ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ‘‘సుమన్ కార్యాచరణ ప్రణాళిక 2030 - నిరంతర సంరక్షణను ప్రోత్సహించడం’’పై జాతీయ కార్యశాల
అవాంఛిత గర్భధారణను నివారించడానికి, ఆరోగ్యకరమైన, ప్రణాళికాయుక్త గర్భధారణకు నవ వధూవరుల రిజిస్ట్రేషన్ తోడ్పడుతుందన్న ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ బ్రజేశ్ పాఠక్
సురక్షితం కాని, సౌకర్యాలు తక్కువ స్థాయిలో అందుతున్న ప్రాంతాలపై దృష్టి పెట్టడంతో పాటు తల్లుల, చంటిబిడ్డల ఆరోగ్య సంరక్షణను నిరంతరం పటిష్ఠపరచడానికే ‘‘సుమన్ కార్యాచరణ ప్రణాళిక 2030’’ అమలు చేస్తున్నాం: ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శి, ఎన్‌హెచ్ఎమ్ మిషన్ డైరెక్టరు శ్రీమతి ఆరాధన పట్నాయక్
తల్లులు, అప్పుడే పుట్టిన శిశువుల మరణాలను నివారించే దిశగా ‘‘సుమన్ కార్యాచరణ ప్రణాళిక 2030’’ను
దార్శనికత దశ నుంచి కార్యాచరణ దశలోకి మార్చడంపై శ్రద్ధ వహించనున్న వర్క్‌షాప్
తల్లుల, నవజాత శిశువుల మరణాల రేటును తగ్గించడానికి
13 రాష్ట్రాలు, 130 జిల్లాల్లో ప్రత్యేక వ్యూహాల అమలుపై శ్రద్ధ వహించనున్న ‘‘సుమన్ కార్యాచరణ ప్రణాళిక 2030’’
నాడు పోస్టు చేయడమైనది:
03 SEP 2026 11:12PM by PIB Hyderabad
‘‘సుమన్ కార్యాచరణ ప్రణాళిక 2030 - నిరంతర సంరక్షణను ప్రోత్సహించడం’’ ఇతివృత్తంతో జాతీయ స్థాయి కార్యశాల (వర్క్‌షాప్)ను కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తరఫున ఉత్తర ప్రదేశ్.. లఖ్‌నవూలో 2026 సెప్టెంబరు 2, 3 తేదీల్లో నిర్వహించారు.

ఈ వర్క్‌షాపును కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శి పదవితో పాటు ఆ శాఖ అధీనంలోని జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్ఎమ్)లో మిషన్ డైరెక్టరు పదవీబాధ్యతలను కూడా నిర్వహిస్తున్న శ్రీమతి ఆరాధన పట్నాయక్ అధ్యక్షతన ఏర్పాటు చేశారు. కార్యక్రమం ప్రారంభ సమావేశంలో ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ బ్రజేశ్ పాఠక్ పాల్గొన్నారు. శ్రీ పాఠక్ ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర వైద్య విద్య, మెడికల్ హెల్త్, కుటుంబ సంక్షేమం, తల్లీ బిడ్డల సంక్షేమశాఖ మంత్రిగా కూడా ఉన్నారు.
సమావేశంలో శ్రీ బ్రజేశ్ పాఠక్ ప్రసంగిస్తూ, కొత్తగా పెళ్లయిన జంటల నమోదుకు గల ప్రాధాన్యాన్ని ప్రస్తావించారు. అవాంఛిత గర్భధారణను నివారించడంతో పాటు, ఆరోగ్యకర, చక్కని ప్రణాళికతో కూడిన గర్భధారణను నిర్ధారించడానికి ఇది దోహదం చేస్తుందని ఆయన వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ‘సుమన్ కార్యాచరణ ప్రణాళిక 2030’ని ప్రభావవంతంగా అమలు చేయడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. దీన్లో భాగంగా మహిళలతో పాటు చంటిబిడ్డలకు సురక్షిత, గౌరవపూర్వక, నాణ్యత సహిత ఆరోగ్య సేవలను అందించడంపై దృష్టిని కేంద్రీకరిస్తున్నారని మంత్రి అన్నారు.

