సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ప్రజారోగ్యం, వైద్య విద్య, డిజిటల్ ఆరోగ్య సేవల్లో అత్యుత్తమ వైద్య కేంద్రంగా ఎదిగిన ఈఎస్‌ఐసీ సనత్‌నగర్
ఈఎస్‌ఐసీ సనత్‌నగర్‌ను సందర్శించిన ఉత్తరాఖండ్ మీడియా ప్రతినిధుల బృందం
నాడు పోస్టు చేయడమైనది:
03 SEP 2026 3:27PM by PIB Hyderabad
ప్రజారోగ్యం, వైద్య విద్య, అధునాతన చికిత్స, సాంకేతిక ఆధారిత రోగి సంరక్షణలో అత్యుత్తమ వైద్య కేంద్రంగా హైదరాబాద్‌లోని ఈఎస్ఐసీ సనత్‌నగర్ ఎదిగింది. ఇందులో ఒకే చోట వైద్య కళాశాల, ఆసుపత్రి, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఉన్నాయి. తెలంగాణవ్యాప్తంగా ఈఎస్ఐసీ పరిధిలోని ఉద్యోగులు, వారి కుటుంబాలకు ఇక్కడ అందుబాటు ధరల్లో సమగ్ర వైద్యసేవలు అందుతున్నాయి.
ఉత్తరాఖండ్‌కు చెందిన 15 మంది మీడియా ప్రతినిధుల బృందం హైదరాబాద్‌లోని సనత్‌నగర్ ఈఎస్‌ఐసీ ప్రాంగణాన్ని నేడు సందర్శించింది. సంస్థ అందిస్తున్న వైద్యసేవలు, వైద్య విద్య, అధునాతన చికిత్సలు, సాంకేతిక ఆధారిత సేవలపై అవగాహన పొందడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం.


ప్రతినిధుల బృందానికి స్వాగతం పలికిన సనత్‌నగర్ ఈఎస్‌ఐసీ వైద్య కళాశాల, ఆసుపత్రి డీన్ డాక్టర్ ఎస్. సీతాలక్ష్మి.. సంస్థలోని వైద్య మౌలిక సదుపాయాలు, సాధించిన విజయాలను మీడియా ప్రతినిధులకు వివరించారు. హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం పరిధిలో 4 ఈఎస్‌ఐఎస్ ఆసుపత్రులు, 70 డిస్పెన్సరీలు, 8 శాఖా కార్యాలయాలు, 10 డిస్పెన్సరీ-కమ్-బ్రాంచ్ కార్యాలయాల (డీసీబీఓలు) ద్వారా తెలంగాణలోని మొత్తం 33 జిల్లాలకు ఈఎస్‌ఐసీ సేవలు విస్తరించాయని తెలిపారు. రాష్ట్రంలో బీమా పరిధిలో 20,47,160 మంది ఉద్యోగులు, 74,32,916 మంది లబ్ధిదారులు ఉండగా, 1,63,581 మంది యజమానులు ఈ వ్యవస్థకు మద్దతుగా ఉన్నారని చెప్పారు.
సనత్‌నగర్ ప్రాంగణంలో 1,044 పడకల సమీకృత వైద్య సదుపాయం ఉందని ఆమె తెలిపారు. ఇందులో 800 పడకల ఈఎస్‌ఐసీ వైద్య కళాశాల, ఆసుపత్రితోపాటు 244 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఉన్నాయి. ప్రాంగణంలో 159 ఐసీయూ పడకలు, 45 డయాలసిస్ పడకలు, 10 మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు, ఐదు అధునాతన ఓటీ సూట్లు ఉన్నాయి. వీటితోపాటు విస్తృత స్థాయి స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉన్నాయి. నిరంతరం అత్యవసర సేవలు లభిస్తాయి.
