సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

చిన్న వయస్సు నుంచే ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు అవసరం: డాక్టర్ భారతి కులకర్ణి, డైరెక్టర్ ఐసీఎంఆర్–ఎన్ఐఎన్

హైదరాబాద్‌లోని ఐసీఎంఆర్–నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్‌ను సందర్శించిన ఉత్తరాఖండ్ మీడియా బృందం

నాడు పోస్టు చేయడమైనది: 02 SEP 2026 5:53PM by PIB Hyderabad

ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) నిర్వహిస్తున్న హైదరాబాద్ ప్రెస్ టూర్‌లో భాగంగా, ఉత్తరాఖండ్‌కు చెందిన 15 మంది సభ్యుల మీడియా ప్రతినిధి బృందం ఈ రోజు హైదరాబాద్‌లోని ఐసీఎంఆర్–నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఐసీఎంఆర్–ఎన్ఐఎన్)ను సందర్శించింది.

 

పోషకాహార పరిశోధన, ప్రజారోగ్య అవగాహన కోసం ఆ సంస్థ చేసిన మార్గదర్శక కృషి సహా... జాతీయ విధానాలు, సంక్షేమ కార్యక్రమాలకు అవసరమైన సమాచారం అందించడంలో దాని పాత్రను గురించి పాత్రికేయులకు ఈ పర్యటన ఆచరణాత్మక అవగాహన కలిగించింది.

 

ప్రతినిధి బృందాన్ని ఉద్దేశించి ఐసీఎంఆర్–ఎన్ఐఎన్ డైరెక్టర్ డాక్టర్ భారతి కులకర్ణి మాట్లాడుతూ... ఆహార కూర్పు, పోషక అవసరాలు, ఆహార మార్గదర్శకాలపై శాస్త్రీయ ఆధారాలను రూపొందించడంలో తమ సంస్థ ప్రధాన విధిని స్పష్టం చేశారు. దేశీయ ఆహార పదార్థాల్లోని శక్తి, ప్రోటీన్, సూక్ష్మపోషకాలు, ఖనిజాల వివరాలను తెలియజేసే సమగ్ర పోషకాహార సమాచారాన్ని *ఇండియన్ ఫుడ్ కంపోజిషన్ టేబుల్స్ (ఐఎఫ్‌సీటీ)* అందిస్తాయన్నారు. ఈ పట్టికలు పరిశోధకులకు, ఆహార పరిశ్రమకు, ప్రజారోగ్య విధాన రూపకర్తలకు కీలకమైన రిఫరెన్స్ మెటీరియల్‌గా ఉపయోగపడతాయని డాక్టర్ భారతి వివరించారు.

 

భారత చట్టబద్ధమైన పోషకాహార కార్యక్రమాలకు పునాదిగా నిలుస్తూ... వివిధ శారీరక వర్గాలు, వయస్సుల వారిలో పోషకాహార ప్రాథమిక స్థాయిలను నిర్వచించే *భారతీయుల పోషకాహార అవసరాలు-సిఫార్సు చేసే ఆహార భత్యాలు (ఆర్‌డీఏల)* ప్రాముఖ్యతను డాక్టర్ కులకర్ణి ప్రముఖంగా ప్రస్తావించారు.

*భారతీయుల కోసం ఆహార మార్గదర్శకాలు (డీజీఐ)*లోని కీలక సూత్రాలను ప్రస్తావిస్తూ... చిన్నతనం నుంచే ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలని డాక్టర్ కులకర్ణి సూచించారు. రెండు సంవత్సరాల్లోపు వయస్సు గల పిల్లలకు అదనపు చక్కెర అస్సలు ఇవ్వకూడదని సూచించే మార్గదర్శకాన్ని ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించారు.

