బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బీసీసీఎల్ కీలక ప్రాజెక్టులు, కార్యకలాపాలపై ప్రధాన మంత్రి సలహాదారు శ్రీ తరుణ్ కపూర్ సమీక్ష

నాడు పోస్టు చేయడమైనది: 01 SEP 2026 3:11PM by PIB Hyderabad

భారత్ కోకింగ్ కోల్ (బీసీసీఎల్) ప్రధాన కేంద్రం కోయ్‌లా భవన్‌లో ఓ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశానికి ప్రధానమంత్రి సలహాదారు శ్రీ తరుణ్ కపూర్ అధ్యక్షత వహించారు. శ్రీ తరుణ్ కపూర్ నిన్న, ఇవాళ ధన్‌బాద్‌తో పాటు ఆ ప్రాంతంలోని కీలక ప్రదేశాల్లో అధికారిక పర్యటనకు వచ్చిన సందర్భంగా తొలి రోజున సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమీక్ష సమావేశంలో బీసీసీఎల్ ప్రధాన కార్యకలాపాలు, కీలక ప్రాజెక్టులు, సాంకేతిక కార్యక్రమాలు, భద్రత చర్యలతో పాటు భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. శ్రీ కపూర్‌ పర్యటనలో ఉన్నత స్థాయి ప్రతినిధి వర్గం ఆయన వెంట ఉంది. శ్రీ కపూర్ మునిడీహ్‌లో బీసీసీఎల్ కీలక ప్రాజెక్టులతో పాటు కుసుండా ప్రాంతంలోని ఈఎన్ఏ ఫైర్ ప్రాజెక్టును కూడా పరిశీలించారు. అధిక ముప్పు గల ప్రాంతాల కుటుంబాలతో ఆయన మాట్లాడారు.

 


సమీక్ష సమావేశంలో పాలుపంచుకున్న వారిలో కోల్ ఇండియా చైర్మన్ శ్రీ బి. సాయిరామ్, బీసీసీఎల్ సీఎండీ శ్రీ మనోజ్ కుమార్ అగర్వాల్, జౌళి మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి శ్రీమతి అలకనంద దయాళ్, బొగ్గు మంత్రిత్వశాఖ ప్రాజెక్టు సలహాదారు శ్రీ ఆలోక్ కుమార్ సింగ్, మానవ వనరుల డైరెక్టరు శ్రీ మురళీ కృష్ణ రామయ్య, సాంకేతిక కార్యకలాపాల డైరెక్టరు శ్రీ సంజయ్ కుమార్ సింగ్, ఆర్థిక విషయాల డైరెక్టరు శ్రీ రాజేశ్ కుమార్, సాంకేతిక, ప్రాజెక్టులు, ప్రణాళిక విషయాల డైరెక్టరు శ్రీ రాజీవ్ కుమార్ సిన్హాలతో పాటు రైల్వేలకు చెందిన సీనియర్ అధికారులు, ఏరియా జనరల్ మేనేజర్లు, ప్రధాన క కేంద్రం జనరల్ మేనేజర్లు, విభాగాల అధిపతులు, ఇతర సీనియర్ అధికారులు ఉన్నారు.
సమీక్ష సమావేశంలో బీసీసీఎల్ సీఎండీ శ్రీ మనోజ్ కుమార్ అగర్వాల్ సంస్థ ప్రధాన నిర్వహణ కార్యకలాపాలు, కీలక విజయాలు, సవాళ్లు, భావి కార్యాచరణ ప్రణాళికలను ప్రస్తావించారు. సాంకేతిక కార్యకలాపాల డైరెక్టరు శ్రీ సంజయ్ కుమార్ సింగ్ బీసీసీఎల్ కార్యకలాపాల తీరు, వ్యూహాత్మక కార్యక్రమాలు, రాబోయే కాలంలో చేపట్టే పథకాలను గురించి సమగ్రంగా వివరించారు.

 


ఉత్పత్తి, సాంకేతికత, భావి అభివృద్ధి ప్రణాళికల సమీక్ష
బీసీసీఎల్ కీలక కార్యకలాపాలను వివరించే సూచికలు, బొగ్గు ఉత్పత్తి, వస్తు వినియోగం, బొగ్గు నిక్షేపాలు, నిర్వహణ సామర్థ్యం, ప్రధాన బలాలు, సవాళ్లతో పాటు 2030-31 వరకు నిర్దేశించుకున్న ఉత్పత్తి లక్ష్యాలను  ప్రజెంటేషన్లో పేర్కొన్నారు. గత అయిదు సంవత్సరాల్లో భూమి లోపలి (యూజీ) గనులు, సమీప ఉపరితల (ఓపెన్ కాస్ట్.. ఓసీ) గనుల పనితీరుతో పాటు, బొగ్గును వెలికితీసేందుకు ఖనిజ పొరల్లో మట్టిని, ఇసుకను, రాళ్ళు తదితర వ్యర్థ పదార్థాలను తొలగించే ప్రక్రియ (ఓవర్ బర్డెన్ రిమూవల్.. ఓబీఆర్)ను కూడా సమీక్షించారు. అలాగే, సంస్థ ఉత్పత్తి సామర్థ్యం, రాబోయే అయిదు సంవత్సరాల్లో సంస్థ అమలు చేయనున్న ప్రణాళికలపై చర్చించారు.
భూగర్భంలో పెద్ద ఎత్తున బొగ్గును అత్యంత వేగంగా, సురక్షితంగా వెలికితీసేందుకు బీసీసీఎల్ ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఆధునిక లాంగ్‌ వాల్ , హైవాల్ మైనింగ్ విధానాలను ఈ సమావేశంలో సమీక్షించారు. సర్ఫేస్ మైనర్స్, కంటిన్యువస్ మైనర్స్ వంటి అధునాతన సాంకేతికతల ఉపయోగాన్ని విస్తరించే దిశగా సిద్ధం చేసిన ప్రణాళికలపైన కూడా చర్చించారు.

