ఆర్థిక మంత్రిత్వ శాఖ
ఆర్ఐఎన్ఎల్ భూముల ఈ-వేలం సందర్భంగా పెట్టుబడిదారులతో ముందస్తు సమావేశాలు నిర్వహించనున్న ఎన్ఎల్ఎంసీ
సెప్టెంబర్ 23, 24, 25 తేదీల్లో విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్‌లో పెట్టుబడిదారుల సమావేశాలు
93,572.21 చదరపు గజాల్లోని 459 ప్లాట్లకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఆసక్తి ఉన్న బిడ్డర్లకు అందించడం లక్ష్యంగా సమావేశాలు
నాడు పోస్టు చేయడమైనది:
17 SEP 2026 5:55PM by PIB Hyderabad
ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థల విభాగం పరిపాలనా నియంత్రణలో ఉన్న నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ (ఎన్ఎల్ఎంసీ), రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్ - విశాఖపట్నం స్టీల్ ప్లాంట్)కు చెందిన 459 ప్లాట్ల ఈ - వేలానికి సంబంధించి ప్రజలకు సమాచారం అందించే కార్యక్రమంలో భాగంగా విశాఖపట్నం, హైదరాబాద్, విజయవాడలో వరుసగా పెట్టుబడిదారుల సమావేశాలు నిర్వహించనుంది.
పెట్టుబడిదారుల సమావేశాలు 2026 సెప్టెంబర్ 23న విశాఖపట్నం, సెప్టెంబర్ 24న –విజయవాడ, సెప్టెంబర్ 25న హైదరాబాద్ లో జరుగుతాయి.
ఆసక్తి ఉన్న పెట్టుబడిదారులు, డెవలపర్లు, ఇతర అర్హత కలిగిన భాగస్వాములకు భూముల వివరాలు, వేలం ప్రక్రియ, బిడ్డింగ్ నిబంధనలు, ఇతర సంబంధిత అంశాలపై అవగాహన కల్పించడంతో పాటు, సంబంధిత భాగస్వాములతో నేరుగా చర్చించే అవకాశం కల్పించడం ఈ సమావేశాల ప్రధాన ఉద్దేశం.
ఆర్ఐఎన్ఎల్ కు చెందిన భూముల్లో విశాఖపట్నంలోని హెచ్‌బీ కాలనీ, మద్దిలపాలెం, ఆటోనగర్, గాజువాక ప్రాంతాల్లోని 93,572.21 చదరపు గజాల విస్తీర్ణంలో 459 ప్లాట్లు ఉన్నాయి. ఒక్కో ప్లాట్ విస్తీర్ణం సుమారు 128.94 చదరపు గజాల నుంచి 2,728 చదరపు గజాల వరకు ఉంది.
ఈ భూముల్లో ప్రధాన భాగంగా హెచ్‌బీ కాలనీలో 87,949.77 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న 456 నివాస ప్లాట్లు ఉన్నాయి. గాజువాకలోని ఆటోనగర్‌లో 5,622.44 చదరపు గజాల విస్తీర్ణంలో మరో మూడు ప్లాట్లు ఉన్నాయి. విశాఖపట్నంలో ఇప్పటికే వ్యూహాత్మకంగా అభివృద్ధి చెందిన నివాస, వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాల్లో ఈ ఆస్తులు ఉన్నాయి. పారదర్శక, పోటీతో కూడిన ఈ - వేలం ప్రక్రియ ద్వారా వీటిని విక్రయించనున్నారు.
వేలానికి సంబంధించిన నిబంధనలు, షరతులకు లోబడి ఈ భూములను ఎటువంటి వివాదాలు లేదా చట్టపరమైన చిక్కులు లేని స్పష్టమైన ప్రభుత్వ హక్కులతో అందుబాటులో ఉంచుతున్నారు. ఈ ప్రక్రియకు లావాదేవీ సలహాదారుగా క్వికర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (క్యూఐపీఎల్)ను నియమించారు.
ఈ - వేలం షెడ్యూల్
రైల్‌టెల్ ఈ - నివిదా ఈ–ప్రొక్యూర్‌మెంట్ వేదిక ద్వారా రెండు విడతల్లో ఈ - వేలంనిర్వహించనున్నారు.