సమావేశంలో కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శి పదవితో పాటు, ఆ శాఖ అధీనంలోని జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్ఎమ్)లో మిషన్ డైరెక్టరు పదవీబాధ్యతలను కూడా నిర్వహిస్తున్న శ్రీమతి ఆరాధన పట్నాయక్ కీలకోపన్యాసాన్ని ఇచ్చారు. ‘‘భారత్ మాతృత్వ మరణాల రేటును తగ్గించడంలో చెప్పుకోదగిన పురోగతిని సాధించింది, ఇక ముందు కూడా మరింత మెరుగుదలను తీసుకు వచ్చే దిశగా నిరంతర ప్రాతిపదికన, నిర్దిష్ట లక్ష్యాలతో కృషి చేస్తోంది. మరీ ముఖ్యంగా తల్లుల మరణాల రేటు ఎక్కువగా ఉన్న, దురదృష్టకర ఘటనలు తరచుగా చోటుచేసుకుంటున్న, మారుమూల ప్రాంతాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల విషయంలో ఎక్కువ శ్రద్ధను తీసుకుంటున్నారు’’ అని ఆమె అన్నారు.
మహిళలను, కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని ఆరోగ్య వ్యవస్థ చేస్తున్న కృషిలో తల్లి స్వస్థతకు అత్యంత ప్రాధాన్యాన్ని ఇస్తున్నారని కూడా శ్రీమతి ఆరాధన పట్నాయక్ స్పష్టం చేశారు. కుటుంబాలకు ఆనందాన్ని, అంచనాలను పెనవేసే శారీరక ప్రక్రియ గర్భధారణ అని ఆమె వర్ణించారు. ప్రతి ఒక్క మహిళ భద్రత, ఆత్మగౌరవం, నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలను అందుకుంటూ గర్భధారణ, ప్రసవాల దశలను దాటి ముందుకు పయనించాలని శ్రీమతి ఆరాధన పట్నాయక్ ఆకాంక్షించారు.
‘సుమన్ కార్యాచరణ ప్రణాళిక 2030’ జీవిత చక్రంతో పాటు నిరంతర సంరక్షణ దృష్టికోణాన్ని అనుసరిస్తుందని, గర్భధారణ కన్న ముందుగా సంరక్షణ, కాన్పునకు పూర్వం ఆరోగ్య సంరక్షణ, గర్భం దాల్చిన వేళ, ప్రసవానంతరం సంరక్షణ వరకూ తల్లి ఆరోగ్య ప్రస్థానంలో మెరుగైన స్వాస్థ్య పోషణ లక్ష్యాలను నెరవేర్చేలా వివిధ దశలను దీనిలో అనుసంధానించారని శ్రీమతి అనురాధ పట్నాయక్ వివరించారు. ఈ కార్యాచరణ ప్రణాళిక.. లోటుపాట్లను భర్తీ చేసే, వర్తమాన ఆరోగ్య ప్రణాళికలను బలోపేతం చేసే, తల్లీబిడ్డలకు ఎప్పటికప్పుడు సమాన రీతిలో, నాణ్యత పూర్వకమైన ఆరోగ్య సంరక్షణకు పూచీపడేటందుకు ఒక కేంద్రిత, బహుపార్శ్విక చర్యల వ్యవస్థను అందిస్తుందని ఆమె తెలిపారు. దీనిలో సామాజికంగా, ఆర్థికంగా, శారీరకంగా, పర్యావరణ పరంగా ఏర్పడుతున్న నష్టాల వల్ల బాధితులుగా మారుతున్న వారి విషయంలోనూ, స్వల్ప స్థాయి సేవలను మాత్రమే అందుకోగలుగుతున్న ప్రాంతాల నివాసుల విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని ఆమె అన్నారు.
సమావేశంలో బర్త్ వెయిటింగ్ హోం (బీడబ్ల్యూహెచ్) మార్గదర్శకాలు, ప్రజల్లో ఆరోగ్య, సామాజిక అవగాహనను పెంచడానికి పోస్టర్లు, కరపత్రాలు, వీడియోలు, చిన్న పుస్తకాల వంటి ‘సుమన్ రోడ్‌మ్యాప్ 2030’ సంబంధిత సమాచార, విద్యా, కమ్యూనికేషన్ (ఐఈసీ) మెటీరియల్‌ను పరిచయం చేయడమే కాకుండా, ‘సుమన్ రోడ్‌మ్యాప్ 2030’ని గురించి వివరించే వీడియోను కూడా ప్రదర్శించారు. ఇది రాష్ట్రాలు, క్షేత్ర స్థాయుల్లో కార్యాచరణ ప్రణాళికను ప్రభావవంతంగా అమలు చేయడానికి అందుబాటులో ఉన్న వనరులను మరింత పటిష్ఠపరుస్తుంది.
