బొగ్గు మంత్రిత్వ శాఖ
వాణిజ్య బొగ్గు గనుల వేలం 16వ విడతను విజయవంతంగా ప్రారంభించిన బొగ్గు మంత్రిత్వశాఖ... ఆరు బొగ్గు గనులకు సంబంధించి సీఎండీపీఏ ఒప్పందాలు
నాడు పోస్టు చేయడమైనది:
17 SEP 2026 5:13PM by PIB Hyderabad
వాణిజ్య బొగ్గు గనుల 16వ విడత వేలం ప్రక్రియను 2026 సెప్టెంబర్ 17న న్యూఢిల్లీలో బొగ్గు మంత్రిత్వశాఖ విజయవంతంగా ప్రారంభించింది. గౌరవ బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి శ్రీ సతీశ్ చంద్ర దూబే ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా శ్రీ సతీశ్ చంద్ర దూబే 16వ విడత వాణిజ్య బొగ్గు గనుల వేలాన్ని ప్రారంభించారు. అలాగే బొగ్గు మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ విక్రమ్ దేవదత్‌తో కలిసి.. అంతకుముందు విడతలలో వేలం వేసిన ఆరు బొగ్గు గనులను దక్కించుకున్న బిడ్డర్లకు బొగ్గు గనుల అభివృద్ధి, ఉత్పత్తి ఒప్పందాలను (సీఎండీపీఏలు) అందించారు.
తారా (సవరించిన), మార్గో వెస్ట్, మార్గో ఈస్ట్, మండ్లా సౌత్, డోంగరీ తాల్-II, డిప్ సైడ్ ఆఫ్ పీకేఓసీ గనులకు సంబంధించి ఈ సీఎమ్‌డీపీఏలు కుదిరాయి. సీజీ సిన్‌గ్యాస్ - కెమికల్స్ లిమిటెడ్, జార్ఖండ్ ఎక్స్‌ప్లోరేషన్ - మైనింగ్ కార్పొరేషన్ లిమిటెడ్, క్యూబ్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్, గ్యాలెంట్ ఇస్పాత్ లిమిటెడ్, ది సింగరేణి కాలరీస్ లిమిటెడ్‌లు వేలంలో గనులను దక్కించుకున్నాయి.
ఈ ఆరు గనుల్లో కలిపి దాదాపు 1,504 మిలియన్ టన్నుల భూగర్భ బొగ్గు నిల్వలుండగా.. వార్షిక గరిష్ట ఉత్పత్తి సామర్థ్యం 11.62 మిలియన్ టన్నులు. ఇవి అందుబాటులోకి వస్తే.. ఏటా దాదాపు రూ. 1,984 కోట్ల ఆదాయాన్ని సమకూర్చడమే కాకుండా, దాదాపు రూ. 1,743 కోట్ల మూలధన పెట్టుబడులను ఆకర్షిస్తాయనీ, ఆయా బొగ్గు నిల్వలున్న ప్రాంతాల్లో దాదాపు 15,700 మందికి ఉపాధి అవకాశాలను కల్పిస్తాయనీ అంచనా.
తొమ్మిది బొగ్గు నిల్వలున్న రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్, బీహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌లలో మొత్తం 25 బొగ్గు బ్లాకులను 16వ విడతలో వేలం వేస్తున్నారు. వీటిలో పూర్తిగా పరిశీలించిన గనులు 21 ఉండగా, నాలుగు గనుల్లో అన్వేషణ పాక్షికంగా పూర్తయింది. ఈ 25 బొగ్గు గనుల్లో... ఆరింటిని బొగ్గు గనుల (ప్రత్యేక నిబంధనలు) చట్టం (సీఎంఎస్పీ) కింద, మిగతా 19 గనులను గనులు, ఖనిజాల (అభివృద్ధి, నియంత్రణ) చట్టం (ఎంఎండీఆర్) కింద కేటాయిస్తున్నారు. సరళీకృత వాణిజ్య బొగ్గు మైనింగ్ విధానం కింద.. అనుభవం కలిగిన మైనింగ్ కంపెనీలు, కొత్తగా వచ్చే సంస్థలు, సాంకేతికత చోదకంగా నడిచే సంస్థలకు ఈ వేలంలో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు. ఈ విధానంలో తుది వినియోగంపై ఎలాంటి ఆంక్షలూ లేవు. ముందస్తు అనుమతుల అవసరం లేకుండానే 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి ఉంది. అలాగే ముందస్తు చెల్లింపులు కూడా తక్కువగానే ఉన్నాయి. వీటిని భవిష్యత్ ఆదాయ వాటాలో సర్దుబాటు చేసుకునే సదుపాయం ఉంది.
ఈ దఫా వేలం ప్రారంభవడంతో.. 2020లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రంగంలో వాణిజ్యపరమైన బొగ్గు గనుల తవ్వకాన్ని అందుబాటులోకి తెచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం పదహారు విడతలు పూర్తయ్యాయి. బొగ్గు నిల్వలున్న తొమ్మిది రాష్ట్రాల్లో ఇప్పటివరకు మొత్తం 147 బొగ్గు గనులను వేలం వేయగా.. వీటి ద్వారా ఏటా రూ.47,500 కోట్లకు పైగా ఆదాయం, రూ.55,000 కోట్లకు పైగా మూలధన పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నారు.