గత నాలుగేళ్లుగా సంస్థలో రోగి సేవలు స్థిరంగా వృద్ధి చెందాయి. వార్షిక ఓపీడీ రోగుల సంఖ్య 2022లో 6,93,853 నుంచి 2025లో 9,80,925కు పెరిగింది. రోజువారీ సగటు ఓపీడీ రోగుల సంఖ్య 2,354 నుంచి 3,248కు చేరింది. వార్షిక అడ్మిషన్లు 78,086 నుంచి 95,037కు పెరగగా, రోజువారీ సగటు అడ్మిషన్లు 214 నుంచి 315కు చేరాయి. శస్త్రచికిత్సల సంఖ్య కూడా 2022లో 16,223 నుంచి 2025లో 20,117కు పెరిగింది. 2025లో ఆసుపత్రి పడకల వినియోగం 85.6 శాతంగా నమోదైంది. తృతీయ స్థాయి వైద్య మౌలిక సదుపాయాలు నిరంతరం విస్తృత వినియోగంలో ఉన్నాయని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి.
500కు పైగా పడకల విభాగంలో ఈ జంట ఆసుపత్రులు 2019 నుంచి వరుసగా అత్యుత్తమ పనితీరు కనబరిచిన ఈఎస్‌ఐసీ ఆసుపత్రులుగా గుర్తింపు పొందుతున్నాయి. సురక్షితమైన, రోగి కేంద్రిత, ఆధారాలతో కూడిన వైద్యసేవలను నిర్ధారించేందుకు సంస్థ పటిష్ఠమైన నాణ్యతా వ్యవస్థలు, అక్రెడిటేషన్ విధానాలను కూడా ఏర్పాటు చేసింది.


కార్డియాలజీ, కార్డియోథొరాసిక్ అండ్ వాస్క్యులర్ సర్జరీ, నెఫ్రాలజీ, యూరాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, ఆంకాలజీ, హెమటాలజీ, ప్లాస్టిక్ అండ్ రీకన్‌స్ట్రక్టివ్ సర్జరీ, పీడియాట్రిక్ సర్జరీ, ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహాబిలిటేషన్ తదితర విభాగాల్లో ఈఎస్‌ఐసీ సనత్‌నగర్ అధునాతన సేవలు అందిస్తోంది.
నెఫ్రాలజీ, యూరాలజీ విభాగాల్లో మూత్రపిండాల మార్పిడికి ఈ ఆసుపత్రి ఈఎస్‌ఐసీ నెట్‌వర్క్‌లో ప్రముఖ కేంద్రంగా ఎదిగింది. ఏబీఓ-ఇన్‌కంపాటిబుల్ కిడ్నీ మార్పిడితోపాటు సజీవ దాతలు, మృతదాతల నుంచి మూత్రపిండాల మార్పిడి సేవలను అందిస్తోంది. 2024 జూన్ 8న సంస్థ అంతర్గతంగా తొలి మృతదాత అవయవ సేకరణ చేపట్టింది. ఇప్పటివరకు 30 మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించగా, వాటిలో 18 సజీవ దాతల మార్పిడులు ఉన్నాయి. 2025–26లో హీమోడయాలసిస్ సదుపాయం ద్వారా 59,868 మంది బీమా రోగులు ప్రయోజనం పొందారు. ప్రాంగణంలో అందుబాటులో ఉన్న మూత్రపిండ సంరక్షణ సేవల విస్తృతిని ఈ సంఖ్య తెలియజేస్తోంది.
పాథాలజీ విభాగం ఎన్‌ఏబీఎల్ ఎంట్రీ-లెవల్ తృతీయ స్థాయి డయాగ్నస్టిక్ లేబొరేటరీని నిర్వహిస్తోంది. ఎనిమిది ప్రత్యేక విభాగాల్లో 162 రకాల పరీక్షలు, 90కి పైగా ఇమ్యునోహిస్టోకెమిస్ట్రీ (ఐహెచ్‌సీ), మాలిక్యులర్ మార్కర్ పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. 2025–26లో ప్రయోగశాల 16.7 లక్షలకు పైగా పరీక్షలు నిర్వహించింది. సాధారణ చికిత్స సేవలతోపాటు ఆంకాలజీ వంటి ప్రత్యేక వైద్య విభాగాలకు సమగ్ర రోగ నిర్ధారణ సహాయాన్ని అందించింది.