 

పోషకాహార లోపం వల్ల కలిగే రెండు రకాల దుష్ప్రభావాలను గురించి ప్రస్తావిస్తూ... నిశ్చల జీవనశైలితో పాటు కొవ్వు, చక్కెర, ఉప్పు అధికంగా ఉండే ఆహార పదార్థాలను (హెచ్ఎఫ్ఎస్ఎస్) మితిమీరి తీసుకోవడం వల్ల ముఖ్యంగా పిల్లల్లో అధిక బరువు, ఊబకాయం వంటి సమస్యలు అధికంగా పెరుగుతున్నాయని డాక్టర్ కులకర్ణి ఆందోళన వ్యక్తం చేశారు. ఆహార భద్రత, పోషకాహార భద్రత మధ్య స్పష్టమైన వ్యత్యాసాన్ని చూపుతూ... కేవలం ఆహారం అందుబాటులో ఉండటం మాత్రమే పోషకాహార శ్రేయస్సుకు హామీనివ్వదని ఆమె వ్యాఖ్యానించారు. ఆహార వైవిధ్యం, ప్రవర్తనా మార్పు అనేవి ప్రజారోగ్యానికి అనివార్యమైన స్తంభాలని ఆమె స్పష్టం చేశారు.

 

ఉత్తరాఖండ్‌కు చెందిన మండువా, ఝంగోరా, చోళై, కోడా వంటి దేశీయ పంటలు, చిరుధాన్యాల ద్వారా లభించే నిర్దిష్ట పోషక విలువల వివరాలను స్పష్టంగా అంచనా వేయడం కోసం వాటిపై పరిశోధనలు కొనసాగుతున్నాయని డాక్టర్ కులకర్ణి పేర్కొన్నారు. రక్తహీనత సమస్య తగ్గింపుపై రాగి (ఫింగర్ మిల్లెట్) వినియోగం ప్రభావాన్ని అంచనా వేసే వైద్యపరమైన, విశ్లేషణాత్మక అధ్యయనాలు ప్రస్తుతం పురోగతిలో ఉన్నాయని ఆమె తెలిపారు.

 

**పోషకాహార సమాచార పంపిణీపై సాంకేతిక సమావేశాలు**

 

 

ఐసీఎంఆర్-ఎన్ఐఎన్‌లోని పోషకాహార సమాచారం, కమ్యూనికేషన్-ఆరోగ్య విద్య (ఎన్ఐసీహెచ్ఈ) విభాగం అధిపతి, శాస్త్రవేత్త–జి డాక్టర్ సుబ్బారావు ఎం. గవరవరపు నిర్వహించిన సాంకేతిక సమావేశాలకూ మీడియా ప్రతినిధి బృందం హాజరైంది.

 

డాక్టర్ సుబ్బారావు సమకాలీన పోషకాహార వైరుధ్యం గురించి ప్రసంగిస్తూ... పోషకాహార లోపం, సూక్ష్మపోషకాల లోపాలు, జీవనశైలి ప్రేరిత జీవక్రియ రుగ్మతల మధ్య సంబంధాన్ని విశ్లేషించారు. శాస్త్రీయ పోషకాహార సమాచారానికి, ప్రజల రోజువారీ వినియోగ అలవాట్లకు మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చడంలో మీడియా నిపుణుల కీలక పాత్రనూ ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ఆహారపు తాత్కాలిక పోకడలను తొలగించి, ఆధారాల-ఆధారితమైన ఆహార పద్ధతులను ప్రోత్సహించడానికి బాధ్యతాయుతమైన రిపోర్టింగ్ చేయాలని ఆయన మీడియా ప్రతినిధులను కోరారు.

 

**ప్రయోగశాల సందర్శనలు, సాంస్కృతిక పర్యటన**

 

ఐసీఎంఆర్–ఎన్ఐఎన్‌లోని అధునాతన ప్రయోగశాల సదుపాయాలను జర్నలిస్టులు సందర్శించారు. ఆహార విశ్లేషణ, లిపిడ్ కెమిస్ట్రీలో జరుగుతున్న నిరంతర పరిశోధనలను పరిశీలించిన మీడియా ప్రతినిధులు పరిశోధకులతో సంభాషించారు.

 

అనంతరం, పర్యటనలోని సాంస్కృతిక విభాగంలో భాగంగా ప్రతినిధి బృందం సాలార్ జంగ్ మ్యూజియాన్ని సందర్శించింది. హైదరాబాద్ చారిత్రక వారసత్వం, పురావస్తు సేకరణల గురించి మీడియా ప్రతినిధులు అవగాహన పొందారు.

 

***


(రిలీజ్ ఐడి: 2306204) సందర్శకుల సూచీ సంఖ్య : : 12
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English