సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
హైదరాబాద్ విముక్తి పోరాట చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చాలి: మాజీ గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ
హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని కేంద్రం అధికారికంగా నిర్వహిస్తుండటం హర్షణీయం: శ్రీ బండారు దత్తాత్రేయ
హైదరాబాద్ విమోచన దినోత్సవం సందర్భంగా సీబీసీ ఆధ్వర్యంలో ఫొటో ప్రదర్శన ప్రారంభం
నాడు పోస్టు చేయడమైనది:
16 SEP 2026 5:05PM by PIB Hyderabad
నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఎందరో మహనీయులు త్యాగాలు, బలిదానాలు చేశారని, వారి చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చాల్సిన అవసరం ఉందని హర్యానా మాజీ గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమై, ఇక్కడి ప్రజలు స్వేచ్ఛను పొందిన సెప్టెంబర్ 17వ తేదీ ప్రాధాన్యతను, చారిత్రక నేపథ్యాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించి అధికారికంగా హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తుండటం హర్షణీయమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం ఈ వేడుకలను అధికారికంగా నిర్వహించాలని ఆయన కోరారు.
హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకల్లో భాగంగా సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (సీబీసీ) రెండు రోజుల ఫొటో ప్రదర్శనను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ సంస్థానంలో ప్రజలపై జరిగిన దమనకాండ, నిజాం వ్యతిరేక పోరాటంలో సమరయోధుల పాత్ర, భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనం వరకు జరిగిన ప్రధాన సంఘటనలను వివరిస్తూ ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనను బుధవారం శ్రీ బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. మల్కాజ్‌గిరి ఎంపీ శ్రీ ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్సీ శ్రీ రాంచందర్‌రావుతో కలిసి ఆయన ఫొటో ప్రదర్శనను పరిశీలించారు. హైదరాబాద్ విముక్తి కోసం వీరోచితంగా పోరాడిన వారి చరిత్ర, త్యాగాలను వివరిస్తూ ప్రదర్శనను ఏర్పాటు చేసిన సీబీసీని ఆయన అభినందించారు. ఈ ప్రదర్శనను ప్రతి విద్యార్థి తప్పక చూడాలని శ్రీ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు.

హైదరాబాద్ విముక్తి పోరాటాన్ని గుర్తుచేస్తూ, నిజాం అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజలంతా కులమతాలకు అతీతంగా పోరాడారని శ్రీ బండారు దత్తాత్రేయ అన్నారు. ప్రజల వేషభాషలు, సంస్కృతి, సంప్రదాయాలపై నిజాం సాగించిన అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన యోధుల చరిత్ర పట్ల మనమంతా గర్వపడాలని పేర్కొన్నారు.
అంతకుముందు మల్కాజ్‌గిరి ఎంపీ శ్రీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ, వందేమాతరం నినాదం చేసినందుకు జైలులో పెట్టడం, త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసినందుకు కాల్చి చంపడం వంటి దారుణ ఘటనలు నిజాం పాలనలో చోటుచేసుకున్నాయని గుర్తుచేశారు. హైదరాబాద్ ప్రజలు ఇప్పుడు అనుభవిస్తున్న స్వేచ్ఛ, గౌరవం వెనుక ఎన్నో త్యాగాలు, బలిదానాలు ఉన్నాయని అన్నారు. త్యాగాలతో కూడిన ఈ పోరాట చరిత్ర తరతరాలకు అందాలని, రాంజీ గోండు, దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ వంటి వీరుల త్యాగాలను నేటి తరం విద్యార్థులు, యువత గుర్తుంచుకోవాలని అన్నారు.

మాజీ ఎమ్మెల్సీ శ్రీ రాంచందర్‌రావు మాట్లాడుతూ, హైదరాబాద్ విమోచన చరిత్ర, నిజాంకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ చొరవతో హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం కావడం, నిజాం లొంగుబాటు వంటి చారిత్రక అంశాల గురించి నేటి తరానికి తెలియాల్సిన అవసరం ఉందని అన్నారు. మన భవిష్యత్తుకు మన చరిత్రే పునాదిగా నిలుస్తుందని పేర్కొన్నారు.

సీబీసీ, పీఐబీ అదనపు డైరెక్టర్ జనరల్ శ్రీమతి శ్రుతి పాటిల్ ప్రారంభోపన్యాసం చేస్తూ, హైదరాబాద్ విమోచన దినోత్సవ చరిత్రను నేటి తరానికి తెలియజేసేందుకు ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శన ప్రాధాన్యతను, విశేషాలను వివరించారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ శ్రీ సమీర్ నందా, డైరెక్టర్ శ్రీ రాజీవ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే శ్రీ చింతల రాంచంద్రారెడ్డి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సభ్యురాలు శ్రీమతి భానుక నర్మద, తదితరులు పాల్గొన్నారు.
****
(రిలీజ్ ఐడి: 2310920)
సందర్శకుల సూచీ సంఖ్య : : 16