ఝరియా బొగ్గు గనిలో ఓసీ బ్లాకుల పునర్‌వ్యవస్థీకరణ, ఎండీఓ, రెవెన్యూ పంపకం నమూనాల ద్వారా కార్యకలాపాలను ఆపేసిన గనులను తిరిగి అభివృద్ధి చేసేందుకు ఉద్దేశించిన ప్రణాళికలను గురించి సమావేశంలో ప్రస్తావించారు. బొగ్గును యంత్రాల సాయంతో కడిగి, శుద్ధమైన బొగ్గుగా మార్చే కేంద్రాల (వాషరీస్) పనితీరు, వాషింగ్ సామర్థ్య విస్తరణ ప్రణాళికలతో పాటు బొగ్గు నాణ్యతను మెరగుపరిచేందుకు చేపడుతున్న కార్యక్రమాలను సమీక్షించారు.
దేశ కోకింగ్ కోల్ అవసరాలను తీర్చడంలో బీసీసీఎల్‌ది వ్యూహాత్మక పాత్ర అని శ్రీ కపూర్ స్పష్టంచేశారు. నిరంతరాయ అభివృద్ధి ప్రక్రియలు,  లాభదాయకతకు మద్దతిచ్చేందుకు సామర్థ్యాన్ని పెంపొందించుకోవడంపై దృష్టిని కేంద్రీకరించాలని, అందుబాటులో ఉన్న వనరులను విజ్ఞానశాస్త్ర పరంగా, అత్యంత అనుకూల స్థాయిలో ఉపయోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
నిర్వహణ, పరిపాలన సంబందిత కీలక సవాళ్లను, వాటి మూల కారణాలను, ఆ సవాళ్లను పరిష్కరించడానికి అనుసరిస్తున్న మార్గాలను తెలుసుకోవడానికి బీసీసీఎల్ ఏరియా జనరల్ మేనేజర్లతో కూడా శ్రీ కపూర్ సమావేశమయ్యారు.
మునిడీహ్‌లో సీబీఎమ్ బ్లాకు-I, లాంగ్‌వాల్ ప్రాజెక్టుల పరిశీలన
సమీక్ష సమావేశం పూర్తి అయిన తరువాత, శ్రీ తరుణ్ కపూర్ కోల్ బెడ్ మీథేన్ (సీబీఎమ్) బ్లాకు-I ప్రాజెక్టును పరిశీలించారు. ఈ సందర్భంగా, సీబీఎమ్ గ్యాస్ వెలికితీతకు అవలంబిస్తున్న సాంకేతికత, ప్రాజెక్టు పురోగమిస్తున్న వైనం, ప్రాజెక్టు అమలుకు సంబంధించిన ప్రణాళికలను గురించి సంబంధిత వర్గాలు ఆయనకు తెలియజేశాయి.
శ్రీ కపూర్ మునిడీహ్ XVI సీమ్ లాంగ్‌వాల్ ప్రాజెక్టును పరిశీలించారు. భూగర్భంలో యంత్రాల సాయంతో చేపడుతున్న గని తవ్వకం కార్యకలాపాలు, సురక్షితమైన, మన్నిక కలిగిన పద్ధతులను పాటిస్తూ మంచి నాణ్యత గల కోకింగ్ కోల్‌‌ను నిలకడగా, విశ్వసనీయ ప్రాతిపదికన సరఫరా చేయడంలో ఈ ప్రాజెక్టు పోషిస్తున్న పాత్రను అర్థం చేసుకోవడం ఈ పర్యటనలో ముఖ్యోద్దేశం.
ఈఎన్ఏ ఫైర్ ప్రాజెక్టు పరిశీలన.. ఎక్కువ ముప్పు గల ప్రాంతాల కుటుంబాలతో మాటామంతీ
కుసుండా ప్రాంతంలోని ఈఎన్ఏ ఫైర్ ప్రాజెక్టును  శ్రీ కపూర్ పరిశీలించారు. అగ్నిప్రమాద నివారణ చర్యలు, భద్రత ఏర్పాట్లు, తత్సంబంధిత కార్యకలాపాలను సమీక్షించారు. శాస్త్రీయ పద్ధతుల్లో అగ్ని ప్రమాదాలు తలెత్తడానికి ఉన్న అవకాశాలను గుర్తించడం, థర్మల్, కృత్రిమ ఉపగ్రహ ఆధారిత పర్యవేక్షణ,  వెలికితీత, ప్రభావిత ప్రాంతాల దశ వారీ పునరాశ్రయ కల్పన  ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చాయి.
కుసుండా ప్రాంతంలో పర్యటించిన శ్రీ కపూర్.. అధిక ముప్పు పొంచి ఉన్న ప్రాంతాల కుటుంబాలతో మాట్లాడారు. వారి భద్రతకు, పునరావాసానికి సంబంధించిన అంశాలపై చర్చించారు.
శ్రీ కపూర్ ఈ రోజున, అంటే 2026 సెప్టెంబరు 1న బేల్‌గరియా, కరమాటాండ్ పునరావాస కేంద్రాలను సందర్శిస్తున్నారు. సవరించిన ఝరియా మాస్టర్ ప్లానుతో ముడిపడిన వ్యవహారాలపై సంబంధిత ఆసక్తిదారులతో ఈ రోజు ఓ సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

 

***


(రిలీజ్ ఐడి: 2305606) సందర్శకుల సూచీ సంఖ్య : : 4
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Gujarati