న్యూఢిల్లీలో 16వ విడత వాణిజ్య బొగ్గు గనుల వేలం ప్రారంభోత్సవంలో గౌరవ బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి శ్రీ సతీశ్ చంద్ర దూబే మాట్లాడుతూ... దేశ వృద్ధిలో బొగ్గు ఎంతటి కీలకమైన పాత్ర పోషిస్తుందో వివరించారు. దేశ ప్రాథమిక ఇంధన అవసరాల్లో దాదాపు 55 శాతం, విద్యుదుత్పత్తిలో 70 శాతానికి పైగా బొగ్గు రంగమే తీరుస్తుందని తెలిపారు. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మార్గనిర్దేశంలో బొగ్గు ఉత్పత్తిలో సాధిస్తున్న అద్భుత పురోగతి సాధిస్తోందని తెలిపారు. వరసగా రెండో సంవత్సరం కూడా బొగ్గు ఉత్పత్తి 1 బిలియన్ టన్నుల మార్కును దాటిందన్నారు. దేశీయ బొగ్గు రంగం సమర్థతను, దేశ ఇంధన భద్రతలో పెరుగుతున్న బొగ్గు రంగం వాటాకు ఇది నిదర్శనమన్నారు.
మరింత పారదర్శకత, పోటీతత్వం, సాంకేతికతతో కూడిన విధానాల ద్వారా... బొగ్గు రంగంలో విప్లవాత్మక మార్పులను తెచ్చేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను శ్రీ దూబే వివరించారు. భాగస్వాములందరికీ సమాన అవకాశాలను కల్పించడం, పెట్టుబడులకు - వాణిజ్య బొగ్గు మైనింగ్‌లో విస్తృత భాగస్వామ్యానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం అత్యావశ్యకమన్నారు. దేశీయ బొగ్గు వనరుల వినియోగాన్ని పెంచడం, ఉత్పత్తిని వేగవంతం చేయడం, దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించడంతోపాటు.. అందుబాటులో ఉన్న నిల్వలను సమర్థంగా, సుస్థిర పద్ధతుల్లో సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే వాణిజ్య బొగ్గు గనుల వేలం ప్రక్రియలో క్రియాశీలంగా పాల్గొని, దేశ ఇంధన భద్రతను మరింత బలోపేతం చేయడానికి తోడ్పడాలని భాగస్వామ్యపక్షాలకు ఆయన పిలుపునిచ్చారు.
అదనపు కార్యదర్శి, నామినేటెడ్ అధికారి శ్రీమతి రూపీందర్ బ్రార్ స్వాగతోపన్యాసం చేశారు. దేశ బొగ్గు రంగాన్ని పారదర్శకమైన, సాంకేతికతా చోదక, పోటీతత్వంతో కూడిన వ్యవస్థగా నిలపడమే ఈ కార్యక్రమ లక్ష్యమని ఆమె వివరించారు. వృద్ధికి, వికాసానికి, పురోగతికి ఇంధనమే ప్రధానమని పేర్కొంటూ... ఇటీవల క్యాప్టివ్, వాణిజ్య గనుల నుంచి బొగ్గు ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని తెలిపారు.
దేశీయ వనరుల వెలికితీత, ఉత్పత్తిని వేగవంతం చేయడం, పెట్టుబడులను ఆకర్షించడం, కొత్త అవకాశాలను సృష్టించడంలో బొగ్గు రంగానికి అపారమైన అవకాశాలున్నాయని శ్రీమతి బ్రార్ పేర్కొన్నారు. వాణిజ్య బొగ్గు మైనింగ్ కోసం అనుకూలమైన, పారదర్శక వాతావరణాన్ని నెలకొల్పే దిశగా.. భాగస్వామ్య పక్షాల సందేహాలను, సమస్యలను నివృత్తి చేస్తూ, వారితో ఎప్పటికప్పుడు చర్చించేందుకు నామినేటెడ్ అధికారి కార్యాలయం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు.
16వ విడత వాణిజ్య బొగ్గు గనుల వేలం ప్రారంభోత్సవంలో బొగ్గు మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ సనోజ్ కుమార్ ఝా మాట్లాడుతూ పలు కీలక విషయాలను వెల్లడించారు. దేశంలో సమృద్ధిగా ఉన్న బొగ్గు వనరులను వినూత్నంగా ఉపయోగించుకోవడానికి, వాటి విలువను పెంచడానికి ‘గ్యాసిఫికేషన్’ ప్రధాన మార్గమని, దీనిపై దృష్టి పెడుతున్నామని పేర్కొన్నారు. తదుపరి తరం బొగ్గు వినియోగానికి అనుగుణంగా.. సాంకేతిక పరిజ్ఞానాన్ని వేగంగా అందిపుచ్చుకోవాలని, దానికి తగిన వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. దేశ అవసరాలకు తగిన పరిష్కారాలను అభివృద్ధి చేస్తూనే.. అంతర్జాతీయంగా అందుబాటులో ఉన్న అత్యుత్తమ సాంకేతికతలు, విధానాల నుంచి నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. సాంకేతికత, ఆవిష్కరణలు, అంతర్జాతీయ నైపుణ్యాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా.. బొగ్గు వినియోగంలో కొత్త అవకాశాలను అందుకోవచ్చని, తద్వారా బొగ్గు రంగాన్ని మరింత సమర్థంగా, సుస్థిరంగా, భవిష్యత్ సన్నద్ధంగా ఉండేలా తీర్చిదిద్దవచ్చని ఆయన పేర్కొన్నారు.
దేశ దీర్ఘకాలిక ఇంధన భద్రత లక్ష్యాలకు అనుగుణంగా.. బొగ్గు రంగంలో సంస్కరణలను ముందుకు తీసుకెళ్లడానికి, విస్తృత భాగస్వామ్యంతోపాటు పెట్టుబడులను ప్రోత్సహించడానికి, అందుబాటు ధరల్లో విశ్వసనీయంగా ఇంధనాన్ని సరఫరా చేయడానికి బొగ్గు మంత్రిత్వశాఖ కట్టుబడి ఉంది.
****
(రిలీజ్ ఐడి: 2312065)
సందర్శకుల సూచీ సంఖ్య : : 9