ఈ వర్క్‌షాపులో దేశం నలుమూలల నుంచి 200 కన్న ఎక్కువ మంది పాలుపంచుకున్నారు. వారిలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన మిషన్ డైరెక్టర్లు, సీనియర్ అధికారులు, కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులతో పాటు సాంకేతిక నిపుణులు, విద్యాసంస్థలు, వృత్తినైపుణ్య సంస్థలు, డెవలప్‌మెంట్ పార్ట్‌నర్లు కూడా ఉన్నారు. వీరు వర్క్‌షాపునకు హాజరు కావడం వల్ల విషయాలను అందరూ తెలుసుకోగలగడానికి, క్షేత్ర స్థాయిలో ఎదురైన అనుభవాన్ని తెలియజేయడానికి, సుమన్ రోడ్‌మ్యాప్ 2030 లో భాగంగా ఆశిస్తున్న ప్రగతికి వేగాన్ని అందించడానికి, రాష్ట్ర వారీ ప్రాధాన్యాలకు అనుగుణంగా చర్చలను చేపట్టడానికి మార్గం సుగమమైంది.

రాష్ట్రాలు, జిల్లాల నిర్దిష్ట అవసరాలను పూర్తి చేయడంతో పాటు పూర్తి దేశంలో నిరంతర ప్రగతికి పూచీ పడటానికి రెండు భాగాలతో కూడిన విధానాన్ని సుమన్ కార్యాచరణ ప్రణాళిక అనుసరిస్తున్నది. సెక్షన్ ‘ఎ’లో ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సిన 13 రాష్ట్రాలతో పాటు 130 జిల్లాలను చేర్చారు. ఈ ప్రాంతాల్లో తల్లీబిడ్డల మరణాల నిష్పత్తి అధికంగా ఉన్న కారణంగా ఈ ప్రాంతాల విషయంలో విశిష్ట వ్యూహాలపై దృష్టిని కేంద్రీకరిస్తారు. సెక్షన్‘బి’లో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను లెక్కలోకి తీసుకొని సుస్థిర పురోగతి సాధన దిశగా పయనించడానికి, ఆ స్థితిని పరిరక్షించడానికి తగిన వ్యూహాలను రూపొందించారు.
ఈ ప్రాథమిక ప్రణాళికను పునాదిగా చేసుకొని, సాంకేతికతపై ప్రధానంగా దృష్టి పెట్టి నిర్వహించిన సమావేశాల్లో తల్లితో పాటు చంటిబిడ్డ సంరక్షణకు పూర్తి స్థాయిలో తీసుకోవాల్సిన చర్యలను సమీక్షించారు. చర్చల్లో.. గర్భధారణ కన్న ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అధిక ముప్పుతో కూడిన గర్భధారణ, కాన్పు తరువాత అధిక రక్తస్రావాన్ని (పోస్ట్-పార్టమ్ హెమరేజ్.. పీపీహెచ్) నియంత్రించడం, సముదాయం స్థాయిలో తీసుకోవాల్సిన ముఖ్య చర్యలు, సిజేరియన్ సెక్షన్ సేవలను మెరుగు పరచడం, తల్లులకు అందించాల్సిన ఆరోగ్య సేవలను బలోపేతం చేయడంలో ప్రయివేటు రంగం పోషించాల్సిన పాత్ర, డిజిటల్ హెల్త్ కార్యక్రమాలు, ‘సుమన్ కాల్ సెంటర్’ ద్వారా ఫిర్యాదులను అందుకొని వాటిని పరిష్కరించే యంత్రాంగం, బీడబ్ల్యూహెచ్‌ను ప్రారంభించడం, వాతావరణ మార్పు తల్లుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడం వంటి అంశాలను ప్రస్తావించారు.

వర్క్‌షాప్‌లో 13 ‘హై-ఫోకస్’ రాష్ట్రాలు ఇచ్చిన ప్రజెంటేషన్ కీలకంగా నిలిచింది. ఆయా రాష్ట్రాలు ‘సుమన్ రోడ్‌మ్యాప్ 2030’లో భాగంగా తమ తమ ప్రాధాన్యాలను, అమలులో ఎదురుకాగల ముఖ్య లోటుపాట్లను, తాము చేపట్టాలనుకుంటున్న చర్యలను ప్రస్తావించాయి. ఈ సమావేశంతో రాష్ట్రాలకు పరస్పర అనుభవాల నుంచి నేర్చుకొనే, తల్లి-నవజాత శిశువు ఆరోగ్యం మెరుగుదల పరంగా వేగాన్ని పెంపొందించడానికి, ప్రత్యేక సందర్భాల వారీగా అనుసరించ దగిన వ్యూహాలను గుర్తించడానికి మార్గం సుగమమైంది.
