బొగ్గు మంత్రిత్వ శాఖ
విశ్వకర్మ జయంతి, ప్రధానమంత్రి జన్మదినం సందర్భంగా 75 మంది ఉద్యోగులను సత్కరించిన ఎస్ఈసీఎల్
స్వచ్ఛతే సేవ కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం
ప్రత్యేక ప్రచారం 6.0కు లక్ష్యాలు నిర్దేశించుకున్న ఎస్‌ఈసీఎల్
నాడు పోస్టు చేయడమైనది:
17 SEP 2026 6:28PM by PIB Hyderabad
విశ్వకర్మ జయంతి, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా కోల్ ఇండియా అనుబంధ సంస్థ అయిన సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎస్ఈసీఎల్) రెండో ఎస్ఈసీఎల్ విశ్వకర్మ పురస్కారాలను ఈ రోజు ప్రదానం చేసింది. బిలాస్‌పూర్‌లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. మైనింగ్, కార్యకలాపాలు, నిర్వహణ, పర్యవేక్షణ, ఇతర సాంకేతిక కార్యకలాపాల్లో విశిష్ట సేవలు అందించిన 75 మంది ఉద్యోగులను సత్కరించింది. వారిలో శాశ్వత, ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తున్న కార్మికులు ఉన్నారు.
స్వచ్ఛతే సేవ ప్రత్యేక ప్రచారం 6.0లో భాగంగా పారిశుద్ధ్య కార్మికులను కూడా ఈ కార్యక్రమంలో సన్మానించారు.

కార్యక్రమంలో ఎస్‌ఈసీఎల్ డైరెక్టర్ (మానవ వనరులు) శ్రీ బిరంచీ దాస్, డైరెక్టర్ (సాంకేతిక/కార్యకలాపాలు) శ్రీ రమేష్ చంద్ర మహాపాత్ర, డైరెక్టర్ (సాంకేతిక/ప్రాజెక్టులు, ప్రణాళిక) (అదనపు బాధ్యతలు) శ్రీ నృపేంద్రనాథ్ పాల్గొన్నారు. అలాగే వివిధ కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, విభాగాధిపతులు, అధికారులు, ఎస్ఈసీఎల్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రాంతాల ఉద్యోగులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఆరంభంలో బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జీ కిషన్ రెడ్డి బొగ్గు కార్మికులకు పంపిన సందేశాన్ని చదివి వినిపించారు. దేశ ఇంధన భద్రత, అభివృద్ధికి బొగ్గు కార్మికులు చేస్తున్న కృషిని ఈ సందేశంలో గుర్తించారు. వారి శ్రమను, అంకితభావాన్ని ప్రశంసించారు.
స్వచ్ఛతే సేవ–ప్రత్యేక ప్రచారం 6.0లో భాగంగా పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం
స్వచ్ఛతే సేవ, ప్రత్యేక ప్రచారం 6.0లో భాగంగా ఎస్ఈసీఎల్ సంస్థల్లో స్వచ్ఛతను, పారిశుద్ధ్యాన్ని కాపాడటంలో నిమగ్నమైన పారిశుద్ధ్య కార్మికులను కూడా ఈ కార్యక్రమంలో సత్కరించారు. పని ప్రదేశాలను పరిశుభ్రంగా, క్రమబద్ధంగా ఉంచడంలో వారి సేవలను ఈ కార్యక్రమం గుర్తించింది. అలాగే పని పట్ల గౌరవాన్ని, పారిశుద్ధ్యం పట్ల ఉమ్మడి బాధ్యతను తెలియజేసింది.
ప్రత్యేక ప్రచారం 6.0లో భాగంగా పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణ, స్థల వినియోగం, రికార్డుల నిర్వహణ లక్ష్యాలను ఎస్‌ఈసీఎల్ నిర్దేశించుకుంది. పారిశుద్ధ్య కార్యకలాపాల కోసం 225 ప్రదేశాలను సంస్థ గుర్తించింది. వీటి మొత్తం విస్తీర్ణం 40 లక్షల చదరపు అడుగులు. 3,300 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను పారవేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.
ప్రత్యేక ప్రచారం 6.0లో ఈ–వ్యర్థాల సేకరణ, విభజన, పారవేయడంపై దృష్టి సారిస్తూ తన పరిధిలోని అన్ని విభాగాల్లోనూ క్రమబద్ధమైన ఈ–వ్యర్థాల నిర్వహణ పనులను ఎస్‌ఈసీఎల్ చేపట్టనుంది. ఈ ప్రచారంలో భాగంగా 500 భౌతిక ఫైళ్లను సమీక్ష, 200 ఫైళ్లను తొలగించడం, 7,000 ఈ–ఫైళ్లను సమీక్షించడం, 3,000 ఈ–ఫైళ్లను మూసివేయడమే లక్ష్యంగా నిర్దేశించుకుంది.
***
(రిలీజ్ ఐడి: 2311951)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5