రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
బెంగళూరు–కడప–విజయవాడ ఎకనమిక్ కారిడార్‌లో సొరంగం తవ్వకం పూర్తి చేసి కీలక మైలురాయిని సాధించిన ఎన్ హెచ్ఏఐ
నాడు పోస్టు చేయడమైనది:
04 SEP 2026 5:33PM by PIB Vijayawada
బెంగళూరు–కడప–విజయవాడ ఎకనమిక్ కారిడార్ (ఎన్‌హెచ్-544జీ)లో 3.68 కిలోమీటర్ల పొడవైన సొరంగం తవ్వకం పనుల్లో భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్ఏఐ) కీలకమైన ఘట్టాన్ని విజయవంతంగా పూర్తి చేసి ముఖ్యమైన మైలురాయిని సాధించింది. వైఎస్సార్ కడప జిల్లాలోని పోరుమామిళ్ల నుంచి ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలోని సీతారామపురం మధ్య ప్యాకేజ్–9లో భాగంగా ఈ సొరంగాన్ని నిర్మిస్తున్నారు. రూ.1,092.18 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు 2027 మధ్య నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది.
3.68 కిలోమీటర్ల పొడవైన ఈ సొరంగం రెండు ముఖద్వారాలను నేరుగా అనుసంధానించడంతో, ప్రస్తుతం ఉన్న సుదీర్ఘ మార్గ ప్రయాణ దూరాన్ని సుమారు 17 కిలోమీటర్లు తగ్గిస్తుంది. కొండలు, అటవీ ప్రాంతం గుండా సాగుతున్న ఈ సొరంగ మార్గం ద్వారా రహదారి అనుసంధానం మెరుగుపడటంతో పాటు, రవాణా సౌకర్యాలు గణనీయంగా మెరుగుపడనున్నాయి. బెంగళూరు–కడప–విజయవాడ ఎకనమిక్ కారిడార్ ద్వారా బెంగళూరు–విజయవాడ మధ్య ప్రయాణ దూరం 110 కిలోమీటర్లు తగ్గడంతో పాటు, ప్రయాణ సమయం 3–4 గంటలు ఆదా కానుంది. అలాగే ఎన్‌హెచ్-44, ఎన్‌హెచ్-16లను అనుసంధానించడం, హిందూపురం మరియు కొప్పర్తి పారిశ్రామిక నోడ్లకు మెరుగైన ప్రాప్యత కల్పించడం, ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఉపాధి అవకాశాలను కల్పిస్తూ మరింత సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణానికి దోహదపడనుంది.
సొరంగం పనులను పరిశీలించిన అనంతరం ఎన్హెచ్ఏఐ విజయవాడ రీజినల్ ఆఫీసర్ శ్రీ జి. హరి కృష్ణ, ఐఈఎస్ మాట్లాడుతూ, నిర్మాణం పూర్తయిన తర్వాత ఈ సొరంగం దక్షిణ భారతదేశంలోని కీలక సొరంగ మార్గాల్లో ఒకటిగా నిలవడంతో పాటు, ఈ ప్రాంత రహదారి మౌలిక వసతులకు మరింత బలోపేతాన్ని చేకూర్చనుందని తెలిపారు. సొరంగం తవ్వకం పనుల్లో కీలకమైన ఘట్టాన్ని అన్ని భద్రతా ప్రమాణాలను పాటిస్తూ వేగంగా పూర్తి చేసినందుకు ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ అనిల్ కుమార్ రెడ్డి, కాంట్రాక్టర్ మ్యాక్స్ ఇన్ఫ్రా సంస్థ మరియు ప్రాజెక్టు సిబ్బందిని అభినందించారు. ఇదే స్పూర్తితో, నిబద్ధతతో మిగిలిన సొరంగం పనులతో పాటు ప్రాజెక్టు పనులన్నీ నిర్దేశిత గడువులోగా పూర్తవుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు.



****
(రిలీజ్ ఐడి: 2306749)
సందర్శకుల సూచీ సంఖ్య : : 34