రాష్ట్ర స్థాయిలో ఆశాజనకంగా పరిణమించిన నూతన ఆవిష్కరణలను, క్షేత్ర స్థాయి అనుభవాలను ‘గ్యాలరీ వాక్’ ద్వారా కళ్లకు కట్టేందుకు కూడా ఈ వర్క్‌షాప్ అవకాశాన్ని అందించింది. ఎన్ఏఎస్‌జీ, యూబీటీ, డ్రేప్స్‌ను ఉపయోగించి పీపీహెచ్‌ను ప్రభావవంతంగా నియంత్రించిన తీరును ఒడిశా, ‘సుమన్ పంచాయత్’, ‘సుమన్ సఖి చాట్‌బాట్’లను మధ్యప్రదేశ్, ‘మదర్స్ పిక్‌నిక్’, ‘గోసాయియా సమ్మేళన్’లను ఛత్తీస్‌గఢ్, ‘స్టేట్ మాటర్నల్ హెల్త్ వార్ రూమ్’ను ఉత్తరాఖండ్, ‘వాత్సల్య’ కార్యక్రమాన్ని మహారాష్ట్ర, తల్లుల మరణాలను నివారించే లక్ష్యంతో అమలుచేస్తున్న ఓ మిషన్‌ను కర్ణాటక ప్రదర్శించాయి. డిజిటల్ నూతన ఆవిష్కరణ కార్యక్రమాలను గురించి ఉత్తరప్రదేశ్ తెలియజేసింది.

తల్లుల, నవజాత శిశువుల ఆరోగ్యాన్ని పెంపొందింప చేయడంలో భాగస్వామ్యాలకు ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తిస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ), యునైటెడ్ నేషన్స్ పాప్యులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్‌పీఏ), ‘యూనిసెఫ్’, గేట్స్ ఫౌండేషన్, ఝిపీగో (Jhpiego), ఎఫ్ఓజీఎస్ఐ, సీ3, సీఐఎఫ్ఎఫ్‌ల ప్రతినిధులు సంప్రదింపులలో పాలుపంచుకున్నారు. వారు ‘సుమన్ కార్యాచరణ ప్రణాళిక 2030’ని అమలు చేయడానికి అండదండలను అందిస్తామని తమ వాగ్దానాన్ని పునరుద్ఘాటించారు. కార్యాచరణ ప్రణాళిక ప్రాధాన్యాలను క్షేత్ర స్థాయుల్లో ప్రభావవంతంగా అమలుచేయడానికి గాను కలిసికట్టుగా పనిచేయడం, నిరంతర ప్రాతిపదికన సాంకేతికత సహాయాన్ని పొందుతుండటం, అభివృద్ధి పరమైన, సాంకేతిక పరమైన భాగస్వాములతో ఎప్పటికప్పుడు సమన్వయాన్ని నెలకొల్పుకోవడం ఎంతయినా అవసరమని ఈ చర్చలు స్పష్టం చేశాయి.
నాలుగు ప్రాధాన్య రంగాలపై సమూహ అభ్యాసాలను చేపట్టడం ద్వారా ఒక సంభాషణాత్మక, పరిష్కారాలను కనుగొనడమే ప్రధానమైన వైఖరిని కూడా ఈ వర్క్‌షాప్‌లో ఆమోదించారు. ఈ నాలుగు ప్రాధాన్య రంగాలు ఇలా ఉన్నాయి..:
• అధిక ముప్పు ఎదురు కాగల గర్భధారణ స్థితిని ప్రభావవంతంగా సంబాళించడం: అంశాలు, సవాళ్లు;
• గర్భధారణ కన్న ముందు తీసుకోవాల్సిన సంరక్షణ ప్రధాన చర్యలు: ప్రభావవంతమైన పద్ధతిలో అమలు చేయగల వ్యూహాలు;
• పీపీహెచ్ మేనేజ్‌మెంట్: ప్రభావవంతమైన రెఫరల్ ట్రాన్స్‌పోర్ట్ ద్వారా సమస్యను అధిగమించడం;
• సిజేరియన్ సెక్షన్ సేవలను ఇప్పటితో పోలిస్తే మెరుగుపరచడం: క్షేత్ర స్థాయి అనుభవాలు.
ఈ అభ్యాసాలు సమావేశంలో పాలుపంచుకున్న వారికి ఆచరణాత్మక అనుభవాలను పరస్పరం వెల్లడించుకొనేందుకు, కార్యాచరణలో ఎదురవుతున్న ఇబ్బందులను గుర్తించేందుకు, రాష్ట్రాల్లో తల్లుల ఆరోగ్యసంరక్షణ సేవల అందజేతను బలోపేతం చేసేందుకు, క్షేత్ర స్థాయుల్లో పరిష్కారాలను కనుగొనేందుకు మార్గాన్ని సుగమం చేశాయి.

