రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
వరుణ ఎలివేటెడ్ కారిడార్: వారణాసిలో వారసత్వం, రవాణా, పురోగతి మధ్య సమతుల్యత
నాడు పోస్టు చేయడమైనది:
15 SEP 2026 12:29PM by PIB Hyderabad
శతాబ్దాలుగా వారణాసి భౌగోళిక, సాంస్కృతిక స్వరూపంలో వరుణ నది అంతర్భాగంగా ఉంటూ... నగర పేరులో సగభాగాన్ని ఇవ్వటంతో పాటు దాని అభివృద్ధికి తోడ్పడింది. నేడు ఈ నదీ తీర ప్రాంతం ఆధునిక పట్టణ రవాణాకు ప్రధాన కేంద్రంగా కొత్తరూపును సంతరించుకోనుంది.
రూ.10,998 కోట్ల అంచనా వ్యయంతో 43.218 కి.మీ. పొడవున నిర్మించనున్న వరుణ ఎలివేటెడ్ కారిడార్‌కు జూలైలో కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇది వారణాసి భవిష్యత్ రవాణా వ్యవస్థలో కీలకంగా మారనుంది. వరుణ నది వెంబడి ఎన్‌హెచ్-31 నుంచి వారణాసి రింగు రోడ్డును కలిపే ఈ ప్రాజెక్టు, నగరంలో అత్యధిక సామర్థ్యం గల ప్రత్యామ్నాయ మార్గాన్ని అందించి, ప్రస్తుత పట్టణ రోడ్లపై ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తుంది.
రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) ప్రధానంగా 6, 4 లైన్ల ఎలివేటెడ్ కారిడార్‌ను అభివృద్ధి చేస్తుంది. ఇందులో ప్రధాన రహదారి, ఫ్లైఓవర్లు, లూప్‌లు, రాంప్లు, సర్వీస్ రోడ్లు ఉంటాయి. అదనంగా ఈ ప్రాజెక్టులో ఆకర్షణీయమైన కేబుల్స్ ఆధారిత వంతెన, ఎక్స్ట్రాడోస్డ్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్-కమ్-మేజర్ బ్రిడ్జ్ ఉన్నాయి.
వారణాసి రద్దీ తగ్గింపు ప్రణాళికలో కీలక అనుసంధానం
వారణాసి రద్దీ నివారణ ప్రణాళికలో ఈ కారిడార్ కీలకమైనది. ఇది ప్రధాన రహదారులు, రైల్వేస్టేషన్లు, విమానాశ్రయం, ముఖ్యమైన పట్టణ ప్రాంతాల మధ్య రాకపోకలను మెరుగుపరిచేందుకు రూపొందించారు.
ఎన్‌హెచ్-31, వారణాసి రింగు రోడ్డును నేరుగా అనుసంధానించటం ద్వారా వారణాసి విమానాశ్రయం, వారణాసి కంటోన్మెంట్, వారణాసి సిటీ రైల్వేస్టేషన్, కాశీ రైల్వే స్టేషన్, దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్‌తో సహా కీలక రవాణా కేంద్రాలకు ప్రయాణ సౌకర్యాన్ని ఈ ప్రాజెక్టు మెరుగుపరుస్తుంది. రామ్‌నగర్ పోర్టుకు, వరుణ కారిడార్ వెంట ఉన్న ముఖ్యమైన ప్రాంతాలకు అనుసంధానాన్ని మరింత బలపరుస్తుంది.
మెరుగైన రహదారి వ్యవస్థ ద్వారా స్థానికులు, తీర్థ యాత్రలకు వెళ్లేవారు, పర్యాటకులు, విద్యార్థులు, వ్యాపారవేత్తలు, ముఖ్యంగా రోజూ, సీజన్‌వారీగా భారీ రద్దీ ఉండే నగరంలో వేగవంతమైన, విశ్వసనీయమైన ప్రయాణాన్ని చేయగలుగుతారు.
గంటకు 80-100 కి.మీ వేగంతో ప్రయాణించేలా రూపొందించిన ఈ కారిడార్... ఎన్‌హెచ్-31, కాశీ రైల్వేస్టేషన్ మధ్య ప్రయాణ సమయాన్ని దాదాపు 40 నుంచి 20 నిమిషాలకు తగ్గిస్తుందని అంచనా. ఈ ప్రయాణ సమయం తగ్గటం వల్ల ట్రాఫిక్ సమస్యలుండవు. వాహన నిర్వహణ ఖర్చులు తగ్గుతాయి. ప్రయాణికులు, సరకు రవాణా సమర్థవంతంగా సాగుతాయి.
వారణాసి సాంస్కృతిక, విజ్ఞాన ఆర్థిక వ్యవస్థను అనుసంధానించటం
భారతదేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక, సాంస్కృతిక, విద్యా, పర్యాటక కేంద్రాల్లో వారణాసి ఒకటి. మెరుగైన రోడ్డు మౌలిక సదుపాయాలు... ఘాట్లు, కాశీ విశ్వనాథ్ కారిడార్, కాశీ విశ్వనాథ్ ఆలయంతో సహా ప్రధాన మతపరమైన, పర్యాటక ప్రాంతాలకు సులభమైన ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తాయి.
ప్రధాన పండుగలు, రద్దీ సమయాల్లో నగరంలో సందర్శకుల తాకిడి విపరీతంగా పెరిగినప్పుడు అదనపు రోడ్డు సామర్థ్యం ట్రాఫిక్‌ను మరింత సమర్థవంతంగా క్రమబద్దీకరించేందుకు, ప్రధాన నగర రహదారులపై ఒత్తిడిని తగ్గించేందుకు దోహదపడుతుందని ఆశిస్తున్నారు.
సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయం వంటి ప్రధాన విద్యాసంస్థలకు కూడా ఈ ప్రాజెక్టు మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పిస్తుంది. ఇది విద్యా కేంద్రాలు, నివాస ప్రాంతాల మధ్య అనుసంధానాన్ని బలపరుస్తూ... విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకులకు రోజువారీ ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తుంది.
వారణాసిని ప్రాంతీయ ఆర్థిక కేంద్రంగా బలోపేతం చేయటం
వారణాసిని ప్రధాన ప్రాంతీయ రవాణా, ఆర్థిక కేంద్రంగా ఈ కారిడార్ మరింత బలపరుస్తుందని అంచనా. పీఎం గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా చందౌలి సామాజిక-ఆర్థిక మండలం, చందౌలి సామాజిక నోడ్, ఆరు ప్రధాన రవాణా కేంద్రాలకు ఇది మెరుగైన సౌకర్యాన్ని అందిస్తుంది.
జాతీయ రహదారులు, రైల్వే మౌలిక సదుపాయాలు, సరకు రవాణా కారిడార్ల మెరుగైన అనుసంధానం వల్ల... వారణాసి, చందౌలి, చుట్టుపక్కల ప్రాంతాల మధ్య వ్యవసాయ ఉత్పత్తులు, పారిశ్రామిక వస్తువులు, నిర్మాణ సామాగ్రి, ఖనిజాల రవాణా మరింత సులభమవుతుంది.
ప్రాంతీయ లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని మెరుగుపరచటం ద్వారా, రవాణా అడ్డంకులను తగ్గించటం ద్వారా, ఆర్థిక కార్యకలాపాలకు ఈ ప్రాజెక్టు ఊతమిస్తుంది. ప్రాంతీయ పోటీతత్వాన్ని పెంచుతుంది. తూర్పు ఉత్తరప్రదేశ్‌లో కొత్త అభివృద్ధి అవకాశాలకు మార్గం సుగమం చేస్తుంది.
వరుణ నది వెంబడి ఆధునిక రవాణాకు ప్రధాన మార్గం
అధిక జనసాంద్రత, చారిత్రక ప్రాధాన్యత గల పట్టణ ప్రాంతంలో ఇప్పటికే ఉన్న నివాసాల మధ్య రోడ్లను పెద్దఎత్తున విస్తరించాల్సిన అవసరం లేకుండా రవాణా సామర్థ్యాన్ని పెంచటానికి వరుణ కారిడార్ అవకాశాన్నిస్తుంది.
వ్యూహాత్మకంగా ప్లాన్ చేసిన లూప్‌లు, రాంప్లు ,సర్వీస్ రోడ్ల మద్దతుతో కూడిన ఎలివేటెడ్ అలైన్మెంట్, దూరప్రాంత, ప్రాంతీయ ట్రాఫిక్ కోసం ప్రత్యేక రవాణా మార్గాన్ని అందిస్తుంది. స్థానిక ట్రాఫిక్ నుంచి సుదూర రాకపోకలను వేరు చేసేందుకు, నగరంలోని అత్యంత రద్దీ రోడ్లపై ఒత్తిడిని తగ్గించేందుకు ఇది దోహదపడుతుంది.
ఈ ప్రాజెక్టులో సివిల్ నిర్మాణ పనుల కోసం రూ. 4,565.33 కోట్లు, భూసేకరణకు రూ. 934.91 కోట్లను కేటాయించారు. నగరవ్యాప్తంగా నిరంతరంగా ఉండే అధిక-సామర్థ్య కారిడార్ నిర్మాణానికి, దీని రూపకల్పనలో ప్రధాన వంతెనలు, అనుసంధాన నిర్మాణాలను మిళితం చేశారు.
ప్రధాన పట్టణ రవాణా మార్గాలపై ఒత్తిడిని తగ్గించటం
వారణాసి జంక్షన్, ఫుల్వారియా, చౌకాఘాట్ వంటి ప్రధాన రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు ఈ కారిడార్ ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ పరిమిత రహదారి సామర్థ్యం వల్ల స్థానిక, వాణిజ్య, ఇతర వాహనాల రద్దీతో ట్రాఫిక్ ఏర్పడుతోంది.
వారణాసి జంక్షన్ నుంచి లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయం మధ్య ప్రయాణాన్ని ఇది గణనీయంగా మెరుగుపరుస్తుందని అంచనా. ఈ మార్గంలో ప్రయాణ సమయం దాదాపు గంట నుంచి 20 నిమిషాలకు తగ్గనుంది.
వారసత్వం, పుణ్యక్షేత్రం, విద్య, వాణిజ్యం, పర్యాటకం కలగలిసిన ఒక నగరానికి వరుణ ఎలివేటెడ్ కారిడార్ కేవలం ఒక నూతన రహదారి ప్రాజెక్టు మాత్రమే కాదు… చారిత్రక, వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంలోని ప్రత్యేకమైన సవాళ్లను ఎదుర్కొంటూ, రవాణా సామర్థ్యాన్ని పెంచేందుకు చేస్తున్న ఒక ప్రయత్నం.
సాంస్కృతిక, పర్యాటక, రవాణా, ఆర్థిక కేంద్రంగా వారణాసి విస్తరిస్తున్న తరుణంలో ఈ వరుణ కారిడార్... ఆధునిక రవాణాకు ప్రధాన మార్గంగా నిలవనుంది. ఇది ప్రజలను, ప్రాంతాలను, ఆర్థిక కార్యకలాపాలను అనుసంధానిస్తూ... నగరం మరింత సమర్థవంతంగా ముందుకెళ్లేందుకు సహకరిస్తుంది.
***
(రిలీజ్ ఐడి: 2310492)
సందర్శకుల సూచీ సంఖ్య : : 3