ్ స్టాఫ్ ఆఫీసర్ రియర్ అడ్మిరల్ గోకుల్ కృష్ణ దత్తా వీఎస్ఎమ్, కోస్ట్ గార్డ్ కమాండర్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ అనురాగ్ కౌశిక్ టీఎమ్ మరియు విజ్ఞాన భారతి (విభా) కార్యదర్శి శ్రీ వివేకానంద పాయ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్, ఆంధ్ర విశ్వవిద్యాలయం, మత్స్యకార సంఘాలు, వివిధ సంస్థల శాస్త్రవేత్తలు, విద్యార్థులు మరియు సాధారణ ప్రజలతో కలిపి 1300 మందికి పైగా భాగస్వాములు హాజరై సముద్ర వ్యర్థాల సమస్యపై తమ ఆలోచనలను పంచుకున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయ పరిధిలోని సెంటర్ ఫర్ బే ఆఫ్ బెంగాల్ స్టడీస్ డైరెక్టర్ ప్రొఫెసర్ శైలజ ధన్యవాద సమర్పణతో ఈ సమావేశం ముగిసింది.

కార్యక్రమం అనంతరం ఆర్‌కే బీచ్ రోడ్డులో 'స్వచ్ఛ సాగర్ సురక్షిత్ సాగర్' చొరవపై అవగాహన పెంచేందుకు పాల్గొన్న వారందరూ భారీ మానవహారంగా ఏర్పడ్డారు. బహిరంగ సభ ముగిసిన తర్వాత స్వచ్ఛంద సేవకులు ఆర్‌కే బీచ్‌ను శుభ్రపరిచే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ ఈవెంట్‌తో పాటు, 'ప్లాటిపస్ ఎస్కేప్స్' సంస్థ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 18 (శుక్రవారం) నాడు విశాఖ బీచ్ తీరంలో నీటి అడుగున వ్యర్థాలను శుభ్రపరిచే కార్యక్రమాన్ని నిర్వహించారు.

****


(రిలీజ్ ఐడి: 2312545) సందర్శకుల సూచీ సంఖ్య : : 15
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English