ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మోసపూరితంగా రూ. 25.22 కోట్లకు పైగా విలువైన ఐటీసీని పొందిన సంస్థను గుర్తించి, ఆ వ్యవహారాన్ని భగ్నం చేసిన ఢిల్లీ సౌత్ సీజీఎస్టీ అధికారులు: ప్రొప్రైటర్ అరెస్టు

నాడు పోస్టు చేయడమైనది: 18 SEP 2026 2:26PM by PIB Hyderabad

నకిలీ ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) క్లెయింలపై కొనసాగుతున్న తనిఖీల్లో భాగంగా కేంద్ర వస్తు, సేవల పన్ను (సీజీఎస్టీ) ఢిల్లీ సౌత్ కమిషనరేట్‌కు చెందిన పన్ను ఎగవేత నిరోధక విభాగం అధికారులు ఒక పెద్ద మోసాన్ని బయటపెట్టారు. దాదాపు రూ. 140.14 కోట్ల బోగస్ ఇన్‌వాయిస్‌ల ద్వారా దాదాపు రూ. 25.22 కోట్లకు పైగా అర్హత లేని ఐటీసీని అక్రమంగా పొందడం, వినియోగించడం, ఇతరులకు బదిలీ చేసిన కేసులో.. ఇనుము, ఉక్కు వస్తువుల వ్యాపారంలో ఉన్న ఒక సంస్థ ప్రొప్రైటర్‌ను అధికారులు అరెస్ట్ చేశారు.

ఉనికిలో లేని, ప్రస్తుతం పనిచేయని, నిలిచిపోయిన లేదా రద్దయిన పలు సంస్థలు జారీ చేసిన ఇన్వాయిస్‌ల ఆధారంగా.. అర్హత లేని ఐటీసీని ఆ సంస్థ పొందినట్టు విచారణలో వెల్లడైంది. అంతేకాకుండా కొందరు సరఫరాదారులు తాము నమోదు చేసుకున్న వ్యాపార ప్రాంగణాల్లో ఎలాంటి వాస్తవిక వ్యాపార కార్యకలాపాలు నిర్వహించడం లేదని కూడా క్షేత్రస్థాయి పరిశీలనలో తేలింది.

సరుకులు అందకుండానే ఐటీసీని వినియోగించుకున్నారని, అలాగే సరుకుల సరఫరా చేయకుండానే జారీ చేసిన ఇన్‌వాయిస్‌ల ద్వారా ఆ మొత్తాన్ని ఇతరులకు బదిలీ చేశారని తదుపరి విచారణలో రుజువైంది.

విచారణలో లభించిన ఆధారాలు, సీజీఎస్టీ చట్టం - 2017 లోని సెక్షన్ 70 కింద నమోదు చేసిన వాంగ్మూలాల ఆధారంగా.. 2026 సెప్టెంబర్ 17న సెక్షన్ 69 కింద నిందితుడిని అరెస్టు చేశారు. అనంతరం పటియాలా హౌస్ కోర్టు ఎదుట హాజరుపరచగా.. న్యాయస్థానం అతడికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.  


(రిలీజ్ ఐడి: 2312138) సందర్శకుల సూచీ సంఖ్య : : 3
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Gujarati , Urdu , हिन्दी , Bengali