సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రభుత్వ విధానాలు, ప్రజలకు మధ్య ఒక ద్విముఖ వారధిగా ప్రధాన పాత్ర పోషిస్తోన్న పీఐబీ: శ్రీ సిద్ధార్థ్ బోడ్కే, ఏడీజీ, పీఐబీ అహ్మదాబాద్


అహ్మదాబాద్‌లోని ఎన్‌హెచ్ఎస్‌ఆర్‌సీఎల్, సబర్మతి హై-స్పీడ్ రైల్ మల్టీమోడల్ హబ్, సీఈపీటీ విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన తెలంగాణ మీడియా ప్రతినిధుల బృందం

నాడు పోస్టు చేయడమైనది: 08 SEP 2026 10:38PM by PIB Hyderabad

గుజరాత్ మీడియా పర్యటనలో ఉన్న హైదరాబాద్ పత్రికా సమాచార కార్యాలయం (పీఐబీ) ఆధ్వర్యంలోని 10 మంది సభ్యుల తెలంగాణ మీడియా ప్రతినిధుల బృందం.. మొదటి రోజు అహ్మదాబాద్‌లోని కీలకమైన మౌలిక వసతుల కేంద్రాలు, విద్యా సంస్థలు, చారిత్రక ప్రదేశాలను సందర్శించింది.
గుజరాత్‌లో సమాచార- ప్రసార మంత్రిత్వ శాఖ చేపట్టిన కార్యక్రమాలు, అభివృద్ధి కార్యకలాపాలపై అవగాహన పొందడానికి పీఐబీ అహ్మదాబాద్ కార్యాలయంలో జరిగిన బ్రీఫింగ్ సెషన్‌తో ఈ బృందం పర్యటనను ప్రారంభించింది.
తెలంగాణ మీడియా ప్రతినిధులతో మాట్లాడిన పీఐబీ అహ్మదాబాద్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ (ఏడీజీ) శ్రీ సిద్ధార్థ్ బోడ్కే ఐఐఎస్.. సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఘనతలను ప్రజలకు సమర్థవంతంగా చేరవేయడంలో కీలక భాగస్వామిగా మీడియా పోషిస్తున్న పాత్రను ప్రధానంగా చెప్పారు.
కేంద్ర ప్రభుత్వ విధానాలు, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు అందించటమే కాకుండా క్షేత్రస్థాయి నుంచి విలువైన అభిప్రాయాలను ప్రభుత్వానికి తిరిగి చేరవేయడంలో పీఐబీ ఒక కీలకమైన ద్విముఖ వారధిగా (టూ-వే బ్రిడ్జ్) పనిచేస్తుందని శ్రీ సిద్ధార్థ్ బోడ్కే చెప్పారు.

 


దేశ స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రకు గుర్తుగా మహాత్మా గాంధీ 1915లో దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత ఏర్పాటు చేసిన చారిత్రక కొచ్‌రాబ్ ఆశ్రమాన్ని ఈ బృందం సందర్శించింది. ఆశ్రమానికి ఉన్న చారిత్రక ప్రాముఖ్యత, దాని పరిరక్షణ.. ప్రారంభంలో మహాత్మా గాంధీ  ఆలోచనలను, జాతీయ స్వాతంత్ర్య పోరాటాన్ని రూపుదిద్దడంలో అది పోషించిన ప్రాథమిక పాత్ర గురించి మీడియా ప్రతినిధులకు వివరించారు.
అనంతరం ఈ బృందం అహ్మదాబాద్‌లోని ఆవాస ప్రణాళిక, డిజైన్ రంగంలో ప్రముఖ కేంద్రమైన సీఈపీటీ విశ్వవిద్యాలయాన్ని సందర్శించింది. సీఈపీటీ విశ్వవిద్యాలయ అధ్యక్షుడు ప్రొఫెసర్ బర్జోర్ మెహతా, సీనియర్ అధ్యాపకులు ప్రొఫెసర్ సాశ్వత్ బందోపాధ్యాయ, ప్రొఫెసర్ శాలిని సిన్హా, ప్రొఫెసర్ శివానంద్ స్వామి, ప్రొఫెసర్ సేజల్ పటేల్‌లతో జర్నలిస్టులు సమావేశమయ్యారు. పట్టణ ప్రణాళిక, రవాణా వ్యవస్థలు, సుస్థిర ఆవాస నిర్వహణ, వాస్తుశిల్ప రంగాల్లో విశ్వవిద్యాలయం బహుళ విభాగ విద్యా బోధన, అత్యాధునిక పరిశోధనలు, ఫలితాల ఆధారిత జోక్యాలపై ఈ చర్చలు దృష్టి సారించాయి.


నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌హెచ్ఎస్ఆర్‌సీఎల్) కార్యాలయ సందర్శన, అత్యాధునిక సబర్మతి హై-స్పీడ్ రైల్ మల్టీమోడల్ ట్రాన్స్‌పోర్ట్ హబ్‌ను పరిశీలించటంలో మీడియా ప్రతినిధుల మొదటి రోజు పర్యటన ముగిసింది. ముంబయి-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైల్ (ఎంఏహెచ్ఎస్ఆర్) ప్రాజెక్ట్‌లో కొనసాగుతున్న పనుల గురించి ప్రతినిధి బృందానికి ఎన్‌హెచ్ఎస్ఆర్‌సీఎల్ ప్రజా సంబంధాల అధికారి శ్రీ అరుణ్ బరోట్‌తో కలిసి డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీ ఆదిత్య సింగ్ వివరించారు.


వివిధ రవాణా మార్గాల మధ్య ప్రయాణికులు ఎలాంటి అంతరాయం లేకుండా మారేలా రూపొందించిన సబర్మతి మల్టీమోడల్ హబ్‌ను మీడియా బృందం పరిశీలించింది. ఈ సదుపాయం రాబోయే హై-స్పీడ్ రైల్ టర్మినల్‌ను భారతీయ రైల్వే నెట్‌వర్క్, అహ్మదాబాద్ మెట్రో రైల్, బస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్‌తో (బీఆర్‌టీఎస్) అనుసంధానిస్తుంది. ఆధునిక ప్రయాణికుల సౌకర్యాలు, విశాలమైన పార్కింగ్ మౌలిక సదుపాయాలు, హరిత భవన ప్రమాణాలు దీని ప్రత్యేకతలు.

 

***


(రిలీజ్ ఐడి: 2307705) సందర్శకుల సూచీ సంఖ్య : : 36
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English