రేడియాలజీ ఇమేజింగ్ సేవల కోసం పిక్చర్ ఆర్కైవింగ్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్ (పీఏసీఎస్), ఈ-ఐసీయూ సేవలు, ఆక్సిజన్, వాక్యూమ్ పైప్‌లైన్ వ్యవస్థల తక్షణ పర్యవేక్షణ, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ డ్యాష్‌బోర్డ్, తక్షణ ఆన్‌లైన్ శాంప్లింగ్ వ్యవస్థలు వంటి పలు సాంకేతిక ఆధారిత ఆరోగ్య కార్యక్రమాలను ప్రాంగణంలో అమలు చేస్తున్నారు. ఏఏఏ+ యాప్ ఆధారిత ఓపీడీ సేవలు, ధన్వంతరి మాడ్యూల్ అమలు, నూరు శాతం ఈ-ఆఫీస్ అమలు, ఆధార్ అనుసంధానం, ఓపీడీలో ల్యాన్ కనెక్టివిటీ ఇతర కార్యక్రమాల్లో ఉన్నాయి.
ఇంటికే మందుల సరఫరా, ఇంటివద్ద నమూనాల సేకరణ, ఏఏఏ+ యాప్ ద్వారా ఆన్‌లైన్ వైద్య సంప్రదింపులు, 5జీ ఆధారిత అంబులెన్స్ సేవలు వంటి రోగి కేంద్రిత డిజిటల్ కార్యక్రమాలు వైద్యసేవల లభ్యత, నిరంతర సంరక్షణను మరింత బలోపేతం చేశాయి.
సనత్‌నగర్ ఈఎస్‌ఐసీ వైద్య కళాశాల తన విద్యా వ్యవస్థను కూడా బలోపేతం చేసింది. ఇక్కడ 150 ఎంబీబీఎస్ సీట్లు, 106 ఎండీ/ఎంఎస్ సీట్లు, 15 ఎం.సీహెచ్ సీట్లు, 12 డీఆర్‌ఎన్‌బీ సీట్లు, 4 డీఎన్‌బీ కోర్సులు, 6 ఎఫ్‌ఎన్‌బీ కోర్సులు ఉన్నాయి. వీటితోపాటు కార్డియాక్ అండ్ కార్డియోవాస్క్యులర్ టెక్నాలజీ, మెడికల్ రికార్డ్స్ సైన్స్, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, ఆప్టోమెట్రీ, రీనల్ డయాలసిస్ టెక్నాలజీ, రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ, మెడికల్ లేబొరేటరీ టెక్నాలజీ వంటి ప్రత్యేక విభాగాల్లో 72 అలైడ్ హెల్త్ సైన్సెస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి.
డాక్టర్ జయ కుందన్ గెడమ్, డాక్టర్ రత్నా గోసైన్, డాక్టర్ జి. లక్ష్మీ ప్రసాద్, డాక్టర్ జి. తిరుపతి వివిధ చికిత్స, విద్యా సదుపాయాల గురించి ప్రతినిధుల బృందానికి వివరించారు. అనంతరం మీడియా ప్రతినిధులు ఆసుపత్రిలోని ప్రయోగశాలలను సందర్శించి, ప్రాంగణంలో అందుబాటులో ఉన్న అధునాతన రోగ నిర్ధారణ మౌలిక సదుపాయాలు, సేవలపై అవగాహన పొందారు.

అందుబాటులో, తక్కువ ఖర్చుతో, ఉన్నత ప్రమాణాలతో కూడిన వైద్యసేవలు అందించేందుకు ఈఎస్‌ఐసీ సనత్‌నగర్ చేస్తున్న కృషిని మీడియా ప్రతినిధులు ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ఈ పర్యటన అవకాశం కల్పించింది. అదే సమయంలో వైద్య విద్య, ప్రత్యేక చికిత్స, డిజిటల్ ఆరోగ్య సేవల పురోగతిపై సమగ్ర అవగాహన పొందారు.
విస్తరిస్తున్న వైద్య మౌలిక సదుపాయాలు, పెరుగుతున్న రోగుల వినియోగం, అధునాతన అవయవ మార్పిడి, రోగ నిర్ధారణ సేవలు, పటిష్ఠమైన వైద్య విద్యా వ్యవస్థ, సాంకేతిక ఆధారిత రోగి సేవల అమలుతో ఈఎస్‌ఐసీ సనత్‌నగర్ ప్రజారోగ్యం, వైద్య విద్యలో ఆదర్శ సంస్థగా ఎదుగుతోంది.
***
(రిలీజ్ ఐడి: 2306327)
సందర్శకుల సూచీ సంఖ్య : : 27