మొదటి విడత ఈ–వేలం 2026 అక్టోబర్ 12న జరుగుతుంది. ఇందులో 243 ప్లాట్లు ఉన్నాయి. మొదటి విడతకు రిజిస్టర్ చేసుకోవడంతో పాటు ఈఎండీ (ఎర్నెస్ట్ మనీ డిపాజిట్) సమర్పించేందుకు 2026 అక్టోబర్ 8 సాయంత్రం 5 గంటల వరకు గడువు ఉంది.
రెండో విడత ఈ - వేలం 2026 అక్టోబర్ 16న నిర్వహించనున్నారు. ఇందులో 216 ప్లాట్లు ఉన్నాయి. రెండో విడతకు రిజిస్టర్ చేసుకోవడంతో పాటు ఈఎండీ సమర్పించేందుకు 2026 అక్టోబర్ 14 సాయంత్రం 5 గంటల వరకు గడువు ఉంది.
ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ ను ప్రతి ప్లాట్‌కు రూ.2 లక్షలుగా నిర్ణయించారు. ఆసక్తి ఉన్న బిడ్డర్లు నిర్దేశించిన గడువులోగా రిజిస్టర్, కేవైసీ ప్రక్రియ, ఈఎండీ చెల్లింపును పూర్తి చేయాలి.
ఈ - వేలం రైల్‌టెల్ ఈ - నివిదా ఈ - ప్రొక్యూర్‌మెంట్ వేదిక ద్వారా నిర్వహించనున్నారు.
అధికారిక ఈ - వేలం పోర్టల్:
https://eauction.enivida.com/
ప్లాట్ల వివరాలు, రిజర్వ్ ధరలు, అర్హత ప్రమాణాలు, బిడ్డింగ్ ప్రక్రియ, రిజిస్ట్రేషన్ నిబంధనలు, ఇతర షరతులు, నిబంధనలకు సంబంధించిన సమగ్ర సమాచారం అధికారిక వేలం పత్రాల్లో అందుబాటులో ఉంది.
పెట్టుబడిదారుల సమావేశాల ద్వారా ఆసక్తి ఉన్న భాగస్వాములు ఈ / వేలంలో పాల్గొనే ముందు తమ సందేహాలను నివృత్తి చేసుకోవడంతో పాటు, వేలం ప్రక్రియపై పూర్తి అవగాహన పొందే అవకాశం కూడా లభిస్తుంది.
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ఇతర ప్రభుత్వ సంస్థలకు చెందిన మిగులు భూములను, ఇతర ప్రధానేతర ఆస్తులను వృత్తిపరమైన, క్రమబద్ధమైన, పారదర్శక విధానంలో విక్రయించే బాధ్యతలో భాగంగా ఎన్ఎల్ఎంసీ ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది.
పెట్టుబడిదారుల సమావేశాలు, ఆర్ఐఎన్ఎల్ భూముల ఈ - వేలం, సంబంధిత ప్రకటనలపై తదుపరి సమాచారం కోసం ఆసక్తి ఉన్న పెట్టుబడిదారులు, ఇతర భాగస్వాములు తన అధికారిక సామాజిక మాధ్యమ ఖాతాలను అనుసరించాలని ఎన్ఎల్ఎంసీ సూచించింది.
ఎన్ఎల్ఎంసీ గురించి
నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ (ఎన్ఎల్ఎంసీ) 100 శాతం భారత ప్రభుత్వ యాజమాన్య సంస్థ. ఇది ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థల విభాగం పరిపాలనా నియంత్రణలో పనిచేస్తోంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ఇతర ప్రభుత్వ సంస్థలకు చెందిన మిగులు భూములు, ఇతర ప్రధానేతర ఆస్తులను క్రమబద్ధమైన, వృత్తిపరమైన విధానంలో విక్రయించే ప్రక్రియకు వీలు కల్పించే లక్ష్యంతో ఎన్ఎల్ఎంసీని ఏర్పాటు చేశారు.
ఆర్ఐఎన్ఎల్ గురించి
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు కార్పొరేట్ సంస్థ అయిన రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్), భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వ శాఖ పరిధిలోని నవరత్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ.
****
(రిలీజ్ ఐడి: 2311597)
సందర్శకుల సూచీ సంఖ్య : : 13