యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
2026 ఆసియా క్రీడల భారత బృందానికి న్యూఢిల్లీలో ఘన వీడ్కోలు
ఒత్తిడిని జయించి అత్యుత్తమ ప్రదర్శన కనబరచాలని, పోటీని అవకాశంగా చూడాలని, అవకాశాలను విజయాలుగా మలచుకోవాలని క్రీడాకారులకు పిలుపునిచ్చిన కేంద్ర క్రీడా శాఖ మంత్రి డాక్టర్ మాన్సుఖ్ మాండవీయ
జపాన్‌లో జరిగే ఆసియా క్రీడల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్న 503 మంది సభ్యుల భారత బృందం
ప్రధాని మోదీ దార్శనికతతో దేశ క్రీడాకారులకు కొత్త అవకాశాలకు బాటలు: డాక్టర్ మాన్సుఖ్ మాండవీయ
నాడు పోస్టు చేయడమైనది:
08 SEP 2026 7:54PM by PIB Hyderabad
న్యూఢిల్లీ, 2026 సెప్టెంబరు 8: 2026 ఆసియా క్రీడలకు బయల్దేరుతున్న భారత క్రీడా బృందానికి న్యూఢిల్లీలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా శాఖ మంత్రి డాక్టర్ మాన్సుఖ్ మాండవీయ సమక్షంలో ఈ రోజు ఘనంగా వీడ్కోలు పలికారు.
భారత ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ) అధ్యక్షురాలు డాక్టర్ పి.టి. ఉష, క్రీడా శాఖ కార్యదర్శి హరిరంజన్ రావు, షెఫ్ డి మిషన్ సహదేవ్ యాదవ్, క్రీడాకారులు, సహాయక సిబ్బందితో కలిసి... ఆసియా క్రీడల భారత బృంద అధికారిక జెర్సీని కేంద్ర మంత్రి డాక్టర్ మాన్సుఖ్ మాండవీయ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఒత్తిడిని జయించి అత్యుత్తమ ప్రదర్శన కనబరచాలని, పోటీని అవకాశంగా చూడాలని, అవకాశాలను విజయాలుగా మలచుకోవాలని క్రీడాకారులకు పిలుపునిచ్చారు.
“ఆసియా క్రీడల్లో మన బృందం అద్భుతంగా రాణించి.. దేశ కీర్తిప్రతిష్ఠలను ఇనుమడింపజేస్తుందన్న పూర్తి నమ్మకం నాకుంది” అని ఆయన అన్నారు.
భారత క్రీడా బృందం ప్రదర్శనపై కేంద్ర మంత్రి ఆశాభావం వ్యక్తం చేస్తూ... ‘‘క్రీడల్లో విజయం వ్యక్తిగత విజయం మాత్రమే కాదు. క్రీడాకారుడి విజయం దేశానికి గర్వకారణం. ఈ రోజు 503 మంది సభ్యులతో కూడిన మన క్రీడా బృందం ఆసియా క్రీడలకు బయల్దేరుతోంది. మన క్రీడాకారులు అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తారన్న పూర్తి విశ్వాసం నాకుంది’’ అని మాండవీయ ధీమా వ్యక్తం చేశారు.
భారత క్రీడారంగం సాధిస్తున్న పురోగతిని, ప్రతిభావంతులైన యువత దూసుకొస్తున్న తీరును వివరిస్తూ.. ‘‘మన 503 మంది క్రీడాకారుల్లో 300 మందికి పైగా అథ్లెట్లు మొదటిసారి ఆసియా క్రీడల్లో పాల్గొంటున్నారు. దీనిబట్టి దేశంలో సరికొత్త క్రీడా ప్రతిభ ఎంత వేగంగా వెలుగులోకి వస్తోందో స్పష్టమవుతోంది’’ అని కేంద్ర మంత్రి డాక్టర్ మాండవీయ వ్యాఖ్యానించారు.
2026 గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో భారత్ అద్భుత ప్రదర్శనను కేంద్ర క్రీడా శాఖ మంత్రి అభినందించారు. ‘‘స్వతంత్ర పరిశీలకులు, కెమెరా పర్యవేక్షణలో సార్వత్రిక ఎంపికలను చేపట్టాం. అత్యంత పారదర్శకంగా, ప్రతిభే ప్రాతిపదికగా ఈ ప్రక్రియ జరిగేలా చూశాం. గత కామన్వెల్త్ క్రీడల్లో భారత్ 13 స్వర్ణ పతకాలను సాధించగా.. ఈసారి మన పతకాల సంఖ్య 35 శాతానికి పైగా పెరిగింది. ఆసియా క్రీడల్లో పాల్గొంటున్న మన అథ్లెట్లకు, సహాయక సిబ్బందికి శుభాకాంక్షలు’’ అని ఆయన అన్నారు.
భారతీయ క్రీడారంగానికి సంబంధించి.. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దూరదృష్టిని ప్రశంసిస్తూ... అంతర్జాతీయ వేదికలపై మన క్రీడాకారులు ప్రతిభను చాటుకుని, విజయ దుందుబి మోగించేలా ప్రభుత్వం నూతన అవకాశాలను, మార్గాలను సుగమం చేసిందని డాక్టర్ మాండవీయ పేర్కొన్నారు.
“మన లక్ష్యం 2036. మనం ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇచ్చే 2036 నాటికి.. అంతర్జాతీయ వేదికపై మనం సుస్థిరంగా నిలదొక్కుకోవాలి. ఇది పదేళ్ల ప్రణాళిక. క్రీడా మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు ఇందులో రూ. 36,000 కోట్లకు పైగా నిధులను ప్రభుత్వం కేటాయించింది’’ అని ఆయన వివరించారు.
ఈ సందర్భంగా డాక్టర్ పి.టి. ఉష మాట్లాడుతూ.. ‘‘క్రీడల్లో పతకాలు మాత్రమే కాదు.. అథ్లెట్ల స్వప్నాలు ఆ ప్రయాణానికి కొలమానం. మనం భారతదేశ ప్రతినిధులుగా ఈ అంతర్జాతీయ వేదికపైకి వెళ్తున్నాం. ఇది మనకు లభించిన గొప్ప గౌరవం. ఇది మన బాధ్యత కూడా. నిరంతరం ప్రోత్సాహాన్ని, సహకారాన్ని అందిస్తున్న గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా శాఖ మంత్రి గారికి ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ తరఫున నా హృదయపూర్వక కృతజ్ఞతలు’’ అన్నారు.
జపాన్‌లో జరగనున్న 2026 ఆసియా క్రీడల్లో.. పలు విభాగాల్లో భారత బృందం పోటీ పడనుంది. మొత్తం 503 మంది సభ్యులతో (క్రీడాకారులు, సహాయక సిబ్బంది) కూడిన ఈ బృందంలో.. 300 మందికి పైగా అథ్లెట్లు తొలిసారిగా ఆసియా క్రీడల్లో అడుగుపెడుతున్నారు. భారత క్రీడారంగంలో పెరుగుతున్న పరిణతిని, రిజర్వ్ క్రీడాకారుల్లో భారత్ బలాన్ని ఇది చాటుతోంది.
***
(రిలీజ్ ఐడి: 2308112)
సందర్శకుల సూచీ సంఖ్య : : 3