సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

విక‌సిత భార‌త్ 2047 ల‌క్ష్య సాధ‌న‌లో యువ‌త కీల‌క‌పాత్ర పోషించాలి: కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి


హైద‌రాబాద్‌లో 20వ విడ‌త రోజ్‌గార్ మేళా ప్రారంభించిన కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి

నాడు పోస్టు చేయడమైనది: 19 SEP 2026 5:34PM by PIB Hyderabad

2047 నాటికి భారతదేశాన్ని వికసిత్ భారత్‌గా తీర్చిదిద్దాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ లక్ష్య సాధన‌లో యువ‌త కీల‌క‌పాత్ర పోషించాల‌ని కేంద్ర బొగ్గు, గ‌నుల శాఖ మంత్రి శ్రీ జి.కిష‌న్‌రెడ్డి పిలుపునిచ్చారు. హైద‌రాబాద్‌లోని మాదాపూర్‌లో ఆదాయ ప‌న్ను శాఖ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన రోజ్‌గార్ మేళాను శ‌నివారం ఆయ‌న ప్రారంభించారు. కొత్త‌గా వివిధ కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ‌ల్లో ఉద్యోగాల‌కు ఎంపికైన 360 మంది అభ్య‌ర్థుల‌కు నియామ‌క ప‌త్రాలు అంద‌జేశారు.

దేశ‌వ్యాప్తంగా 51,000 మందికి పైగా అభ్య‌ర్థుల‌కు ఉద్యోగ‌ నియామ‌క‌ప‌త్రాలు అందించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం 45 ప్రాంతాల్లో శ‌నివారం 20వ విడ‌త‌ రోజ్‌గార్ మేళాను నిర్వ‌హించింది. ఈ కార్య‌క్ర‌మాన్ని ఉద్దేశించి ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ప్ర‌సంగించారు.

హైద‌రాబాద్‌లో నిర్వ‌హించిన‌ రోజ్‌గార్ మేళాను ప్రారంభించిన అనంత‌రం శ్రీ కిష‌న్‌రెడ్డి మాట్లాడుతూ... 20 విడ‌త‌ల్లో రోజ్‌గార్ మేళాల ద్వారా కేంద్ర‌ప్ర‌భుత్వం దాదాపు 13 ల‌క్ష‌ల మంది దేశ యువ‌త‌కు ప్ర‌భుత్వ ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పించింద‌ని పేర్కొన్నారు. ఒక‌వైపు ప్ర‌భుత్వ ఉద్యోగాల‌ను క‌ల్పిస్తూనే మ‌రోవైపు ఇత‌ర రంగాల్లోనూ ఉద్యోగాల సృష్టిని కేంద్రం ప్రోత్స‌హిస్తోంద‌ని అన్నారు. ఈ దిశ‌గానే ప్ర‌స్తుతం పెట్టుబ‌డుల‌కు భార‌త్ గ‌మ్య‌స్థానంగా మారింద‌ని, ప్ర‌పంచంలోనే ఎక్కువ స్టార్ట‌ప్‌లు క‌లిగిన దేశాల్లో ముందంజ‌లో ఉంద‌ని ప్ర‌ధానంగా ప్ర‌స్తావించారు.

యువ‌త కేవ‌లం ఉద్యోగాలు ఆశించే వారిగా ఉండిపోవ‌ద్ద‌ని, ఉద్యోగాలు సృష్టించే వారిగా ఆలోచించాల‌ని, ఈ దిశ‌గా కేంద్ర ప్ర‌భుత్వం అనేక కార్య‌క్ర‌మాలు చేప‌ట్టిన‌ట్టు తెలిపారు. ముఖ్యంగా ఏఐ, రోబోటిక్స్, సెమీకండక్టర్స్, సైబర్ సెక్యూరిటీ, డ్రోన్ టెక్నాలజీ, 3డీ ప్రింటింగ్, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాలు భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను సృష్టించగలవని, వీటిపైన యువ‌త దృష్టి సారించాల‌ని సూచించారు. భారతదేశంలో ప్ర‌తిభ‌, నైపుణ్యాలు క‌లిగిన మాన‌వ‌వ‌న‌రులు, స్టార్టప్‌లకు అపారమైన అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాలను ఉపయోగించుకుని దేశానికి మరిన్ని పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలను తీసుకురావాలి యువ‌త‌కు శ్రీ కిష‌న్‌రెడ్డి సూచించారు.

నూత‌నంగా ఉద్యోగాల‌కు ఎంపికైన అభ్య‌ర్థుల‌ను ఉద్దేశించి శ్రీ కిష‌న్‌రెడ్డి ప‌లు సూచ‌న‌లు చేశారు. విక‌సిత భార‌త్ ల‌క్ష్య‌సాధ‌న కోసం నిబ‌ద్ధ‌త‌, బాధ్య‌త‌తో ప‌నిచేయాల‌ని కోరారు. ఉద్యోగాలు వ‌చ్చిన‌ప్ప‌టికీ కొత్త విష‌యాలు నేర్చుకోవ‌డం మాత్రం ఆప‌కూడ‌ద‌ని, అధునాత‌న సాంకేతిక‌త‌లు, నైపుణ్యాల‌ను అందిపుచ్చుకోవాల‌ని సూచించారు. ప్ర‌భుత్వ ఉద్యోగం అంటే ఉద్యోగ భ‌ద్ర‌త మాత్ర‌మే కాద‌ని, ప్ర‌జ‌ల‌కు సేవ చేసే బాధ్య‌త అనే విష‌యాన్ని గుర్తుంచుకోవాల‌ని కోరారు. ఉద్యోగాల్లో చేరిన త‌ర్వాత సైతం త‌మ కోసం క‌ష్ట‌ప‌డిన త‌ల్లిదండ్రుల‌ను, పుట్టి, పెరిగిన ఊరిని, చ‌దువుకున్న బ‌డిని మ‌ర్చిపోవ‌ద్ద‌ని అన్నారు. పేద‌ల సంక్షేమ‌, దేశాభివృద్ధి కోసం ప‌నిచేయాల‌ని సూచించారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆదాయపు ప‌న్ను శాఖ‌ తెలంగాణ‌, ఏపీ ప్రిన్సిప‌ల్ చీఫ్ క‌మిష‌న‌ర్ శ్రీ సురేశ్ బ‌త్తిని, ఆదాయపు ప‌న్ను శాఖ ఇన్‌వెస్టిగేష‌న్ డీజీ శ్రీ రాజ‌ర్షీ ద్వివేది, అదాయ‌పు ప‌న్ను శాఖ హైద‌రాబాద్ చీఫ్ క‌మిష‌న‌ర్ శ్రీమ‌తి సునీత బెల్లా త‌దిత‌రులు పాల్గొన్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2312443) సందర్శకుల సూచీ సంఖ్య : : 15
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English