ఈ ప్రకారంగా రెండు రోజుల పాటు చోటుచేసుకున్న చర్చలు రాష్ట్రాలకు, సాంకేతిక నిపుణులకు, విద్యాసంస్థలకు, వృత్తినైపుణ్యం కల సంస్థలకు, డెవలప్‌మెంట్ పార్ట్‌నర్లకు ఒక ఉమ్మడి వేదికను సమకూర్చాయి. దీంతో వారికి తమ ప్రాధాన్య క్రమాన్ని తీర్చిదిద్దుదకొనేందుకు, నూతన ఆవిష్కరణలను ప్రస్తావించుకొనేందుకు, ‘సుమన్ కార్యాచరణ ప్రణాళిక 2030’ని త్వరిత గతిన అమలుచేయడంతో పాటు, 2030కల్లా తల్లులు, చంటిబిడ్డలలో నివారించ దగిన మరణాలను ‘సున్నా’ స్థాయికి చేర్చాలన్న జాతీయ నిబద్ధతను ముందుకు తీసుకుపోవడానికి ఆచరణాత్మక వ్యూహాలను ఖరారు చేయడంలో తోడ్పాటు లభించింది.
సుమన్ కార్యాచరణ ప్రణాళిక 2030
సుస్థిరాభివృద్ధి లక్ష్యాల దిశగా ప్రగతిని పరిరక్షించుకొంటూ 2030 కల్లా తల్లులు, చంటిబిడ్డలలో నివారించ దగిన మరణాలను సున్నా స్థాయికి చేర్చడానికి దేశం చేస్తున్న ప్రయత్నాలకు జోరును సంతరించడం కోసం ఒక వ్యూహాత్మక ప్రాథమిక ప్రణాళికను ‘సుమన్ కార్యాచరణ ప్రణాళిక 2030’ అందిస్తోంది. దీనికి గాను చక్కని ఫలితాలను అందించగల చర్యలను చేపడతారు.
రెండు రోజులు పాటు నిర్వహించిన వర్క్‌షాప్‌లో, తల్లి ఆరోగ్యంతో ముడిపడిన కార్యక్రమాలపై చర్చించారు. దీనిలో గర్భధారణకు ముందు అనుసరించాల్సిన సంరక్షక చర్యలు, హై-రిస్క్ ప్రెగ్నెన్సీ, గర్భం ధరించిన తరువాత కాన్పునకు ముందు మూడు మాసాల్లో కమ్యూనిటీ-స్థాయిలో పాటించాల్సిన జాగ్రత్త చర్యలు, సిజేరియన్ సెక్షనును సరి అయిన రీతిన పూర్తి చేయడం, డిజిటల్ హెల్త్ కార్యక్రమాలు, బర్త్ వెయిటింగ్ హోమ్, వాతావరణం వల్ల తల్లి స్వస్థతపై పడే ప్రభావం, రాష్ట్రాల ప్రాధాన్యాలు, పార్ట్‌నర్ భాగస్వామ్యం వంటి విషయాలపై దృష్టిని సారించారు.

నివారించ గలిగిన ఏ కారణాల వల్ల నైనా ఏ మహిళా, లేదా ఏ నవజాత శిశువు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి రాకూడదన్న జాతీయ సంకల్పాన్ని ఈ చర్చలలో పునరుద్ఘాటించారు. రాష్ట్ర ప్రభుత్వాలు, సాంకేతిక సంస్థలు, డెవలప్‌మెంట్ పార్ట్‌నర్స్‌తో కలిసి పనిచేస్తానని మంత్రిత్వ శాఖ తన సంకల్పాన్ని మరో మారు స్పష్టం చేసింది. తల్లులు, చంటి బిడ్డల ఆరోగ్యం మెరుగుపడాలని, దేశం 2030 కల్లా నివారించ దగిన మరణాలను సున్నా స్థాయికి చేర్చాలన్న లక్ష్యాన్ని చేరుకొనేటట్లుగా ‘సుమన్ కార్యాచరణ ప్రణాళిక 2030’ని విస్తృత స్థాయిలో దీర్ఘ కాలం పాటు అమలు చేసే సంస్కరణలా మార్చడం ఈ శాఖ లక్ష్యం.
***
(రిలీజ్ ఐడి: 2306828)
సందర్శకుల సూచీ సంఖ్య : : 20